Integrated development
-
పర్యాటకంలో నంబర్ 3
సాక్షి, న్యూఢిల్లీ: పర్యాటక సమగ్ర అభివృద్ధిలో మూడో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జాతీయ పర్యాటక అవార్డుల(2018–19) ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్‌రెడ్డి అవార్డులు అందించారు. తెలంగాణ 4, ఆంధ్రప్రదేశ్ 4 అవార్డులను కైవసం చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఆంధ్రప్రదేశ్ తరఫున టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి ఆర్.గోవిందరావు అవార్డులు అందుకున్నారు. దేశీయ పర్యాటకానికి మంచి భవిష్యత్ భారత పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని.. కావాల్సిందల్లా పర్యాటక కేంద్రాలకు అవసరమైన రవాణా, ఇతర మౌలిక వసతుల కల్పన మాత్రమేనని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు మొదలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిచోటా భారత్‌లో పర్యాటకానికి విస్తృత అవకాశాలున్నాయన్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు, వివిధ ప్రాంతాల్లో జరిగే పండుగలు, పురాతన కట్టడాలు ఇలా ప్రతిచోటా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయని చెప్పారు. భారత పర్యాటక రంగం చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ.. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డిని అభినందించారు. పర్యాటక, ఆతిథ్య రంగాల బలోపేతం.. దేశీయ పర్యాటకాభివృద్ధి కోసం కేంద్రం చిత్తుశుద్ధితో కృషిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. న్యూ ఇండియా విజన్ నినాదంతో త్వరలోనే నూతన జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా మౌలిక వసతుల కల్పన, పర్యాటక పరిశ్రమను వృద్ధి చేయడం, పర్యాటకానికి అనుబంధంగా ఉన్న రంగాలను ప్రోత్సహించడం, పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం.. వంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు అవార్డులు పర్యాటక సమగ్ర అభివృద్ధిలో మూడో ఉత్తమ రాష్ట్రం బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వేస్టేషన్‌గా సికింద్రాబాద్ హైదరాబాద్‌లోని అపోలో హెల్త్ సిటీకి ‘బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ’ హైదరాబాద్ గోల్ఫ్ కోర్సుకు ఉత్తమ పర్యాటక గోల్ఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్‌కు అవార్డులు ఉత్తమ పర్యాటక రాష్ట్రాల్లో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు ఏపీ టూరిజం ప్రచురించిన కాఫీ టేబుల్ బుక్ ‘సీసైడ్’కు ఎక్సలెన్స్ ఇన్ పబ్లిషింగ్ ఇన్ ఇంగ్లిష్ అవార్డు ఏపీ టూరిజం ప్రచురించిన కాఫీ టేబుల్ బుక్స్ ‘సీసైడ్’ (రష్యన్), హ్యాండ్‌క్రాఫ్టెడ్ ( స్పానిష్, జర్మన్)కు ఎక్సలెన్స్ ఇన్ పబ్లిషింగ్ ఇన్ ఫారిన్ లాంగ్వేజ్ అవార్డు విజయవాడలోని ‘ది గేట్‌వే హోటల్’కు బెస్ట్ ఫైవ్‌స్టార్ హోటల్ అవార్డు ఉత్తమ పర్యాటక కేంద్రంగా బుద్ధవనం నాగార్జునసాగర్: ప్రపంచ పర్యాటక దినోత్సవం–2022 సందర్భంగా ప్రతిష్టాత్మక బుద్ధవనం ప్రాజెక్టుకు ఉత్తమ పౌరసదుపాయాలు కల్పించినందుకుగాను ఉత్తమ పర్యాటక అవార్డు దక్కిందని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. హైదరాబాద్ హైటెక్‌సిటీలో మంగళవారం జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమంలో పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా చేతుల మీదుగా అవార్డు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్‌రావు, శివనాగిరెడ్డి, బుద్ధవనం అధికారులు సుధన్‌రెడ్డి, క్రాంతిబాబు, శ్యాంసుందర్‌రావు పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. -
AP: బతుకులు బాగుపడుతున్నాయ్..‘ఇండియా టుడే’ సర్వే
సాక్షి, అమరావతి: గ్రామాల్లోనే పారదర్శకంగా పౌర సేవలన్నీ అందుబాటులోకి తేవడం.. వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలవడం.. విద్య, వైద్య రంగాలను సంస్కరించి నాడు – నేడు ద్వారా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడం.. అభివృద్ధి పథంలో ప్రజలందరినీ భాగస్వాములుగా చేయడం.. వివక్ష లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చడం ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల స్థితిగతుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా సమగ్రాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రపథంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్ గ్రోత్) సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధించిందని జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఇండియా టుడే’ సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది. అంతేకాకుండా ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఏపీ తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంది. గతేడాది ఏడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరడం గమనార్హం. 2021 ఏడాదికిగానూ ‘స్టేట్ ఆఫ్ స్టేట్స్’ పేరిట నిర్వహించిన సర్వే ఫలితాలను ‘ఇండియా టుడే’ సంస్థ తాజాగా ప్రకటించింది. 2018లో పదో స్థానం నుంచి.. టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తోందని ఈ సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా 2018లో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రాల జాబితాలో ఏపీ పదో స్థానంలో ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో రెండు స్థానాలు మెరుగుపరచుకుని ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. ఇక 2020లో ఏడో స్థానానికి చేరుకున్న మన రాష్ట్రం తాజాగా ఆరో స్థానం సాధించడం విశేషం. 2019 నుంచి రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అత్యుత్తమ పనితీరు కనబరుస్తోందన్నది ‘ఇండియా టుడే’ సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వేలో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. జీవన ప్రమాణాలకు కొలమానం ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలకు కొలబద్ధ లాంటి సమ్మిళత అభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా సమ్మిళిత అభివృద్ధి ప్రధాన సూచిక అని ఇండియా టుడే సర్వే పేర్కొంది. పేద, మధ్య తరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారానే సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయగలమన్న నిపుణుల అభిప్రాయాలను ఉదహరించింది. ఎలా సాధ్యమైందంటే... రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేయడం, ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ, రికార్డు స్థాయిలో ఉపాధి హామీ పనుల కల్పన, పలు పథకాల ద్వారా చిరు వ్యాపారులు, వివిధ వృత్తుల వారికి ప్రభుత్వం అండగా నిలవడం ద్వారా ప్రజలు మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు. జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక లాంటి పథకాలతో రాష్ట్రంలో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెద్ద ఎత్తున పెరిగింది. రూ.వెయ్యికు మించిన వైద్య చికిత్సలు అన్నింటినీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకురావడం, పథకం వర్తించేందుకు వార్షిక ఆదాయ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్రంలో దాదాపు 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారా బీమా రక్షణ కల్పించారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, ఆరోగ్య రక్షణ, విద్యాభివృద్ధి చర్యలతో ప్రజల జీవన ప్రమాణాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయంగా మెరుగుపరిచింది. నిపుణులతో సమగ్ర సర్వే రాష్ట్రాల పనితీరును నిగ్గు తేల్చేందుకు ఇండియా టుడే సంస్థ నిర్వహిస్తున్న ఈ సర్వేకు దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. ఇండియా టుడే సంస్థకు చెందిన ‘మార్కెటింగ్– డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్ఏ)’ ద్వారా 2003 నుంచి ఏటా ఈ సర్వేను నిర్వహిస్తోంది. 2021కుగాను ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు దేశవ్యాప్తంగా సర్వే చేపట్టారు. సర్వే బృందంలో ప్రముఖ విధాన నిర్ణేతలు, నీతి ఆయోగ్ ప్రతినిధులు, సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు, వివిధ పరిశోధన సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నట్లు ఇండియా టుడే సంస్థ వెల్లడించింది. రాష్ట్రాల పనితీరును మదింపు చేసేందుకు మొత్తం 123 ప్రామాణిక అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే చేపట్టినట్లు వెల్లడించింది. కీలక అంశాలే ప్రామాణికం.. సమ్మిళిత అభివృద్ధిని నిర్ధారించేందుకు పలు కీలక అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఇండియా టుడే ఈ సర్వే నిర్వహించింది. పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలు తీరు, బ్యాంకు ఖాతాలున్న పేద కుటుంబాలు, వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు, ఉపాధి హామీ ద్వారా ప్రయోజనం పొందుతున్న కుటుంబాలు, ఆరోగ్య బీమా పథకాల పరిధిలోకి వచ్చిన కుటుంబాలు, రేషన్ పంపిణీతో లబ్ధి పొందుతున్న కుటుంబాలు, కుటుంబ సగటు వేతన ఆదాయం, బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ పనితీరు, 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో పాఠశాలలకు వెళ్తున్న వారి శాతం.. ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించింది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందంది. రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ‘శాచ్యురేషన్ విధానం’లో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతోనే ఇది సాధ్యమైందని సర్వే నివేదిక విశ్లేషించింది. -
సమగ్ర అభివృద్ధి కోసం ధర్నా
పెదకడుబూరు: కర్నూలు జిల్లా పెదకడుబూరు మండల సమగ్ర అభివృద్ధికి ప్యాకేజీ కేటాయించాలని కోరుతూ స్థానికులు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గురువారం మండల కేంద్రంలో పలువురు నాయకులు మండల అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించాలని కోరారు. కర్నూలు జిల్లాలో వెనకబడిన మండలాలపై నాయకులు, ఉన్నతాధికారులు దృష్టి సారించి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలి ఈ సందర్భంగా వారు కోరారు. -
సమీకృత అభివృద్ధికి ‘గ్రామజ్యోతి’
-
సమీకృత అభివృద్ధికి ‘గ్రామజ్యోతి’
ఆగస్టు 15న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం ⇒ గ్రామీణ ప్రాంతాల కోసం ప్రత్యేక కార్యక్రమం ⇒ గ్రామ స్థాయిలోనే అభివృద్ధి ప్రణాళికలు, అమలు ⇒ విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం ⇒ వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సమీకృత అభివృద్ధి కోసం ప్రభుత్వం ‘గ్రామజ్యోతి’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించనుంది. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామజ్యోతి ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామానికి రూ.రెండు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు అభివృద్ధి నిధులను అందివ్వాలని సీఎం సంకల్పించారు. పంచాయతీరాజ్ వ్యవస్థనుబలోపేతం చేయడం, గ్రామ పంచాయతీలను క్రియాశీలకంగా మార్చడం, గ్రామస్థాయిలోనే అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకొని అమలు చేయడం.. గ్రామ జ్యోతి కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత ్వం పేర్కొంటోంది. ఈ కార్యక్రమ విధి విధానాలను రూపొందించేందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సభ్యులుగా ఉంటారు. మంత్రివర్గ ఉపసంఘం వారంలోగా నివేదిక ఇవ్వాలని సీఎం నిర్ధేశించారు. మన ఊరు-మన ప్రణాళికతో భూమిక ప్రభుత్వం గతేడాది నిర్వహించిన మనఊరు-మన ప్రణాళిక గ్రామజ్యోతి కార్యక్రమానికి భూమిక కానుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పలానా గ్రామమే ప్రత్యేకం అనికాకుండా తెలంగాణలోని ప్రతి గ్రామం అవసరాలను తీర్చడమే ప్రభుత్వ సంకల్పంగా ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదిక మేరకు గ్రామజ్యోతి కార్యక్రమ విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఈ నెల 30న అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి విభాగం ఉన్నతాధికారులతో ఎంసీహెచ్ఆర్డీలో సమావేశం నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.