మోడల్ స్కూళ్లలో వృత్తి విద్యా కోర్సులు
సాక్షి, హైదరాబాద్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పించేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు చదువుతోపాటు ఈ కోర్సులు నేర్పించడం ద్వారా భవిష్యత్తులో స్వయం ఉపాధి సాధించేందుకు తోడ్పడుతాయన్న ఆలోచనతో ఏర్పాట్లు చేస్తోంది. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎన్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 20 మోడల్ స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు కింద నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరంలోనే కోర్సులు ప్రారంభించేలా చర్యలు చేపడుతోంది. ఈ కార్యక్రమం విజయవంతమైతే మిగతా పాఠశాలల్లోనూ ప్రారంభించాలని భావిస్తోంది.
ముఖ్యంగా ఐటీ సంబంధిత కోర్సులు, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, బ్యూటీ అండ్ వెల్‌నెస్ (బ్యూటీ పార్లర్) కోర్సులను ప్రధానంగా ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. కోర్సుల డిజైన్, కాల పరిమితి, నిర్వహణ సమయం అంతా ఎన్‌ఎస్‌డీసీ ప్రతినిధులు చూసుకుంటారని విద్యాశాఖ ఉన్నతాధికారులు రి ఒకరు వెల్లడించారు.