new brands
-
జూలై నుంచి మరిన్ని కొత్త ఫండ్స్
న్యూఢిల్లీ: ఆస్తుల నిర్వహణ కంపెనీలు(ఏఎంసీ)లు తాత్కాలిక నిలిపివేత తదుపరి తిరిగి కొత్త బ్రాండ్ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)ను ఆవిష్కరించే సన్నాహాల్లో ఉన్నాయి. వచ్చే నెల(జూలై) నుంచి కొత్త ఫండ్ ఆఫర్ల(ఎన్‌ఎఫ్‌వోలు)కు తెరతీయనున్నాయి. ఎన్‌ఎఫ్‌వోలపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మూడు నెలలపాటు విధించిన ఆంక్షలు ఈ నెల(జూన్)తో ముగియనున్నాయి. దీంతో ఫిక్స్డ్ ఇన్కమ్, ఈక్విటీ సంబంధ ప్యాసివ్ ఫండ్స్‌ను ప్రవేశపెట్టేందుకు ఏఎంసీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. వీటితోపాటు నూతన ప్రొడక్టుల అవసరమున్న కొన్ని విభాగాలపైనా దృష్టిసారించాయి. జూలై 1నుంచి స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ సభ్యులు ఏవిధంగానైనా ఇన్వెస్టర్ల ఫండ్స్‌ను, యూనిట్లనూ సమీకృతం(పూలింగ్) చేయడాన్ని సెబీ ఏప్రిల్ 1నుంచి నిషేధించింది. అంతేకాకుండా ఎంఎఫ్ పెట్టుబడుల అడ్వయిజర్లు లేదా పంపిణీదారులు ఫండ్స్ లావాదేవీలను చేపట్టడానికి సైతం చెక్ పెట్టింది. ఇందుకు సంబంధించిన నిర్వహణా సామర్థ్య పెంపునకు వీలుగా పరిశ్రమ ప్రతినిధులతో చర్చల అనంతరం సెబీ జూలై 1వరకూ గడువును పొడిగించింది. తద్వారా ఎంఎఫ్‌లు సబ్స్క్రిప్షన్లు, రిడెంపన్షన్లు వంటివి చేపట్టడంలో వ్యవస్థలను మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు వీలుగా మెరుగుపరచుకునేందుకు వీలు చిక్కింది. వెరసి పూల్ అకౌంట్ల విషయంలో ఆధునీకరించిన వ్యవస్థాగత మార్పులను ప్రవేశపెట్టేందుకు ఏఎంసీలకు సెబీ జూలై 1వరకూ గడువిచ్చింది. గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెలలో ఇప్పటికే కనీసం ఆరు ఏఎంసీలు ఎన్‌ఎఫ్‌వోలను ఆవిష్కరించేందుకు సెబీకి దరఖాస్తు చేశాయి. ఈ జాబితాలోని ఎంఎఫ్‌లలో పీజీఐఎం ఇండియా, సుందరం, బరోడా బీఎన్పీ పరిబాస్, ఎల్ఐసీ, ఫ్రాంక్లిన్ ఇండియా చేరాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) ఇప్పటివరకూ నాలుగు ఎన్‌ఎఫ్‌వోలు మాత్రమే విడుదలకాగా.. రూ. 3,307 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. -
భారత్‌లో కొత్త ‘ఏసీ’ బ్రాండ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల మార్కెట్లోకి కొత్త బ్రాండ్లు ఎంట్రీ ఇస్తున్నాయి. మరికొన్ని రీ–ఎంట్రీ చేస్తున్నాయి. దేశీయంగా ఏసీల అమ్మకాలు ఆకర్షణీయంగా ఉండడమే ఇందుకు కారణం. ఇప్పటికే 12 దాకా బ్రాండ్లు ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. ఏటా వందలాది మోడళ్లతో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. సరికొత్త ఫీచర్లతో ఇతర కంపెనీలకు సవాల్ విసురుతున్నాయి. ఇప్పుడు కొత్త బ్రాండ్ల రాకతో పోటీ తీవ్రతరం కానుంది. 2018–19లో దేశవ్యాప్తంగా 55 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడయ్యాయని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాల్లో 15 శాతం వృద్ధి ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. వచ్చే అయిదేళ్లలో అమ్మకాలు రెండింతలకు చేరుకుంటాయని పరిశ్రమ ధీమాగా ఉంది. ఒకదాని వెంట ఒకటి.. యూరప్‌కు చెందిన ట్రూవిజన్ భారత్‌లో ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది. ప్యానాసోనిక్ ఆన్లైన్ బ్రాండ్ అయిన సాన్యో ఏసీల విభాగంలోకి ప్రవేశించింది. రూ.24,490ల నుంచి మోడళ్లు లభ్యం అవుతున్నాయి. లివ్‌ప్యూర్ బ్రాండ్‌తో ఎయిర్, వాటర్ ప్యూరిఫయర్ల రంగంలో ఉన్న ఎస్ఏఆర్ గ్రూప్ ఏసీల విక్రయాల్లోకి రంగ ప్రవేశం చేస్తోంది. ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫంక్షన్స్‌తో కూడిన స్మార్ట్ ఏసీలను ఏప్రిల్ చివరికల్లా ప్రవేశపెడతామని లివ్‌ప్యూర్ ఫౌండర్ రాకేశ్ మల్హోత్రా వెల్లడించారు. యురేకా ఫోర్బ్స్ హెల్త్ కండీషనర్ల పేరుతో ఈ విభాగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ప్రైవేట్ లేబుల్ బ్రాండ్ మార్క్యూ క్రమంగా ఏసీల శ్రేణిని విస్తరిస్తోంది. నూతనంగా ఇన్సిగ్నియా శ్రేణిని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రానిక్స్ సంస్థ షార్ప్ ఏసీల విపణిలోకి రీ–ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఎల్టెక్ అప్లయెన్సెస్‌తో డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం చేసుకుంది. పోటీలో లేని చైనా.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 14 కోట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇందులో ఒక్క చైనా వాటా అత్యధికంగా 8 కోట్ల యూనిట్లు ఉంది. ఏసీల తయారీలో సామర్థ్యం పరంగా చైనా కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. అయినప్పటికీ భారత్‌లో ఎంట్రీ ఇవ్వలేకపోతున్నాయి. దీనికి కారణం దేశంలో అమలులో ఉన్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) కఠిన ప్రమాణాలే. విద్యుత్‌ను గణనీయంగా ఆదాచేసే ఉపకరణాలను తయారు చేయాల్సి ఉంటుంది. రెండేళ్లకోసారి బీఈఈ ఈ ప్రమాణాలను సవరిస్తోంది. అంటే అంత క్రితం 5 స్టార్ ఉన్న ఏసీ కాస్తా కొత్త ప్రమాణాలతో 3 స్టార్ అవుతుంది. ఈ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిందేనని బ్లూస్టార్ జేఎండీ బి.త్యాగరాజన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రెండేళ్లకోసారి సాంకేతిక మార్పులు చేపట్టడం భారీ తయారీ సామర్థ్యం ఉన్న చైనా కంపెనీలకు సాధ్యం కాదని.. ఇది అధిక వ్యయంతో కూడినదని అన్నారు. అందుకే చైనా కంపెనీలు ఇక్కడ ప్రవేశించలేకపోతున్నాయని వివరించారు. అమలులో ఈ–వేస్ట్ రూల్స్..: పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఈ–వేస్ట్ (మేనేజ్మెంట్, హ్యాండ్లింగ్స్) రూల్స్‌ను 2012 మే 1 నుంచి అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించాల్సి ఉంటుంది. ఇందులో ఏసీలకు 2017–18 నుంచి ఈ నిబంధనలు వర్తించాయి. దీని ప్రకారం 10 ఏళ్ల క్రితం ఒక కంపెనీ తాను విక్రయించిన యూనిట్లలో 10 శాతం తిరిగి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా కొనుగోలు చేయాల్సిన యూనిట్లు 2021–22 నాటికి 50 శాతం కానుంది. రీప్లేస్మెంట్ వేగంగా అయ్యేందుకు కంపెనీలు ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. -
ఇంటర్నేషనల్ 'బీర్లు'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మద్యం వ్యాపారం లాభసాటిగా మారటంతో రాష్ట్రీయ మద్యం మార్కెట్లోకి ప్రవేశించటానికి ప్రపంచ దేశాల బీర్ల కంపెనీలు ఎగబడుతున్నాయి. ఇక్కడ అంచనాలకు మించి బీర్ల వినియోగం ఉండ టం, ఈ ఏడాది బీర్ల బేసిక్ ధర పెంచటానికి ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో సొమ్ము చేసుకోవటానికి పలు అంతర్జాతీయ కంపెనీలు రంగంలోకి దిగాయి. మొత్తం 26 కార్పొరేటు కంపెనీలు 186 దేశీయ, విదేశీ బ్రాండ్లను సరఫరా చేసేందుకు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ట్యూబర్గ్, క్యాల్సిబర్గ్, ఫోస్టర్, బడ్వైజర్, హన్‌కెన్ బ్రాండ్లు ఇప్పటికే రాష్ట్రీయ మార్కెట్లో వినియోగంలో ఉండగా.. స్కోల్, విక్టోరియా, ఆంగోర్, హినానో, గోల్డ్ స్టార్, పెరోని, రెడ్ స్ట్రైప్, టస్కర్ తదితర బ్రాండ్లు కొత్తగా రాబోతున్న జాబితాలో ఉన్నాయి. 120 కొత్త బ్రాండ్లకు టెండర్లు రాష్ట్రీయ మద్యం మార్కెట్లో బీర్లను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 186 రకాల బ్రాండ్లను సరఫరా చేయడానికి కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. వీటిలో 66 బ్రాండ్లు ఇప్పటికే వినియోగంలో ఉండగా.. కొత్తగా మరో 120 బ్రాండ్లకు టెండర్లు దాఖలయ్యాయి. సాధారణంగా ఏడాది కాలానికి బీర్లు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. గతేడాది చేసుకున్న ఒప్పందం మార్చి 31తో ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియ కసరత్తు చేపట్టింది. టెండర్లు ఖరారు చేయటంతోపాటు, బీర్ల బేసిక్ ధర నిర్ణయించటానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జెడ్జి జస్టిస్ గోపాల్‌రెడ్డి నేతృత్వంలో కమిటీని నియమించింది. కమిటీలో చార్టర్డ్ అకౌంటెంట్ బి.నర్సింహారావు, మాజీ ఐఏఎస్ అధికారి అరవిందరెడ్డి సభ్యులుగా ఉన్నారు. బేసిక్ ధర పెంపు ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిస్టిలరీల యాజమాన్యం కోసం లిక్కర్ ధరను 5 నుంచి 15 శాతం వరకు పెంచింది. ఈ నేపథ్యంలోనే బ్రూవరీల యాజమాన్యం కోసం బీర్ల బేసిక్ ధర పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. నాలుగేళ్ల నుంచి బీర్ల ధరలు పెంచలేదని, కనీసం ఈ సారైనా ధర పెంచాలని, ప్రతి సీసా మీద కనీసం రూ.6 చొప్పున (బేసిక్ ధరపై 20 శాతం) అదనంగా చెల్లించాలని బ్రూవరీలు డిమాండ్ చేస్తున్నాయి. యాజమాన్యాలు డిమాండ్ చేసిన స్థాయిలో కాకపోయినా కనీసం 10 శాతం నుంచి 15 శాతం ధరలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఆ మేరకే జస్టిస్ గోపాల్‌రెడ్డి కమిటీని వేసిందని అంతర్గతంగా ప్రచారం చేశారు. దీంతో పెద్ద ఎత్తున కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. ఇక్కడే ఉత్పత్తి.. అంతర్జాతీయ బ్రాండ్లు అంటే విదేశాల్లోనే తయారు చేసిన మద్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయించుకోవాలనే నిబంధన ఏమీ లేదు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం పేటెంట్ పొందిన బీరు తయారీ ఫార్ములాతో స్థానికంగా అందుబాటులో ఉన్న బ్రూవరీల్లో వారి బ్రాండ్ బీరును ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆరు బ్రూవరీలతో (బీర్ల తయారీ పరిశ్రమలు) పలు అంతర్జాతీయ కంపెనీలు ఒప్పందం చేసుకోని బీర్లను ఉత్పత్తి చేశాయి. ఈ సారి టెండర్లలో సోన్ డిస్టిలరీస్, బ్రూవరీస్ మధ్యప్రదేశ్, ఎస్ఎన్జే డిస్టిలరీలస్ నెల్లూరు, ఎస్పీఆర్ డిస్టిలరీస్ మైసూర్, ప్రివిలేజ్ ఇండస్ట్రీస్ పుణే, హరియాణా బ్రూవరీస్, సోన బ్రూవరేజెస్ ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. అలాగే రాష్ట్రీయ మార్కెట్లో పెద్ద వాటాదారుగా ఉన్న యూబీ (యునైటెడ్ బ్రూవరేజెస్) మైసూర్, ఔరంగాబాద్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి ఈసారి కొత్తగా టెండర్లు దాఖలు చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్ వన్ బీర్ల వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. సగటున నెలకు 37.5 లక్షల కేసుల బీర్లు తాగుతున్నారు. టీఎస్‌బీసీఎల్ నివేదికల ప్రకారం రాష్ట్రంలో రోజుకు 8 లక్షల మంది 13 లక్షల సీసాల బీర్లు తాగుతున్నారు. గతేడాది రాష్ట్రంలో జరిగిన బీర్ల విక్రయాలతో పోలిస్తే 27 శాతం అధికంగా బీర్లను తాగేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో బీర్ల వినియోగం ఇక్కడితో పోలిస్తే సగం కూడా లేదు. ఈ రికార్డుల నేపథ్యంలో బీర్ల కంపెనీలు రాష్ట్రంపై ఆసక్తి చూపుతున్నట్లు టీఎస్‌బీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. టెండర్లు ఎక్కువే వచ్చాయి: దేవీ ప్రసాద్, టీఎస్‌బీసీఎల్ చైర్మన్ బీర్లు సరఫరా చేసేందుకు ఈ ఏడాది ఆశించిన దానికంటే ఎక్కువగానే టెండర్లు వచ్చాయి. గతేడాది రాష్ట్రంలో 66 బ్రాండ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 120 బ్రాండ్లు అదనంగా వచ్చాయి. జస్టిస్ గోపాల్‌రెడ్డి కమిటీ.. కంపెనీలతో మాట్లాడి ధరలను నిర్ణయిస్తుంది. ఒక వేళ కమిటీ అడిగిన ధరలకు బీరు సరఫరా చేసేందుకు కంపెనీలు ముందుకు రాకపోతే.. ఇప్పుడు కొనసాగుతున్న ఒప్పందాన్నే మరో 6 నెలలపాటు పొడిగిస్తాం. -
ఫ్యాషన్ ఐకాన్
ఫ్యాషన్ రంగంలో వస్తున్న అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా దేశంలో న్యూ బ్రాండ్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్న సంస్థ మ్యాక్స్. హైదరాబాద్‌లో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఈ సంస్థ మొట్టమొదటిసారిగా ఫ్యాషన్ షోలపై దృష్టి సారించింది. నగరంలోని సుజ నామాల్లో ‘మాక్స్ ఫ్యాషన్ ఐకాన్ ఇండియా-2015’ పోటీలు నిర్వహించింది. ఔత్సాహిక మోడల్స్ ర్యాంప్‌వాక్ చేశారు. న్యాయనిర్ణేతల్లో ఒకరైన నటి, మోడల్ మనస్వి మంగాయ్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ. ఈ నెల 21న దిల్లీలో ‘మాక్స్ ఫ్యాషన్ ఐకాన్ ఇండియా-2015’ ఫైనల్స్ జరగనున్నాయి.