Telangana activist
-
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, నాటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నేత ఎం.శ్రీధర్‌రెడ్డి (77) కన్నుమూశా రు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో శ్రీధర్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యార్థి నేతగా ఉద్యమంలోకి.. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాడారు. ఆ సమయంలో యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఉన్న శ్రీధర్‌రెడ్డి.. ఉవ్వెత్తున ఉద్యమాన్ని రేపి, ముందుండి నడిపించారు. అప్పట్లో మర్రి చెన్నారెడ్డి ఏర్పాటు చేసిన సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి (ఎస్టీపీఎస్)కు పోటీగా తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్)ని ఏర్పాటు చేశారు. జనతాపార్టీ ఆవిర్భావం తర్వాత అందులో చేరి ఆలిండియా యువ జనతా విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్.జనార్ధనరెడ్డి ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఏపీ స్పోర్ట్ కౌన్సిల్ చైర్మన్‌గా పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రముఖుల దిగ్భ్రాంతి.. శ్రీధర్‌రెడ్డి మృతి తీరని లోటు అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన నాయకత్వ లక్షణాలున్న గొప్ప నేత అని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పారు. శ్రీధర్‌రెడ్డి మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, వీహెచ్, నిరంజన్, కోటూరి మానవతారాయ్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీధర్‌రెడ్డి నిఖార్సయిన తెలంగాణ పోరాట యోధుడని.. ఆయన మరణం రాష్ట్రానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకు డిగా రాజీలేని పోరాటం చేసిన శ్రీధర్‌రెడ్డి మర ణం తెలంగాణకు తీరని లోటు అని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. విలువల కోసం కట్టుబడిన శ్రీధర్‌రెడ్డి: సీఎం తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్‌రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో శ్రీధర్‌రెడ్డి చేసిన కృషిని స్మరించుకున్నారు. 1969 నాటి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన శ్రీధర్‌రెడ్డి.. తాను నమ్మిన విలువలకు కట్టుబడి, రాజీపడకుండా పనిచేశారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శ్రీధర్‌రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మ¯Œ వినోద్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. -
నాగరాజు కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సాయం చేసిన వైఎస్ షర్మిల
సాక్షి, నారాయణపేట జిల్లా(గరిడేపల్లి): తెలంగాణ ఉద్యమకారుడు గరిడేపల్లి మండలం నాయినిగూడెం గ్రామానికి చెందిన నాగరాజుకు సోమవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆర్థిక సాయం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో రూ. 4లక్షలను అందించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను అర్పించేందుకు రైలుకు ఎదురెళ్లి రెండు కాళ్లు, చేయి పోగొట్టుకొని ఏ పనీ చేయలేక దుర్భరజీవితం గడుపుతున్న నాగరాజు ఈ నెల 12న హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అతని కన్నీటి వ్యథను “ఉపాధి కరువై.. బతుకుభారమై’ అనే శీర్షికన ఈ నెల 13న సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు వైఎస్ షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఆమె నాగరాజుతో ఫోన్లో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. అతడిని నారాయణపేటకు పిలిపించుకుని సోమవారం స్వాతంత్య్రవేడుకల్లో రూ.4లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ షర్మిల స్వయంగా ఫోన్ చేసి తనను నారాయణపేటకు పిలిపించుకొని ఆర్థిక సాయం చేశారన్నారు. దీంతో ఆమెకు ఎంతో రుణపడి ఉన్నానన్నారు. తన లాంటి తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారని, వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలని కోరారు. చదవండి: (Munugode Politics: ఆ పార్టీ సరేనంటే.. కమ్యూనిస్టులు అటువైపే..!) -
పరిశోధనలో ఆయన ఘనాపాఠి
ననుమాస స్వామి అనగానే గుర్తొచ్చేవి కుల పురాణాలు. ఎన్నో కులాల పుట్టుపూర్వోత్తరాలను ఆయన జానపద గా«థల ఆధారంగా తెలియజేశారు. ముఖ్యంగా వృత్తి పురాణాలపై ఆయన చేసిన పరిశోధన పండితుల ప్రశంసలను అందుకుంది. అలాగే ఆయన అనేక ఉద్యమ గీతాలను అందించి తెలంగాణ ఉద్యమానికి ఊపును తీసుకొచ్చారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, అరెస్టయి వరంగల్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవించిన యోధుడు ననుమాసస్వామి (నమామి). అప్పటినుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తన భుజానెత్తిన తెలంగాణ జెండాను దించలేదు. 2013లో తెలంగాణ పోరాట యోధుల సంఘాన్ని స్థాపించారు. సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, శరద్ యాదవ్, ఏబీ బర్దన్ లాంటి నాయకులకు విజ్ఞా పన పత్రాలను అందించారు. 1969లోనే గాదు, 2001 నుండి తెలంగాణా ఉద్యమ గీతాలను రాసి పాడి తొలి తెలంగాణ ఉద్యమ వాగ్గేయ కారుడు అనిపించుకొన్నారు. 1969 లోనే ఉద్యమగీతాలు ‘అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్య’ లాంటి పాటతోపాటు మరో ఏడు పాటలను రాశారు. 2001లో తెరాస ఆవిర్భావసభ సందర్భంగా కూడా నాలుగు పాటలు రాసి 1969 నాటి ఉద్యమ స్ఫూర్తిని చాటారు. నిరక్షరాస్యుల కుటుంబంలో పుట్టిన ననుమాస స్వామి మూడు డాక్టరేట్లు, ఒక ఎం.ఫిల్ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూనే 1990లో ‘తెలుగు పరిశోధన’ పత్రికను స్థాపించి, పరిశోధన లను పదునెక్కించారు. ఎంతోమంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఆయన పర్యవేక్షణలో 21 మంది పరి శోధకులు పీహెచ్డీ పట్టాలనూ, తొమ్మండుగురు ఎం.ఫిల్ పట్టా లనూ సాధించారు. వృత్తి పురాణాల పరిశోధన కోసం ఆయన ఉభయ తెలుగురాష్ట్రాల్లో గ్రామగ్రామాన తిరిగి 14 చిత్రపటం కథా ప్రదర్శనలను, 34 వృత్తి కథా ప్రదర్శనలను వీడియో రూపంలో సేకరించారు. మడేల్, నాయీ, ముదిరాజ్, గౌడ పటంకథలతో సహా 12 పుస్తకాలను ప్రచురించారు. జానపద పురాణాలు, కుల పురాణం పేరుతో వివిధ పత్రికల్లో విస్తారంగా కాలమ్స్ రాశారు. ఇవి కొన్ని ఏళ్ల తరబడి కూడా కొనసాగాయి. వృత్తి దేవతలు పేరిట ఎస్వీ భక్తి చానల్లో ధారావాహిక నిర్వహించారు. ‘ఊసెత్తుతే చాలు ఉలిక్కిపడే పురాణాలు’ అంశం మీద 13 గంటలు ధారాళంగా ఉపన్యసించి ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్’ (2015)లోకి ఎక్కారు. అమె రికా, శ్రీలంక, యూకే లాంటి దేశాల్లో జరిగిన సదస్సులలో పాల్గొని, పరిశోధన పత్రాలను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధ్యా పక సంఘంలో 1995 నుండి 2011 దాకా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో అన్నింటా తెలుగు భోధన ఉండాలని ఉద్యమించి ప్రగతిని సాధించారు. 2011లో ‘భాషా పరిరక్షణ సమితి’ని స్థాపించి మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో, అంతర్జాతీయ యూనివర్సిటీలో తెలుగు శాఖలను ఏర్పాటు చేయించేందుకు చొరవ తీసుకున్నారు. – డా. నేతి మాధవి,జానపద పరిశోధకురాలు (నేడు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ననుమాస స్వామి మూడు పుస్తకాలు – ప్రవహిస్తున్న జైలుగానం,గాడ్గే బాబా, తెలంగాణ బోనాలు – ఆవిష్కరణ కానున్నాయి) -
తెలంగాణ ఉద్యమకారుడికి కేటీఆర్ సాయం
సాక్షి, హైదరాబాద్ : తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, డాక్టర్ కొల్లూరి చిరంజీవి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తడంతో పాటు మూత్రపిండాల పనితీరు మందగించడంతో ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌మీద చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కొల్లూరి చిరంజీవి ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. చిరంజీవి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.10 లక్షలు తక్షణమే విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి కూతురు అజిత, ఇతర కుటుంబసభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డా. చిరంజీవి పుట్టినరోజునే ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని కేటీఆర్ ఆదుకోవడం ఎప్పటికీ మరిచిపోలేమని కుటుంబసభ్యులు తెలిపారు. చదవండి: మంత్రి తలసానిపై దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు ‘కేటీఆర్ పీఏ’నంటూ ఫోన్.. డబ్బు డిమాండ్ రాంగ్ రూట్లో బైకర్.. ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు -
ఉద్యమకారుడి ఆత్మహత్య
దుగ్గొండి: ఉన్నత విద్యావంతుడు.. ఉద్యోగం, ఆస్తిపాస్తులు లేవు.. బతుకుదెరువు దొరుకుతుందని ఆశపడి 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యాడు. ఊరూవాడను ఏకం చేయడంతో పాటు గిరిజన తండాల్లో ఉద్యమ బిడ్డలను తయారు చేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆరేళ్లు గడిచినా ఎలాంటి బతుకుదెరువు దొరకలేదు. కన్నబిడ్డలు పెళ్లీడుకొచ్చినా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో జీవితం వ్యర్థమని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం పీజీ తండా గ్రామానికి చెందిన నూనావత్ రవినాయక్ (40) కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణ వచ్చిన ఆరేళ్ల నుంచి ఉద్యోగం కోసం పడరాని పాట్లు పడినా ఫలితం లేదు. ఓ పక్క ఎలాంటి ఆస్తి లేకపోవడం, ఇద్దరు కూతుళ్లు లిఖిల, కళ్యాణి డిగ్రీ చదువుతూ పెళ్లీడుకు రావడంతో భార్య జ్యోతి కూలి పనులు చేస్తూ కుటుంబపోషణలో పాలు పంచుకుంటోంది. దీంతో రవినాయక్ తీవ్ర మనస్తాపం చెంది సోమవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశాడు. కాగా, రవినాయక్ మృతదేహం వద్ద నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వెంటనే రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. -
ఆ ఉద్యమకారుడికి న్యాయం దక్కేనా?
- రోశయ్య హయాంలో సభలో జై తెలంగాణ అన్నందుకు పోలీస్ కేసు - కేసు కారణంగా కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయిన యువకుడు - సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించినా దక్కని న్యాయం సాక్షి, హైదరాబాద్: ‘జై తెలంగాణ’ అనే పిలుపునిచ్చినందకు ఓ యువకుని జీవితాన్ని విషాదంలోకి నెట్టింది. ‘మా రాష్ట్రం రావాలి... మా కష్టం తీరాలి’ అని నినాదాలు చేసిన అతని బతుకు నడిరోడ్డుపై పడింది. ఉద్యమ నినాద ఫలితమే చేతికందిన ఉద్యోగం కోల్పోయి నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా బట్వారం మండలం రాంపూర్‌కు చెందిన చంద్రకాంత్‌రెడ్డి కానిస్టేబుల్‌గా ఎంపికైనా కొలువు దక్కడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో విడుదలైన కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కు చంద్రకాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. 2010 చివరి నాటికి రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన అన్ని ఈవెంట్లు, రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. కానీ అప్పటికే తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో చంద్రకాంత్ కూడా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అదే సందర్భంగా 2010 మే 17న అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య రైతు చైతన్య యాత్రలు ప్రారంభించేందుకు బట్వారం మండలం యాచారంకు వచ్చారు. సభలో సీఎం రోశయ్య ప్రసంగిస్తుండగా ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలిచ్చాడు. సీఎం సభను భగ్నం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో చంద్రకాంత్‌రెడ్డితో సహా పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ కేసులో వికారాబాద్ కోర్టు రూ.300 జరిమానా విధించింది. అయితే కానిస్టేబుల్ కొలువుకు ఎంపికవడంతో రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన వెరిఫికేషన్‌లో చంద్రకాంత్‌పై కేసు నమోదై.. శిక్షపడినట్లు రుజువు కావడంతో పోలీస్ కొలువును నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఒక వైపు న్యాయస్థానాల చుట్టూ, మరోవైపు ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా కానిస్టేబుల్ కొలువు దక్కడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా... ఉద్యమ కారుడికి మాత్రం న్యాయం జరగడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఆఖరికి సీఎం కేసీఆర్‌ను కలిసి సమస్యను విన్నవించినా ఇప్పటికీ పరిష్కారం లభించడంలేదంటూ బాధితుడు వాపోతున్నాడు. -
ఐలమ్మ విగ్రహానికి నిప్పు
దుండగుల చర్యతో దెబ్బతిన్న విగ్రహం ఆగ్రహించిన రజక, ప్రజాసంఘాల నాయకులు అలంపూర్ : అలంపూర్ పట్టణంలోని ప్రధాన కూడలిలో ఉన్న తెలంగాణ పో రాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న విగ్రహం ఇలా తగలబడిపోవడం తో ప్రజాసంఘాలు, రజక, అన్ని పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శనివారం రాత్రి దుండగలు పని కట్టుకొని ఐలమ్మ విగ్రహానికి నిప్పుపెట్టారు. ఆది వారం విషయం అందరికి తెలియడంతో వివిధ ప్రజా సంఘాలు, ఆయాపార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. ఇటీవలే రజక సంఘం నాయకులు చందాలు వేసుకొని ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆవిష్కరణ వచ్చే నెలకు వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముసుగు వేసి ఆవిష్కరణకు సిద్ధం చేసి ఉంచారు. శనివారం రాత్రి విగ్రహం దగ్దం కావడంతో జీర్ణించుకోలేని రజకు లు ఆందోళనబాట పట్టారు. వారికి ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులతో సంఘీభావం తెలిపారు. అందరు మూకుమ్మడిగా ర్యాలీ నిర్వహించి విగ్రహం ఎదుట నిరసన తెలి పారు. అనంతరం సీఐ వెంకటేశ్వర్లుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్థానిక తహశీల్దార్ మంజుల, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ పర్వతాలు వివరాలను సేకరించారు. నిరసనలో రజక ఉద్యోగ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహులు, రజకసంఘం గౌరవ అధ్యక్షుడు శేషన్న, అధ్యక్షుడు శాలన్న, నాయకులు వేణు, వెంకటేశ్వర్లు, రంగన్న, ఇందిరమ్మ, మగమ్మ, వెంకటరంగమ్మ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. హేయమైన చర్య : ఎమ్మెల్యే అయిజ : తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చివేయడం, చాకలి ఐలమ్మ విగ్రహానికి నిప్పుపెట్టడం లాంటి సంఘటనలు అమానుషమని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఖండించారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవలే అయిజలో తెలంగాణ చౌరస్తాలో తెలంగాణతల్లి విగ్రహాన్ని రాజకీయాల గ్రూపు తగాదాలదాడిలో కూల్చివేసిన సంఘటన మరిచిపోకముందే అలంపూర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహానికి నిప్పుపెట్టారని ఆవేదన చెందారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ నాయకులతోపాటు అన్నిపార్టీల నాయకులు, అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారని, తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. -
దీక్ష విరమించిన సదాశివం
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్: తెలంగాణ కల సాకారం కావడంతో మూడేళ్ల దీక్షకు ముగింపు పలికాడు ఓ తెలంగాణ వాది. ఆదిలాబాద్ జిల్లా సీసీసీ కార్నర్‌కు చెందిన కిరాణ దుకాణం యజమాని రాచర్ల సదాశివం తెలంగాణ వీరాభిమాని. కేసీఆర్ దీక్ష చేసిన నవంబర్ 29, 2009న తెలంగాణ వచ్చే వరకు తల వెంట్రుకలు, గడ్డం తీయనని, ఒక్క పూట భోజనం చేస్తానని, చెప్పులు లేకుండా నడుస్తానని దీక్ష బూనాడు. అన్నట్టుగానే ఇప్పటివరకు వాటిని పాటిస్తూ వచ్చాడు. లోక్‌సభలో టీ బిల్లు ఆమోదం పొందటంతో బుధవారం నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తలనీలాలు సమర్పించి దీక్ష విరమించాడు. 15 ఆనందంలో ఆగిన గుండె బీర్కూర్, న్యూస్‌లైన్: తెలంగాణ వచ్చిన ఆనందంలో టీవీలో ప్రత్యేక రాష్ట్ర వార్తలు చూస్తూ సత్యం (50) అనే వ్యక్తి బుధవారం నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో గుండెపోటుతో మృతి చెందాడు. సత్యం కొంతకాలంగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. మంగళవారం తెలంగాణ బిల్లు పాస్ అయిన విషయం తెలుసుకున్న ఆయన నృత్యాలు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నాడు. గతంలో సత్యం ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సత్యం ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం చందాలు సేకరించి మృతుడి భార్య నిర్మలకు రూ. 22వేలు అందజేశారు.