
రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు కంపెనీల ఆసక్తి
ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన.. ఆసక్తి వ్యక్తీకరించిన 15 విదేశీ బ్రాండ్లు
15 దేశీయ లిక్కర్.. ఏడు బీర్ బ్రాండ్లు కూడా
మరో నెలలో అంగీకార ఒప్పందం కుదుర్చుకోనున్న బేవరేజెస్ కార్పొరేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లిక్కర్ మార్కెట్‌లోకి అతిత్వరలో కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 37 మద్యం బ్రాండ్లు ఇందుకోసం ముందుకొచ్చాయి. మద్యం సరఫరా కోసం గతనెల 23న బేవరేజెస్ కార్పొరేషన్ కొత్త సరఫరాదారుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో తయారయ్యే మద్యం బ్రాండ్లలో 95 శాతం కార్పొరేషన్‌తో రిజిస్టర్ అయిన నేపథ్యంలో 10లోపు బ్రాండ్లు ముందుకొస్తాయని ఎక్సైజ్ వర్గాలు భావించాయి.
అయితే ఊహించని స్పందన లభించింది. గడువు ముగిసే సమయానికి ఏకంగా 37 బ్రాండ్లు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 15 విదేశీ మద్యం బ్రాండ్లు కాగా, మరో 15 దేశీయ మద్యం, ఏడు దరఖాస్తులు బీర్ల సరఫరాకు వచ్చినట్టు తెలుస్తోంది. నోటిఫికేషన్ లేకుండానే కొత్త బ్రాండ్ల సరఫరా కోసం అనుమతినిచ్చారంటూ వివాదాస్పద జాబితాలోకెక్కిన సోం డిస్టలరీస్ కూడా ఈ జాబితాలో ఉందని, బీర్‌తోపాటు లిక్కర్ సరఫరా కోసం ఈ సంస్థ దరఖాస్తు పెట్టిందని సమాచారం.
ఆచితూచి.. అన్నీ సరిచూసి..
వచ్చిన దరఖాస్తులను అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే మద్యం సరఫరాకు అంగీకార ఒప్పందం కుదుర్చుకుంటామని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయా సంస్థల ట్రాక్ రికార్డును పరిశీలించడంతోపాటు ఎంత ధరకు కోట్ చేసింది? ఆ బ్రాండు మద్యానికి ఇతర రాష్ట్రాలు ఎంత చెల్లిస్తున్నాయి? ఏ కేటగిరీలో ఆ బ్రాండు ఉంది? ఆ కేటగిరీకి మన రాష్ట్రంలో చెల్లిస్తున్న ధర ఎంత? ఒకవేళ సంస్థ కోట్ చేసిన ధరకు, ప్రభుత్వ ధరకు తేడా ఉంటే ఏం చేయాలి? ధరల నిర్ధారణ కమిటీకి ప్రతిపాదించాలా లేదా? అనే అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రక్రియ ముగిసేందుకు కనీసం మరో నెల రోజుల సమయం పడుతుందన్నారు.
ఆ ధర పెంచితే.. మద్యం ధర పెంపు?
కొత్త బ్రాండ్ల సరఫరాకు ఒప్పందాలు చేసుకునే సమయంలోనే మద్యం బేసిక్ ధరలను కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది.
∙ ఇప్పటికే బీర్ల బేసిక్ ధరను పెంచిన విషయం తెలిసిందే. అయితే లిక్కర్ బేసిక్ ధరలను మాత్రం సవరించలేదు. ప్రస్తుతం లిక్కర్ కేస్ బేసిక్ ధర ఐదు స్లాబుల్లో (రూ.565, 700, 1000, 2000, 2000 కంటే ఎక్కువ చొప్పున) ఉంది. ఈ బేసిక్ ధరను కూడా కేస్‌కు రూ.85 చొప్పున పెంచే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.
∙ బీర్ల బేసిక్ ధర పెంచే సమయంలో బహిరంగ మార్కెట్‌లో బీర్ల ధరలను కూడా ఎక్సైజ్ శాఖ సవరించింది. అదే క్రమంలో లిక్కర్ బేసిక్ ధరలను పెంచాల్సి వస్తే మద్యం ధరలు కూడా పెరగొచ్చు. అయితే, లిక్కర్ ధరలు పెంచాలా వద్దా అన్నది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాలను బట్టి ఉండొచ్చు. ప్రస్తుత బడ్జెట్‌లో ఎౖMð్సజ్ శాఖ ద్వారా రూ.25 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం అంచనా వేయగా, వచ్చే బడ్జెట్‌లో రూ.30 వేల కోట్ల వరకు వెళితే మాత్రం లిక్కర్ ధరలు పెంచక తప్పదనే అభిప్రాయం ఎౖMð్సజ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment