దుగ్గొండి: ఉన్నత విద్యావంతుడు.. ఉద్యోగం, ఆస్తిపాస్తులు లేవు.. బతుకుదెరువు దొరుకుతుందని ఆశపడి 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యాడు. ఊరూవాడను ఏకం చేయడంతో పాటు గిరిజన తండాల్లో ఉద్యమ బిడ్డలను తయారు చేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆరేళ్లు గడిచినా ఎలాంటి బతుకుదెరువు దొరకలేదు. కన్నబిడ్డలు పెళ్లీడుకొచ్చినా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో జీవితం వ్యర్థమని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం పీజీ తండా గ్రామానికి చెందిన నూనావత్ రవినాయక్ (40) కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.
తెలంగాణ వచ్చిన ఆరేళ్ల నుంచి ఉద్యోగం కోసం పడరాని పాట్లు పడినా ఫలితం లేదు. ఓ పక్క ఎలాంటి ఆస్తి లేకపోవడం, ఇద్దరు కూతుళ్లు లిఖిల, కళ్యాణి డిగ్రీ చదువుతూ పెళ్లీడుకు రావడంతో భార్య జ్యోతి కూలి పనులు చేస్తూ కుటుంబపోషణలో పాలు పంచుకుంటోంది. దీంతో రవినాయక్ తీవ్ర మనస్తాపం చెంది సోమవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశాడు. కాగా, రవినాయక్ మృతదేహం వద్ద నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వెంటనే రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment