పర్యాటకంలో నంబర్‌ 3  | Telangana Stands Third In Integrated Development Of Tourism | Sakshi
Sakshi News home page

పర్యాటక సమగ్ర అభివృద్ధిలో మూడో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ 

Published Wed, Sep 28 2022 4:17 AM | Last Updated on Wed, Sep 28 2022 5:23 AM

Telangana Stands Third In Integrated Development Of Tourism - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పర్యాటక సమగ్ర అభివృద్ధిలో మూ­డో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జాతీయ పర్యాటక అవార్డుల(2018–19) ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్‌రెడ్డి అవార్డులు అందించా­రు. తెలంగాణ 4, ఆంధ్రప్రదేశ్‌ 4 అవార్డులను కైవసం చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఆంధ్రప్రదేశ్‌ తరఫున టూరిజం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఐఏఎస్‌ అధికారి ఆర్‌.గోవిందరావు అవార్డులు అందుకున్నారు.  

దేశీయ పర్యాటకానికి మంచి భవిష్యత్‌ 
భారత పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని.. కావాల్సిందల్లా పర్యాటక కేంద్రాలకు అవసరమైన రవాణా, ఇతర మౌలిక వసతుల కల్పన మాత్రమేనని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు మొదలు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిచోటా భారత్‌లో పర్యాటకానికి విస్తృత అవకాశాలున్నాయన్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు, వివిధ ప్రాంతాల్లో జరిగే పండుగలు, పురాతన కట్టడాలు ఇలా ప్రతిచోటా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయని చెప్పారు. భారత పర్యాటక రంగం చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ.. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డిని అభినందించారు. 

పర్యాటక, ఆతిథ్య రంగాల బలోపేతం..  
దేశీయ పర్యాటకాభివృద్ధి కోసం కేంద్రం చిత్తుశుద్ధితో కృషిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. న్యూ ఇండియా విజన్‌ నినాదంతో త్వరలోనే నూతన జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా మౌలిక వసతుల కల్పన, పర్యాటక పరిశ్రమను వృద్ధి చేయడం, పర్యాటకానికి అనుబంధంగా ఉన్న రంగాలను ప్రోత్సహించడం, పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం.. వంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.     

తెలంగాణకు అవార్డులు

  • పర్యాటక సమగ్ర అభివృద్ధిలో మూడో ఉత్తమ రాష్ట్రం  
  • బెస్ట్‌ టూరిస్ట్‌ ఫ్రెండ్లీ రైల్వేస్టేషన్‌గా సికింద్రాబాద్‌ 
  • హైదరాబాద్‌లోని అపోలో హెల్త్‌ సిటీకి ‘బెస్ట్‌ మెడికల్‌ టూరిజం ఫెసిలిటీ’ 
  • హైదరాబాద్‌ గోల్ఫ్‌ కోర్సుకు ఉత్తమ పర్యాటక గోల్ఫ్‌ కోర్స్‌ 

ఆంధ్రప్రదేశ్‌కు అవార్డులు 

  • ఉత్తమ పర్యాటక రాష్ట్రాల్లో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డు 
  • ఏపీ టూరిజం ప్రచురించిన కాఫీ టేబుల్‌ బుక్‌ ‘సీసైడ్‌’కు ఎక్సలెన్స్‌ ఇన్‌ పబ్లిషింగ్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ అవార్డు 
  • ఏపీ టూరిజం ప్రచురించిన కాఫీ టేబుల్‌ బుక్స్‌ ‘సీసైడ్‌’ (రష్యన్‌), హ్యాండ్‌క్రాఫ్టెడ్‌ ( స్పానిష్, జర్మన్‌)కు ఎక్సలెన్స్‌ ఇన్‌ పబ్లిషింగ్‌ ఇన్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ అవార్డు  
  • విజయవాడలోని ‘ది గేట్‌వే హోటల్‌’కు బెస్ట్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ అవార్డు   

ఉత్తమ పర్యాటక కేంద్రంగా బుద్ధవనం 

నాగార్జునసాగర్‌: ప్రపంచ పర్యాటక దినోత్సవం–2022 సందర్భంగా ప్రతిష్టాత్మక బుద్ధవనం ప్రాజెక్టుకు ఉత్తమ పౌరసదుపాయాలు కల్పించినందుకుగాను ఉత్తమ పర్యాటక అవార్డు దక్కిందని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. హైదరాబాద్‌ హైటెక్‌సిటీలో మంగళవారం జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమంలో పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా చేతుల మీదుగా అవార్డు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్, టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్‌రావు, శివనాగిరెడ్డి, బుద్ధవనం అధికారులు సుధన్‌రెడ్డి, క్రాంతిబాబు, శ్యాంసుందర్‌రావు పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement