మల్లంపల్లి గ్రామం
ములుగు: కృషి, పట్టుదలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు పాలకవర్గం అధికారులు కష్టపడితే మారుమూల గ్రామం సైతం ఆదర్శంగా మారుతుంది. అనడానికి జిల్లాలోని ములుగు మండలం మల్లంపల్లి గ్రామం ఉదహరణగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఏడాది మల్లంపల్లి రాష్ట్ర స్థాయిలో పోటీపడి ఎస్‌ఎస్‌ఐపీ (సెల్ఫ్ సఫీసియంట్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ పంచాయతీ) విభాగంలో అవార్డును గెలుచుకుంది.
హైదరాబాద్ లో అవార్డుల ప్రదానోత్సవం
ములుగు జిల్లా ఏర్పాటు అనంతరం తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్న 27 జీపీల సర్పంచులు, కార్యదర్శులతో కలిసి మల్లంపల్లి పాలకవర్గం, జిల్లా యంత్రాంగం నేడు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ రాష్ట్ర స్థాయి అవార్డును మల్లంపల్లి సర్పంచ్ చందా కుమారస్వామి, కార్యదర్శి పి.రాజు అందుకోనున్నారు.
రూ.2.66కోట్లతో మౌలిక వసతులు
జిల్లాలోని ములుగు మండలం మల్లంపల్లి గ్రామ పంచాయతీ 365, 163 జాతీయ రహదారిపై ఉన్నప్పటికీ సాధారణ జీపీగానే అందరికీ తెలుసు. 2021–2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2.66 కోట్ల నిధులను మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ అవార్డుకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి డ్యాక్యు మెంటరీని అధికారులు సమర్పించారు.
మండల, జిల్లా స్థాయిలో అవార్డును గెలుచుకున్న మల్లంపల్లి రాష్ట్రస్థాయి అవార్డు కోసం చేసిన డాక్యుమెంటరీలో డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఏర్పాటు, గ్రంథాలయం, కమ్యూనిటీ సెంటర్, విలేజ్ పార్కు, ప్లే గ్రౌండ్, ఈ పంచాయతీ, పురుషులు, స్త్రీలకు ప్రత్యేక మరుగుదొడ్లు వంటి స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల పంచాయతీ కింద ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిటీ మల్లంపల్లిని రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లాలో 174 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇటీవల 27 గ్రామ పంచాయతీలు 9 అంశాలలో 3 గ్రామ పంచాయతీల చొప్పున 27 పంచాయతీలు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి.
మల్లంపల్లి వివరాలు
ఇళ్లు 1,250
వార్డులు 12
జనాభా 4,670
సహకరించిన వారికి కృతజ్ఞతలు
కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా పంచాయతీ అధికారి కొండా వెంకటయ్య సహకారంతో ఎప్పటికప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రణాళిక రూపొందించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనులను సక్రమంగా పూర్తిచేశాం. పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, నర్సరీలు, సెగ్రిగేషన్ షెడ్, క్రిమిటోరియం, తడి, పొడి చెత్త వేరుచేయడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల ములుగులో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్నాం. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది.
- చందా కుమారస్వామి, సర్పంచ్ మల్లంపల్లి
బాధ్యత పెరిగింది
మల్లంపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జీపీ అవార్డుకు ఎంపిక కావడంతో గతం కంటే ప్రస్తుతం మరింత బాధ్యత పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ప్రతీ పనిని బాధ్యతతో పూర్తి చేశాం. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల సలహాలు సూచనలు తీసుకుని పనులు పూర్తి చేశాం. కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ ప్రజలు అభివృద్ధి పనుల్లో సహకరించారు. ఇక ముందు మల్లంపల్లిని గంగదేవిపల్లిలా ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాం. ఇందుకోసం పాలకవర్గం గ్రామ పెద్దలతో కలిసి నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.
పి.రాజు, పంచాయతీ కార్యదర్శి మల్లంపల్లి
Comments
Please login to add a commentAdd a comment