చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామం
గద్వాల జిల్లా చమన్‌ఖాన్‌దొడ్డి ఉన్న భూమి తమదేనంటున్న కొందరు వ్యక్తులు
గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ హుకుం.... రాజకీయ నేతలు, పోలీసుల ద్వారా ఒత్తిడి
ఆందోళనలో 200 కుటుంబాలు.. జిల్లా ఎస్పీకి వినతిపత్రం
మూడు తరాల నుంచీ ఇక్కడే ఉంటున్నాం..
ఊరొదిలి పొమ్మంటే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
కిషోర్‌కుమార్ పెరుమాండ్ల, మహబూబ్‌నగర్: ఆ గ్రామానికి 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఐదేళ్ల క్రితం గ్రామపంచాయతీగా ఆవిర్భవించింది. 200 కుటుంబాలు.. 1,000 మంది జనాభా. ఇందులో నాలుగు సామాజిక వర్గాలకు చెందిన వారు ఉండగా.. ఎక్కువగా బోయ, ఆ తర్వాత కుర్వ, ముస్లిం, గౌడ్‌లు ఉన్నారు. చాలావరకు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు.
అంతా బాగానే ఉన్న ఆ ఊరుకు ఇప్పుడు ఆపదొచ్చింది. కొందరు వ్యక్తులు గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించి, 200 కుటుంబాల్ని నిరాశ్రయుల్ని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి రాజకీయ నాయకులు, పోలీసులు తోడుకావడంతో పల్లెవాసులు ఎప్పుడు ఇల్లు వదిలి పోవాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చమన్‌ఖాన్‌దొడ్డి వాసుల దీనగాథపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
అనుబంధ గ్రామం నుంచి పంచాయతీగా..
చమన్‌ఖాన్‌దొడ్డి మొదట్లో మల్లంపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉండేది. శాసనసభ, లోక్ సభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ గ్రామంలోని ఓటర్లు మల్లంపల్లికి వెళ్లి ఓటు వేసేవారు. ఐదేళ్ల క్రితం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినప్పుడు చమన్‌ఖాన్‌దొడ్డి కూడా నూతన గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం 450 మంది ఓటర్లు ఉన్నారు.
భూమి మొత్తం మాదేనంటూ..
ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన భూమి మొత్తం తమదేనంటూ.. ఈ ప్రాంత పూర్వీకుల వారసులుగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. వీరికి ఎక్స్‌పార్టీ డిక్రీ ఆర్డర్ వచ్చింది. దీంతో వారు కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఊరు ఖాళీ చేయమంటూ గ్రామస్తులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన పరిస్థితుల నేపథ్యంలో.. రాజకీయ నాయకులు, పోలీసులు కూడా వారికే దన్నుగా నిలవడంతో స్థానికులు లబోదిబోమంటున్నారు. మేము మూడు తరాలుగా ఇక్కడే ఉంటున్నామని, మా పెద్దలు ఇక్కడే పుట్టి, ఇక్కడే చనిపోయారని.. ఉన్న ఫళంగా ఊరు వదిలి పొమ్మంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్పీ రితిరాజ్‌కు వినతిపత్రం అందజేశారు.
మరి ప్రభుత్వం ఎలా అభివృద్ధి పనులు చేపట్టింది?!
గ్రామంలో ప్రభుత్వ పంచాయతీ కార్యాలయం, ఐదో తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. గ్రామంలో బ్రహ్మంగారి గుడి, కనకదాసు గుడి, దర్గా, మసీదు, పీర్లగుడి, ఆంజనేయస్వామి, శివాలయాలతో పాటు గ్రామ దేవతలైన మారెమ్మ, సుంకులమ్మ, బొడ్రాయి, సావిడి వంటి నిర్మాణాలు ఏళ్ల క్రితమే ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో అంతర్గత రహదారులు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం, వాటర్ ట్యాంకులు వంటివి కూడా ప్రభుత్వం ఎప్పుడో ఏర్పాటు చేసింది. గ్రామ కంఠానికి చెందిన భూముల్లో ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రికార్డులు ఉండగా.. ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూమి తమదే అని ఎలా అంటారని, ఎలా ఖాళీ చేయమంటున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
ఊరొదిలి పొమ్మంటే ఎలా?
నేను ఈ గ్రామంలోనే పుట్టా. మా తాత, ముత్తాతలు కూడా ఇక్కడే పుట్టి, ఇక్కడే చనిపోయారు. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులమే 30 మంది వరకు ఉన్నాం. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. అకస్మాత్తుగా ఊరు వదిలిపొమ్మంటే ఎలా కుదురుతుంది?
– భీమయ్య
గ్రామకంఠం కిందే ఉంది..
గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినప్పుడు అప్పటి తహసీల్దార్ వచ్చి మా ఊరు మొత్తం 9 ఎకరాల వరకు ఉంటుందని చెప్పారు. రెవెన్యూ రికార్డులో భూమి మొత్తం గ్రామ కంఠం కిందే ఉందన్నారు. అలాంటిది మా ఊరి ముఖం ఒక్కసారి కూడా చూడని వారు వచ్చి.. గ్రామం మొత్తం మాదే, ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటున్నారు. ఇదెక్కడి న్యాయం?
– ఆంజనేయులు
ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతాం
చమన్‌ఖాన్‌దొడ్డికి సంబంధించిన అంశం ఇప్పటివరకు నా దృష్టికి రాలేదు. దీనిపై గ్రామస్తులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.
– రాంచందర్, ఆర్డీఓ, గద్వాల
Comments
Please login to add a commentAdd a comment