ఇంటర్నేషనల్‌ 'బీర్లు' | International beers companies to be in Telangana | Sakshi
Sakshi News home page

ఇంటర్నేషనల్‌ 'బీర్లు'

Published Sat, Feb 17 2018 4:01 AM | Last Updated on Sat, Feb 17 2018 4:01 AM

International beers companies to be in Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో మద్యం వ్యాపారం లాభసాటిగా మారటంతో రాష్ట్రీయ మద్యం మార్కెట్‌లోకి ప్రవేశించటానికి ప్రపంచ దేశాల బీర్ల కంపెనీలు ఎగబడుతున్నాయి. ఇక్కడ అంచనాలకు మించి బీర్ల వినియోగం ఉండ టం, ఈ ఏడాది బీర్ల బేసిక్‌ ధర పెంచటానికి ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో సొమ్ము చేసుకోవటానికి పలు అంతర్జాతీయ కంపెనీలు రంగంలోకి దిగాయి. మొత్తం 26 కార్పొరేటు కంపెనీలు 186 దేశీయ, విదేశీ బ్రాండ్లను సరఫరా చేసేందుకు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ట్యూబర్గ్, క్యాల్సిబర్గ్, ఫోస్టర్, బడ్వైజర్, హన్‌కెన్‌ బ్రాండ్లు ఇప్పటికే రాష్ట్రీయ మార్కెట్‌లో వినియోగంలో ఉండగా.. స్కోల్, విక్టోరియా, ఆంగోర్, హినానో, గోల్డ్‌ స్టార్, పెరోని, రెడ్‌ స్ట్రైప్, టస్కర్‌ తదితర బ్రాండ్లు కొత్తగా రాబోతున్న జాబితాలో ఉన్నాయి.

120 కొత్త బ్రాండ్లకు టెండర్లు 
రాష్ట్రీయ మద్యం మార్కెట్లో బీర్లను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 186 రకాల బ్రాండ్లను సరఫరా చేయడానికి కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. వీటిలో 66 బ్రాండ్లు ఇప్పటికే వినియోగంలో ఉండగా.. కొత్తగా మరో 120 బ్రాండ్లకు టెండర్లు దాఖలయ్యాయి. సాధారణంగా ఏడాది కాలానికి బీర్లు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. గతేడాది చేసుకున్న ఒప్పందం మార్చి 31తో ముగుస్తుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో లైసెన్స్‌ పునరుద్ధరణ ప్రక్రియ కసరత్తు చేపట్టింది. టెండర్లు ఖరారు చేయటంతోపాటు, బీర్ల బేసిక్‌ ధర నిర్ణయించటానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ జెడ్జి జస్టిస్‌ గోపాల్‌రెడ్డి నేతృత్వంలో కమిటీని నియమించింది. కమిటీలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌ బి.నర్సింహారావు, మాజీ ఐఏఎస్‌ అధికారి అరవిందరెడ్డి సభ్యులుగా ఉన్నారు. 

బేసిక్‌ ధర పెంపు ప్రచారం 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిస్టిలరీల యాజమాన్యం కోసం లిక్కర్‌ ధరను 5 నుంచి 15 శాతం వరకు పెంచింది. ఈ నేపథ్యంలోనే బ్రూవరీల యాజమాన్యం కోసం బీర్ల బేసిక్‌ ధర పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. నాలుగేళ్ల నుంచి బీర్ల ధరలు పెంచలేదని, కనీసం ఈ సారైనా ధర పెంచాలని, ప్రతి సీసా మీద కనీసం రూ.6 చొప్పున (బేసిక్‌ ధరపై 20 శాతం) అదనంగా చెల్లించాలని బ్రూవరీలు డిమాండ్‌ చేస్తున్నాయి. యాజమాన్యాలు డిమాండ్‌ చేసిన స్థాయిలో కాకపోయినా కనీసం 10 శాతం నుంచి 15 శాతం ధరలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఆ మేరకే జస్టిస్‌ గోపాల్‌రెడ్డి కమిటీని వేసిందని అంతర్గతంగా ప్రచారం చేశారు. దీంతో పెద్ద ఎత్తున కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. 

ఇక్కడే ఉత్పత్తి.. 
అంతర్జాతీయ బ్రాండ్లు అంటే విదేశాల్లోనే తయారు చేసిన మద్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయించుకోవాలనే నిబంధన ఏమీ లేదు. ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం పేటెంట్‌ పొందిన బీరు తయారీ ఫార్ములాతో స్థానికంగా అందుబాటులో ఉన్న బ్రూవరీల్లో వారి బ్రాండ్‌ బీరును ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆరు బ్రూవరీలతో (బీర్ల తయారీ పరిశ్రమలు) పలు అంతర్జాతీయ కంపెనీలు ఒప్పందం చేసుకోని బీర్లను ఉత్పత్తి చేశాయి. ఈ సారి టెండర్లలో సోన్‌ డిస్టిలరీస్, బ్రూవరీస్‌ మధ్యప్రదేశ్, ఎస్‌ఎన్‌జే డిస్టిలరీలస్‌ నెల్లూరు, ఎస్పీఆర్‌ డిస్టిలరీస్‌ మైసూర్, ప్రివిలేజ్‌ ఇండస్ట్రీస్‌ పుణే, హరియాణా బ్రూవరీస్, సోన బ్రూవరేజెస్‌ ఛత్తీస్‌గఢ్‌ ఉన్నాయి. అలాగే రాష్ట్రీయ మార్కెట్‌లో పెద్ద వాటాదారుగా ఉన్న యూబీ (యునైటెడ్‌ బ్రూవరేజెస్‌) మైసూర్, ఔరంగాబాద్, పశ్చిమ బెంగాల్‌ తదితర ప్రాంతాల నుంచి ఈసారి కొత్తగా టెండర్లు దాఖలు చేసింది. 

దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్‌ వన్‌ 
బీర్ల వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచింది. సగటున నెలకు 37.5 లక్షల కేసుల బీర్లు తాగుతున్నారు. టీఎస్‌బీసీఎల్‌ నివేదికల ప్రకారం రాష్ట్రంలో రోజుకు 8 లక్షల మంది 13 లక్షల సీసాల బీర్లు తాగుతున్నారు. గతేడాది రాష్ట్రంలో జరిగిన బీర్ల విక్రయాలతో పోలిస్తే 27 శాతం అధికంగా బీర్లను తాగేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో బీర్ల వినియోగం ఇక్కడితో పోలిస్తే సగం కూడా లేదు. ఈ రికార్డుల నేపథ్యంలో బీర్ల కంపెనీలు రాష్ట్రంపై ఆసక్తి చూపుతున్నట్లు టీఎస్‌బీసీఎల్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. 

టెండర్లు ఎక్కువే వచ్చాయి: దేవీ ప్రసాద్, టీఎస్‌బీసీఎల్‌ చైర్మన్‌ 
బీర్లు సరఫరా చేసేందుకు ఈ ఏడాది ఆశించిన దానికంటే ఎక్కువగానే టెండర్లు వచ్చాయి. గతేడాది రాష్ట్రంలో 66 బ్రాండ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 120 బ్రాండ్లు అదనంగా వచ్చాయి. జస్టిస్‌ గోపాల్‌రెడ్డి కమిటీ.. కంపెనీలతో మాట్లాడి ధరలను నిర్ణయిస్తుంది. ఒక వేళ కమిటీ అడిగిన ధరలకు బీరు సరఫరా చేసేందుకు కంపెనీలు ముందుకు రాకపోతే.. ఇప్పుడు కొనసాగుతున్న ఒప్పందాన్నే మరో 6 నెలలపాటు పొడిగిస్తాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement