‘కొత్త ఒక వింత.. పాత ఒక రోత’ అన్న సామెత... మ్యూచువల్ ఫండ్స్ నూతన పథకాలకూ వర్తిస్తుంది. అందుకేనేమో మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు (అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) న్యూ ఫండ్ ఆఫర్ (నూతన పథకాలు/ఎన్‌ఎఫ్‌వో)లతో మోత మోగిస్తున్నాయి. కొత్త పథకం రూపంలో పెట్టుబడులు సమకూర్చుకోవడం మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు తేలికైన మార్గం. యూఎస్ అపార్చునిటీస్‌ఫండ్, స్మాల్‌క్యాప్ ఫండ్, మిడ్‌క్యాప్ ఫండ్, ఇండెక్స్ ఫండ్, ఈఎస్‌జీ ఫండ్ పేర్లు ఏవైనా కానీయండి..
మార్కెట్లలో ఉన్న బుల్లిష్ సెంటిమెంట్‌ను అనుకూలంగా చేసుకుని మ్యూచువల్ ఫండ్స్‌సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. వీటి గురించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. కానీ పరిశీలించి చూస్తే.. ఎన్‌ఎఫ్‌వోల్లో ఎన్ని ఇన్వెస్టర్లకు సంపద తెచ్చి పెడుతున్నాయి? అన్న ప్రశ్న కచ్చితంగా వస్తుంది. పెట్టుబడులు పెట్టే ముందు ఇన్వెస్టర్లు తప్పకుండా పరిశీలించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఎన్‌ఎఫ్‌వోలు క్యూలు కట్టడానికి.. అవి చెప్పే మాటలకు, ఆచరణలో చూపించే రాబడులకు వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందన్న వివరాలను తెలియజేసే కథనమే ఇది.
2017 నుంచి 2020 మధ్య ఈక్విటీ
మ్యూచువల్ ఫండ్ ఎన్‌ఎఫ్‌వోలు ఏటా రూ.27,000–33,000 కోట్ల వరకు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించాయి. అన్ని విభాగాల్లోనూ నిధుల సమీకరణను కలిపి చూస్తే ఇది రూ.1.23 లక్షల కోట్ల మేర ఉంటుంది. అంటే ఈటీఎఫ్‌లు, భారత్ 22, సీపీఎస్‌ఈ, ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇక ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే అర డజను ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి వచ్చి రూ.4,500 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి.
బుల్ మార్కెట్లు అనుకూలం
ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ప్రాథమిక సూత్రం ఒకటి ఉంది. ఒక స్టాక్‌లోకి మీరు ప్రవేశించే ధర అధికంగా ఉంటే.. ఖరీదైన వేల్యుయేషన్ల వద్ద పెట్టుబడులు పెడితే.. భవిష్యత్తు రాబడులు తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు బుల్ మార్కెట్ అనుకూల సమయం కాదు. అదే బేర్ మార్కెట్లలో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం రాబడుల పరంగా అనుకూలమైనది. మరి ఏఎంసీలు బుల్ మార్కెట్లలోనే ఎక్కువ ఎన్‌ఎఫ్‌వోలను ఎందుకు తీసుకొస్తున్నాయి?.. ఎందుకంటే బుల్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడుల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉంటారు.
దీంతో బుల్ మార్కెట్లలో ఎన్‌ఎఫ్‌వోల ద్వారా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను సమీకరించగలిగే అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే వారానికో ఎన్‌ఎఫ్‌వో ఇన్వెస్టర్లను పలకరించింది. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టిన గతేడాది కూడా 48 ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లలోకి వచ్చాయి. 2019లోనూ ఇదే సంఖ్యలో ఎన్‌ఎఫ్‌వోలు వచ్చాయి. 2003–2007 మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్లు కనిష్టాల నుంచి చూస్తే ఆరు రెట్లు పెరిగాయి. ఆ సమయంలో ఎన్‌ఎఫ్‌వోలు ఇన్వెస్టర్ల నుంచి రూ.97,000 కోట్లను సమీకరించాయి. ఈక్విటీ బుల్ ర్యాలీల్లో వచ్చే ఎన్‌ఎఫ్‌వోల పట్ల ఆచితూచి వ్యవహరించాలే కానీ.. వెర్రిగా వ్యవహరించకూడదని గత అనుభవాలు చెబుతున్నాయి.
ఎన్‌ఎఫ్‌వోల పట్ల ఇన్వెస్టర్ల ఆసక్తికి ఒక కారణం నెట్ అసెట్ వేల్యూ (ఎన్‌ఏవీ). ఎన్‌ఎఫ్‌వో ప్రారంభంలో ఒక యూనిట్‌ను రూ.10 ఎన్‌ఏవీపై ఫండ్స్ సంస్థలు కేటాయిస్తుంటాయి. ఇప్పటికే మార్కెట్లలో ఉన్న పథకాల ఎన్‌ఏవీలు ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకంటే అవి చేసిన పెట్టుబడులు వృద్ధి చెందడంతో అది ఎన్‌ఏవీపై ప్రతిఫలిస్తుంది. రాబడులకు అనుగుణంగా ఫండ్స్ యూనిట్ల ఎన్‌ఏవీలు కాలక్రమంలో వృద్ధి చెందుతుంటాయని తెలిసిందే. కనుక కొత్త పథకం ఎన్‌ఏవీ చౌకగా ఉందని భావించడం సరికాదు. అలాగే, కొత్త పథకాల్లో రాబడులు ఎక్కువగా ఉంటాయని పొరపడొద్దు. కాకపోతే నూతన పథకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ యూనిట్లు వస్తాయంతే. ఎన్‌ఎఫ్‌వోలో ఇన్వెస్ట్ చేసేందుకు కనీసం రూ.5,000 నుంచి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అప్ప టికే బాగా పెరిగిన మార్కెట్లలో ఏక మొత్తంలో పెట్టుబడులు అను కూలం కాదు. ఇప్పటికే ఉన్న పథకాల్లో అయితే సిప్ ద్వారా రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
ప్యాసివ్ ఫండ్స్...
నూతన ఫండ్స్ ఆఫర్లు అన్నింటినీ ఒకటే గాటన కట్టడానికి లేదు. వీటిల్లో ప్యాసివ్ ఫండ్స్ (ప్రధానంగా ఇండెక్స్ ఫండ్స్)వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించొచ్చు. మన ఏఎంసీలు ఇప్పుడే ఈ విభాగంలో ఫండ్స్‌ను తీసుకురావడంపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక్కో విభాగంలో ఒక్క పథకమే అంటూ సెబీ విధించిన పరిమితి కారణంగా.. ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, సెక్టోరల్ ఎన్‌ఎఫ్‌వోలపై ఏఎంసీలు ఎక్కువగా దృష్టి సారించాయి. నిజానికి యాక్టివ్‌గా పనిచేసే అధిక శాతం ఈక్విటీ ఫండ్స్‌లో రాబడులు గడిచిన ఏడాది, మూడేళ్ల కాలం లో సూచీలతో పోలిస్తే బలహీనంగానే ఉన్నాయి.
దీంతో ఇన్వెస్టర్లు యాక్టివ్ ఫండ్స్ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉపసంహరణల ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ఇది కూడా ఒక కారణమే. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రారంభమైన ఎన్‌ఎఫ్‌వోలలో 75% ప్యాసివ్ ఫండ్సేనని ఇన్వెస్టర్లు గమనించాలి. కానీ, పదేళ్ల క్రితం దీనికి విరుద్ధ పరిస్థితి ఉంది. 2011లో వచ్చిన మొత్తం ఎన్‌ఎఫ్‌వోలలో 70% యాక్టివ్ మేనేజ్డ్ ఈక్విటీ పథకాలే. యాక్టివ్ ఫండ్స్ రాబడుల్లో వెనుకంజవేయడం.. అలాగే వాటిలో అధిక నిర్వహణ చార్జీల దష్ట్యా ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో కొన్ని ప్యాసివ్ ఫండ్స్‌కు అయినా చోటు ఇవ్వడం సముచితం.
సీజన్ వారీ ఫండ్స్..
ప్రతీ మార్కెట్ సైకిల్‌లోనూ కొన్ని రంగాల స్టాక్స్ మంచి పనితీరు చూపిస్తుంటాయి. ఇటీవలి కాలంలో థ్యీమాటిక్, సెక్టోరల్ ఫండ్స్ (రంగాలవారీ) ఎన్‌ఎఫ్‌వోలు ఎక్కువగా రావడానికి సెబీ గతంలో తీసుకొచ్చిన మార్పులే కారణమని చెప్పుకోవాలి. ఒక ఏఎంసీ ఒక విభాగంలో ఒక్క పథకాన్నే నిర్వహించాల్సి ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్/ఈటీఎఫ్‌లు, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్), సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్‌కు ఈ పరిమితి లేదు. అందుకనే ఏఎంసీలు ఈ విభాగాల్లో ఎక్కువ ఎన్‌ఎఫ్‌వోలను తీసుకువస్తున్నాయి. కానీ, గత చరిత్రను గమనిస్తే.. సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ ఆయా రంగాలు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిధులు సమీకరించినవి.. ఆ తర్వాతి కాలంలో అధిక రాబడులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
అలా కాకుండా ఆయా రంగాలు బూమ్‌లో ఉన్న సమయంలో వచ్చి నిధులను సమీకరించినట్టయితే.. అధిక వ్యాల్యూషన్ల వద్ద ఆయా రంగాల స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. దాంతో ఆ తర్వాతి కాలంలో మెరుగైన రాబడులకు దీర్ఘకాలం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు అమెరికా ఈక్విటీ ఆధారిత ఎన్‌ఎఫ్‌వోలు ప్రస్తుతం ఎక్కువగా వస్తున్నాయి. కానీ, అమెరికా మార్కెట్ల వ్యాల్యూషన్లు చారిత్రక గరిష్టాల వద్దనున్న విషయాన్ని గమనించాలి. అలాగే, 2004 నుంచి 2008 మధ్య కాలంలో ఇన్‌ఫ్రా కంపెనీలు భారీ ర్యాలీ చేశాయి. దాంతో ఆ సమయంలో 17 ఇన్‌ఫ్రా ఫండ్స్‌ను ఏఎంసీలు ఆవిష్కరించాయి. కానీ, నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే సగం ఫండ్స్‌లో రాబడులు ఇప్పటికీ వార్షికంగా 2–8 శాతాన్ని మించలేదు. అలాగే, గడిచిన ఐదేళ్ల కాలంలో 22 థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్ కొత్తగా మార్కెట్లలోకి రాగా.. ఇప్పటికీ వీటిల్లో మూడోవంతు నిఫ్టీ–50 రాబడులను మించి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాయి.
రాబడులు ఎలా?
ఈక్విటీ ఫండ్స్‌లో యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ అని రెండు రకాలు ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో స్టాక్స్ ఎంపిక ఫండ్ మేనేజర్ల పరిశోధన, వారి అంచనాల ఆధారంగా ఉంటాయి. కానీ ప్యాసివ్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్ల ఎంపిక ఏమీ ఉండదు. ఇండెక్స్ ఫండ్స్, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ప్యాసివ్ విభాగంలోకే వస్తాయి. ఉదాహరణకు నిఫ్టీ –50 ఫండ్ అన్నది నిఫ్టీ–50లో ఉండే స్టాక్స్‌లో వాటి వెయిటేజీ ఆధారంగా పెట్టుబడులను పెడుతుంది. రాబడులు కూడా నిఫ్టీ–50 పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి. కానీ, యాక్టివ్ ఫండ్స్‌లో రాబడులు ఇలా ఉండవు. ఫండ్ మేనేజర్ల ప్రతిభా పాటవాలపైనే ఆధారపడి ఉంటాయి. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు యాక్టివ్ ఫండ్స్‌నే ఎంపిక చేసుకోవడం రాబడుల కోణంలోనే. కానీ, గడిచిన ఐదేళ్ల కాలంలో వచ్చిన యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలను పరిశీలించినట్టయితే.. వాటి రాబడులు గడిచిన ఏడాది కాలంలో బెంచ్ మార్క్ కంటే తక్కువే ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. 79 శాతం పథకాల పరిస్థితి ఇదే విధంగా ఉంది.
ఉదాహరణకు నూతనంగా మొదలైన స్మాల్‌క్యాప్ ఫండ్స్ చాలా వరకు గత ఏడాది కాలంలో ఇచ్చిన రాబడులు 56–78 శాతంగా ఉన్నాయి. కానీ, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీ టోటల్ రిటర్నులు 80 శాతంగా ఉండడాన్ని గమనించాలి. సూచీల కంటే రాబడులు తక్కువగా ఉన్నప్పుడు ప్యాసివ్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చుగా.. యాక్టివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు దండగ? అన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్యాసివ్ ఫండ్స్‌లో నిర్వహణ చార్జీలు యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే 80 శాతం వరకు తక్కువగా ఉంటాయి. మూడేళ్ల కాలంలో చూసుకుంటే ఎన్‌ఎఫ్‌వోల పనితీరు సూచీలతో పోలిస్తే తక్కువగానే ఉంది. మూడేళ్ల కాలంలో 70 శాతానికి పైగా యాక్టివ్ మేనేజ్డ్ ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలలో రాబడులు సూచీలకంటే తక్కువే ఉన్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో 63 ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోల డేటా అందుబాటులో ఉండగా.. వీటిల్లో సగం మేర బెంచ్‌మార్క్‌లతో పోలిస్తే రాబడుల్లో వెనుకబడే ఉన్నాయి. కనుక ఇప్పటికే మార్కెట్లలో దీర్ఘకాలంగా ఉండి, మంచి ట్రాక్ రికార్డు ఉన్న వాటితో పోలిస్తే ఎన్‌ఎఫ్‌వోలలో అధిక రాబడులు వస్తాయన్న అంచనాలతో ఇన్వెస్ట్ చేయడం అన్ని వేళలా సరైనది కాదని ఈ నిదర్శనాలు తెలియజేస్తున్నాయి.
న్యూ ఫండ్ ఆఫర్.. లాభసాటేనా?
Published Mon, Mar 29 2021 12:06 AM | Last Updated on Mon, Mar 29 2021 3:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment