Tourism and hospitality
-
ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు ఇచ్చే రంగం
దేశ పర్యాటక రంగంలో రానున్న రోజుల్లో ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రధానంగా టెక్నాలజీ సేవలందిస్తున్న కంపెనీల్లో గణనీయంగా ఉద్యోగుల అవసరం ఏర్పడబోతున్నట్లు కొన్ని కంపెనీల అధికారులు తెలిపారు.ట్రావెల్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ కంపెనీలు 2024లో భారీగా ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. మేక్మైట్రిప్, ఈజ్‌మైట్రిప్, అగోడా, ర్యాడిసన్ హోటల్ గ్రూప్, లెమన్ ట్రీ హోటల్స్ వంటి సంస్థలు ఇప్పటికే డిమాండ్‌కు అనుగుణంగా రికార్డు స్థాయిలో ఉద్యోగులను చేర్చుకుంటున్నాయి. సాంకేతికత, కస్టమర్ సపోర్ట్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగాల్లో ఎక్కువ నియామకాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: కేంద్ర సబ్సిడీ ప్రక్రియ గడువు తగ్గింపురాడిసన్ హోటల్ గ్రూప్ దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ శర్మ మాట్లాడుతూ..‘పర్యాటక రంగం కొవిడ్ సమయంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంది. క్రమంగా కరోనా భయాలు వీడి ఈ రంగం పుంజుకుంటోంది. ప్రస్తుతం కరోనా ముందు పరిస్థితుల కంటే వేగంగా ఈ రంగం వృద్ధి నమోదు చేస్తోంది. ఈ సంవత్సరం రాడిసన్ హోటల్ గ్రూప్ దేశవ్యాప్తంగా 3,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది’ అన్నారు. -
పర్యాటకంలో నంబర్ 3
సాక్షి, న్యూఢిల్లీ: పర్యాటక సమగ్ర అభివృద్ధిలో మూడో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జాతీయ పర్యాటక అవార్డుల(2018–19) ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్‌రెడ్డి అవార్డులు అందించారు. తెలంగాణ 4, ఆంధ్రప్రదేశ్ 4 అవార్డులను కైవసం చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఆంధ్రప్రదేశ్ తరఫున టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి ఆర్.గోవిందరావు అవార్డులు అందుకున్నారు. దేశీయ పర్యాటకానికి మంచి భవిష్యత్ భారత పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని.. కావాల్సిందల్లా పర్యాటక కేంద్రాలకు అవసరమైన రవాణా, ఇతర మౌలిక వసతుల కల్పన మాత్రమేనని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు మొదలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిచోటా భారత్‌లో పర్యాటకానికి విస్తృత అవకాశాలున్నాయన్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు, వివిధ ప్రాంతాల్లో జరిగే పండుగలు, పురాతన కట్టడాలు ఇలా ప్రతిచోటా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయని చెప్పారు. భారత పర్యాటక రంగం చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ.. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డిని అభినందించారు. పర్యాటక, ఆతిథ్య రంగాల బలోపేతం.. దేశీయ పర్యాటకాభివృద్ధి కోసం కేంద్రం చిత్తుశుద్ధితో కృషిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. న్యూ ఇండియా విజన్ నినాదంతో త్వరలోనే నూతన జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా మౌలిక వసతుల కల్పన, పర్యాటక పరిశ్రమను వృద్ధి చేయడం, పర్యాటకానికి అనుబంధంగా ఉన్న రంగాలను ప్రోత్సహించడం, పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం.. వంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు అవార్డులు పర్యాటక సమగ్ర అభివృద్ధిలో మూడో ఉత్తమ రాష్ట్రం బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వేస్టేషన్‌గా సికింద్రాబాద్ హైదరాబాద్‌లోని అపోలో హెల్త్ సిటీకి ‘బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ’ హైదరాబాద్ గోల్ఫ్ కోర్సుకు ఉత్తమ పర్యాటక గోల్ఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్‌కు అవార్డులు ఉత్తమ పర్యాటక రాష్ట్రాల్లో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు ఏపీ టూరిజం ప్రచురించిన కాఫీ టేబుల్ బుక్ ‘సీసైడ్’కు ఎక్సలెన్స్ ఇన్ పబ్లిషింగ్ ఇన్ ఇంగ్లిష్ అవార్డు ఏపీ టూరిజం ప్రచురించిన కాఫీ టేబుల్ బుక్స్ ‘సీసైడ్’ (రష్యన్), హ్యాండ్‌క్రాఫ్టెడ్ ( స్పానిష్, జర్మన్)కు ఎక్సలెన్స్ ఇన్ పబ్లిషింగ్ ఇన్ ఫారిన్ లాంగ్వేజ్ అవార్డు విజయవాడలోని ‘ది గేట్‌వే హోటల్’కు బెస్ట్ ఫైవ్‌స్టార్ హోటల్ అవార్డు ఉత్తమ పర్యాటక కేంద్రంగా బుద్ధవనం నాగార్జునసాగర్: ప్రపంచ పర్యాటక దినోత్సవం–2022 సందర్భంగా ప్రతిష్టాత్మక బుద్ధవనం ప్రాజెక్టుకు ఉత్తమ పౌరసదుపాయాలు కల్పించినందుకుగాను ఉత్తమ పర్యాటక అవార్డు దక్కిందని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. హైదరాబాద్ హైటెక్‌సిటీలో మంగళవారం జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమంలో పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా చేతుల మీదుగా అవార్డు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్‌రావు, శివనాగిరెడ్డి, బుద్ధవనం అధికారులు సుధన్‌రెడ్డి, క్రాంతిబాబు, శ్యాంసుందర్‌రావు పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పర్యాటకం..ప్రగతి పరుగు!
సహజసిద్ధ ప్రకృతి ప్రాంతాలు, ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాలతో అలరారుతున్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉంది. జీవ వైవిధ్యానికి నెలవైన ఈ ప్రాంతం విదేశీ, స్వదేశీ పక్షులకు స్వర్గధామంగా మారింది. కొల్లేరు సరస్సు పెలికాన్, పెయింటెడ్ స్ట్రాక్ వంటి 189 రకాల పక్షులకు ఆవాసంగా ఉంది. కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రంలో బోటు షికారు చేస్తూ వేలాది పక్షుల కేరింతలను ఆస్వాదించవచ్చు. ఏలూరు మండలం మాధవాపురం పక్షుల కేంద్రాన్ని అటవీశాఖ నూతనంగా అభివృద్ధి పరచింది. రిజం సర్కిల్‌గా కొల్లేరు కొల్లేరులో వృక్షజాలం, జంతుజాలం ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆస్ట్రేలియా, సైబీరియా, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి ప్రతి ఏటా వలస పక్షులు విచ్చేస్తాయి. వీటిలో ప్రధానమైనది పెలికాన్ పక్షి. దీని పేరుతో ఆటపాక పక్షుల కేంద్రానికి పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం మీదుగా ఏలూరు జిల్లా చేరే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి కొల్లేరు సర్కారు కాల్వపై పెద్దింట్లమ్మ వారధి నిర్మాణం పూర్తి కానుంది. రానున్న రోజుల్లో కొల్లేరును టూరిజం సర్కిల్‌గా ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా మారుతుంది. త్వరలో పూర్తికానున్న పోలవరం ప్రాజెక్టు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే అవకాశముంది. పశ్చిమగోదావరి జిల్లాలో కొలువైన పేరుపాలెం బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ప్రాంతం కావడం గమనార్హం. ప్రఖ్యాతఆధ్యాత్మిక క్షేత్రాలు పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాలు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొలువై ఉన్నాయి. యాత్రికులకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఏలూరు జిల్లాలో ద్వారకాతిరుమల గొప్ప దర్శనీయ స్థలంగా పేరుగడించింది. అమ్మవార్ల విషయంలో భీమవరం మావుళ్లమ్మ, కొల్లేటికోట పెద్దింట్లమ్మలను భక్తులు కొంగుబంగారంగా కొలుస్తున్నారు. ఇక పంచారామాల్లో రెండు క్షేత్రాలు భీమవరం, పాలకొల్లులోనే కొలువై ఉన్నాయి. భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయం, పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం దర్శనీయ స్థలాల్లో ముఖ్యమైనవి. జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి, గోకుల తిరుమల పారిజాత క్షేత్రం, ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం పెనుగొండ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దేవస్థానం ప్రసిద్ధి చెందిన దర్శినీయ స్థలాలుగా చెప్పుకోవచ్చు. వీటన్నింటికి బస్సు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అటవీ ప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ సందర్శనంలో భాగంగా ఆ ప్రాంతానికి ప్రయాణం భక్తులకు ఆహ్లాదకరంగానూ సాగుతుంది. నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లిలో కొలువైన శోభనాచలస్వామి ఆలయం వేల సంవత్సరాలుగా భక్తుల తాకిడితో అలరారుతోంది. ప్రకృతి రమణీయత, ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాలకు నెలవైన ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యాటకం పరుగులు తీయనుంది. కృష్ణాజిల్లా నుంచి ఏలూరు జిల్లాలో కలిసిన కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో చూడచక్కని ప్రదేశాలు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన కొల్లేరు ప్రాంతం, ఆటపాక, మాధవాపురం పక్షుల కేంద్రాలు, ప్రఖ్యాత దేవస్థానాలైన ద్వారకాతిరుమల, పెద్దింట్లమ్మ ఆలయం, భీమవరంలోని మావుళ్లమ్మ ఆలయం, పశ్చిమగోదావరి జిల్లాలో కొలువైన పంచారామ క్షేత్రాలు, పేరుపాలెం బీచ్, ఏలూరు జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతం, పోలవరం ప్రాజెక్టు, ఆగిరిపల్లిలోని సోభనాచల స్వామి ఆలయం ఇలా పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు అనేకం. పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెడితే టూరిజం స్పాట్‌గా ఈ ప్రాంతాలు మంచి ఆదాయ వనరులుగా మారే అవకాశముంది. – కైకలూరు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి చర్యలు కొల్లేరు ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ముఖ్యంగా పక్షుల విహార కేంద్రాల వద్ద ఎకో టూరిజం అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేశాం. యాత్రికుల నుంచి టిక్కెట్ల రూపంలో వచ్చిన నగదుతో పర్యాటకులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఏలూరు జిల్లాలో కొల్లేరు ప్రాంతాలన్నీ విలీనం కావడంతో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఆటపాక, మాధవాపురం పక్షుల కేంద్రాలను అభివృద్ధి చేశాం. – ఎస్వీవీ కుమార్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, ఏలూరు -
గూగుల్‌లో చూసి.. రష్యా నుంచి హార్సిలీహిల్స్‌కు!
బి.కొత్తకోట : ఎన్నో పర్యాటక ప్రాంతాల్లో పర్యటించినా ఏపీ టూరిజంలా ఎక్కడా లేదని రష్యాకు చెందిన పర్యాటకులు డేనియల్, దిమిత్రి తెలిపారు. మిత్రులైన వీరు రష్యాలోని మాస్కోలో వృత్తిపరమైన వ్యాపారం చేసుకొంటూ జీవిస్తున్నారు. వీరికి పర్యాటక ప్రాంతాల సందర్శన అంటే ఇష్టం. పర్యాటక స్థలాల గురించి గూగుల్‌లో వెతుకుతుండగా చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ గురించి తెలుసుకొన్నారు. బెంగళూరులో ఉన్న ప్రాంతాలు చూసుకుని ఆదివారం హార్సిలీహిల్స్ చేరుకున్నారు. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని కొండపైనున్న ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడి మొక్కలు, యూకలిప్టస్ వృక్షాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలను సందర్శించడం తమ హాబీ అని తెలిపారు. గూగుల్‌లో హార్సిలీహిల్స్ గురించి తెలుసుకొని వచ్చామన్నారు. ఇక్కడి ప్రకృతి అందాలు, చల్లటి వాతావరణం మరెక్కడా చూడలేదని వివరించారు. ప్రధానంగా ఏపీ ప్రభుత్వ టూరిజంశాఖ నిర్వహణ, పనితీరు బాగుందని వారు ప్రశంసించారు. -
మోడల్ స్కూళ్లలో వృత్తి విద్యా కోర్సులు
సాక్షి, హైదరాబాద్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పించేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు చదువుతోపాటు ఈ కోర్సులు నేర్పించడం ద్వారా భవిష్యత్తులో స్వయం ఉపాధి సాధించేందుకు తోడ్పడుతాయన్న ఆలోచనతో ఏర్పాట్లు చేస్తోంది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎన్ఎస్డీసీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 20 మోడల్ స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు కింద నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరంలోనే కోర్సులు ప్రారంభించేలా చర్యలు చేపడుతోంది. ఈ కార్యక్రమం విజయవంతమైతే మిగతా పాఠశాలల్లోనూ ప్రారంభించాలని భావిస్తోంది. ముఖ్యంగా ఐటీ సంబంధిత కోర్సులు, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, బ్యూటీ అండ్ వెల్నెస్ (బ్యూటీ పార్లర్) కోర్సులను ప్రధానంగా ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. కోర్సుల డిజైన్, కాల పరిమితి, నిర్వహణ సమయం అంతా ఎన్ఎస్డీసీ ప్రతినిధులు చూసుకుంటారని విద్యాశాఖ ఉన్నతాధికారులు రి ఒకరు వెల్లడించారు. -
‘ఆతిథ్యం’లో వైవిధ్యం.. డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్
దేశంలో ప్రతి ఏటా సుస్థిరమైన అభివృద్ధి బాటలో పయనిస్తున్న రంగం.. టూరిజం అండ్ హాస్పిటాలిటీ. భారత్‌లోని అద్భుతమైన చారిత్రక కట్టడాలు, ఆహ్లాదకరమైన, సుందరమైన ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇదే సమయంలో కెరీర్ పరంగానూ యువతకు చక్కటి మార్గం చూపుతోంది. పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడానికి నిపుణుల అవసరం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో హాస్పిటాలిటీ రంగంలో నిష్ణాతులను తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటై నాణ్యమైన విద్యను అందించడంలో మంచి గుర్తింపు పొందుతున్న డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్పై ఇన్స్టిట్యూట్ వాచ్.. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవతో 2004లో ప్రభుత్వ సంస్థగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఏర్పాటైంది. అనతి కాలంలోనే ఆతిథ్య రంగంలో నిపుణులను తీర్చిదిద్దడంలో దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్.. ఆతిథ్య రంగంలోని ఉత్తమ ఇన్స్టిట్యూట్లకు అందించే ‘ఉయ్ స్కూల్ ఇన్నోవేషన్ అవార్డ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ అవార్డులను కూడా సొంతం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఈ ఇన్స్టిట్యూట్.. డిప్లొమా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు హాస్పిటాలిటీ, టూరిజం, అనుబంధ విభాగాల్లో పలు కోర్సులు అందిస్తూ అన్ని స్థాయిల విద్యార్థులకు కెరీర్ అవకాశాలు కల్పిస్తోంది. అంతేకాకుండా హోటల్ మేనేజ్మెంట్లో.. టూరిజం, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్ మూడు విభాగాలను అనుసంధానం చేస్తూ కోర్సులను అందిస్తున్న సంస్థగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఫలితంగా ఒక కోర్సులో చేరిన విద్యార్థికి మొత్తం మూడు రంగాల అవసరాలపై శిక్షణ లభిస్తుంది. కోర్సులివే: ప్రస్తుతం డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఆరు నెలల వ్యవధి గల స్వల్ప కాలిక కోర్సుల నుంచి ఎంబీఏ వరకు పలు కోర్సులు అందిస్తోంది. అవి..- ఎంబీఏ(హాస్పిటాలిటీ); ఎంబీఏ(టూరిజం అండ్ హాస్పిటాలిటీ); పీజీడీఎం(టూరిజం); పీజీ డిప్లొమా ఇన్ హెరిటేజ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్; బీబీఏ(టూరిజం అండ్ హాస్పిటాలిటీ); బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్); వీటిలో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత అర్హత. ఎంబీఏ, ఇతర పీజీ కోర్సులకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత అర్హత. పీజీడీఎం(టూరిజం); ఎంబీఏ(టూరిజం అండ్ హాస్పిటాలిటీ) కోర్సులకు క్యాట్/ మ్యాట్/ సీమ్యాట్/ ఐసెట్ వంటి మేనేజ్మెంట్ ఎంట్రెన్స్ పరీక్షల్లోనూ ర్యాంకులు తప్పనిసరి. బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈలో ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. స్వయం ఉపాధికి.. ఊతమిచ్చే షార్ట్‌టర్మ్ కోర్సులు: డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్ పూర్తి స్థాయి ప్రొఫెషనల్ కోర్సులతోపాటు హోటల్, హాస్పిటాలిటీ అనుబంధ విభాగాల్లో స్వయం ఉపాధికి ఊతమిచ్చేలా మూడు నెలలు, ఆరు నెలల వ్యవధిలో పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది. వీటిలో రూరల్ టూరిజం; ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ, ఆర్ట్ అప్రిసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆయుర్వేద పంచకర్మ థెరపీ కోర్సులు ప్రధానమైనవి. ఇప్పటికే హోటల్స్, రెస్టారెంట్లలో పనిచేస్తున్న వారికి మరింత వృత్తి నైపుణ్యాలు అందించే విధంగా కుకింగ్ (ఎనిమిది వారాలు); రెస్టారెంట్ సర్వీసెస్ (ఆరు వారాలు)లో ఉచిత శిక్షణ కూడా అందిస్తోంది. వెబ్సైట్: www.nithm.ac.in లెర్న్ బై డూయింగ్ ‘ లేబొరేటరీ: హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలదే పెద్దపీట. అందుకే ఇన్స్టిట్యూట్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యమిచ్చేలా కరిక్యులం రూపకల్పన జరిగింది. ముఖ్యంగా లెర్న్ బై డూయింగ్ విధానంతో ప్రతి విద్యార్థికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కలిగేలా చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలో ఆహార పదార్థాల తయారీలో ఎంతో ముఖ్యమైన ఎలక్ట్రిక్ ఒవెన్స్, మైక్రోవేవ్ ఒవెన్స్; ప్లానెటరీ కేక్ మిక్సర్స్; మల్టీ పర్పస్ గ్యాస్ కుకర్స్ తదితర అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. వీటితోపాటు ఆరు వేల పుస్తకాలు; జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న దాదాపు వంద జర్నల్స్, మేగజైన్లతో కూడిన లైబ్రరీ సదుపాయం విద్యార్థులు ఈ రంగంలో థియరీ నాలెడ్జ్‌ను మరింత పెంచుకునేందుకు, తాజా పరిస్థితులపై అవగాహన పొందేందుకు దోహదం చేస్తోంది. ఇన్స్టిట్యూట్లోని డిజిటల్ లైబ్రరీ ద్వారా విద్యార్థులకు అపారమైన నైపుణ్యం సొంతమవుతోంది. వేల సంఖ్యలో ఈ-లెర్నింగ్ రిసోర్సెస్, వర్చువల్ క్లాస్ రూంల సదుపాయం అందుబాటులో ఉంది. క్షేత్ర నైపుణ్యాల దిశగా ఒప్పందాలు: విద్యార్థుల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలు అందించే దిశగా ఇండియన్ అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్, యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్, జేఎన్టీయూ-హైదరాబాద్ వంటి సంస్థలతో డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్ ఒప్పందాలు చేసుకుంది. ప్లేస్మెంట్ ష్యూర్: లాంగ్ టర్మ, షార్ట్ టర్మ్.. ఏ కోర్సు ఉత్తీర్ణులకైనా ప్లేస్మెంట్ కల్పించే విధంగా ఈ రంగంలోని పలు సంస్థలతో ఇన్స్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది. ప్రతి ఏటా బీబీఏ, ఎంబీఏలో మూడో సెమిస్టర్ పూర్తయిన వెంటనే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఏర్పాట్లు జరుగుతాయి. నిథమ్ విద్యార్థులు ఏపీటీడీసీ, జీఎంఆర్, రాడిసన్, గ్రీన్‌పార్క్, థామస్‌కుక్, కాక్స్ అండ్ కింగ్స్, మేక్ మై ట్రిప్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు ప్రారంభంలో నెలకు రూ.25 వేలు, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులు రూ.30 వేల వేతనం పొందుతున్నారు. ‘‘డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్... కోర్సులు, శిక్షణ విషయంలో నిరంతరం నిత్య నూతనంగా వ్యవహరిస్తోంది. ఈ రంగంలోని తాజా అవసరాలకు అనుగుణంగా శిక్షణలో మార్పులూచేర్పులూ చేస్తూ విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పిస్తోంది. ఫలితంగా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దోహా ఎయిర్పోర్ట్, ఖతార్ ఎయిర్వేస్ తదితర సంస్థలు కూడా ఈ ఇన్స్టిట్యూట్ విద్యార్థులను రిక్రూట్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవలి కాలంలో విద్యార్థులకు కూడా హాస్పిటాలిటీ కోర్సుల పట్ల అవగాహన పెరిగింది. వారు డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్‌ను తమ తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు’’ - ప్రొఫెసర్ ఎస్.సుధాకుమార్ ప్రిన్సిపాల్, స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ, డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్