దీక్ష విరమించిన సదాశివం
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్: తెలంగాణ కల సాకారం కావడంతో మూడేళ్ల దీక్షకు ముగింపు పలికాడు ఓ తెలంగాణ వాది. ఆదిలాబాద్ జిల్లా సీసీసీ కార్నర్‌కు చెందిన కిరాణ దుకాణం యజమాని రాచర్ల సదాశివం తెలంగాణ వీరాభిమాని. కేసీఆర్ దీక్ష చేసిన నవంబర్ 29, 2009న తెలంగాణ వచ్చే వరకు తల వెంట్రుకలు, గడ్డం తీయనని, ఒక్క పూట భోజనం చేస్తానని, చెప్పులు లేకుండా నడుస్తానని దీక్ష బూనాడు. అన్నట్టుగానే ఇప్పటివరకు వాటిని పాటిస్తూ వచ్చాడు. లోక్‌సభలో టీ బిల్లు ఆమోదం పొందటంతో బుధవారం నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తలనీలాలు సమర్పించి దీక్ష విరమించాడు.
15
ఆనందంలో ఆగిన గుండె
బీర్కూర్, న్యూస్‌లైన్: తెలంగాణ వచ్చిన ఆనందంలో టీవీలో ప్రత్యేక రాష్ట్ర వార్తలు చూస్తూ సత్యం (50) అనే వ్యక్తి బుధవారం నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో గుండెపోటుతో మృతి చెందాడు. సత్యం కొంతకాలంగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. మంగళవారం తెలంగాణ బిల్లు పాస్ అయిన విషయం తెలుసుకున్న ఆయన నృత్యాలు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నాడు. గతంలో సత్యం ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సత్యం ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం చందాలు సేకరించి మృతుడి భార్య నిర్మలకు రూ. 22వేలు అందజేశారు.