Mallampalli
-
ఈ ఊరు మాది.. అందరూ ఖాళీ చేయండి!
కిషోర్‌కుమార్ పెరుమాండ్ల, మహబూబ్‌నగర్: ఆ గ్రామానికి 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఐదేళ్ల క్రితం గ్రామపంచాయతీగా ఆవిర్భవించింది. 200 కుటుంబాలు.. 1,000 మంది జనాభా. ఇందులో నాలుగు సామాజిక వర్గాలకు చెందిన వారు ఉండగా.. ఎక్కువగా బోయ, ఆ తర్వాత కుర్వ, ముస్లిం, గౌడ్లు ఉన్నారు. చాలావరకు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. అంతా బాగానే ఉన్న ఆ ఊరుకు ఇప్పుడు ఆపదొచ్చింది. కొందరు వ్యక్తులు గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించి, 200 కుటుంబాల్ని నిరాశ్రయుల్ని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి రాజకీయ నాయకులు, పోలీసులు తోడుకావడంతో పల్లెవాసులు ఎప్పుడు ఇల్లు వదిలి పోవాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చమన్‌ఖాన్‌దొడ్డి వాసుల దీనగాథపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. అనుబంధ గ్రామం నుంచి పంచాయతీగా.. చమన్‌ఖాన్‌దొడ్డి మొదట్లో మల్లంపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉండేది. శాసనసభ, లోక్ సభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ గ్రామంలోని ఓటర్లు మల్లంపల్లికి వెళ్లి ఓటు వేసేవారు. ఐదేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినప్పుడు చమన్‌ఖాన్‌దొడ్డి కూడా నూతన గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం 450 మంది ఓటర్లు ఉన్నారు. భూమి మొత్తం మాదేనంటూ.. ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన భూమి మొత్తం తమదేనంటూ.. ఈ ప్రాంత పూర్వీకుల వారసులుగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. వీరికి ఎక్స్‌పార్టీ డిక్రీ ఆర్డర్ వచ్చింది. దీంతో వారు కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఊరు ఖాళీ చేయమంటూ గ్రామస్తులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన పరిస్థితుల నేపథ్యంలో.. రాజకీయ నాయకులు, పోలీసులు కూడా వారికే దన్నుగా నిలవడంతో స్థానికులు లబోదిబోమంటున్నారు. మేము మూడు తరాలుగా ఇక్కడే ఉంటున్నామని, మా పెద్దలు ఇక్కడే పుట్టి, ఇక్కడే చనిపోయారని.. ఉన్న ఫళంగా ఊరు వదిలి పొమ్మంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్పీ రితిరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. మరి ప్రభుత్వం ఎలా అభివృద్ధి పనులు చేపట్టింది?! గ్రామంలో ప్రభుత్వ పంచాయతీ కార్యాలయం, ఐదో తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గ్రామంలో బ్రహ్మంగారి గుడి, కనకదాసు గుడి, దర్గా, మసీదు, పీర్లగుడి, ఆంజనేయస్వామి, శివాలయాలతో పాటు గ్రామ దేవతలైన మారెమ్మ, సుంకులమ్మ, బొడ్రాయి, సావిడి వంటి నిర్మాణాలు ఏళ్ల క్రితమే ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో అంతర్గత రహదారులు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం, వాటర్ ట్యాంకులు వంటివి కూడా ప్రభుత్వం ఎప్పుడో ఏర్పాటు చేసింది. గ్రామ కంఠానికి చెందిన భూముల్లో ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రికార్డులు ఉండగా.. ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూమి తమదే అని ఎలా అంటారని, ఎలా ఖాళీ చేయమంటున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఊరొదిలి పొమ్మంటే ఎలా? నేను ఈ గ్రామంలోనే పుట్టా. మా తాత, ముత్తాతలు కూడా ఇక్కడే పుట్టి, ఇక్కడే చనిపోయారు. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులమే 30 మంది వరకు ఉన్నాం. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. అకస్మాత్తుగా ఊరు వదిలిపొమ్మంటే ఎలా కుదురుతుంది? – భీమయ్య గ్రామకంఠం కిందే ఉంది.. గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినప్పుడు అప్పటి తహసీల్దార్ వచ్చి మా ఊరు మొత్తం 9 ఎకరాల వరకు ఉంటుందని చెప్పారు. రెవెన్యూ రికార్డులో భూమి మొత్తం గ్రామ కంఠం కిందే ఉందన్నారు. అలాంటిది మా ఊరి ముఖం ఒక్కసారి కూడా చూడని వారు వచ్చి.. గ్రామం మొత్తం మాదే, ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటున్నారు. ఇదెక్కడి న్యాయం? – ఆంజనేయులు ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతాం చమన్‌ఖాన్‌దొడ్డికి సంబంధించిన అంశం ఇప్పటివరకు నా దృష్టికి రాలేదు. దీనిపై గ్రామస్తులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. – రాంచందర్, ఆర్డీఓ, గద్వాల -
ఉత్తర తెలంగాణలో ఆదర్శగ్రామంగా మల్లంపల్లి
ములుగు: కృషి, పట్టుదలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు పాలకవర్గం అధికారులు కష్టపడితే మారుమూల గ్రామం సైతం ఆదర్శంగా మారుతుంది. అనడానికి జిల్లాలోని ములుగు మండలం మల్లంపల్లి గ్రామం ఉదహరణగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఏడాది మల్లంపల్లి రాష్ట్ర స్థాయిలో పోటీపడి ఎస్ఎస్ఐపీ (సెల్ఫ్ సఫీసియంట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ పంచాయతీ) విభాగంలో అవార్డును గెలుచుకుంది. హైదరాబాద్ లో అవార్డుల ప్రదానోత్సవం ములుగు జిల్లా ఏర్పాటు అనంతరం తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్న 27 జీపీల సర్పంచులు, కార్యదర్శులతో కలిసి మల్లంపల్లి పాలకవర్గం, జిల్లా యంత్రాంగం నేడు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ రాష్ట్ర స్థాయి అవార్డును మల్లంపల్లి సర్పంచ్ చందా కుమారస్వామి, కార్యదర్శి పి.రాజు అందుకోనున్నారు. రూ.2.66కోట్లతో మౌలిక వసతులు జిల్లాలోని ములుగు మండలం మల్లంపల్లి గ్రామ పంచాయతీ 365, 163 జాతీయ రహదారిపై ఉన్నప్పటికీ సాధారణ జీపీగానే అందరికీ తెలుసు. 2021–2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2.66 కోట్ల నిధులను మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ అవార్డుకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి డ్యాక్యు మెంటరీని అధికారులు సమర్పించారు. మండల, జిల్లా స్థాయిలో అవార్డును గెలుచుకున్న మల్లంపల్లి రాష్ట్రస్థాయి అవార్డు కోసం చేసిన డాక్యుమెంటరీలో డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఏర్పాటు, గ్రంథాలయం, కమ్యూనిటీ సెంటర్, విలేజ్ పార్కు, ప్లే గ్రౌండ్, ఈ పంచాయతీ, పురుషులు, స్త్రీలకు ప్రత్యేక మరుగుదొడ్లు వంటి స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల పంచాయతీ కింద ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిటీ మల్లంపల్లిని రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లాలో 174 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇటీవల 27 గ్రామ పంచాయతీలు 9 అంశాలలో 3 గ్రామ పంచాయతీల చొప్పున 27 పంచాయతీలు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. మల్లంపల్లి వివరాలు ఇళ్లు 1,250 వార్డులు 12 జనాభా 4,670 సహకరించిన వారికి కృతజ్ఞతలు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా పంచాయతీ అధికారి కొండా వెంకటయ్య సహకారంతో ఎప్పటికప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రణాళిక రూపొందించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనులను సక్రమంగా పూర్తిచేశాం. పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, నర్సరీలు, సెగ్రిగేషన్ షెడ్, క్రిమిటోరియం, తడి, పొడి చెత్త వేరుచేయడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల ములుగులో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్నాం. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. - చందా కుమారస్వామి, సర్పంచ్ మల్లంపల్లి బాధ్యత పెరిగింది మల్లంపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జీపీ అవార్డుకు ఎంపిక కావడంతో గతం కంటే ప్రస్తుతం మరింత బాధ్యత పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ప్రతీ పనిని బాధ్యతతో పూర్తి చేశాం. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల సలహాలు సూచనలు తీసుకుని పనులు పూర్తి చేశాం. కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ ప్రజలు అభివృద్ధి పనుల్లో సహకరించారు. ఇక ముందు మల్లంపల్లిని గంగదేవిపల్లిలా ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాం. ఇందుకోసం పాలకవర్గం గ్రామ పెద్దలతో కలిసి నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. పి.రాజు, పంచాయతీ కార్యదర్శి మల్లంపల్లి -
మల్లంపల్లిని మండలం చేయాలి
1500 మందితో భారీ ధర్నా, రాస్తారోకో గంటన్నర పాటు స్తంభించిన ట్రాఫిక్ ములుగు : మల్లంపల్లిని మండలం చేయాలనే డిమాండ్‌తో 10 గ్రామాల ప్రజలు, అఖిలపక్షం, మండల సాధన సమితి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు సుమారు 1500 మంది జాతీయ రహదారిపై గురువారం భారీ ధర్నా నిర్వహించారు. మహిళలు కోలాటం ఆడుతూ నిరసన తెలిపారు. సుమారు గంటన్నర పాటు వర్షంలోనే కార్యక్రమం కొనసాగింది. 369 జాతీయ రహదారిపై నాయకులు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. మొదట ఎస్సైలు మల్లేశ్‌యాదవ్, సూర్యనారాయణ అడ్డుకున్నా ఆందోళనకారులు వెనకడుగు వేయలేదు. సీఐ శ్రీనివాస్‌రావు వచ్చి నాయకులతో మాట్లాడినా.. ఆర్డీవో వచ్చేంత వరకు రాస్తారోకో విరమించేది లేదని పట్టుబట్టారు. చివరికి ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి రంగప్రవేశం చేశారు. నాయకులతో మాట్లాడినా వినకపోవడంతో స్థానిక సమస్యను తమ వంతు బాధ్యతగా ఉన్నతాధికారుల ముందు ఉంచుతామని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు రాస్తారోకో విరమించారు. అంతకు ముందు మల్లంపల్లిని మండలం చేయాలని నాగుల నర్సయ్య అనే వ్యక్తి వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు అతన్ని కిందికి దింపారు. ఈ సందర్భంగా అఖిలపక్షం , మండల సాధన సమితి నాయకులు మాట్లాడుతూ మల్లంపల్లిని మండలంగా చేయాలని చుట్టు పక్కల 40 గ్రామాలకు చెందిన 35 వేల మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. నల్లబెల్లి మండలంలోని నాలుగు గ్రామపంచాయతీలు, శాయంపేట మండలంలోని రెండు గ్రామపంచాయతీలు మల్లంపల్లిలో కలిసేందుకు తీర్మానం చేశాయని అన్నారు. మండల ఏర్పాటు విషయంలో అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక అందించారని ఆరోపించారు. మల్లంపల్లికి మండలం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని, నూతన మండలంగా ఏర్పాటు చేసి వరంగల్ జిల్లాలో కొనసాగేలా చూడాలని కోరారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా కేంద్రం మల్లంపల్లికి 30 కిలో మీటర్లు మాత్రమే ఉంటుందని, అదే భూపాలపల్లికి వెళ్లాలంటే 70 కిలోమీటర్లకు పైగా వెళ్లాలని చెప్పారు. మండలంగా ఏర్పాటు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల సాధన సమితి నాయకులు చంద కుమారస్వామి, పీఏసీఎస్ చైర్మెన్ గుగులోతు కిషన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రుద్రోజు ద్రోణాచారి, సర్పంచ్‌లు గోల్కొండ రవి, విష్ణువర్థన్‌రెడ్డి, శంకర్‌నాయక్, రమేశ్, బొక్క సత్తిరెడ్డి, ఎంపీటీసీ సుమలత, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి కోడి సోమన్న , నాయకులు హరినాథ్, మాచర్ల ప్రభాకర్, శ్యాంరావు, డాక్టర్ ర విబాబు, కొంగరి నరేందర్, కొమ్మాలు, కుమార్, గుండ కుమార్, కరుణాకర్‌రెడ్డి, మొర్రి రాజు, బోయిని రవి, శంకర్ పాల్గొన్నారు.