న్యూఢిల్లీ: ఆస్తుల నిర్వహణ కంపెనీలు(ఏఎంసీ)లు తాత్కాలిక నిలిపివేత తదుపరి తిరిగి కొత్త బ్రాండ్ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)ను ఆవిష్కరించే సన్నాహాల్లో ఉన్నాయి. వచ్చే నెల(జూలై) నుంచి కొత్త ఫండ్ ఆఫర్ల(ఎన్‌ఎఫ్‌వోలు)కు తెరతీయనున్నాయి. ఎన్‌ఎఫ్‌వోలపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మూడు నెలలపాటు విధించిన ఆంక్షలు ఈ నెల(జూన్)తో ముగియనున్నాయి. దీంతో ఫిక్స్‌డ్ ఇన్‌కమ్, ఈక్విటీ సంబంధ ప్యాసివ్ ఫండ్స్‌ను ప్రవేశపెట్టేందుకు ఏఎంసీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. వీటితోపాటు నూతన ప్రొడక్టుల అవసరమున్న కొన్ని విభాగాలపైనా దృష్టిసారించాయి.
జూలై 1నుంచి
స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ సభ్యులు ఏవిధంగానైనా ఇన్వెస్టర్ల ఫండ్స్‌ను, యూనిట్లనూ సమీకృతం(పూలింగ్) చేయడాన్ని సెబీ ఏప్రిల్ 1నుంచి నిషేధించింది. అంతేకాకుండా ఎంఎఫ్ పెట్టుబడుల అడ్వయిజర్లు లేదా పంపిణీదారులు ఫండ్స్ లావాదేవీలను చేపట్టడానికి సైతం చెక్ పెట్టింది. ఇందుకు సంబంధించిన నిర్వహణా సామర్థ్య పెంపునకు వీలుగా పరిశ్రమ ప్రతినిధులతో చర్చల అనంతరం సెబీ జూలై 1వరకూ గడువును పొడిగించింది.
తద్వారా ఎంఎఫ్‌లు సబ్‌స్క్రిప్షన్లు, రిడెంపన్షన్లు వంటివి చేపట్టడంలో వ్యవస్థలను మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు వీలుగా మెరుగుపరచుకునేందుకు వీలు చిక్కింది. వెరసి పూల్ అకౌంట్ల విషయంలో ఆధునీకరించిన వ్యవస్థాగత మార్పులను ప్రవేశపెట్టేందుకు ఏఎంసీలకు సెబీ జూలై 1వరకూ గడువిచ్చింది. గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెలలో ఇప్పటికే కనీసం ఆరు ఏఎంసీలు ఎన్‌ఎఫ్‌వోలను ఆవిష్కరించేందుకు సెబీకి దరఖాస్తు చేశాయి. ఈ జాబితాలోని ఎంఎఫ్‌లలో పీజీఐఎం ఇండియా, సుందరం, బరోడా బీఎన్‌పీ పరిబాస్, ఎల్‌ఐసీ, ఫ్రాంక్లిన్ ఇండియా చేరాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) ఇప్పటివరకూ నాలుగు ఎన్‌ఎఫ్‌వోలు మాత్రమే విడుదలకాగా.. రూ. 3,307 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment