asset management companies
-
మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాల వెల్లువ
న్యూఢిల్లీ: అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) గతేడాది నూతన పథకాల రూపంలో ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు సమీకరించాయి. మొత్తం 212 న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)లు 2023లో మార్కెట్లోకి వచ్చాయి. ఇవి సంయుక్తంగా రూ.63,854 కోట్లను సమీకరించాయి. అంతకుముందు ఏడాది (2022) కూడా 228 ఎన్‌ఎఫ్‌వోలు రూ.62,817 కోట్లు సమీకరించడం గమనార్హం. ఇక 2021లో రూ.99,704 కోట్లు, 2020లో రూ.53,703 కోట్ల చొప్పున కొత్త పథకాల ద్వారా సమీకరించాయి. ఈ వివరాలను ఫైయర్స్ రీసెర్చ్ విడుదల చేసింది. ‘‘వినియోగం విషయంలో మారుతున్న ధోరణి, అధిక ప్రమాణాలతో కూడిన జీవన అవసరాల నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టడాన్ని గుర్తిస్తున్నారు. అత్యవసర సమయాలను గట్టేక్కేందుకు తగినంత నిధి, ఆర్థిక ప్రణాళిక అవసరాన్ని కరోనా మహమ్మారి తెలియజేసింది’’అని ఫైయర్స్ రీసెర్చ్ తన నివేదికలో తెలిపింది. బలమైన ఆర్థిక కార్యకలాపాలు, స్థిరమైన జీఎస్టీ వసూళ్లు, ప్రభుత్వ సంస్కరణలతో సూచీలు గతేడాది మంచి పనితీరు చూపించినప్పటికీ, 2024లోనూ అదే మాదిరి పనితీరు ఆశించరాదని పేర్కొంది. మార్కెట్ విలువలు ఖరీదుగా మారిన తరుణంలో అప్రమత్తత అవసరమని ఇన్వెస్టర్లకు సూచించింది. పెరిగిన రిస్క్ ధోరణి.. 2023 జనవరి–మార్చి కాలంలో అత్యధికంగా 57 ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి వచ్చాయి. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో అత్యధికంగా రూ.22,049 కోట్లను ఎన్‌ఎఫ్‌వోలు సమీకరించాయి. 2023లో 29 థీమాటిక్/సెక్టోరల్ ఫండ్స్ (ఎన్‌ఎఫ్‌వోలు) రూ.17,946 కోట్లను ఆకర్షించాయి. ఈక్విటీల విషయంలో ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే ధోరణి పెరగడంతో వారు థీమాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్ ర్యాలీ సమయంలో ఎన్‌ఎఫ్‌వోలు ఎక్కువగా వస్తుంటాయి. సానుకూల సెంటిమెంట్ నేపథ్యంలో అధిక పెట్టుబడులను సులభంగా సమీకరించొచ్చని అలా చేస్తుంటాయి. స్టాక్ మార్కెట్ మెరుగైన పనితీరుకు తోడు, ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్ గతేడాది భారీగా ఎన్‌ఎఫ్‌వోలు నిధులు సమీకరించడానికి తోడ్పడినట్టు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2023లో నిఫ్టీ–50 సూచీ 20 శాతం రాబడులను ఇచి్చంది. ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్ అయితే 47 శాతం, స్మాల్‌క్యాప్ 56 శాతం చొప్పున ర్యాలీ చేయడం గమనార్హం. గతేడాది దేశీయ ఇనిస్టిట్యూషన్స్ రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులతో ఈక్విటీల ర్యాలీలో ముఖ్యపాత్ర పోషించాయి. గతేడాది మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ రూ.2.74 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 2022లో వచి్చన రూ.71,000 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా వచ్చాయి. -
మ్యూచువల్ ఫండ్స్ ఫోరెన్సిక్ ఆడిటింగ్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్, వాటి అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, ట్రస్టీల ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు ఫోరెన్సిక్ ఆడిటర్లను సెబీ నియమించనుంది. యూనిట్ హోల్డర్ల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా మ్యూచువల్ ఫండ్ ట్రస్టీల పాత్ర, వాటిని జవాబుదారీ చేయడానికి సెబీ ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు చేయడం తెలిసిందే. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, ఏఎంసీలు, ట్రస్టీలు లేదా బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతల నిర్వహణకు అర్హత కలిగిన సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ సెబీ ప్రకటన జారీ చేసింది. ఎంపికైన సంస్థలు డిజిటల్ ఆధారాలైన మొబైల్, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, హార్డ్ డ్రైవ్‌లు, యూఎస్బీ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకుని, వాటిని విశ్లేషించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రక్రియలో గుర్తించిన అంశాలతో నివేదికను రూపొందించి సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఫోరెన్సిక్ ఆడిటింగ్, డిజిటల్ ఫోరెన్సిక్లో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలని సెబీ షరతుల్లో పేర్కొంది. అలాగే, కనీసం 10 పార్ట్నర్లు లేదా డైరెక్టర్లను ట్రస్టీ బోర్డుల్లో కలిగి ఉండాలని నిబంధనలు విధించింది. దరఖాస్తుల సమర్పణకు మార్చి 6 వరకు గడువు ఇచ్చింది. -
ఇక కొత్త పథకాల జోరు.. ముగిసిన మూడు నెలల నిషేధం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాలు ఇక మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. కొత్త పథకాల ఆరంభంపై సెబీ విధించిన మూడు నెలల నిషేధం ముగిసిపోయింది. దీంతో అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఫండ్స్ సంస్థలు) కొత్త పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క జూలైలోనే 28 పథకాలను కంపెనీలు ప్రారంభించాయి. ఈక్విటీ, డెట్, ఇండెక్స్, ఈటీఎఫ్‌ల విభాగాల్లో వీటిని తీసుకొచ్చాయి. ఇన్వెస్టర్ల నిధుల పూలింగ్ విషయంలో తాను తీసుకొచ్చిన నిబంధనలను జూలై 1 నాటికి అమలు చేయాలని ఆదేశిస్తూ.. అప్పటి వరకు కొత్త పథకాలు ప్రారంభిచొద్దని ఈ ఏడాది ఏప్రిల్‌లో సెబీ ఆదేశించింది. జూలై 1తో నిషేధం ముగిసిపోయింది. పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో డ్యుయల్ అథెంటికేషన్, ఖాతా మూలాలను గుర్తించాలని కూడా సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కొత్త నిబంధనలు తెచ్చింది. జూలైలో 28 ఎన్‌ఎఫ్‌వోలు జూలైలో 18 ఏఎంసీలు కలసి 28 కొత్త పథకాలను ప్రారంభించాయి. ఇందులో నాలుగు పథకాలు ముగిసిపోగా, 24 పథకాలు ఇంకా పెట్టుబడుల స్వీకరణలో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, బరోడా బీఎన్పీ పారిబాస్, కెనరా రొబెకో, డీఎస్పీ, మోతీలాల్ ఓస్వాల్, ఐడీఎఫ్సీ, మిరే అస్సెట్ నుంచి ఈ పథకాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ప్రారంభమైన పథకాల్లో చాలా వరకు సెబీ విధించిన మూడు నెలల నిషేధానికి ముందే అనుమతి పొందినవిగా ఆనంద్‌రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ హెడ్ అమర్ రాను తెలిపారు. ప్యాసివ్ విభాగంలో పథకాలు లేకపోతే వాటా కోల్పోతామన్న ఉద్దేశ్యంతో.. ఏఎంసీలు ప్యాసివ్ ఇండెక్స్ పథకాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. యాక్టివ్ నిర్వహణతో కూడిన ఈక్విటీ పథకాల్లో మంచి రాబడులు లేకపోవడంతో.. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొంత పెట్టుబడులను ప్యాసివ్ పథకాలకు మళ్లిస్తున్నట్టు అమర్‌రాను వెల్లడించారు. ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నుంచి ఈటీఎఫ్‌లకు ఆసక్తి పెరిగినట్టు మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. 176 కొత్త పథకాలు.. 2021–22లో ఏఎంసీలు 176 కొత్త పథకాలను ఆవిష్కరించి, వీటి రూపంలో రూ.1.08 లక్షల కోట్లను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించాయి. అంటే సగటున ఒక్కో నెలలో 15 పథకాలు ప్రారంభమయ్యాయి. 2020–21లో 84 కొత్త పథకాలు రాగా, అవి రూ.42,038 కోట్లను ఆకర్షించాయి. రానున్న రోజుల్లో మరిన్ని నూతన పథకాలు ఇన్వెస్టర్ల ముందుకు వస్తాయని, వీటిల్లో డెట్, ఈక్విటీ విభాగం నుంచి ప్యాసివ్ (ఇండెక్స్‌ల్లో) స్ట్రాటజీతో ఉంటాయని ఎపిస్లాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్‌రావు చెప్పారు. -
జూలై నుంచి మరిన్ని కొత్త ఫండ్స్
న్యూఢిల్లీ: ఆస్తుల నిర్వహణ కంపెనీలు(ఏఎంసీ)లు తాత్కాలిక నిలిపివేత తదుపరి తిరిగి కొత్త బ్రాండ్ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)ను ఆవిష్కరించే సన్నాహాల్లో ఉన్నాయి. వచ్చే నెల(జూలై) నుంచి కొత్త ఫండ్ ఆఫర్ల(ఎన్‌ఎఫ్‌వోలు)కు తెరతీయనున్నాయి. ఎన్‌ఎఫ్‌వోలపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మూడు నెలలపాటు విధించిన ఆంక్షలు ఈ నెల(జూన్)తో ముగియనున్నాయి. దీంతో ఫిక్స్డ్ ఇన్కమ్, ఈక్విటీ సంబంధ ప్యాసివ్ ఫండ్స్‌ను ప్రవేశపెట్టేందుకు ఏఎంసీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. వీటితోపాటు నూతన ప్రొడక్టుల అవసరమున్న కొన్ని విభాగాలపైనా దృష్టిసారించాయి. జూలై 1నుంచి స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ సభ్యులు ఏవిధంగానైనా ఇన్వెస్టర్ల ఫండ్స్‌ను, యూనిట్లనూ సమీకృతం(పూలింగ్) చేయడాన్ని సెబీ ఏప్రిల్ 1నుంచి నిషేధించింది. అంతేకాకుండా ఎంఎఫ్ పెట్టుబడుల అడ్వయిజర్లు లేదా పంపిణీదారులు ఫండ్స్ లావాదేవీలను చేపట్టడానికి సైతం చెక్ పెట్టింది. ఇందుకు సంబంధించిన నిర్వహణా సామర్థ్య పెంపునకు వీలుగా పరిశ్రమ ప్రతినిధులతో చర్చల అనంతరం సెబీ జూలై 1వరకూ గడువును పొడిగించింది. తద్వారా ఎంఎఫ్‌లు సబ్స్క్రిప్షన్లు, రిడెంపన్షన్లు వంటివి చేపట్టడంలో వ్యవస్థలను మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు వీలుగా మెరుగుపరచుకునేందుకు వీలు చిక్కింది. వెరసి పూల్ అకౌంట్ల విషయంలో ఆధునీకరించిన వ్యవస్థాగత మార్పులను ప్రవేశపెట్టేందుకు ఏఎంసీలకు సెబీ జూలై 1వరకూ గడువిచ్చింది. గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెలలో ఇప్పటికే కనీసం ఆరు ఏఎంసీలు ఎన్‌ఎఫ్‌వోలను ఆవిష్కరించేందుకు సెబీకి దరఖాస్తు చేశాయి. ఈ జాబితాలోని ఎంఎఫ్‌లలో పీజీఐఎం ఇండియా, సుందరం, బరోడా బీఎన్పీ పరిబాస్, ఎల్ఐసీ, ఫ్రాంక్లిన్ ఇండియా చేరాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) ఇప్పటివరకూ నాలుగు ఎన్‌ఎఫ్‌వోలు మాత్రమే విడుదలకాగా.. రూ. 3,307 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. -
ఆస్తుల నిర్వహణ కంపెనీ ఉద్యోగులకు సెబీ కీలక ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ: ఆస్తుల నిర్వహణ కంపెనీ(ఏఎంసీ)ల జూనియర్ స్థాయి సిబ్బంది ఇకపై మ్యూచువల్ ఫండ్స్‌లో తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. స్థూల వేతనాలలో కనీసం 20 శాతాన్ని దశల వారీగా పెట్టుబడులకు కేటాయించవలసి వస్తుంది. ఆఫీసర్స్థాయి ఉద్యోగులైతే జీతాలలో 20 శాతాన్ని తప్పనిసరిగా ఫండ్స్‌కు మళ్లించవలసి ఉంటుంది. 2021–2023 అక్టోబర్ నుంచి తాజా నిబంధనలు వర్తించనున్నాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సర్క్యులర్‌ను జారీ చేసింది. తొలుత ఇలా.. ఏఎంసీల జూనియర్‌స్థాయి సిబ్బంది తొలుత వేతనాలలో 10 శాతాన్ని ఫండ్ హౌస్ యూనిట్లలో ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. ఈ ఏడాది(2021) అక్టోబర్ 1నుంచి ఇది అమలుకానుంది. ఈ బాటలో 2022 అక్టోబర్ నుంచి 15 శాతం, 2023 అక్టోబర్ 1 నుంచి 20 శాతం వేతనాన్ని సంస్థకు చెందిన మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కోసం వెచ్చించవలసి ఉంటుంది. ఇక 2023 అక్టోబర్ 1 నుంచి జూనియర్ ఉద్యోగులందరూ 20 శాతం వేతనాన్ని ఫండ్స్‌లో పెట్టుబడులకు వినియోగించవలసి వస్తుంది. అధికారుల పెట్టుబడులు ఏఎంసీలలో పనిచేసే 35 ఏళ్లకంటే తక్కువ వయసుగల ఆఫీసర్ స్థాయి ఉద్యోగులను జూనియర్ సిబ్బందిగానే పరిగణించనున్నారు. అయితే ఈ జాబితా నుంచి సీఈవో, ఏదైనా విభాగానికి అధిపతి, ఫండ్ మేనేజర్లను మినహాయిస్తారు. 35ఏళ్ల వయసు అందుకున్న జూనియర్ ఉద్యోగులకు దశలవారీ పెట్టుబడుల నిబంధన వర్తించదు. కాగా.. నిబంధనల స్థూల ఉల్లంఘన, మోసం, నిర్లక్ష్యం తదితర పరిస్థితుల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగుల యూనిట్లను కంపెనీ వెనక్కి తీసుకుంటుంది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ప్రతినిధులు, మ్యూచు వల్ ఫండ్స్ సలహా కమిటీ సూచనల నేపథ్యంలో సెబీ పలు అంశాలపై స్పష్టతనిచ్చింది. తాజా నిబంధనలు ఏఎంసీ కంపెనీలకు చెందిన కీలక ఉద్యోగులందరికీ వర్తించనున్నాయి. ఫండ్ మేనేజ్మెంట్ విధానంలో భాగమున్న ఉద్యోగులందరూ నిబంధనల పరిధిలోకి రానున్నారు. ఫండ్ మేనేజర్స్, రీసెర్చ్ బృందాలు, డీలర్లు తదితరులకు నిబంధనలు వర్తించనున్నాయి. మ్యూచువల్ ఫండ్ పథకా ల యూనిట్దారులతో కంపెనీ ఉద్యోగులను అనుసంధానం చేసే లక్ష్యంతో సెబీ తాజా నిబంధనలను ప్రవేశపెట్టినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 3 ఏళ్ల లాకిన్ ఫండ్ హౌస్ యూనిట్లలో ఇన్వెస్ట్ చేసిన ఉద్యోగులకు పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ వర్తిస్తుంది. తదుపరి కొత్త పెట్టుబడులకు మారుగా వీటిని మరో మూడేళ్లు కొనసాగించుకోవచ్చు. అయితే తిరిగి మూడేళ్ల లాకిన్ గడువు లేదా పథకం గడువు వర్తించనుంది. -
మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల్లో భారీ వృద్ధి
ముంబై: స్టాక్ మార్కెట్ల చక్కని ర్యాలీ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు కలిసొచ్చింది. ఫలితంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు) నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడులు (ఆస్తులు/ఏయూఎం) ఏకంగా 41 శాతం పెరిగి రూ.31.43 లక్షల కోట్లకు చేరాయి. వాస్తవానికి 2021 ఫిబ్రవరి నాటికి తొలి 11 నెలల్లో ఏయూఎం రూ.31.64 లక్షల కోట్ల వరకు పెరగ్గా.. ఆ తర్వాత డెట్ విభాగం నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా మార్చి ఆఖరుకు రూ.31.43 లక్షల కోట్లకు పరిమితమైంది. డెట్ విభాగం నుంచి మార్చి మాసంలో రూ.52,528 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.19,384 కోట్లు, లో డ్యూరేషన్ ఫండ్స్ నుంచి రూ.15,847 కోట్లు బయటకు వెళ్లగా.. కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మాత్రం రూ.69,305 కోట్లను ఆకర్షించినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. -
న్యూ ఫండ్ ఆఫర్.. లాభసాటేనా?
‘కొత్త ఒక వింత.. పాత ఒక రోత’ అన్న సామెత... మ్యూచువల్ ఫండ్స్ నూతన పథకాలకూ వర్తిస్తుంది. అందుకేనేమో మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) న్యూ ఫండ్ ఆఫర్ (నూతన పథకాలు/ఎన్ఎఫ్వో)లతో మోత మోగిస్తున్నాయి. కొత్త పథకం రూపంలో పెట్టుబడులు సమకూర్చుకోవడం మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు తేలికైన మార్గం. యూఎస్ అపార్చునిటీస్ఫండ్, స్మాల్‌క్యాప్ ఫండ్, మిడ్‌క్యాప్ ఫండ్, ఇండెక్స్ ఫండ్, ఈఎస్జీ ఫండ్ పేర్లు ఏవైనా కానీయండి.. మార్కెట్లలో ఉన్న బుల్లిష్ సెంటిమెంట్‌ను అనుకూలంగా చేసుకుని మ్యూచువల్ ఫండ్స్‌సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. వీటి గురించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. కానీ పరిశీలించి చూస్తే.. ఎన్‌ఎఫ్‌వోల్లో ఎన్ని ఇన్వెస్టర్లకు సంపద తెచ్చి పెడుతున్నాయి? అన్న ప్రశ్న కచ్చితంగా వస్తుంది. పెట్టుబడులు పెట్టే ముందు ఇన్వెస్టర్లు తప్పకుండా పరిశీలించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఎన్‌ఎఫ్‌వోలు క్యూలు కట్టడానికి.. అవి చెప్పే మాటలకు, ఆచరణలో చూపించే రాబడులకు వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందన్న వివరాలను తెలియజేసే కథనమే ఇది. 2017 నుంచి 2020 మధ్య ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎన్‌ఎఫ్‌వోలు ఏటా రూ.27,000–33,000 కోట్ల వరకు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించాయి. అన్ని విభాగాల్లోనూ నిధుల సమీకరణను కలిపి చూస్తే ఇది రూ.1.23 లక్షల కోట్ల మేర ఉంటుంది. అంటే ఈటీఎఫ్‌లు, భారత్ 22, సీపీఎస్ఈ, ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇక ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే అర డజను ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి వచ్చి రూ.4,500 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. బుల్ మార్కెట్లు అనుకూలం ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ప్రాథమిక సూత్రం ఒకటి ఉంది. ఒక స్టాక్‌లోకి మీరు ప్రవేశించే ధర అధికంగా ఉంటే.. ఖరీదైన వేల్యుయేషన్ల వద్ద పెట్టుబడులు పెడితే.. భవిష్యత్తు రాబడులు తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు బుల్ మార్కెట్ అనుకూల సమయం కాదు. అదే బేర్ మార్కెట్లలో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం రాబడుల పరంగా అనుకూలమైనది. మరి ఏఎంసీలు బుల్ మార్కెట్లలోనే ఎక్కువ ఎన్‌ఎఫ్‌వోలను ఎందుకు తీసుకొస్తున్నాయి?.. ఎందుకంటే బుల్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడుల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉంటారు. దీంతో బుల్ మార్కెట్లలో ఎన్‌ఎఫ్‌వోల ద్వారా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను సమీకరించగలిగే అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే వారానికో ఎన్ఎఫ్వో ఇన్వెస్టర్లను పలకరించింది. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టిన గతేడాది కూడా 48 ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లలోకి వచ్చాయి. 2019లోనూ ఇదే సంఖ్యలో ఎన్‌ఎఫ్‌వోలు వచ్చాయి. 2003–2007 మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్లు కనిష్టాల నుంచి చూస్తే ఆరు రెట్లు పెరిగాయి. ఆ సమయంలో ఎన్‌ఎఫ్‌వోలు ఇన్వెస్టర్ల నుంచి రూ.97,000 కోట్లను సమీకరించాయి. ఈక్విటీ బుల్ ర్యాలీల్లో వచ్చే ఎన్‌ఎఫ్‌వోల పట్ల ఆచితూచి వ్యవహరించాలే కానీ.. వెర్రిగా వ్యవహరించకూడదని గత అనుభవాలు చెబుతున్నాయి. ఎన్‌ఎఫ్‌వోల పట్ల ఇన్వెస్టర్ల ఆసక్తికి ఒక కారణం నెట్ అసెట్ వేల్యూ (ఎన్ఏవీ). ఎన్ఎఫ్వో ప్రారంభంలో ఒక యూనిట్‌ను రూ.10 ఎన్‌ఏవీపై ఫండ్స్ సంస్థలు కేటాయిస్తుంటాయి. ఇప్పటికే మార్కెట్లలో ఉన్న పథకాల ఎన్ఏవీలు ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకంటే అవి చేసిన పెట్టుబడులు వృద్ధి చెందడంతో అది ఎన్‌ఏవీపై ప్రతిఫలిస్తుంది. రాబడులకు అనుగుణంగా ఫండ్స్ యూనిట్ల ఎన్ఏవీలు కాలక్రమంలో వృద్ధి చెందుతుంటాయని తెలిసిందే. కనుక కొత్త పథకం ఎన్ఏవీ చౌకగా ఉందని భావించడం సరికాదు. అలాగే, కొత్త పథకాల్లో రాబడులు ఎక్కువగా ఉంటాయని పొరపడొద్దు. కాకపోతే నూతన పథకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ యూనిట్లు వస్తాయంతే. ఎన్ఎఫ్వోలో ఇన్వెస్ట్ చేసేందుకు కనీసం రూ.5,000 నుంచి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అప్ప టికే బాగా పెరిగిన మార్కెట్లలో ఏక మొత్తంలో పెట్టుబడులు అను కూలం కాదు. ఇప్పటికే ఉన్న పథకాల్లో అయితే సిప్ ద్వారా రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్యాసివ్ ఫండ్స్... నూతన ఫండ్స్ ఆఫర్లు అన్నింటినీ ఒకటే గాటన కట్టడానికి లేదు. వీటిల్లో ప్యాసివ్ ఫండ్స్ (ప్రధానంగా ఇండెక్స్ ఫండ్స్)వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించొచ్చు. మన ఏఎంసీలు ఇప్పుడే ఈ విభాగంలో ఫండ్స్‌ను తీసుకురావడంపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక్కో విభాగంలో ఒక్క పథకమే అంటూ సెబీ విధించిన పరిమితి కారణంగా.. ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, సెక్టోరల్ ఎన్‌ఎఫ్‌వోలపై ఏఎంసీలు ఎక్కువగా దృష్టి సారించాయి. నిజానికి యాక్టివ్‌గా పనిచేసే అధిక శాతం ఈక్విటీ ఫండ్స్‌లో రాబడులు గడిచిన ఏడాది, మూడేళ్ల కాలం లో సూచీలతో పోలిస్తే బలహీనంగానే ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు యాక్టివ్ ఫండ్స్ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉపసంహరణల ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ఇది కూడా ఒక కారణమే. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రారంభమైన ఎన్‌ఎఫ్‌వోలలో 75% ప్యాసివ్ ఫండ్సేనని ఇన్వెస్టర్లు గమనించాలి. కానీ, పదేళ్ల క్రితం దీనికి విరుద్ధ పరిస్థితి ఉంది. 2011లో వచ్చిన మొత్తం ఎన్‌ఎఫ్‌వోలలో 70% యాక్టివ్ మేనేజ్డ్ ఈక్విటీ పథకాలే. యాక్టివ్ ఫండ్స్ రాబడుల్లో వెనుకంజవేయడం.. అలాగే వాటిలో అధిక నిర్వహణ చార్జీల దష్ట్యా ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో కొన్ని ప్యాసివ్ ఫండ్స్‌కు అయినా చోటు ఇవ్వడం సముచితం. సీజన్ వారీ ఫండ్స్.. ప్రతీ మార్కెట్ సైకిల్లోనూ కొన్ని రంగాల స్టాక్స్ మంచి పనితీరు చూపిస్తుంటాయి. ఇటీవలి కాలంలో థ్యీమాటిక్, సెక్టోరల్ ఫండ్స్ (రంగాలవారీ) ఎన్‌ఎఫ్‌వోలు ఎక్కువగా రావడానికి సెబీ గతంలో తీసుకొచ్చిన మార్పులే కారణమని చెప్పుకోవాలి. ఒక ఏఎంసీ ఒక విభాగంలో ఒక్క పథకాన్నే నిర్వహించాల్సి ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్/ఈటీఎఫ్‌లు, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్), సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్‌కు ఈ పరిమితి లేదు. అందుకనే ఏఎంసీలు ఈ విభాగాల్లో ఎక్కువ ఎన్‌ఎఫ్‌వోలను తీసుకువస్తున్నాయి. కానీ, గత చరిత్రను గమనిస్తే.. సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ ఆయా రంగాలు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిధులు సమీకరించినవి.. ఆ తర్వాతి కాలంలో అధిక రాబడులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అలా కాకుండా ఆయా రంగాలు బూమ్‌లో ఉన్న సమయంలో వచ్చి నిధులను సమీకరించినట్టయితే.. అధిక వ్యాల్యూషన్ల వద్ద ఆయా రంగాల స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. దాంతో ఆ తర్వాతి కాలంలో మెరుగైన రాబడులకు దీర్ఘకాలం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు అమెరికా ఈక్విటీ ఆధారిత ఎన్‌ఎఫ్‌వోలు ప్రస్తుతం ఎక్కువగా వస్తున్నాయి. కానీ, అమెరికా మార్కెట్ల వ్యాల్యూషన్లు చారిత్రక గరిష్టాల వద్దనున్న విషయాన్ని గమనించాలి. అలాగే, 2004 నుంచి 2008 మధ్య కాలంలో ఇన్ఫ్రా కంపెనీలు భారీ ర్యాలీ చేశాయి. దాంతో ఆ సమయంలో 17 ఇన్ఫ్రా ఫండ్స్‌ను ఏఎంసీలు ఆవిష్కరించాయి. కానీ, నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే సగం ఫండ్స్‌లో రాబడులు ఇప్పటికీ వార్షికంగా 2–8 శాతాన్ని మించలేదు. అలాగే, గడిచిన ఐదేళ్ల కాలంలో 22 థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్ కొత్తగా మార్కెట్లలోకి రాగా.. ఇప్పటికీ వీటిల్లో మూడోవంతు నిఫ్టీ–50 రాబడులను మించి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాయి. రాబడులు ఎలా? ఈక్విటీ ఫండ్స్‌లో యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ అని రెండు రకాలు ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో స్టాక్స్ ఎంపిక ఫండ్ మేనేజర్ల పరిశోధన, వారి అంచనాల ఆధారంగా ఉంటాయి. కానీ ప్యాసివ్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్ల ఎంపిక ఏమీ ఉండదు. ఇండెక్స్ ఫండ్స్, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ప్యాసివ్ విభాగంలోకే వస్తాయి. ఉదాహరణకు నిఫ్టీ –50 ఫండ్ అన్నది నిఫ్టీ–50లో ఉండే స్టాక్స్‌లో వాటి వెయిటేజీ ఆధారంగా పెట్టుబడులను పెడుతుంది. రాబడులు కూడా నిఫ్టీ–50 పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి. కానీ, యాక్టివ్ ఫండ్స్‌లో రాబడులు ఇలా ఉండవు. ఫండ్ మేనేజర్ల ప్రతిభా పాటవాలపైనే ఆధారపడి ఉంటాయి. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు యాక్టివ్ ఫండ్స్‌నే ఎంపిక చేసుకోవడం రాబడుల కోణంలోనే. కానీ, గడిచిన ఐదేళ్ల కాలంలో వచ్చిన యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలను పరిశీలించినట్టయితే.. వాటి రాబడులు గడిచిన ఏడాది కాలంలో బెంచ్ మార్క్ కంటే తక్కువే ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. 79 శాతం పథకాల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఉదాహరణకు నూతనంగా మొదలైన స్మాల్‌క్యాప్ ఫండ్స్ చాలా వరకు గత ఏడాది కాలంలో ఇచ్చిన రాబడులు 56–78 శాతంగా ఉన్నాయి. కానీ, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీ టోటల్ రిటర్నులు 80 శాతంగా ఉండడాన్ని గమనించాలి. సూచీల కంటే రాబడులు తక్కువగా ఉన్నప్పుడు ప్యాసివ్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చుగా.. యాక్టివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు దండగ? అన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్యాసివ్ ఫండ్స్‌లో నిర్వహణ చార్జీలు యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే 80 శాతం వరకు తక్కువగా ఉంటాయి. మూడేళ్ల కాలంలో చూసుకుంటే ఎన్‌ఎఫ్‌వోల పనితీరు సూచీలతో పోలిస్తే తక్కువగానే ఉంది. మూడేళ్ల కాలంలో 70 శాతానికి పైగా యాక్టివ్ మేనేజ్డ్ ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలలో రాబడులు సూచీలకంటే తక్కువే ఉన్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో 63 ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోల డేటా అందుబాటులో ఉండగా.. వీటిల్లో సగం మేర బెంచ్‌మార్క్‌లతో పోలిస్తే రాబడుల్లో వెనుకబడే ఉన్నాయి. కనుక ఇప్పటికే మార్కెట్లలో దీర్ఘకాలంగా ఉండి, మంచి ట్రాక్ రికార్డు ఉన్న వాటితో పోలిస్తే ఎన్‌ఎఫ్‌వోలలో అధిక రాబడులు వస్తాయన్న అంచనాలతో ఇన్వెస్ట్ చేయడం అన్ని వేళలా సరైనది కాదని ఈ నిదర్శనాలు తెలియజేస్తున్నాయి.