సాక్షి, అమరావతి: గ్రామాల్లోనే పారదర్శకంగా పౌర సేవలన్నీ అందుబాటులోకి తేవడం.. వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలవడం.. విద్య, వైద్య రంగాలను సంస్కరించి నాడు – నేడు ద్వారా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడం.. అభివృద్ధి పథంలో ప్రజలందరినీ భాగస్వాములుగా చేయడం.. వివక్ష లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చడం ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల స్థితిగతుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా సమగ్రాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రపథంలో నిలిచింది.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్ గ్రోత్) సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధించిందని జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఇండియా టుడే’ సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది. అంతేకాకుండా ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఏపీ తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంది. గతేడాది ఏడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరడం గమనార్హం. 2021 ఏడాదికిగానూ ‘స్టేట్ ఆఫ్ స్టేట్స్’ పేరిట నిర్వహించిన సర్వే ఫలితాలను ‘ఇండియా టుడే’ సంస్థ తాజాగా ప్రకటించింది.
2018లో పదో స్థానం నుంచి..
టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తోందని ఈ సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా 2018లో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రాల జాబితాలో ఏపీ పదో స్థానంలో ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో రెండు స్థానాలు మెరుగుపరచుకుని ఎనిమిదో స్థానానికి ఎగబాకింది.
ఇక 2020లో ఏడో స్థానానికి చేరుకున్న మన రాష్ట్రం తాజాగా ఆరో స్థానం సాధించడం విశేషం. 2019 నుంచి రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అత్యుత్తమ పనితీరు కనబరుస్తోందన్నది ‘ఇండియా టుడే’ సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వేలో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది.
జీవన ప్రమాణాలకు కొలమానం
ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలకు కొలబద్ధ లాంటి సమ్మిళత అభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా సమ్మిళిత అభివృద్ధి ప్రధాన సూచిక అని ఇండియా టుడే సర్వే పేర్కొంది. పేద, మధ్య తరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారానే సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయగలమన్న నిపుణుల అభిప్రాయాలను ఉదహరించింది.
ఎలా సాధ్యమైందంటే...
రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేయడం, ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ, రికార్డు స్థాయిలో ఉపాధి హామీ పనుల కల్పన, పలు పథకాల ద్వారా చిరు వ్యాపారులు, వివిధ వృత్తుల వారికి ప్రభుత్వం అండగా నిలవడం ద్వారా ప్రజలు మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు. జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక లాంటి పథకాలతో రాష్ట్రంలో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెద్ద ఎత్తున పెరిగింది. రూ.వెయ్యికు మించిన వైద్య చికిత్సలు అన్నింటినీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకురావడం, పథకం వర్తించేందుకు వార్షిక ఆదాయ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్రంలో దాదాపు 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారా బీమా రక్షణ కల్పించారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, ఆరోగ్య రక్షణ, విద్యాభివృద్ధి చర్యలతో ప్రజల జీవన ప్రమాణాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయంగా మెరుగుపరిచింది.
నిపుణులతో సమగ్ర సర్వే
రాష్ట్రాల పనితీరును నిగ్గు తేల్చేందుకు ఇండియా టుడే సంస్థ నిర్వహిస్తున్న ఈ సర్వేకు దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. ఇండియా టుడే సంస్థకు చెందిన ‘మార్కెటింగ్– డెవలప్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్‌ఏ)’ ద్వారా 2003 నుంచి ఏటా ఈ సర్వేను నిర్వహిస్తోంది. 2021కుగాను ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు దేశవ్యాప్తంగా సర్వే చేపట్టారు. సర్వే బృందంలో ప్రముఖ విధాన నిర్ణేతలు, నీతి ఆయోగ్ ప్రతినిధులు, సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు, వివిధ పరిశోధన సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నట్లు ఇండియా టుడే సంస్థ వెల్లడించింది. రాష్ట్రాల పనితీరును మదింపు చేసేందుకు మొత్తం 123 ప్రామాణిక అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే చేపట్టినట్లు వెల్లడించింది.
కీలక అంశాలే ప్రామాణికం..
సమ్మిళిత అభివృద్ధిని నిర్ధారించేందుకు పలు కీలక అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఇండియా టుడే ఈ సర్వే నిర్వహించింది. పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలు తీరు, బ్యాంకు ఖాతాలున్న పేద కుటుంబాలు, వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు, ఉపాధి హామీ ద్వారా ప్రయోజనం పొందుతున్న కుటుంబాలు, ఆరోగ్య బీమా పథకాల పరిధిలోకి వచ్చిన కుటుంబాలు, రేషన్ పంపిణీతో లబ్ధి పొందుతున్న కుటుంబాలు, కుటుంబ సగటు వేతన ఆదాయం, బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ పనితీరు, 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో పాఠశాలలకు వెళ్తున్న వారి శాతం.. ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించింది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందంది. రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ‘శాచ్యురేషన్ విధానం’లో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతోనే ఇది సాధ్యమైందని సర్వే నివేదిక విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment