కడపలో యువకుడి ఆత్మహత్య
అమీనాబాద్‌లో అలుముకున్న విషాదఛాయలు
చెన్నారావుపేట: అమ్మా, నాన్నా నన్ను క్షమించండి.. మీ ఆశలు నెరవేర్చలేకపోతున్నాను.. అని సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటనకు సంబంధించి, స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన చీర మల్లేశం– కళావతిలకు కుమార్తె, కుమారుడు రంజిత్(25) ఉన్నారు. కుమార్తెకు వివాహం జరిపించారు.
కుమారుడు అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి ఉన్నత చదువులు చదువుతూ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్నాడు. ఇటీవల ఓ పోటీ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో ఉద్యోగం రాలేదని మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో స్నేహితుడు ప్రశాంత్ అక్క వివాహానికి మూడు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. పట్టణంలోని ఎర్రముక్కలపల్లి రోడ్డు వద్ద ఓ ప్రముఖ లాడ్జీని అద్దెకు తీసుకున్నారు.
గురువారం తన స్నేహితులు టిఫిన్ చేయడానికి వెళ్లారు. రంజిత్ రాకపోవడంతో స్నేహితులు గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నాడు. పోలీసులకు తెలియజేసి, రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రంజిత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం అనంతరం రంజిత్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. చేతికొచ్చిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురి కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment