Ulips
-
యులిప్.. లోతుగా తెలుసుకున్నాకే!
ఆర్యన్ (60) క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేద్దామని బ్యాంక్‌కు వెళ్లాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి (ఎఫ్డీ), దానిపై ప్రతి నెలా వడ్డీ రాబడి తీసుకోవాలన్నది ఆయన ప్రణాళిక. కానీ, బ్యాంక్ ఉద్యోగి చేసిన పనికి అతడు నష్టపోవాల్సి వచి్చంది. అనుకున్నది ఒకటి అయింది మరొకటి. ఎఫ్డీ పేరు చెప్పి బ్యాంక్ ఉద్యోగి ఆర్యన్‌తో యులిప్ పథకంపై సంతకం చేయించాడు. ఆ తర్వాతే అది ఎఫ్డీ కాదని అతడికి తెలిసొచ్చింది. దీంతో క్రమం తప్పకుండా ఆదాయం పొందాలన్న అతడి ప్రణాళిక దారితప్పింది. ఇలా తప్పుదోవ పట్టించి బీమా పాలసీలు, పెట్టుబడి పథకాలను అంటగట్టే ప్రయత్నాలు సహజంగానే కనిపిస్తూనే ఉంటాయి. యస్ బ్యాంక్ కేసులోనూ ఇదే చోటు చేసుకుంది. ఏటీ–1 (అడిషనల్ టైర్) బాండ్లను ఎఫ్డీ పేరు చెప్పి లక్షలాది మంది నుండి పెట్టుబడులు సమీకరించింది. యస్ బ్యాంక్ సంక్షోభంలో పడినప్పుడు ఏటీ–1 బాండ్లను రైటాఫ్ చేసేశారు. అంటే పెట్టుబడి పెట్టిన వారికి రూపాయి ఇవ్వలేదు. ఎఫ్‌డీల్లో అధిక రాబడి ఇస్తుందని చెప్పారే కానీ, ఏటీ–1 బాండ్లలో ఉండే రిస్క్ గురించి చెప్పలేదు. మన దేశంలో పెట్టుబడి సాధనాలను మార్కెట్ చేసే వారు కేవలం రాబడులు, ఆకర్షణీయమైన ఫీచర్ల గురించే చెబుతుంటారు. ఆయా సాధనాల్లోని రిస్్క ల గురించి తెలుసుకోవడం ఇన్వెస్ట్ చేసే వారి బాధ్యత అని గుర్తించాలి. బీమా పాలసీలను తప్పుడు సమాచారంతో విక్రయించే ధోరణులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో యులిప్‌లు కూడా ఒకటి. ‘‘ఇవి ఏజెంట్లకు ఎక్కువ కమీషన్‌ను అందిస్తాయి. దీంతో పాలసీ తీసుకునే వారికి గరిష్ట ప్రయోజనం కల్పించడానికి బదులు, ఏజెంట్‌కు ఎక్కువ ప్రయోజనం కలిగించే ఉత్పత్తి విక్రయానికి దారితీస్తుంది’’ అని ఆనంద్‌రాఠి వెల్త్ ప్రొడక్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ చేతన్ షెనాయ్ వివరించారు. ఎండోమెంట్ బీమా ప్లాన్లలో కమీషన్ మెదటి ఏడాది 10–35 శాతం మేర ఏజెంట్లకు అందుతుంది. యులిప్ ప్లాన్ల ప్రీమియంలో 10 శాతం ఏజెంట్ కమీషన్‌గా వెళుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో కేవలం 0.3–1.5 శాతం మధ్యే ఎక్కువ పథకాల్లో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పనిచేస్తాయంటూ యులిప్‌లను మార్కెట్ చేస్తుంటారు ఏజెంట్లు. కానీ, పూర్తిగా తెలుసుకోకుండా అంగీకారం తెలపకపోవడమే మంచిది. యులిప్‌లు – మ్యూచువల్ ఫండ్స్ యులిప్‌లు, మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటి కావు. వీటి మధ్య సారూప్యత కొంత అయితే, వైరుధ్యాలు బోలెడు. యులిప్‌లు అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు. అంటే పెట్టుబడులతో ముడిపడిన బీమా పథకాలు. చెల్లించే ప్రీమియంలో కొంత బీమా కవరేజీకి పోను, మిగిలిన మొత్తాన్ని తీసుకెళ్లి ఈక్విటీ, డెట్ సాధనాల్లో (ఇన్వెస్టర్ ఎంపిక మేరకు) పెట్టుబడిగా పెడతారు. కనుక ఇందులో రిస్క్‌లు, రాబడుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. బీమా కంపెనీల ఫండ్ మేనేజర్లు యులిప్ పాలసీలకు సంబంధించిన పెట్టుబడులను మార్కెట్ లింక్డ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. యులిప్‌ల ప్లాన్లను మ్యూచువల్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)గా కొందరు మార్కెట్ చేస్తుంటారు. నెట్ అసెట్ వేల్యూ (ఎన్ఏవీ)ని చూపిస్తుంటారు. యులిప్‌లను మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయం అంటూ విక్రయిస్తుంటారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ మాదిరే రాబడులు వస్తాయని కొనుగోలు చేసే వారూ ఉన్నారు. కానీ వాస్తవంలో మెరుగ్గా పనిచేసే యులిప్‌ల రాబడులను గమనించినప్పుడు.. మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువే ఉండడాన్ని చూడొచ్చు. దీనికి కారణం యులిప్‌లలో పలు రకాల చార్జీల పేరుతో పాలసీదారుల నుంచి బీమా సంస్థలు ఎక్కువ రాబట్టుకునే చర్యలు అమలు చేస్తుంటాయి. సంక్లిష్టత.. పారదర్శకత లిక్విడిటీ (కొనుగోలు, విక్రయాలకు కావాల్సినంత డిమాండ్), చార్జీలు అనేవి యులిప్‌లు, ఫండ్స్‌లో పూర్తిగా భిన్నం. యులిప్‌లు ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. ఫండ్స్ పెట్టుబడులను కోరుకున్నప్పుడు ఉపసంహరించుకోవచ్చు. యులిప్‌లలో విధించే చార్జీలు ఎక్కువగా ఉంటాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో సాధారణంగా అయితే 0.5–1.5 శాతం మధ్య ఉంటుంది. అదే యులిప్‌లలో 20 ఏళ్ల కాలానికి లోడింగ్ 60 శాతంగా ఉంటుంది. అంటే ఏటా 3 శాతం చార్జీల రూపంలో కోల్పోవాల్సి వస్తుంది’’ అని ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్ అనే ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ వ్యవస్థాపకుడు అనంత్ లోధా తెలిపారు. చార్జీల పరంగా సంక్లిష్టత ఇందులో కనిపిస్తుంది. ప్రీమియం అలోకేషన్ చార్జీలు, మోరా్టలిటీ చార్జీలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు, పాలసీ అడ్మిని్రస్టేటివ్ చార్జీలు, ఫండ్ స్విచింగ్ (ఫండ్‌ను మార్చుకున్నప్పుడు) చార్జీలు, పాక్షిక ఉపసంహరణ చార్జీలు, ప్రీమియం రీడైరెక్షన్ చార్జీలు, ప్రీమియం నిలిపివేత చార్జీలు.. ఇన్నేసీ చార్జీలు మరే పెట్టుబడి సాధనంలో కనిపించవు. యులిప్ ప్లాన్లను తీసుకున్న వారిలోనూ చాలా మందికి ఈ చార్జీల గురించి తెలియదు. ఫండ్ మేనేజ్మెంట్ చార్జీల గురించే ఎక్కువ మందికి తెలుసు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల నిర్వహణకు గాను ఎక్స్పెన్స్ రేషియో విధిస్తుంటారు. దీన్నే ఫండ్ మేనేజ్మెంట్ చార్జీగానూ భావించొచ్చు. యులిప్ ప్లాన్లలో దీర్ఘకాలంలో రాబడులు 7–9 శాతం మధ్య ఉంటాయి. కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో వార్షిక రాబడిని 12 శాతానికి పైనే ఆశించొచ్చు. రాబడులపై గ్యారంటీ లేదు మ్యూచువల్ ఫండ్స్ మాదిరే యులిప్‌లు సైతం రాబడికి హామీ ఇవ్వవు. వీటిల్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లపై ఆధారపడి ఉంటాయి. కాకపోతే దీర్ఘకాలంలో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే మెరుగైన రాబడి యులిప్‌లలో ఉంటుందని భావించొచ్చు. ఎందుకంటే ఇవి పెట్టుబడులను తీసుకెళ్లి ఈక్విటీల్లో పెడుతుంటాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. కనుక అన్ని రకాల చార్జీల పేరుతో బాదిన తర్వాత కూడా ఎఫ్డీ కంటే కొంచెం ఎక్కువ రాబడి యులిప్‌లలో ఉంటుంది. పైగా ఎఫ్డీ రాబడిపై పన్ను ఉంటుంది. యులిప్ మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. అందుకే బీమా ఏజెంట్లు ఎఫ్‌డీల కంటే మెరుగైనవిగా మార్కెట్ చేస్తుంటారు. యులిప్ పెట్టుబడులను సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డెట్, ఈక్విటీ మధ్య మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ కూడా ఇదే పనిచేస్తుంటాయి. పన్ను పరిధిలో ఉన్న వారికి యులిప్‌లు అనుకూలమేనని చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిల్లో పెట్టుబడులు, రాబడులపైనా పన్ను ప్రయోజనాలు ఉండడమే. ‘బెనిఫిట్ ఇలి్రస్టేషన్’ (ఎంత రావచ్చన్న అంచనాలు)లో రాబడిని 4–8 శాతం మించి చూపించకూడదు. యులిప్లలోనూ కన్జర్వేటివ్, బ్యాలన్స్డ్, అగ్రెస్సివ్ ఫండ్స్ ఉంటాయి. వీటిల్లో రాబడి, రిస్క్ వేర్వేరు. ఏ ఫండ్ ఎంపిక చేసుకుంటున్నారన్నదాని ఆధారంగానే రాబడులు ఆధారపడి ఉంటాయి. అగ్రెసివ్ ఫండ్‌తో దీర్ఘకాలంలో రాబడి అధికంగా ఉంటుంది. రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణలు కాదు.. అవసరాలు కుటుంబ పెద్దకు అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకుంటుందనే మార్కెటింగ్ ప్రచారం కూడా యులిప్ ప్లాన్ల విషయంలో కనిపిస్తుంది. కానీ, ఇందులో వాస్తవం పాళ్లు కొంతే. ఎందుకంటే యులిప్ ప్లాన్లలో బీమా రక్షణ తగినంత ఉండదు. అచ్చమైన కవరేజీ కోసం అనువైనది టర్మ్ ఇన్సూరెన్స్. అలాగే, యులిప్‌లో చెల్లించే ప్రీమియం సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిధిలోకి వస్తుందని, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదని కూడా చెబుతారు. కానీ, 2021 ఫిబ్రవరి 1 తర్వాత కొనుగోలు చేసిన యులిప్ ప్లాన్లకు సంబంధించి అందుకునే మెచ్యూరిటీపై పన్ను ఉండకూడదని కోరుకుంటే, ప్రీమియం రూ.2.5 లక్షలు మించకూడదు. మరీ ముఖ్యంగా యులిప్ ప్లాన్ల విషయంలో వృద్ధులను ఏజెంట్లు లక్ష్యంగా చేసుకోవడాన్ని గమనించొచ్చు. ఎందుకంటే వారికి వీటిపై తగినంత అవగాహన లేకపోవడమే. సింగిల్ ప్రీమియం పాలసీలు, గ్యారంటీడ్ ఇన్కమ్ (హామీతో కూడిన రాబడి) పాలసీల గురించి వృద్ధులు అడుగుతుంటారని, అవి వారి అవసరాలకు అనుకూలమైనవి కావని నిపుణుల సూచన. అలాగే, యులిప్ ప్లాన్లలో పెట్టుబడికి ఐదేళ్ల పాటు లాకిన్‌లో ఉంటుంది. దీన్ని కూడా వృద్ధులు గమనించాలి. సీనియర్ సిటిజన్లలో ఎక్కువ మందికి వారు చెల్లించే ప్రీమియానికి పది రెట్ల బీమా కవరేజీ ఇతర ప్లాన్లలో రాకపోవడం ఆకర్షణకు ఒక కారణం. మార్గమేంటి..? అది యులిప్ అయినా, ఎండోమెంట్ ప్లాన్ అయినా సరే బీమాను, పెట్టుబడిని కలపకూడదన్నది ప్రాథమిక సూత్రం. అచ్చమైన బీమా రక్షణ కోరుకుంటే అందుకు టర్మ్ ఇన్సూరెన్స్ మెరుగైన సాధనం. పెట్టుబడి కోసం ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఎన్నో ఉన్నాయి. అటు బీమా, ఇటు పెట్టుబడిపై గరిష్ట ప్రయోజనాన్ని పొందాలంటే వీటిని విడివిడిగానే తీసుకోవాలి. పన్ను ఆదా కోరుకునేట్టు అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కోరుకోవచ్చు. టర్మ్ ప్లాన్లలో గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనం అందదు. ఇక పెట్టుబడులపై పన్ను ఆదా కోరుకునే వారు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిలో చేసే పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో సగటు రాబడి 15 శాతానికి పైనే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం.. ఈఎల్ఎస్ఎస్ నుంచి వచ్చే రాబడిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. యులిప్‌లో అయితే మెచ్యూరిటీపైనా పన్ను మిహాయింపు ప్రయోజనం లభిస్తుంది. కానీ, ఈల్ఎస్ఎస్ఎస్లో అది లేదు. కాకపోతే యులిప్తో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ రాబడులు ఎంతో మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్షకు మించిన మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించిన తర్వాత కూడా నికర రాబడి, యులిప్‌లలో కంటే ఈఎల్ఎస్ఎస్ ప్లాన్లలో ఎక్కువే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. డెట్‌లో పీపీఎఫ్ సాధనంలో మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉండదు. ఇంత చెప్పినా, యులిప్ ప్లాన్ తీసుకుకోవడానికే మొగ్గు చూపేవారు.. బ్యాంకుల నుంచి కాకుండా నేరుగా బీమా సంస్థల నుంచి తీసుకోవడం వల్ల సరైన మార్గనిర్దేశం లభిస్తుందనేది నిపుణుల సూచన. -
మ్యాక్స్‌లైఫ్ మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఫండ్
మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యులిప్ పాలసీదారుల కోసం ‘మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఇండెక్స్ ఫండ్’ను ప్రారంభించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 మూమెంటమ్ 50 ఇండెక్స్‌ను అనుసరించి ఇది పెట్టుబడులు పెడుతుంటుంది. అంటే ఇండెక్స్‌లోని స్టాక్స్‌లోనే వెయిటేజీ ఆధారంగా పెట్టుబడులు పెడుతుంది. కనుక దీన్ని ఇండెక్స్ ఫండ్‌గా పరిగణించొచ్చు. ఈ ఇండెక్స్ రాబడులు ఐదేళ్లలో ఏటా 28.7 శాతం, పదేళ్లలో ఏటా 26.7 శాతంగా ఉన్నట్టు మ్యాక్స్‌లైఫ్ ప్రకటించింది. ఈ నెల 29వ తేదీ వరకు ఈ నూతన ఫండ్‌లో పాల్గొనవచ్చని పేర్కొంది. ఇండెక్స్‌లోని స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెడుతుంది కనుక రాబడులు కూడా దానినే ప్రతిఫలించే మాదిరిగా ఉంటాయని ఆశించొచ్చు. ఒక యూనిట్ ఎన్ఏవీ రూ.10. మిడ్‌క్యాప్ విభాగంలో వ్యూహాత్మక పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చని మ్యాక్స్‌లైఫ్ పేర్కొంది. -
పన్ను భారం తగ్గించుకోవాలంటే..
వేతన జీవులకు ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు గణనీయంగా పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి. పాత పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకపోగా, అందుబాటులోని అన్ని మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలను వినియోగించుకుంటే మరో రూ.5 లక్షల ఆదాయంపైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే తమ ఆదాయం, పన్ను బాధ్యతలకు అనుగుణంగా ప్రణాళిక వేసుకుని, పెట్టుబడులు చేసుకోవడం మెరుగైన మార్గం. కానీ, చాలా మందికి ఇది ఆచరణలో అసాధ్యంగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం చివరిలోనే పన్ను ఆదా బాధ్యతలపై ఎక్కువ మంది దృష్టి సారిస్తుంటారు. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న సాధనాలపై కథనం ఇది. ఏడాది చివర్లో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు, హడావిడిగా చేసే పెట్టుబడుల్లో తప్పులకు చోటు ఇవ్వకూడదు. అదే సమయంలో పన్ను ఆదా ఒక్కటే ప్రామాణిక అంశం కూడా కాకూడదు. ఒకవైపు పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇస్తూనే, మరోవైపు చేసిన పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని కూడా అందించేలా ఉండాలి. పైగా మనలో కొందరు చిన్న వయసులో ఉంటారు. మరికొందరు మధ్య వయసులో, కొందరు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉండొచ్చు. కొందరి ఆర్జన మెరుగ్గా, కొందరి ఆర్జన మధ్యస్థంగా, తక్కువగాను ఉండొచ్చు. ఆదాయానికి అనుగుణంగా తీసుకునే రిస్క్ సామర్థ్యం మారిపోతుంటుంది. ఉదాహరణకు ఈఎల్ఎస్ఎస్ అన్నది సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పన్ను సాధనాల్లో ఒకటి. అచ్చం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈ సాధనంలో పెట్టుబడులపై రాబడి దీర్ఘకాలంలో ఏటా 12 శాతానికి పైనే లభిస్తుంది. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన తర్వాత లిక్విడిటీ సమస్యే ఉండదు. కానీ, కొందరికి ఈక్విటీలు నచ్చకపోవచ్చు. కొందరికి పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించడం ఇష్టం లేకపోవచ్చు. అందుకనే అందుబాటులో సాధనా లు, వాటి మంచి చెడులను అర్థం చేసుకుంటే, ఇన్వెస్టర్లు తమకు నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. ఎన్పీఎస్– మూడు ప్రయోజనాలు ఇందులో రాబడులు గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షికంగా 8–11 శాతం మధ్య ఉన్నాయి. ఇందులో చేసే పెట్టుబడులు రిటైర్మెంట్ వరకు లాకిన్లోనే ఉంటాయి. డెట్ నుంచి ఈక్విటీ, ఈక్విటీ నుంచి డెట్‌కు అలోకేషన్‌ను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఎన్పీఎస్కు సంబంధించి మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇందులో ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 మొత్తంపై అదనపు పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. ఉద్యోగి మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని ఎన్పీఎస్కు కంపెనీలు జమ చేస్తే, ఆ మొత్తంపైనా పన్ను ఉండదు. సెక్షన్ 80సీసీడీ (2) కింద ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కనుక ఎన్పీఎస్ ఇచ్చే ప్రయోజనాలతను వేరొక సాధనంతో పోల్చడం సరికాదు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ (గిల్ట్ ఫండ్స్) అనే మూడు కేటగిరీలు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు. మిగిలిన రెండింటిలో నూరు శాతం కేటాయింపులకు అనుమతి ఉంది. మూడింటి మధ్య తమ రిస్క్‌స్థాయిని బట్టి కేటాయింపుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు సార్లు ఇలా చేసుకునేందుకు అనుమతి ఉంది. పనితీరు నచ్చకపోతే ఫండ్ మేనేజర్లను కూడా మార్చుకోవచ్చు. మార్కెట్ల పట్ల అవగాహన ఉన్న వారికి ఇది అనుకూలమైన టూల్. వీటికి అదనంగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ విభాగం కూడా ఉంది. జీవిత బీమా పథకాలు జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి దీర్ఘకాలానికి 5 శాతంగా ఉంటుంది. పన్ను ఆదా కోసం ఇది మెరుగైన ఎంపిక కాదు. దీనికంటే కూడా యులిప్‌లు మెరుగైనవి. లేదంటే ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. బీమా ఎండోమెంట్ ప్లాన్లలో జీవిత బీమా కవరేజీ కూడా చెల్లించే ప్రీమియానికి నామమాత్రంగానే ఉంటుంది. రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ రూ.12,0000 ప్రీమియానికి వస్తుంది. కానీ, ఎండోమెంట్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీ కావాలంటే ఏటా రూ.4–5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. జీవితానికి రక్షణ కోణంలోనే బీమా ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఎన్ఎస్సీ, పన్ను ఆదా ఎఫ్డీలు ఎన్ఎస్సీలను పోస్టాఫీసు నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. పన్ను ఆదా ఎఫ్డీని బ్యాంకుల్లో తీసుకోవచ్చు. రెండింటిలోనూ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై డీసీబీ బ్యాంక్ అత్యధికంగా 8.10 శాతం రేటును ఆఫర్ చేస్తుంటే, యాక్సిస్ బ్యాంక్ రూ.7.75 శాతం ఇస్తోంది. మిగిలిన బ్యాంకుల్లో 6.70 శాతం నుంచి 7.50 శాతం మధ్య రేట్లు ఉన్నాయి. పన్ను ఆదా ఎఫ్డీ అంటే పెట్టుబడిపైనే. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎన్ఎస్సీ కేవలం పోస్టాఫీసులోనే కొనుగోలు చేసుకోగలరు. దీంతో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీని బ్యాంకుల్లో ప్రారంభించడం, క్లోజ్ చేసుకోవడం సులభం. కొన్ని బ్యాంక్‌లు ఆన్‌లైన్‌లోనూ ఆఫర్ చేస్తున్నాయి. ఎన్ఎస్సీలో ప్రస్తుతం 7 శాతం రేటు అమల్లో ఉంది. ఎన్ఎస్సీలో పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. యులిప్‌లు యులిప్‌లలో గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 8–9 శాతం మధ్య ఉంది. యులిప్ అన్నది ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే బీమా సాధనం. బీమా సంస్థలు ఒకవైపు పాలసీదారులకు బీమా రక్షణ ఇస్తూ.. మరోవైపు ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి, వచ్చిన రాబడిని పంచుతాయి. యులిప్లోనూ ఎన్‌పీఎస్‌లో మాదిరే ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపులను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఇలా మార్చుకుంటే పన్ను కట్టక్కర్లేదు. ఈక్విటీల విలువలు గరిష్టాలకు చేరినప్పుడు డెట్‌కు మారి, మార్కెట్లు దిద్దుబాటుకు గురైనప్పుడు తిరిగి ఈక్విటీల్లోకి పెట్టుబడులను మళ్లించుకోవచ్చు. రాబడులపై పన్ను లేకపోవడం మరో ఆకర్షణీయ అంశం. యులిప్‌లో పెట్టుబడులపై ఐదేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. ఆ తర్వాత కోరుకున్నప్పుడు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో మాదిరి ఇందులో ఫండ్ మేనేజర్‌ను మార్చుకోవడానికి అవకాశం లేదు. యులిప్‌ను జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకోవచ్చు. వార్షిక పెట్టుబడితో పోలిస్తే జీవిత బీమా కవరేజీ కనీసం 10 రెట్లు ఉంటే సెక్షన్ 10(10డీ) కింద మెచ్యూరిటీ సమయంలో తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇది ఐదేళ్ల పథకం. తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు ప్రస్తుతం 8 శాతంగా ఉంది. 60 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి (త్రైమాసికం ఆరంభంలో) ఆదాయం అందుకునేందుకు ఇది అనుకూలం. ఇందులో పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కాకపోతే 60 ఏళ్లు నిండిన వారికి ఏటా రూ.50 వేల వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు అమల్లో ఉంది. అంటే ఈ పథకంలో రూ.6.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఏడాదిలో రూ.50,000 పన్ను లేని ఆదాయం అందుకోవచ్చు. వార్షికాదాయం రూ.50వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తారు. పీపీఎఫ్ ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. పెట్టుబడులు 15 ఏళ్ల పాటు లాకిన్‌లో ఉంటాయి. పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణ ఇలా ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని సాధనం ఇది. కనుక స్థిరాదాయ పథకాలతో పోలిస్తే మెరుగైనది. బ్యాంక్ ఎఫ్‌డీలపైనా ఇంతే వడ్డీ రేటు లభిస్తున్నప్పటికీ, అది పన్ను పరిధిలోకి వస్తుంది. పీపీఎఫ్‌ను అన్ని ప్రభుత్వరంగ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల్లో ప్రారంభించొచ్చు. పోస్టాఫీసులోనూ దీన్ని తెరవొచ్చు. బ్యాంకుల్లో మరింత సౌకర్యంగా ఉంటుంది. సొంత ఖాతా నుంచే పీపీఎఫ్ కంట్రిబ్యూషన్ బదిలీ చేసుకోవచ్చు. కోరుకున్నప్పుడు ఈ–స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఆరో ఏట తర్వాత పాక్షిక ఉపంసహరణకు అనుమతి ఉంటుంది. నాలుగో ఏడాది చివరి నాటికి ఉన్న బ్యాలన్స్నుంచి సగం తీసుకోవచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. మూడో ఏట నుంచి ఆరో ఏట వరకు బ్యాలన్స్‌పై రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుత వడ్డీ 7.6%. కుమార్తెల పేరిట ప్రారంభించి, పెట్టుబడులు పెట్టుకునే పథకం ఇది. వారికి 18 ఏళ్లు వచ్చే వరకు దీన్ని కొనసాగించుకోవచ్చు. పదేళ్లలోపు ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఏటా రూ.1.50 లక్షల పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. గడువు ముగిసిన తర్వాత తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. ఈ పథకంలో వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటుంది. బ్యాంకు శాఖలు, తపాలా కార్యాలయాల్లో ప్రారంభించుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని తెరుచుకునేందుకు అనుమతి ఉంది. ఇద్దరి పేరిట ఖాతాలు తెరిచినా సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలకే పన్ను మినహాయింపు కోరగలరు. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో గత మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడులు 7–13 శాతం మధ్య ఉన్నాయి. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను సైతం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు పెట్టుబడుల్లో 40 శాతాన్ని ఈక్విటీలకు, 55–60 శాతాన్ని డెట్ సాధనాలకు కేటాయిస్తుంటాయి. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఫండ్ ఇందుకు ఉదాహరణలు. వీటిల్లో రిస్క్ తక్కువ. తక్కువ రిస్క్ ఉండాలని కోరుకునే ఇన్వెస్టర్లు రిటైర్మెంట్ కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. రాబడి మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తే, డెట్ ఫండ్స్ మాదిరిగా లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించొచ్చు. -
ఈ ఆర్థిక అలవాట్లకు దూరం..!
జీవన ప్రయాణంలో ఆర్థిక ఇబ్బందులు పడకూడదనుకుంటే అందుకు పక్కా ప్రణాళిక, క్రమశిక్షణ, మంచి అలవాట్లు కూడా అవసరం అవుతాయి. ముఖ్యంగా కొన్ని అలవాట్లు ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపించేవి అయి ఉంటాయి. ఓ ఇన్వెస్టర్‌గా వాటిని దూరం పెట్టడం ద్వారా మీ ప్రయాణం సాఫీగా కొనసాగేలా చూసుకోవచ్చు. ఎక్కువ పొదుపు, తక్కువ ఖర్చు, అనవసర రుణాలకు దూరంగా ఉండడం అన్నవి మంచి అలవాట్లు. ఈ అలవాట్లు వ్యక్తిని ఆరి్థకంగా సౌకర్యంగా ఉంచుతాయి. ఆర్థికపరమైన విజ్ఞానం ఉన్నవారు సైతం కొన్ని తప్పిదాల వల్ల ఆరి్థకంగా ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆర్థికంగా దూరంగా ఉంచాల్సిన అలవాట్లపై అవగాహన కలి్పంచడమే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం... స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచి అలవాటే. కానీ, షేర్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపించే వారు చాలా మందే ఉన్నారు. అయితే, వీరిలో తగినంత పరిశోధన, అధ్యయనం చేసి ఇన్వెస్ట్ చేసే వారు చాలా చాలా తక్కువ. ఇటీవలి మార్కెట్ పతనం చాలా మంది చిన్న ఇన్వెస్టర్లను కుదిపేసిందనే చెప్పుకోవాలి. చాలా స్టాక్స్ ఇటీవలి బడ్జెట్ తర్వాత నూతన 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. డీహెచ్ఎఫ్ఎల్ ఏడాది క్రితం రూ.600పైన పలికింది. ప్రస్తుత ధర రూ.48.65. అంటే దాదాపు 92 శాతం మేర విలువ తుడిచిపెట్టుకుపోయింది. కానీ, ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఈ స్థాయి నష్టాలేమీ లేవు. స్టాక్ మార్కెట్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ కూడా క్షీణించడం సహజమే. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు పెట్టుబడుల విషయంలో వైవిధ్యాన్ని పాటించడం వల్ల నష్టాలు పరిమితంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ చెత్త పనితీరు చూపించిన పథకాలు కూడా... బీఎస్ఈ 100లోని ఎక్కువగా నష్టపోయిన షేర్ల కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడంతోపాటు, కొంత మేర మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాడు. ఫండ్స్‌లో ఆయనకు సగటు రాబడులు 8 శాతంగా ఉంటే, స్టాక్స్‌లో ఆయన నష్టాలు భారీగా పేరుకుపోయాయి. 50 శాతంపైన నష్టాల పాలయ్యాడు. అందుకే నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి ఎంతో అవగాహన, అధ్యయనం, విస్తృత పరిజ్ఞానం అవసరం. ఈ విషయాన్నే చాలా మంది ఇన్వెస్టర్లు విస్మరిస్తుంటారు. ఎంచుకునే కంపెనీల విషయంలో తాము సొంతంగా అధ్యయనం చేసి నిర్ధారించుకోలేని వారు, నిపుణుల సలహాలను పొందొచ్చు. లేదంటే మంచి ట్రాక్ రికార్డు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం నయం. అధ్యయనం లేకుండా ముందడుగు మన దేశంలో చిగురిస్తున్న స్టార్టప్‌లలో 90 శాతానికి పైగా ప్రారంభించిన ఐదేళ్లలోపే మూతపడుతున్నాయని ఐబీఎం నిర్వహించిన ఓ సర్వేలో తెలిసింది. సావన్ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి 2011లో ఓ వెంచర్‌ను ఆరంభించాడు. రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. క్రమంగా దాన్ని విస్తరించాలన్నది ప్రణాళిక. కానీ న్యాయపరమైన, నియంత్రణపరమైన అవరోధాలతో 2014లోనే దాన్ని ఆపేయాల్సి వచి్చంది. అయితే, ఇది అతడి జీవన ప్రణాళికలపైనా పడింది. వ్యాపారంలో నష్టపోవడమే కాకుండా, ఇంటి రుణం, పర్సనల్ లోన్, పిల్లల విద్య అవసరాల కోసం చేస్తున్న పెట్టుబడుల ప్రణాళికలకు విఘాతం కలిగింది. తిరిగి మరలా ఉద్యోగంలో చేరేందుకు ఏడాది సమయం పట్టింది. తన సొంత కాళ్లపై నిలబడాలని చాలా మందికి ఉండొచ్చు. తానో ఎంట్రప్రెన్యూర్‌గా మారాలన్న అభిలాష ఉండొచ్చు. కానీ, ఆ దిశగా అడుగులు వేసేందుకు సమగ్ర సన్నద్ధత అవసరం. ఇలా సొంత ప్రయత్నాలు ఆరంభించడానికి ముందుగానే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలి. పన్ను ఆదా కోసం బీమా మన దేశంలో ఏటా కోట్లాది రూపాయలను అవసరం లేని బీమా ప్లాన్లపై వెచి్చస్తున్న విషయం తెలుసా..? బీమాలో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపు, జీవితానికి బీమా రక్షణ, గడువు తీరిన తర్వాత వచ్చే మొత్తంపై పన్ను లేకపోవడం... ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న ట్రిపుల్ బెనిఫిట్. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీల్లో పన్ను ఆదా ఒక్క ప్రయోజనం తప్పించి... నిజానికి సరిపడా బీమా రక్షణను అవి ఇవ్వలేవు. అంతేకాదు సరైన రాబడులను కూడా ఇవ్వవు. మీరు చెల్లించే ప్రీమియంలో సగ భాగం బీమా రక్షణ ఖర్చులకే పోతుంది. మిగిలిన పెట్టుబడులపై వచ్చే రాబడి చూసుకుంటే మొత్తంమీద రాబడి రేటు 5 శాతం దాటదు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడిన యులిప్‌లు రాబడుల విషయంలో కొంచెం మెరుగైనవే. కానీ వీటిల్లో చార్జీలు, ఫీజులు, రాబడుల విషయంలో పారదర్శకత తక్కువ. బీమా పాలసీల్లో ప్రధానమైనది దురదృష్టవశాత్తూ మరణం చోటు చేసుకుంటే, ఆ కుటుంబ ఆర్థిక అవసరాను గట్టె క్కించేది అయి ఉండాలి. కానీ, సంప్రదాయ పాలసీల్లో ఇదే ఆఖరు ప్రాధాన్యంగా ఉంటుందన్న నిజాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ఎక్కువ మంది చూస్తున్నది పన్ను ఆదానే. ఇదే పాలసీలను మార్కెట్ చేసే వారికి ఆయుధంగా మారుతోంది. 63 ఏళ్ల రాజారావు ఓ పెన్షనర్. మూడేళ్ల క్రితం ఆయనొక యులిప్ పాలసీ తీసుకున్నారు. రాజారావు పదవీ విరమణ డబ్బులు ఆయన బ్యాంకు ఖాతాలో జమ అయిన వెంటనే, బ్యాంకు ఉద్యోగి ఆయనకు యులిప్ పాలసీ అంటగడ్డాడు. దీనివల్ల పన్ను ఆదా చేసుకోవచ్చన్న బ్యాంకు ఉద్యోగి మాటలను నమ్మి యులిప్ పాలసీని రాజారావు తీసుకున్నాడు. మూడేళ్లలో ఇందులో రూ.4.5 లక్షలు పెడితే, మూడేళ్ల తర్వాత ఆయన పెట్టుబడి విలువ రూ.4 లక్షలుగానే కనిపిస్తోంది. ఫండ్ విలువ కోలుకునే వరకూ వేచి చూడాలని బ్యాంకు ఉద్యోగులు చెబుతున్నారంటూ రాజారావు పేర్కొన్నారు. నిజానికి సీనియర్ సిటిజన్ అయిన రాజారావుకు యులిప్ పాలసీ అవసరమే లేదు. ఎందుకంటే మార్కెట్ లింక్డ్ పాలసీ అది. దీనికి బదులు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనుకూలం. వైవిధ్యం ఎక్కువైతే... పెట్టుబడులకు వైవిధ్యం అన్నది ప్రాణం అవుతుంది. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ నూరు శాతం ఉంటుంది. కానీ, ఈ పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య డెవర్సిఫై చేయడం వల్ల రిస్‌్కను వేరు చేసినట్టు అవుతుంది. కానీ, వైవిధ్యం శ్రుతిమించకూడదు. ఆప్పుడే ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. రిస్క్ తగ్గించుకోవాలని లెక్కకు మించిన చోట ఇన్వెస్ట్ చేయడం అనుకున్న ప్రయోజనాలను ఇవ్వదు. మోడల్ పోర్ట్‌ఫోలియో అంటే... వివిధ రంగాలకు చెందిన స్టాక్స్ 15–20 మించకుండా చూసుకోవడం. ఇది రిస్‌్కను తగ్గిస్తుంది. ఈ వైవిధ్యం పెట్టుబడుల రిస్‌్కను ఎన్నో సెక్యూరిటీల మధ్య పంచుతుంది. అలా అని పదుల సంఖ్యలో చాంతాడంత స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ ఇంకా తగ్గుతుందని అనుకుంటే అది నిజం కాబోదు. ఇదే సూత్రం మ్యూచువల్ ఫండ్స్‌కూ అమలవుతుంది. సెక్టార్ ఫండ్స్ (థీమ్యాటిక్) మినహా మిగిలిన ఈక్విటీ ఫండ్స్‌లో వైవిధ్యం అన్నది సహజంగానే ఉంటుంది. ఎందుకంటే ఫండ్ మేనేజర్లు, భిన్న రంగాలకు చెందిన కంపెనీలను, అలాగే స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలను పోర్ట్‌ఫోలియో కోసం ఎంచుకుంటారు. కనుక తమ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ ఫండ్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అధిక సంఖ్యలో పథకాలను ఎంచుకున్నారనుకోండి... ఆయా పథకాలు ఒకే తరహా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తగ్గకపోగా, పెరుగుతుంది. నెలకు రూ.5,000–20,000 మధ్య ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే మహా అయితే నాలుగు పథకాలు సరిపోతాయి. 40 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కోసం, 30 శాతం మల్టీక్యాప్ పథకాలకు, 20 శాతం మిడ్‌క్యాప్, 10 శాతం స్మాల్‌క్యాప్‌నకు కేటాయించుకోవచ్చు. ఉదాహరణకు పుణెకు చెందిన సౌమ్య మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం హాబీగా పెట్టుకుంది. అది కూడా మంచి పనితీరు చూపించే పథకాల్లోనే. కానీ, ఒక ఏడాది మంచి పనితీరు చూపించిన పథకం మరుసటి ఏడాది కూడా టాప్‌లోనే ఉండాలని లేదు కదా. దాంతో సౌమ్య పోర్ట్‌ఫోలియోలో పథకాల సంఖ్య 30కు చేరుకుంది. దీంతో కొన్నింటిని తగ్గించుకుందామనుకున్నా... వేటిని తీసేయాలన్న సందిగ్ధం ఆమెను వేధిస్తోంది. ఒకటి రెండు పథకాలను అదనంగా ఎంచుకున్నా ఫర్వాలేదు కానీ, మరీ ఎక్కువ కాకుండా చూసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. అయితే, షేర్ల మాదిరిగా ఫండ్స్ పథకాలు ఎక్కువైపోతే నష్టాలు వస్తాయనేమీ లేదు. ఎందుకుంటే ఫండ్స్ ఎప్పుడూ నిపుణుల నిర్వహణలోనే కొనసాగుతుంటాయి. కాకపోతే రాబడుల రేటే ప్రభావితం అవుతుంది. ఎందుకంటే వాటిని పర్యవేక్షించడం కష్టమవుతుంది. అత్యవసరాలు... జీవనశైలి ఖర్చులన్నవి నేడు బాగా పెరిగిపోయాయి. అంతేకాదు ఖర్చు చేసేందుకు ఎన్నో ఆకర్షణలు వచ్చి పడ్డాయి. ఎందుకంటే జీవితానికి కనీస అవసరాలన్నవి గతంతో పోలిస్తే అధికమయ్యాయి. రిటైర్మెంట్ అవసరాల కోసం తాము చేస్తున్న పొదుపు, మదుపులను వృద్ధాప్యంలో వైద్య అవసరాల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ సిగ్నా నిర్వహించిన సర్వేలో ప్రతి ఇద్దరిలో ఒకరు చెప్పడం గమనార్హం. 40 శాతం మంది తాము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు తెలిపారు. ముంబైకి చెందిన కీర్తి నెల ఆదాయంలో వ్రస్తాలు, ఆహారం, ప్రయాణ అవసరాలకే 75 శాతం ఖర్చవుతోంది. దీంతో ఆమె పొదుపు చేసేందుకు మిగులుతున్నది కొద్ది మొత్తంగానే ఉంటోంది. అంతేకాదు, తగినంత పొదుపు లేకపోవడం వల్ల ఆమె కంటి సర్జరీని వాయిదా వేసుకోవాల్సి వచి్చంది. ఆలస్యంగా వాస్తవాన్ని గ్రహించిన కీర్తి, ప్రతి నెలా సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం ఆరంభించింది. అంతేకాదు హెల్త్ ప్లాన్ తీసుకోవడం, అత్యవసరాల కోసం ఓ నిధిని సమకూర్చుకోవడం కూడా ఆమె ముందున్న అవసరాలు. చాలా మంది అత్యవసర నిధి అవసరాన్ని పట్టించుకోరు. అవసరం వచ్చినప్పుడే వాస్తవాన్ని గుర్తిస్తుంటారు. కనుక ఆర్జించే ప్రతీ వ్యక్తి కూడా 6–8 నెలల కుటుంబ అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. కనీసం రూ.5 లక్షలకు అయినా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. పెరిగే అవసరాలకు అనుగుణంగా కవరేజీని టాపప్ ద్వారా పెంచుకోవాలి. అంతేకాదు కుటుంబానికి ఆధారంగా ఉండేవారు తమ వార్షిక ఆదాయానికి కనీసం 10–15 రెట్ల మేర టర్మ్ బీమా ప్లాన్ కూడా తీసుకోవాలి. -
పిల్లలకైతే యులిప్సే బెస్ట్...
గతంతో పోలిస్తే పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు అధికంగా దృష్టిసారిస్తున్నారు. వారికి పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి ఉన్నత చదువులు చదివించడందాకా అన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా సాగిస్తున్నారు. ఉన్నత చదువులకు పిల్లలను విదేశాలకు పంపే వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. ఏటా వేగంగా పెరుగుతున్న విద్యావ్యయం తట్టుకోవడం వీరికి కష్టంగా మారుతోంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇటీవల నిర్వహించిన ‘లైఫ్ ఫ్రీడమ్ ఇండెక్స్’ సర్వేలో 75 శాతం మంది తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం పొదుపునకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. కాని చాలామంది ఈ పొదుపును చాలా ఆలస్యంగా మొదలు పెడుతున్నారు. ఉన్నత చదువుకు అక్కరకు వచ్చే విధంగా ఉండాలంటే కనీసం 3 నుంచి 8 ఏళ్ళ లోపే ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక మొదలు పెట్టాలి. దీర్ఘకాలానికి యులిప్స్ అటు బీమా రక్షణ కల్పిస్తూ, ఇటు ఆర్థిక లక్ష్యాలను చేరుకునే విధంగా అనేక పిల్లల పథకాలను బీమా కంపెనీలు అందిస్తున్నాయి. వీటిలో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్స్) అనువైనవని చెప్పొచ్చు. తల్లిదండ్రుల రిస్క్ సామర్థ్యం ఆధారంగా వివిధ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉండటమే కాకుండా, అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చాలామంది బ్యాంకు ఎఫ్డీలు, పోస్టాఫీసు సేవింగ్స్ వంటి పథకాలపై అధికంగా మొగ్గు చూపుతున్నారు. కాని వీటికంటే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని యులిప్స్ చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ మూడు గుర్తుంచుకోవాలి ఏదైనా ఒక చైల్డ్ యులిప్ పథకాన్ని ఎంచుకునేటప్పుడు తప్పకుండా ఈ అంశాలను పరిశీలించడం మర్చిపోవద్దు. అందులో మొదటిది ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితి. యులిప్స్ అనేవి కేవలం దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌కే అనువుగా ఉంటాయి. ఇప్పుడు చాలా పథకాలు 20 నుంచి 30 ఏళ్ళ వరకు ఇన్వెస్ట్ చేసే విధంగా పథకాలను అందిస్తున్నాయి. ఇలా దీర్ఘకాలం ఎంచుకోవడం వల్ల మార్కెట్లో ఉండే సహజసిద్ధమైన ఒడిదుడుకులను తట్టుకొని దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందొచ్చు. ఇక రెండో విషయం: ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ప్రారంభంలో ఈక్విటీలకు అధికంగా కేటాయిస్తూ లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు రిస్క్ తక్కువగా ఉండే డెట్ ఫండ్ వంటి సాధనాల్లోకి క్రమేపీ మారాలి. ఉదాహరణకు ప్రారంభంలో 80 నుంచి 100 శాతం వరకు ఈక్విటీలకు కేటాయిస్తే పాలసీ ముగిసే వరకు అదే విధంగా కొనసాగించకూడదు. మార్కెట్లో ఉండే ఒడిదుడుకుల వల్ల లాభాలు హరించుకుపోయే ప్రమాదం ఉంది. లాభాలొచ్చినప్పుడు వాటిని డెట్ వంటి రిస్క్ తక్కువ ఉండే వాటిల్లోకి మార్చుకోవాలి. చిన్న పిల్లల పేరుమీద ఏ పాలసీ తీసుకున్నా సరే వైవర్ ఆఫ్ ప్రీమియం అనే రైడర్‌ను తీసుకోవడం మర్చిపోవద్దు. అనుకోని అవాంఛనీయ సంఘటన ఏదైనా జరిగి తల్లిదండ్రులు ప్రీమియం చెల్లించలేకపోయినా పిల్లల లక్ష్యం అక్కడితో ఆగిపోకూడదు. ఇలాంటి సమయంలో వైవర్ ఆఫ్ ప్రీమియం అక్కరకు వస్తుంది. ఇంతే కాకుండా యులిప్స్‌లో ఉండే ఇంకో ప్రయోజనం ఏమిటంటే.... బోనస్‌లు, లేదా ఇతర ఆదాయాలు ఏమైనా చేతికి వస్తే టాప్ అప్స్ పేరుతో అదే పథకంలో పిల్లల పేరుమీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.