![ఉత్కంఠభరితంగా ఎన్నికలు](/styles/webp/s3/article_images/2017/09/2/81404415293_625x300.jpg.webp?itok=-ZlrTWBZ)
ఉత్కంఠభరితంగా ఎన్నికలు
- బడంగ్‌పేట నగర పంచాయతీ చైర్మన్‌గా సామ నర్సింహాగౌడ్,
- వైస్ చైర్మన్‌గా చిగురింత నర్సింహారెడ్డి
- పెద్దఅంబర్‌పేట్ చైర్‌పర్సన్‌గా ధనలక్ష్మి, వైస్ చైర్మన్‌గా సిద్ధంకి కృష్ణారెడ్డి
సరూర్‌నగర్/పెద్ద అంబర్‌పేట్/ఆటోనగర్ : నగర శివార్లలోని బడంగ్‌పేట్, పెద్ద అంబర్‌పేట్ నగర పంచాయతీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగాయి. గురువారం అల్మాస్‌గూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన బడంగ్‌పేట్ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికలో 20 మంది వార్డు సభ్యులతో పాటు, ఎక్స్ అఫీషియో హోదాలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి పాల్గొన్నారు. మొదట ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి చక్రధర్‌రావు వార్డు సభ్యులతో పమాణ చేయించారు. అనంతరం చైర్మన్ ఎన్నిక జరిగింది. ఎనిమిదవ వార్డు సభ్యుడు సామ నర్సింహాగౌడ్‌ను ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
ఆ తరువాత వైస్ చైర్మన్ ఎన్నికలో కొద్ది సేపు ఉత్కంఠ నెలకొంది. ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై సభ్యులు తర్జనభర్జనలు పడ్డారు. కొద్దిసేపటికి చిగురింత నర్సింహారెడ్డి కాంగ్రెస్,టీడీపీ,స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు.అనంతరం చైర్మన్ నర్సింహాగౌడ్, వైస్‌చైర్మన్ నర్సింహారెడ్డిలు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
పెద్ద అంబర్‌పేట్‌లో రసాభాస
పెద్దఅంబర్‌పేట నగర పంచాయితీ చైర్ పర్సన్ ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగినప్పటికీ వైస్ చైర్మన్ ఎన్నికలో రసాభాస చోటుచేసుకుంది. మొదటిసారిగా ఏర్పడ్డ పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీకి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. ప్రిసైడింగ్ అధికారి యాదగిరిరెడ్డి, నగర పంచాయతీ కమిషనర్ కోట రాంరెడ్డిలు ఈ ఎన్నికలు నిర్వహించారు.
తొలుత 20 మంది సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం తెలుగుదేశం, కాంగ్రెస్ సభ్యుల మద్దతుతో ఈదమ్మల ధనలక్ష్మిని చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత వైస్ చైర్మన్ పదవికి టీడీపీ నుంచి చామ సంపూర్ణారెడ్డి, కాంగ్రెస్ నుంచి సిద్ధంకి కృష్ణారెడ్డి పోటీకి దిగారు. తొమ్మిది మంది మద్దతుతోకృష్ణారెడ్డి గెలుపొందారు.