ఆదర్శంగా నిలుస్తున్న భువనగిరి జిల్లాలోని గ్రామం
రాష్ట్రంలో మరికొన్ని గ్రామాల్లోనూ మద్య నిషేధం కట్టుబాటు
చౌటుప్పల్ రూరల్: ఇప్పుడు ఏ పల్లెలో చూసినా బెల్ట్ షాపుల జోరుతో మద్యం ఏరులై పారుతోంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కాట్రేవ్ గ్రామంలో మాత్రం మద్యం జాడే కనిపించదు. గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోంది. అప్పట్లో గ్రామ పెద్దలు నిర్ణయించిన కట్టుబాటును ఇప్పటికీ కొనసాగిస్తూ.. తమ ప్రత్యేకతను నిలుపుకొంటున్నారు కాట్రేవ్ గ్రామ ప్రజలు. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని గ్రామాల్లోనూ కొన్నేళ్లు మద్యం విక్రయాలు, వినియోగంపై నిషేధం పెట్టుకోవడం గమనార్హం. కాట్రేవ్‌లో అయితే సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతోంది.
గ్రామ యువత కూడా దూరమే..
కాట్రేవ్ గ్రామం ఒకప్పుడు ఆరెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. ఐదేళ్ల కింద నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. సుమారు 700కుపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో అంతా రైతులే. రోజంతా వ్యవసాయ పనుల్లో మునిగిపోతారు. సాయంత్రానికి ఇంటికొచ్చి సేదతీరుతారే తప్ప మద్యం జోలికి వెళ్లరు. ఈ గ్రామం నుంచి బయట పట్టణాల్లో ఉద్యోగం, ఉపాధి, చదువు కోసం వెళ్లిన యవత కూడా.. ఈ గ్రామానికి ఎప్పుడూ మద్యం తీసుకురారు.
ఇక్కడ వినియోగించరు. మద్య నిషేధమేకాదు.. అభివృద్ధిలోనూ కాట్రేవ్ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. పక్కనే ఉన్న దివిస్ పరిశ్రమ అందించే ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)’ నిధులతో గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్లు, ఎల్‌ఈడీ లైట్లు, ప్రతి ఇంటికి శుద్ధిచేసిన సురక్షిత నీరు అందించేలా ఏర్పాటు చేసుకున్నారు. పక్కనే ఉన్న ఆరెగూడెంలోనూ రెండు దశాబ్దాలుగా మద్యం విక్రయాలు లేవు.
గ్రామ పంచాయతీ కార్యాలయం
గ్రామస్తుల సహకారంతోనే కొనసాగిస్తున్నా..
నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ గ్రామంలో మద్యపానం అలవాటు లేదు. 40 ఏళ్ల కింద పెద్దలు పెట్టుకున్న కట్టుబాటును.. గ్రామస్తుల సహకారంతో కొనసాగిస్తున్నాం. అభివృద్ధిలోనూ ముందుకెళ్తున్నాం.
– బచ్చ రామకృష్ణ మాజీ సర్పంచ్, కాట్రేవ్
Comments
Please login to add a commentAdd a comment