మల్లంపల్లిని మండలం చేయాలి
-
1500 మందితో భారీ ధర్నా, రాస్తారోకో
-
గంటన్నర పాటు స్తంభించిన ట్రాఫిక్
ములుగు : మల్లంపల్లిని మండలం చేయాలనే డిమాండ్‌తో 10 గ్రామాల ప్రజలు, అఖిలపక్షం, మండల సాధన సమితి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు సుమారు 1500 మంది జాతీయ రహదారిపై గురువారం భారీ ధర్నా నిర్వహించారు.
మహిళలు కోలాటం ఆడుతూ నిరసన తెలిపారు. సుమారు గంటన్నర పాటు వర్షంలోనే కార్యక్రమం కొనసాగింది. 369 జాతీయ రహదారిపై నాయకులు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. మొదట ఎస్సైలు మల్లేశ్‌యాదవ్, సూర్యనారాయణ అడ్డుకున్నా ఆందోళనకారులు వెనకడుగు వేయలేదు. సీఐ శ్రీనివాస్‌రావు వచ్చి నాయకులతో మాట్లాడినా.. ఆర్డీవో వచ్చేంత వరకు రాస్తారోకో విరమించేది లేదని పట్టుబట్టారు. చివరికి ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి రంగప్రవేశం చేశారు. నాయకులతో మాట్లాడినా వినకపోవడంతో స్థానిక సమస్యను తమ వంతు బాధ్యతగా ఉన్నతాధికారుల ముందు ఉంచుతామని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు రాస్తారోకో విరమించారు. అంతకు ముందు మల్లంపల్లిని మండలం చేయాలని నాగుల నర్సయ్య అనే వ్యక్తి వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు అతన్ని కిందికి దింపారు. ఈ సందర్భంగా అఖిలపక్షం , మండల సాధన సమితి నాయకులు మాట్లాడుతూ మల్లంపల్లిని మండలంగా చేయాలని చుట్టు పక్కల 40 గ్రామాలకు చెందిన 35 వేల మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. నల్లబెల్లి మండలంలోని నాలుగు గ్రామపంచాయతీలు, శాయంపేట మండలంలోని రెండు గ్రామపంచాయతీలు మల్లంపల్లిలో కలిసేందుకు తీర్మానం చేశాయని అన్నారు. మండల ఏర్పాటు విషయంలో అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక అందించారని ఆరోపించారు.
మల్లంపల్లికి మండలం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని, నూతన మండలంగా ఏర్పాటు చేసి వరంగల్ జిల్లాలో కొనసాగేలా చూడాలని కోరారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా కేంద్రం మల్లంపల్లికి 30 కిలో మీటర్లు మాత్రమే ఉంటుందని, అదే భూపాలపల్లికి వెళ్లాలంటే 70 కిలోమీటర్లకు పైగా వెళ్లాలని చెప్పారు. మండలంగా ఏర్పాటు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల సాధన సమితి నాయకులు చంద కుమారస్వామి, పీఏసీఎస్ చైర్మెన్ గుగులోతు కిషన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రుద్రోజు ద్రోణాచారి, సర్పంచ్‌లు గోల్కొండ రవి, విష్ణువర్థన్‌రెడ్డి, శంకర్‌నాయక్, రమేశ్, బొక్క సత్తిరెడ్డి, ఎంపీటీసీ సుమలత, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి కోడి సోమన్న , నాయకులు హరినాథ్, మాచర్ల ప్రభాకర్, శ్యాంరావు, డాక్టర్ ర విబాబు, కొంగరి నరేందర్, కొమ్మాలు, కుమార్, గుండ కుమార్, కరుణాకర్‌రెడ్డి, మొర్రి రాజు, బోయిని రవి, శంకర్ పాల్గొన్నారు.