Net asset value
-
యులిప్.. లోతుగా తెలుసుకున్నాకే!
ఆర్యన్ (60) క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేద్దామని బ్యాంక్‌కు వెళ్లాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి (ఎఫ్డీ), దానిపై ప్రతి నెలా వడ్డీ రాబడి తీసుకోవాలన్నది ఆయన ప్రణాళిక. కానీ, బ్యాంక్ ఉద్యోగి చేసిన పనికి అతడు నష్టపోవాల్సి వచి్చంది. అనుకున్నది ఒకటి అయింది మరొకటి. ఎఫ్డీ పేరు చెప్పి బ్యాంక్ ఉద్యోగి ఆర్యన్‌తో యులిప్ పథకంపై సంతకం చేయించాడు. ఆ తర్వాతే అది ఎఫ్డీ కాదని అతడికి తెలిసొచ్చింది. దీంతో క్రమం తప్పకుండా ఆదాయం పొందాలన్న అతడి ప్రణాళిక దారితప్పింది. ఇలా తప్పుదోవ పట్టించి బీమా పాలసీలు, పెట్టుబడి పథకాలను అంటగట్టే ప్రయత్నాలు సహజంగానే కనిపిస్తూనే ఉంటాయి. యస్ బ్యాంక్ కేసులోనూ ఇదే చోటు చేసుకుంది. ఏటీ–1 (అడిషనల్ టైర్) బాండ్లను ఎఫ్డీ పేరు చెప్పి లక్షలాది మంది నుండి పెట్టుబడులు సమీకరించింది. యస్ బ్యాంక్ సంక్షోభంలో పడినప్పుడు ఏటీ–1 బాండ్లను రైటాఫ్ చేసేశారు. అంటే పెట్టుబడి పెట్టిన వారికి రూపాయి ఇవ్వలేదు. ఎఫ్‌డీల్లో అధిక రాబడి ఇస్తుందని చెప్పారే కానీ, ఏటీ–1 బాండ్లలో ఉండే రిస్క్ గురించి చెప్పలేదు. మన దేశంలో పెట్టుబడి సాధనాలను మార్కెట్ చేసే వారు కేవలం రాబడులు, ఆకర్షణీయమైన ఫీచర్ల గురించే చెబుతుంటారు. ఆయా సాధనాల్లోని రిస్్క ల గురించి తెలుసుకోవడం ఇన్వెస్ట్ చేసే వారి బాధ్యత అని గుర్తించాలి. బీమా పాలసీలను తప్పుడు సమాచారంతో విక్రయించే ధోరణులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో యులిప్‌లు కూడా ఒకటి. ‘‘ఇవి ఏజెంట్లకు ఎక్కువ కమీషన్‌ను అందిస్తాయి. దీంతో పాలసీ తీసుకునే వారికి గరిష్ట ప్రయోజనం కల్పించడానికి బదులు, ఏజెంట్‌కు ఎక్కువ ప్రయోజనం కలిగించే ఉత్పత్తి విక్రయానికి దారితీస్తుంది’’ అని ఆనంద్‌రాఠి వెల్త్ ప్రొడక్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ చేతన్ షెనాయ్ వివరించారు. ఎండోమెంట్ బీమా ప్లాన్లలో కమీషన్ మెదటి ఏడాది 10–35 శాతం మేర ఏజెంట్లకు అందుతుంది. యులిప్ ప్లాన్ల ప్రీమియంలో 10 శాతం ఏజెంట్ కమీషన్‌గా వెళుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో కేవలం 0.3–1.5 శాతం మధ్యే ఎక్కువ పథకాల్లో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పనిచేస్తాయంటూ యులిప్‌లను మార్కెట్ చేస్తుంటారు ఏజెంట్లు. కానీ, పూర్తిగా తెలుసుకోకుండా అంగీకారం తెలపకపోవడమే మంచిది. యులిప్‌లు – మ్యూచువల్ ఫండ్స్ యులిప్‌లు, మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటి కావు. వీటి మధ్య సారూప్యత కొంత అయితే, వైరుధ్యాలు బోలెడు. యులిప్‌లు అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు. అంటే పెట్టుబడులతో ముడిపడిన బీమా పథకాలు. చెల్లించే ప్రీమియంలో కొంత బీమా కవరేజీకి పోను, మిగిలిన మొత్తాన్ని తీసుకెళ్లి ఈక్విటీ, డెట్ సాధనాల్లో (ఇన్వెస్టర్ ఎంపిక మేరకు) పెట్టుబడిగా పెడతారు. కనుక ఇందులో రిస్క్‌లు, రాబడుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. బీమా కంపెనీల ఫండ్ మేనేజర్లు యులిప్ పాలసీలకు సంబంధించిన పెట్టుబడులను మార్కెట్ లింక్డ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. యులిప్‌ల ప్లాన్లను మ్యూచువల్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)గా కొందరు మార్కెట్ చేస్తుంటారు. నెట్ అసెట్ వేల్యూ (ఎన్ఏవీ)ని చూపిస్తుంటారు. యులిప్‌లను మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయం అంటూ విక్రయిస్తుంటారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ మాదిరే రాబడులు వస్తాయని కొనుగోలు చేసే వారూ ఉన్నారు. కానీ వాస్తవంలో మెరుగ్గా పనిచేసే యులిప్‌ల రాబడులను గమనించినప్పుడు.. మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువే ఉండడాన్ని చూడొచ్చు. దీనికి కారణం యులిప్‌లలో పలు రకాల చార్జీల పేరుతో పాలసీదారుల నుంచి బీమా సంస్థలు ఎక్కువ రాబట్టుకునే చర్యలు అమలు చేస్తుంటాయి. సంక్లిష్టత.. పారదర్శకత లిక్విడిటీ (కొనుగోలు, విక్రయాలకు కావాల్సినంత డిమాండ్), చార్జీలు అనేవి యులిప్‌లు, ఫండ్స్‌లో పూర్తిగా భిన్నం. యులిప్‌లు ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. ఫండ్స్ పెట్టుబడులను కోరుకున్నప్పుడు ఉపసంహరించుకోవచ్చు. యులిప్‌లలో విధించే చార్జీలు ఎక్కువగా ఉంటాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో సాధారణంగా అయితే 0.5–1.5 శాతం మధ్య ఉంటుంది. అదే యులిప్‌లలో 20 ఏళ్ల కాలానికి లోడింగ్ 60 శాతంగా ఉంటుంది. అంటే ఏటా 3 శాతం చార్జీల రూపంలో కోల్పోవాల్సి వస్తుంది’’ అని ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్ అనే ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ వ్యవస్థాపకుడు అనంత్ లోధా తెలిపారు. చార్జీల పరంగా సంక్లిష్టత ఇందులో కనిపిస్తుంది. ప్రీమియం అలోకేషన్ చార్జీలు, మోరా్టలిటీ చార్జీలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు, పాలసీ అడ్మిని్రస్టేటివ్ చార్జీలు, ఫండ్ స్విచింగ్ (ఫండ్‌ను మార్చుకున్నప్పుడు) చార్జీలు, పాక్షిక ఉపసంహరణ చార్జీలు, ప్రీమియం రీడైరెక్షన్ చార్జీలు, ప్రీమియం నిలిపివేత చార్జీలు.. ఇన్నేసీ చార్జీలు మరే పెట్టుబడి సాధనంలో కనిపించవు. యులిప్ ప్లాన్లను తీసుకున్న వారిలోనూ చాలా మందికి ఈ చార్జీల గురించి తెలియదు. ఫండ్ మేనేజ్మెంట్ చార్జీల గురించే ఎక్కువ మందికి తెలుసు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల నిర్వహణకు గాను ఎక్స్పెన్స్ రేషియో విధిస్తుంటారు. దీన్నే ఫండ్ మేనేజ్మెంట్ చార్జీగానూ భావించొచ్చు. యులిప్ ప్లాన్లలో దీర్ఘకాలంలో రాబడులు 7–9 శాతం మధ్య ఉంటాయి. కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో వార్షిక రాబడిని 12 శాతానికి పైనే ఆశించొచ్చు. రాబడులపై గ్యారంటీ లేదు మ్యూచువల్ ఫండ్స్ మాదిరే యులిప్‌లు సైతం రాబడికి హామీ ఇవ్వవు. వీటిల్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లపై ఆధారపడి ఉంటాయి. కాకపోతే దీర్ఘకాలంలో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే మెరుగైన రాబడి యులిప్‌లలో ఉంటుందని భావించొచ్చు. ఎందుకంటే ఇవి పెట్టుబడులను తీసుకెళ్లి ఈక్విటీల్లో పెడుతుంటాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. కనుక అన్ని రకాల చార్జీల పేరుతో బాదిన తర్వాత కూడా ఎఫ్డీ కంటే కొంచెం ఎక్కువ రాబడి యులిప్‌లలో ఉంటుంది. పైగా ఎఫ్డీ రాబడిపై పన్ను ఉంటుంది. యులిప్ మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. అందుకే బీమా ఏజెంట్లు ఎఫ్‌డీల కంటే మెరుగైనవిగా మార్కెట్ చేస్తుంటారు. యులిప్ పెట్టుబడులను సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డెట్, ఈక్విటీ మధ్య మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ కూడా ఇదే పనిచేస్తుంటాయి. పన్ను పరిధిలో ఉన్న వారికి యులిప్‌లు అనుకూలమేనని చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిల్లో పెట్టుబడులు, రాబడులపైనా పన్ను ప్రయోజనాలు ఉండడమే. ‘బెనిఫిట్ ఇలి్రస్టేషన్’ (ఎంత రావచ్చన్న అంచనాలు)లో రాబడిని 4–8 శాతం మించి చూపించకూడదు. యులిప్లలోనూ కన్జర్వేటివ్, బ్యాలన్స్డ్, అగ్రెస్సివ్ ఫండ్స్ ఉంటాయి. వీటిల్లో రాబడి, రిస్క్ వేర్వేరు. ఏ ఫండ్ ఎంపిక చేసుకుంటున్నారన్నదాని ఆధారంగానే రాబడులు ఆధారపడి ఉంటాయి. అగ్రెసివ్ ఫండ్‌తో దీర్ఘకాలంలో రాబడి అధికంగా ఉంటుంది. రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణలు కాదు.. అవసరాలు కుటుంబ పెద్దకు అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకుంటుందనే మార్కెటింగ్ ప్రచారం కూడా యులిప్ ప్లాన్ల విషయంలో కనిపిస్తుంది. కానీ, ఇందులో వాస్తవం పాళ్లు కొంతే. ఎందుకంటే యులిప్ ప్లాన్లలో బీమా రక్షణ తగినంత ఉండదు. అచ్చమైన కవరేజీ కోసం అనువైనది టర్మ్ ఇన్సూరెన్స్. అలాగే, యులిప్‌లో చెల్లించే ప్రీమియం సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిధిలోకి వస్తుందని, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదని కూడా చెబుతారు. కానీ, 2021 ఫిబ్రవరి 1 తర్వాత కొనుగోలు చేసిన యులిప్ ప్లాన్లకు సంబంధించి అందుకునే మెచ్యూరిటీపై పన్ను ఉండకూడదని కోరుకుంటే, ప్రీమియం రూ.2.5 లక్షలు మించకూడదు. మరీ ముఖ్యంగా యులిప్ ప్లాన్ల విషయంలో వృద్ధులను ఏజెంట్లు లక్ష్యంగా చేసుకోవడాన్ని గమనించొచ్చు. ఎందుకంటే వారికి వీటిపై తగినంత అవగాహన లేకపోవడమే. సింగిల్ ప్రీమియం పాలసీలు, గ్యారంటీడ్ ఇన్కమ్ (హామీతో కూడిన రాబడి) పాలసీల గురించి వృద్ధులు అడుగుతుంటారని, అవి వారి అవసరాలకు అనుకూలమైనవి కావని నిపుణుల సూచన. అలాగే, యులిప్ ప్లాన్లలో పెట్టుబడికి ఐదేళ్ల పాటు లాకిన్‌లో ఉంటుంది. దీన్ని కూడా వృద్ధులు గమనించాలి. సీనియర్ సిటిజన్లలో ఎక్కువ మందికి వారు చెల్లించే ప్రీమియానికి పది రెట్ల బీమా కవరేజీ ఇతర ప్లాన్లలో రాకపోవడం ఆకర్షణకు ఒక కారణం. మార్గమేంటి..? అది యులిప్ అయినా, ఎండోమెంట్ ప్లాన్ అయినా సరే బీమాను, పెట్టుబడిని కలపకూడదన్నది ప్రాథమిక సూత్రం. అచ్చమైన బీమా రక్షణ కోరుకుంటే అందుకు టర్మ్ ఇన్సూరెన్స్ మెరుగైన సాధనం. పెట్టుబడి కోసం ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఎన్నో ఉన్నాయి. అటు బీమా, ఇటు పెట్టుబడిపై గరిష్ట ప్రయోజనాన్ని పొందాలంటే వీటిని విడివిడిగానే తీసుకోవాలి. పన్ను ఆదా కోరుకునేట్టు అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కోరుకోవచ్చు. టర్మ్ ప్లాన్లలో గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనం అందదు. ఇక పెట్టుబడులపై పన్ను ఆదా కోరుకునే వారు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిలో చేసే పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో సగటు రాబడి 15 శాతానికి పైనే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం.. ఈఎల్ఎస్ఎస్ నుంచి వచ్చే రాబడిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. యులిప్‌లో అయితే మెచ్యూరిటీపైనా పన్ను మిహాయింపు ప్రయోజనం లభిస్తుంది. కానీ, ఈల్ఎస్ఎస్ఎస్లో అది లేదు. కాకపోతే యులిప్తో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ రాబడులు ఎంతో మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్షకు మించిన మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించిన తర్వాత కూడా నికర రాబడి, యులిప్‌లలో కంటే ఈఎల్ఎస్ఎస్ ప్లాన్లలో ఎక్కువే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. డెట్‌లో పీపీఎఫ్ సాధనంలో మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉండదు. ఇంత చెప్పినా, యులిప్ ప్లాన్ తీసుకుకోవడానికే మొగ్గు చూపేవారు.. బ్యాంకుల నుంచి కాకుండా నేరుగా బీమా సంస్థల నుంచి తీసుకోవడం వల్ల సరైన మార్గనిర్దేశం లభిస్తుందనేది నిపుణుల సూచన. -
న్యూ ఫండ్ ఆఫర్.. లాభసాటేనా?
‘కొత్త ఒక వింత.. పాత ఒక రోత’ అన్న సామెత... మ్యూచువల్ ఫండ్స్ నూతన పథకాలకూ వర్తిస్తుంది. అందుకేనేమో మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) న్యూ ఫండ్ ఆఫర్ (నూతన పథకాలు/ఎన్ఎఫ్వో)లతో మోత మోగిస్తున్నాయి. కొత్త పథకం రూపంలో పెట్టుబడులు సమకూర్చుకోవడం మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు తేలికైన మార్గం. యూఎస్ అపార్చునిటీస్ఫండ్, స్మాల్‌క్యాప్ ఫండ్, మిడ్‌క్యాప్ ఫండ్, ఇండెక్స్ ఫండ్, ఈఎస్జీ ఫండ్ పేర్లు ఏవైనా కానీయండి.. మార్కెట్లలో ఉన్న బుల్లిష్ సెంటిమెంట్‌ను అనుకూలంగా చేసుకుని మ్యూచువల్ ఫండ్స్‌సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. వీటి గురించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. కానీ పరిశీలించి చూస్తే.. ఎన్‌ఎఫ్‌వోల్లో ఎన్ని ఇన్వెస్టర్లకు సంపద తెచ్చి పెడుతున్నాయి? అన్న ప్రశ్న కచ్చితంగా వస్తుంది. పెట్టుబడులు పెట్టే ముందు ఇన్వెస్టర్లు తప్పకుండా పరిశీలించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఎన్‌ఎఫ్‌వోలు క్యూలు కట్టడానికి.. అవి చెప్పే మాటలకు, ఆచరణలో చూపించే రాబడులకు వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందన్న వివరాలను తెలియజేసే కథనమే ఇది. 2017 నుంచి 2020 మధ్య ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎన్‌ఎఫ్‌వోలు ఏటా రూ.27,000–33,000 కోట్ల వరకు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించాయి. అన్ని విభాగాల్లోనూ నిధుల సమీకరణను కలిపి చూస్తే ఇది రూ.1.23 లక్షల కోట్ల మేర ఉంటుంది. అంటే ఈటీఎఫ్‌లు, భారత్ 22, సీపీఎస్ఈ, ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇక ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే అర డజను ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి వచ్చి రూ.4,500 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. బుల్ మార్కెట్లు అనుకూలం ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ప్రాథమిక సూత్రం ఒకటి ఉంది. ఒక స్టాక్‌లోకి మీరు ప్రవేశించే ధర అధికంగా ఉంటే.. ఖరీదైన వేల్యుయేషన్ల వద్ద పెట్టుబడులు పెడితే.. భవిష్యత్తు రాబడులు తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు బుల్ మార్కెట్ అనుకూల సమయం కాదు. అదే బేర్ మార్కెట్లలో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం రాబడుల పరంగా అనుకూలమైనది. మరి ఏఎంసీలు బుల్ మార్కెట్లలోనే ఎక్కువ ఎన్‌ఎఫ్‌వోలను ఎందుకు తీసుకొస్తున్నాయి?.. ఎందుకంటే బుల్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడుల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉంటారు. దీంతో బుల్ మార్కెట్లలో ఎన్‌ఎఫ్‌వోల ద్వారా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను సమీకరించగలిగే అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే వారానికో ఎన్ఎఫ్వో ఇన్వెస్టర్లను పలకరించింది. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టిన గతేడాది కూడా 48 ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లలోకి వచ్చాయి. 2019లోనూ ఇదే సంఖ్యలో ఎన్‌ఎఫ్‌వోలు వచ్చాయి. 2003–2007 మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్లు కనిష్టాల నుంచి చూస్తే ఆరు రెట్లు పెరిగాయి. ఆ సమయంలో ఎన్‌ఎఫ్‌వోలు ఇన్వెస్టర్ల నుంచి రూ.97,000 కోట్లను సమీకరించాయి. ఈక్విటీ బుల్ ర్యాలీల్లో వచ్చే ఎన్‌ఎఫ్‌వోల పట్ల ఆచితూచి వ్యవహరించాలే కానీ.. వెర్రిగా వ్యవహరించకూడదని గత అనుభవాలు చెబుతున్నాయి. ఎన్‌ఎఫ్‌వోల పట్ల ఇన్వెస్టర్ల ఆసక్తికి ఒక కారణం నెట్ అసెట్ వేల్యూ (ఎన్ఏవీ). ఎన్ఎఫ్వో ప్రారంభంలో ఒక యూనిట్‌ను రూ.10 ఎన్‌ఏవీపై ఫండ్స్ సంస్థలు కేటాయిస్తుంటాయి. ఇప్పటికే మార్కెట్లలో ఉన్న పథకాల ఎన్ఏవీలు ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకంటే అవి చేసిన పెట్టుబడులు వృద్ధి చెందడంతో అది ఎన్‌ఏవీపై ప్రతిఫలిస్తుంది. రాబడులకు అనుగుణంగా ఫండ్స్ యూనిట్ల ఎన్ఏవీలు కాలక్రమంలో వృద్ధి చెందుతుంటాయని తెలిసిందే. కనుక కొత్త పథకం ఎన్ఏవీ చౌకగా ఉందని భావించడం సరికాదు. అలాగే, కొత్త పథకాల్లో రాబడులు ఎక్కువగా ఉంటాయని పొరపడొద్దు. కాకపోతే నూతన పథకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ యూనిట్లు వస్తాయంతే. ఎన్ఎఫ్వోలో ఇన్వెస్ట్ చేసేందుకు కనీసం రూ.5,000 నుంచి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అప్ప టికే బాగా పెరిగిన మార్కెట్లలో ఏక మొత్తంలో పెట్టుబడులు అను కూలం కాదు. ఇప్పటికే ఉన్న పథకాల్లో అయితే సిప్ ద్వారా రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్యాసివ్ ఫండ్స్... నూతన ఫండ్స్ ఆఫర్లు అన్నింటినీ ఒకటే గాటన కట్టడానికి లేదు. వీటిల్లో ప్యాసివ్ ఫండ్స్ (ప్రధానంగా ఇండెక్స్ ఫండ్స్)వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించొచ్చు. మన ఏఎంసీలు ఇప్పుడే ఈ విభాగంలో ఫండ్స్‌ను తీసుకురావడంపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక్కో విభాగంలో ఒక్క పథకమే అంటూ సెబీ విధించిన పరిమితి కారణంగా.. ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, సెక్టోరల్ ఎన్‌ఎఫ్‌వోలపై ఏఎంసీలు ఎక్కువగా దృష్టి సారించాయి. నిజానికి యాక్టివ్‌గా పనిచేసే అధిక శాతం ఈక్విటీ ఫండ్స్‌లో రాబడులు గడిచిన ఏడాది, మూడేళ్ల కాలం లో సూచీలతో పోలిస్తే బలహీనంగానే ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు యాక్టివ్ ఫండ్స్ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉపసంహరణల ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ఇది కూడా ఒక కారణమే. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రారంభమైన ఎన్‌ఎఫ్‌వోలలో 75% ప్యాసివ్ ఫండ్సేనని ఇన్వెస్టర్లు గమనించాలి. కానీ, పదేళ్ల క్రితం దీనికి విరుద్ధ పరిస్థితి ఉంది. 2011లో వచ్చిన మొత్తం ఎన్‌ఎఫ్‌వోలలో 70% యాక్టివ్ మేనేజ్డ్ ఈక్విటీ పథకాలే. యాక్టివ్ ఫండ్స్ రాబడుల్లో వెనుకంజవేయడం.. అలాగే వాటిలో అధిక నిర్వహణ చార్జీల దష్ట్యా ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో కొన్ని ప్యాసివ్ ఫండ్స్‌కు అయినా చోటు ఇవ్వడం సముచితం. సీజన్ వారీ ఫండ్స్.. ప్రతీ మార్కెట్ సైకిల్లోనూ కొన్ని రంగాల స్టాక్స్ మంచి పనితీరు చూపిస్తుంటాయి. ఇటీవలి కాలంలో థ్యీమాటిక్, సెక్టోరల్ ఫండ్స్ (రంగాలవారీ) ఎన్‌ఎఫ్‌వోలు ఎక్కువగా రావడానికి సెబీ గతంలో తీసుకొచ్చిన మార్పులే కారణమని చెప్పుకోవాలి. ఒక ఏఎంసీ ఒక విభాగంలో ఒక్క పథకాన్నే నిర్వహించాల్సి ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్/ఈటీఎఫ్‌లు, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్), సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్‌కు ఈ పరిమితి లేదు. అందుకనే ఏఎంసీలు ఈ విభాగాల్లో ఎక్కువ ఎన్‌ఎఫ్‌వోలను తీసుకువస్తున్నాయి. కానీ, గత చరిత్రను గమనిస్తే.. సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ ఆయా రంగాలు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిధులు సమీకరించినవి.. ఆ తర్వాతి కాలంలో అధిక రాబడులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అలా కాకుండా ఆయా రంగాలు బూమ్‌లో ఉన్న సమయంలో వచ్చి నిధులను సమీకరించినట్టయితే.. అధిక వ్యాల్యూషన్ల వద్ద ఆయా రంగాల స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. దాంతో ఆ తర్వాతి కాలంలో మెరుగైన రాబడులకు దీర్ఘకాలం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు అమెరికా ఈక్విటీ ఆధారిత ఎన్‌ఎఫ్‌వోలు ప్రస్తుతం ఎక్కువగా వస్తున్నాయి. కానీ, అమెరికా మార్కెట్ల వ్యాల్యూషన్లు చారిత్రక గరిష్టాల వద్దనున్న విషయాన్ని గమనించాలి. అలాగే, 2004 నుంచి 2008 మధ్య కాలంలో ఇన్ఫ్రా కంపెనీలు భారీ ర్యాలీ చేశాయి. దాంతో ఆ సమయంలో 17 ఇన్ఫ్రా ఫండ్స్‌ను ఏఎంసీలు ఆవిష్కరించాయి. కానీ, నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే సగం ఫండ్స్‌లో రాబడులు ఇప్పటికీ వార్షికంగా 2–8 శాతాన్ని మించలేదు. అలాగే, గడిచిన ఐదేళ్ల కాలంలో 22 థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్ కొత్తగా మార్కెట్లలోకి రాగా.. ఇప్పటికీ వీటిల్లో మూడోవంతు నిఫ్టీ–50 రాబడులను మించి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాయి. రాబడులు ఎలా? ఈక్విటీ ఫండ్స్‌లో యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ అని రెండు రకాలు ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో స్టాక్స్ ఎంపిక ఫండ్ మేనేజర్ల పరిశోధన, వారి అంచనాల ఆధారంగా ఉంటాయి. కానీ ప్యాసివ్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్ల ఎంపిక ఏమీ ఉండదు. ఇండెక్స్ ఫండ్స్, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ప్యాసివ్ విభాగంలోకే వస్తాయి. ఉదాహరణకు నిఫ్టీ –50 ఫండ్ అన్నది నిఫ్టీ–50లో ఉండే స్టాక్స్‌లో వాటి వెయిటేజీ ఆధారంగా పెట్టుబడులను పెడుతుంది. రాబడులు కూడా నిఫ్టీ–50 పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి. కానీ, యాక్టివ్ ఫండ్స్‌లో రాబడులు ఇలా ఉండవు. ఫండ్ మేనేజర్ల ప్రతిభా పాటవాలపైనే ఆధారపడి ఉంటాయి. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు యాక్టివ్ ఫండ్స్‌నే ఎంపిక చేసుకోవడం రాబడుల కోణంలోనే. కానీ, గడిచిన ఐదేళ్ల కాలంలో వచ్చిన యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలను పరిశీలించినట్టయితే.. వాటి రాబడులు గడిచిన ఏడాది కాలంలో బెంచ్ మార్క్ కంటే తక్కువే ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. 79 శాతం పథకాల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఉదాహరణకు నూతనంగా మొదలైన స్మాల్‌క్యాప్ ఫండ్స్ చాలా వరకు గత ఏడాది కాలంలో ఇచ్చిన రాబడులు 56–78 శాతంగా ఉన్నాయి. కానీ, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీ టోటల్ రిటర్నులు 80 శాతంగా ఉండడాన్ని గమనించాలి. సూచీల కంటే రాబడులు తక్కువగా ఉన్నప్పుడు ప్యాసివ్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చుగా.. యాక్టివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు దండగ? అన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్యాసివ్ ఫండ్స్‌లో నిర్వహణ చార్జీలు యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే 80 శాతం వరకు తక్కువగా ఉంటాయి. మూడేళ్ల కాలంలో చూసుకుంటే ఎన్‌ఎఫ్‌వోల పనితీరు సూచీలతో పోలిస్తే తక్కువగానే ఉంది. మూడేళ్ల కాలంలో 70 శాతానికి పైగా యాక్టివ్ మేనేజ్డ్ ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలలో రాబడులు సూచీలకంటే తక్కువే ఉన్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో 63 ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోల డేటా అందుబాటులో ఉండగా.. వీటిల్లో సగం మేర బెంచ్‌మార్క్‌లతో పోలిస్తే రాబడుల్లో వెనుకబడే ఉన్నాయి. కనుక ఇప్పటికే మార్కెట్లలో దీర్ఘకాలంగా ఉండి, మంచి ట్రాక్ రికార్డు ఉన్న వాటితో పోలిస్తే ఎన్‌ఎఫ్‌వోలలో అధిక రాబడులు వస్తాయన్న అంచనాలతో ఇన్వెస్ట్ చేయడం అన్ని వేళలా సరైనది కాదని ఈ నిదర్శనాలు తెలియజేస్తున్నాయి. -
పీఎస్‌యూ ఫండ్స్‌కు దూరంగా ఉండండి
మూడు నెలల కాలానికి కొంత మొత్తన్ని ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను. లిక్విడ్ ఫండ్, షార్ట్ టెర్మ్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్- ఈ మూడింటిలో ఏది ఎంచుకోవాలో తెలియని డోలాయమాన పరిస్థితుల్లో ఉన్నాను. నా అంచనాల ప్రకారం.., 1.లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్(ఎస్టీసీజీ) ట్యాక్స్ 30 శాతం, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) 27 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 2. షార్ట్‌టెర్మ్ ఇన్కమ్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే ఎస్టీసీజీ 30 శాతం, డీటీటీ 13 శాతం చెల్లించాలి. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికొస్తే షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ మూడింటిపై ఒకే విధమైన రాబడి (8-9 శాతం)వచ్చే అవకాశాలున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమే ఉత్తమం అంటారా? -చైతన్య ప్రసాద్, విజయవాడ పన్నులకు సంబంధించి మీ అంచనాలు కరెక్టే. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి, షార్ట్‌టెర్మ్ గెయిన్స్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందనే అభిప్రాయంలో మీరున్నారు. ఇది సరికాదు. మీరు కనుక గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకుంటే క్యాపిటల్ గెయిన్స్ పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. డీడీటీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వేళ డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే డీడీటీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఎస్టీసీజీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే షార్ట్‌టెర్మ్ ఇన్‌కం ఫండ్‌లో డివిడెండ్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని చెప్పవచ్చు. ఇలా చేస్తే మీరు 13 శాతం డీడీటీ మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. ఎస్బీఐ పీఎస్‌యూ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి భారీగా నష్టపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? తగిన మార్గం సూచించండి? - అరవింద్, హైదరాబాద్ ప్రభుత్వ రంగంలో ఇన్వెస్ట్ చేయడమనేది సరైన ఆలోచన కాదని చెప్పవచ్చు. అనుభవమున్న ఇన్వెస్టరైతే పరిస్థితులను బట్టి తగిన మదుపువ్యూహంతో లాభాలు గడించే అవకాశాలుంటాయి. ప్రభుత్వ రంగ కంపెనీలకు సంబంధించి దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించినా లాభాలు రావడం అరుదైన విషయమే. ప్రభుత్వం పూర్తి స్థాయి వ్యాపార కంపెనీగా వ్యవహరించలేకపోవడమే దీనికి ప్రధాన కారణం.. డివిడెండ్లు, సబ్సిడీల రూపంలో పీఎస్‌యూల నుంచి వీలైనంత నిధులను పిండుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, ఒక ప్రత్యేకమైన పీఎస్‌యూ ఫండ్ ఉత్తమమైనదా? అధమమైనదా? అని ఇన్వెస్టర్లు ఆలోచించడం అనవసరం. మొత్తం మీద పీఎస్‌యూ స్టాక్స్ దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలమైనవి కావని చెప్పవచ్చు. అందుకని పీఎస్‌యూ ఫండ్స్‌కు దూరంగా ఉండడమే మేలు.. నిలకడైన రాబడులతో భారీ నిధిని ఏర్పాటు చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా డెట్ ఫండ్‌లో సిప్ విధానంలో 5 నుంచి 10 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను? అలా అయితే ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారు? - ప్రీతి, విశాఖపట్టణం, నిలకడైన రాబడుల కోసం సిప్ విధానంలో డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం మంచి నిర్ణయమే. అయితే పదేళ్ల కాలానికి సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడానికి డెట్ ఫండ్స్ కంటే ఈక్విటీ ఫండ్స్ ఉత్తమం. ఉదాహరణకు మీరొక డెట్ఫండ్లో పదేళ్ల పాటు సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, మీకు 8.86 శాతం వార్షిక రాబడులు వస్తాయి. ఇదే లార్జ్‌క్యాప్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 15.25 శాతం వార్షిక రాబడులు వచ్చే అవకాశాలున్నాయి. మీరు రిస్క్‌ను ఏమాత్రం భరించలేని వారైతే, మంచి రేటింగ్ ఉన్న డైనమిక్ బాండ్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టండి. వడ్డీరేట్లను బట్టి వివిధ మెచ్యూరిటీ కాల వ్యవధులున్న డెట్ ఇన్స్ట్రుమెంట్స్ల్లో ఈ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి. కొంచెం రిస్క్ తీసుకోగలిగితే, హైబ్రిడ్ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. లార్జ్ క్యాప్ ఫండ్స్‌తో పోల్చితే వీటిల్లో కొంచెం రిస్క్ తక్కువ. మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఏడేళ్ల కాలానికి 11.3 శాతం వార్షిక రాబడిని ఇస్తాయి.