ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే పిల్లనిస్తం
- మెదక్ జిల్లా ఎన్సాన్‌పల్లిలో గ్రామపంచాయతీ తీర్మానం
సిద్దిపేట: ‘మరుగుదొడ్డి ఉంటేనే పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం లేదంటే పిల్లనివ్వం.. ’అంటూ వినూత్నంగా తీర్మానం చేసింది మెదక్ జిల్లా సిద్దిపేట మండంలోని ఎన్సాన్‌పల్లి గ్రామ పంచాయతీ. ప్రజలందరికీ కనిపించేలా పంచాయతీ కార్యాలయం ఎదుట బోర్డు ఏర్పాటు చేసి బహిరంగానే ప్రచారం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. దీనికి కారణం.. 2013-14లో సంవత్సరానికి ఎన్సాన్‌పల్లి గ్రామాన్ని నిర్మల్ పురస్కార్‌కు అధికారులు ప్రతిపాదించారు.
దీంతో ప్రజలు, పురస్కార సాధనకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. మరుగుదొడ్డి లేని కొన్ని కుటుంబాల కారణంగా అర్హత సాధించలేక దూరమైపోయింది. అందుకు గానూ గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్నంగా పై నిర్ణయం తీసుకుంది.
గ్రామంలో 4,888 మంది జనాభాకు 1400 కుటుంబాలు, 1034 ఇళ్లు ఉన్నాయి. వీటిలో 1019 ఇళ్లకు నిర్మల్ పురస్కార్‌కు ప్రతిపాదించినప్పటికే మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగాయి. ఇంకో 15 ఇళ్లు మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సి ఉంది. దీనికి గానూ గ్రామ పంచాయతీ వద్ద బోర్డు ఏర్పాటు చేసినట్లు గ్రామ పాలక వర్గం చెబుతోంది.