ఆర్యన్ (60) క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేద్దామని బ్యాంక్‌కు వెళ్లాడు. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి (ఎఫ్‌డీ), దానిపై ప్రతి నెలా వడ్డీ రాబడి తీసుకోవాలన్నది ఆయన ప్రణాళిక. కానీ, బ్యాంక్ ఉద్యోగి చేసిన పనికి అతడు నష్టపోవాల్సి వచి్చంది. అనుకున్నది ఒకటి అయింది మరొకటి. ఎఫ్‌డీ పేరు చెప్పి బ్యాంక్ ఉద్యోగి ఆర్యన్‌తో యులిప్ పథకంపై సంతకం చేయించాడు. ఆ తర్వాతే అది ఎఫ్‌డీ కాదని అతడికి తెలిసొచ్చింది.
దీంతో క్రమం తప్పకుండా ఆదాయం పొందాలన్న అతడి ప్రణాళిక దారితప్పింది. ఇలా తప్పుదోవ పట్టించి బీమా పాలసీలు, పెట్టుబడి పథకాలను అంటగట్టే ప్రయత్నాలు సహజంగానే కనిపిస్తూనే ఉంటాయి. యస్ బ్యాంక్ కేసులోనూ ఇదే చోటు చేసుకుంది. ఏటీ–1 (అడిషనల్ టైర్) బాండ్లను ఎఫ్‌డీ పేరు చెప్పి లక్షలాది మంది నుండి పెట్టుబడులు సమీకరించింది. యస్ బ్యాంక్ సంక్షోభంలో పడినప్పుడు ఏటీ–1 బాండ్లను రైటాఫ్ చేసేశారు. అంటే పెట్టుబడి పెట్టిన వారికి రూపాయి ఇవ్వలేదు. ఎఫ్‌డీల్లో అధిక రాబడి ఇస్తుందని చెప్పారే కానీ, ఏటీ–1 బాండ్లలో ఉండే రిస్క్ గురించి చెప్పలేదు. మన దేశంలో పెట్టుబడి సాధనాలను మార్కెట్ చేసే వారు కేవలం రాబడులు, ఆకర్షణీయమైన ఫీచర్ల గురించే చెబుతుంటారు. ఆయా సాధనాల్లోని రిస్‌్క ల గురించి తెలుసుకోవడం ఇన్వెస్ట్ చేసే వారి బాధ్యత అని గుర్తించాలి.
బీమా పాలసీలను తప్పుడు సమాచారంతో విక్రయించే ధోరణులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో యులిప్‌లు కూడా ఒకటి. ‘‘ఇవి ఏజెంట్లకు ఎక్కువ కమీషన్‌ను అందిస్తాయి. దీంతో పాలసీ తీసుకునే వారికి గరిష్ట ప్రయోజనం కల్పించడానికి బదులు, ఏజెంట్‌కు ఎక్కువ ప్రయోజనం కలిగించే ఉత్పత్తి విక్రయానికి దారితీస్తుంది’’ అని ఆనంద్‌రాఠి వెల్త్ ప్రొడక్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ చేతన్ షెనాయ్ వివరించారు. ఎండోమెంట్ బీమా ప్లాన్లలో కమీషన్ మెదటి ఏడాది 10–35 శాతం మేర ఏజెంట్లకు అందుతుంది. యులిప్ ప్లాన్ల ప్రీమియంలో 10 శాతం ఏజెంట్ కమీషన్‌గా వెళుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్ రేషియో కేవలం 0.3–1.5 శాతం మధ్యే ఎక్కువ పథకాల్లో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పనిచేస్తాయంటూ యులిప్‌లను మార్కెట్ చేస్తుంటారు ఏజెంట్లు. కానీ, పూర్తిగా తెలుసుకోకుండా అంగీకారం తెలపకపోవడమే మంచిది.
యులిప్‌లు – మ్యూచువల్ ఫండ్స్
యులిప్‌లు, మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటి కావు. వీటి మధ్య సారూప్యత కొంత అయితే, వైరుధ్యాలు బోలెడు. యులిప్‌లు అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు. అంటే పెట్టుబడులతో ముడిపడిన బీమా పథకాలు. చెల్లించే ప్రీమియంలో కొంత బీమా కవరేజీకి పోను, మిగిలిన మొత్తాన్ని తీసుకెళ్లి ఈక్విటీ, డెట్ సాధనాల్లో (ఇన్వెస్టర్ ఎంపిక మేరకు) పెట్టుబడిగా పెడతారు. కనుక ఇందులో రిస్క్‌లు, రాబడుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. బీమా కంపెనీల ఫండ్ మేనేజర్లు యులిప్ పాలసీలకు సంబంధించిన పెట్టుబడులను మార్కెట్ లింక్డ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు.
యులిప్‌ల ప్లాన్లను మ్యూచువల్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో)గా కొందరు మార్కెట్ చేస్తుంటారు. నెట్ అసెట్ వేల్యూ (ఎన్‌ఏవీ)ని చూపిస్తుంటారు. యులిప్‌లను మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయం అంటూ విక్రయిస్తుంటారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ మాదిరే రాబడులు వస్తాయని కొనుగోలు చేసే వారూ ఉన్నారు. కానీ వాస్తవంలో మెరుగ్గా పనిచేసే యులిప్‌ల రాబడులను గమనించినప్పుడు.. మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువే ఉండడాన్ని చూడొచ్చు. దీనికి కారణం యులిప్‌లలో పలు రకాల చార్జీల పేరుతో పాలసీదారుల నుంచి బీమా సంస్థలు ఎక్కువ రాబట్టుకునే చర్యలు అమలు చేస్తుంటాయి.
సంక్లిష్టత.. పారదర్శకత
లిక్విడిటీ (కొనుగోలు, విక్రయాలకు కావాల్సినంత డిమాండ్), చార్జీలు అనేవి యులిప్‌లు, ఫండ్స్‌లో పూర్తిగా భిన్నం. యులిప్‌లు ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. ఫండ్స్ పెట్టుబడులను కోరుకున్నప్పుడు ఉపసంహరించుకోవచ్చు. యులిప్‌లలో విధించే చార్జీలు ఎక్కువగా ఉంటాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్ రేషియో సాధారణంగా అయితే 0.5–1.5 శాతం మధ్య ఉంటుంది. అదే యులిప్‌లలో 20 ఏళ్ల కాలానికి లోడింగ్ 60 శాతంగా ఉంటుంది. అంటే ఏటా 3 శాతం చార్జీల రూపంలో కోల్పోవాల్సి వస్తుంది’’ అని ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్ అనే ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ వ్యవస్థాపకుడు అనంత్ లోధా తెలిపారు. చార్జీల పరంగా సంక్లిష్టత ఇందులో కనిపిస్తుంది.
ప్రీమియం అలోకేషన్ చార్జీలు, మోరా్టలిటీ చార్జీలు, ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీలు, పాలసీ అడ్మిని్రస్టేటివ్ చార్జీలు, ఫండ్ స్విచింగ్ (ఫండ్‌ను మార్చుకున్నప్పుడు) చార్జీలు, పాక్షిక ఉపసంహరణ చార్జీలు, ప్రీమియం రీడైరెక్షన్ చార్జీలు, ప్రీమియం నిలిపివేత చార్జీలు.. ఇన్నేసీ చార్జీలు మరే పెట్టుబడి సాధనంలో కనిపించవు. యులిప్ ప్లాన్లను తీసుకున్న వారిలోనూ చాలా మందికి ఈ చార్జీల గురించి తెలియదు. ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీల గురించే ఎక్కువ మందికి తెలుసు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల నిర్వహణకు గాను ఎక్స్‌పెన్స్ రేషియో విధిస్తుంటారు. దీన్నే ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీగానూ భావించొచ్చు. యులిప్ ప్లాన్లలో దీర్ఘకాలంలో రాబడులు 7–9 శాతం మధ్య ఉంటాయి. కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో వార్షిక రాబడిని 12 శాతానికి పైనే ఆశించొచ్చు.
రాబడులపై గ్యారంటీ లేదు
మ్యూచువల్ ఫండ్స్ మాదిరే యులిప్‌లు సైతం రాబడికి హామీ ఇవ్వవు. వీటిల్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లపై ఆధారపడి ఉంటాయి. కాకపోతే దీర్ఘకాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే మెరుగైన రాబడి యులిప్‌లలో ఉంటుందని భావించొచ్చు. ఎందుకంటే ఇవి పెట్టుబడులను తీసుకెళ్లి ఈక్విటీల్లో పెడుతుంటాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. కనుక అన్ని రకాల చార్జీల పేరుతో బాదిన తర్వాత కూడా ఎఫ్‌డీ కంటే కొంచెం ఎక్కువ రాబడి యులిప్‌లలో ఉంటుంది. పైగా ఎఫ్‌డీ రాబడిపై పన్ను ఉంటుంది. యులిప్ మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. అందుకే బీమా ఏజెంట్లు ఎఫ్‌డీల కంటే మెరుగైనవిగా మార్కెట్ చేస్తుంటారు.
యులిప్ పెట్టుబడులను సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డెట్, ఈక్విటీ మధ్య మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ కూడా ఇదే పనిచేస్తుంటాయి. పన్ను పరిధిలో ఉన్న వారికి యులిప్‌లు అనుకూలమేనని చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిల్లో పెట్టుబడులు, రాబడులపైనా పన్ను ప్రయోజనాలు ఉండడమే. ‘బెనిఫిట్ ఇలి్రస్టేషన్’ (ఎంత రావచ్చన్న అంచనాలు)లో రాబడిని 4–8 శాతం మించి చూపించకూడదు. యులిప్‌లలోనూ కన్జర్వేటివ్, బ్యాలన్స్‌డ్, అగ్రెస్సివ్ ఫండ్స్ ఉంటాయి. వీటిల్లో రాబడి, రిస్క్ వేర్వేరు. ఏ ఫండ్ ఎంపిక చేసుకుంటున్నారన్నదాని ఆధారంగానే రాబడులు ఆధారపడి ఉంటాయి. అగ్రెసివ్ ఫండ్‌తో దీర్ఘకాలంలో రాబడి అధికంగా ఉంటుంది. రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ఆకర్షణలు కాదు.. అవసరాలు
కుటుంబ పెద్దకు అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకుంటుందనే మార్కెటింగ్ ప్రచారం కూడా యులిప్ ప్లాన్ల విషయంలో కనిపిస్తుంది. కానీ, ఇందులో వాస్తవం పాళ్లు కొంతే. ఎందుకంటే యులిప్ ప్లాన్లలో బీమా రక్షణ తగినంత ఉండదు. అచ్చమైన కవరేజీ కోసం అనువైనది టర్మ్ ఇన్సూరెన్స్. అలాగే, యులిప్‌లో చెల్లించే ప్రీమియం సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిధిలోకి వస్తుందని, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదని కూడా చెబుతారు. కానీ, 2021 ఫిబ్రవరి 1 తర్వాత కొనుగోలు చేసిన యులిప్ ప్లాన్లకు సంబంధించి అందుకునే మెచ్యూరిటీపై పన్ను ఉండకూడదని కోరుకుంటే, ప్రీమియం రూ.2.5 లక్షలు మించకూడదు.
మరీ ముఖ్యంగా యులిప్ ప్లాన్ల విషయంలో వృద్ధులను ఏజెంట్లు లక్ష్యంగా చేసుకోవడాన్ని గమనించొచ్చు. ఎందుకంటే వారికి వీటిపై తగినంత అవగాహన లేకపోవడమే. సింగిల్ ప్రీమియం పాలసీలు, గ్యారంటీడ్ ఇన్‌కమ్ (హామీతో కూడిన రాబడి) పాలసీల గురించి వృద్ధులు అడుగుతుంటారని, అవి వారి అవసరాలకు అనుకూలమైనవి కావని నిపుణుల సూచన. అలాగే, యులిప్ ప్లాన్లలో పెట్టుబడికి ఐదేళ్ల పాటు లాకిన్‌లో ఉంటుంది. దీన్ని కూడా వృద్ధులు గమనించాలి. సీనియర్ సిటిజన్లలో ఎక్కువ మందికి వారు చెల్లించే ప్రీమియానికి పది రెట్ల బీమా కవరేజీ ఇతర ప్లాన్లలో రాకపోవడం ఆకర్షణకు ఒక కారణం.
మార్గమేంటి..?
అది యులిప్ అయినా, ఎండోమెంట్ ప్లాన్ అయినా సరే బీమాను, పెట్టుబడిని కలపకూడదన్నది ప్రాథమిక సూత్రం. అచ్చమైన బీమా రక్షణ కోరుకుంటే అందుకు టర్మ్ ఇన్సూరెన్స్ మెరుగైన సాధనం. పెట్టుబడి కోసం ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఎన్నో ఉన్నాయి. అటు బీమా, ఇటు పెట్టుబడిపై గరిష్ట ప్రయోజనాన్ని పొందాలంటే వీటిని విడివిడిగానే తీసుకోవాలి. పన్ను ఆదా కోరుకునేట్టు అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కోరుకోవచ్చు. టర్మ్ ప్లాన్లలో గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనం అందదు. ఇక పెట్టుబడులపై పన్ను ఆదా కోరుకునే వారు ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు.
వీటిలో చేసే పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో సగటు రాబడి 15 శాతానికి పైనే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం.. ఈఎల్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చే రాబడిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. యులిప్‌లో అయితే మెచ్యూరిటీపైనా పన్ను మిహాయింపు ప్రయోజనం లభిస్తుంది. కానీ, ఈల్‌ఎస్‌ఎస్‌ఎస్‌లో అది లేదు. కాకపోతే యులిప్‌తో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ రాబడులు ఎంతో మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్షకు మించిన మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించిన తర్వాత కూడా నికర రాబడి, యులిప్‌లలో కంటే ఈఎల్‌ఎస్‌ఎస్ ప్లాన్లలో ఎక్కువే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. డెట్‌లో పీపీఎఫ్ సాధనంలో మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉండదు. ఇంత చెప్పినా, యులిప్ ప్లాన్ తీసుకుకోవడానికే మొగ్గు చూపేవారు.. బ్యాంకుల నుంచి కాకుండా నేరుగా బీమా సంస్థల నుంచి తీసుకోవడం వల్ల సరైన మార్గనిర్దేశం లభిస్తుందనేది నిపుణుల సూచన.
Comments
Please login to add a commentAdd a comment