మూడు నెలల కాలానికి కొంత మొత్తన్ని ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్నాను. లిక్విడ్ ఫండ్, షార్ట్ టెర్మ్ ఫండ్, ఫిక్స్‌డ్ డిపాజిట్- ఈ మూడింటిలో ఏది ఎంచుకోవాలో తెలియని డోలాయమాన పరిస్థితుల్లో ఉన్నాను. నా అంచనాల ప్రకారం..,
1.లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్(ఎస్‌టీసీజీ) ట్యాక్స్ 30 శాతం, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) 27 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
2. షార్ట్‌టెర్మ్ ఇన్‌కమ్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే ఎస్‌టీసీజీ 30 శాతం, డీటీటీ 13 శాతం చెల్లించాలి. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయానికొస్తే షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ మూడింటిపై ఒకే విధమైన రాబడి (8-9 శాతం)వచ్చే అవకాశాలున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడమే ఉత్తమం అంటారా? -చైతన్య ప్రసాద్, విజయవాడ
పన్నులకు సంబంధించి మీ అంచనాలు కరెక్టే. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి, షార్ట్‌టెర్మ్ గెయిన్స్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందనే అభిప్రాయంలో మీరున్నారు. ఇది సరికాదు. మీరు కనుక గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకుంటే క్యాపిటల్ గెయిన్స్ పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. డీడీటీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వేళ డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే డీడీటీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌టీసీజీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే షార్ట్‌టెర్మ్ ఇన్‌కం ఫండ్‌లో డివిడెండ్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని చెప్పవచ్చు. ఇలా చేస్తే మీరు 13 శాతం డీడీటీ మాత్రం చెల్లిస్తే సరిపోతుంది.
ఎస్‌బీఐ పీఎస్‌యూ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి భారీగా నష్టపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? తగిన మార్గం సూచించండి? - అరవింద్, హైదరాబాద్
ప్రభుత్వ రంగంలో ఇన్వెస్ట్ చేయడమనేది సరైన ఆలోచన కాదని చెప్పవచ్చు. అనుభవమున్న ఇన్వెస్టరైతే పరిస్థితులను బట్టి తగిన మదుపువ్యూహంతో లాభాలు గడించే అవకాశాలుంటాయి. ప్రభుత్వ రంగ కంపెనీలకు సంబంధించి దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించినా లాభాలు రావడం అరుదైన విషయమే. ప్రభుత్వం పూర్తి స్థాయి వ్యాపార కంపెనీగా వ్యవహరించలేకపోవడమే దీనికి ప్రధాన కారణం..
డివిడెండ్‌లు, సబ్సిడీల రూపంలో పీఎస్‌యూల నుంచి వీలైనంత నిధులను పిండుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, ఒక ప్రత్యేకమైన పీఎస్‌యూ ఫండ్ ఉత్తమమైనదా? అధమమైనదా? అని ఇన్వెస్టర్లు ఆలోచించడం అనవసరం. మొత్తం మీద పీఎస్‌యూ స్టాక్స్ దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలమైనవి కావని చెప్పవచ్చు.
అందుకని పీఎస్‌యూ ఫండ్స్‌కు దూరంగా ఉండడమే మేలు..
నిలకడైన రాబడులతో భారీ నిధిని ఏర్పాటు చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా డెట్ ఫండ్‌లో సిప్ విధానంలో 5 నుంచి 10 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను? అలా అయితే ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారు? - ప్రీతి, విశాఖపట్టణం,
నిలకడైన రాబడుల కోసం సిప్ విధానంలో డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం మంచి నిర్ణయమే. అయితే పదేళ్ల కాలానికి సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడానికి డెట్ ఫండ్స్ కంటే ఈక్విటీ ఫండ్స్ ఉత్తమం. ఉదాహరణకు మీరొక డెట్‌ఫండ్‌లో పదేళ్ల పాటు సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, మీకు 8.86 శాతం వార్షిక రాబడులు వస్తాయి. ఇదే లార్జ్‌క్యాప్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 15.25 శాతం వార్షిక రాబడులు వచ్చే అవకాశాలున్నాయి. మీరు రిస్క్‌ను ఏమాత్రం భరించలేని వారైతే, మంచి రేటింగ్ ఉన్న డైనమిక్ బాండ్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టండి.
వడ్డీరేట్లను బట్టి వివిధ మెచ్యూరిటీ కాల వ్యవధులున్న డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ల్లో ఈ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి. కొంచెం రిస్క్ తీసుకోగలిగితే, హైబ్రిడ్ లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. లార్జ్ క్యాప్ ఫండ్స్‌తో పోల్చితే వీటిల్లో కొంచెం రిస్క్ తక్కువ. మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ ఏడేళ్ల కాలానికి 11.3 శాతం వార్షిక రాబడిని ఇస్తాయి.
పీఎస్‌యూ ఫండ్స్‌కు దూరంగా ఉండండి
Published Mon, Feb 10 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement