
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో సంచలనంగా మారిన భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తాజాగా ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, అరెస్ట్ అయిన వారిలో బీఆర్‌ఎస్ నేత హరిబాబు కూడా ఉన్నారు. ఆయనే ప్లాన్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించిన వివరాలను తాజాగా ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ..‘రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణం. సంజీవ్, రాజలింగమూర్తి మధ్య భూ వివాదం కొనసాగుతోంది. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారు. కంట్లో కారం కొట్టి కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ హత్యలో నలుగురు వ్యక్తులు నేరుగా పాల్గొన్నారు. మిగతా వాళ్లు వారితో టచ్‌లో ఉన్నారు.
బీఆర్‌ఎస్ నాయకుడు హరిబాబు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు గుర్తించాం. ప్లాన్ ప్రకారం వరంగల్‌లోని కాశీబుగ్గలో హత్యకోసం కత్తులు, రాడ్లను దుండగులు కొనుగోలు చేశారు. ఇతర కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రదారులైన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశాం. మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఆరు బృందాలతో కలిసి పోలీసులు వారి కోసం గాలింపు చర్యల్లో ఉన్నారు. త్వరగానే పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉండగా.. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ముఖ్య అనుచరుడే కొత్త హరిబాబు. ఈ కేసులో A1 రేణిగుంట్ల సంజీవ్.. హత్యకు ముందు, తర్వాత హరిబాబుతో టచ్‌లో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు.

నిందితుల పేర్లు వెల్లడి..
- A1)రేణికుంట్ల సంజీవ్
- A2) పింగిలి సీమంత్
- A3)మోరె కుమార్
- A4)కొత్తూరి కిరణ్
- A5) రేణికుంట్ల కొమురయ్య
- A6) దాసర కృష్ణ
- A7) రేణిగుంట్ల సాంబయ్య
పరారీలో ఉన్న వారు
- A8) కొత్తూరి హరిబాబు
- A9) పుల్ల నరేష్
- A10) పుల్ల సురేష్

Comments
Please login to add a commentAdd a comment