
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ (ICICI Prudential) మ్యుచువల్ ఫండ్ (Mutual Fund) తాజాగా రూరల్ ఆపర్చూనిటీస్ ఫండ్ (rural opportunities fund) పేరిట న్యూ ఫండ్ ఆఫర్‌ను (NFO) ప్రకటించింది. ఇది జనవరి 9న ప్రారంభమై 23న ముగుస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల సంబంధిత స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీము.
దేశ జీడీపీలో గ్రామీణ ప్రాంతాల వాటా గణనీయంగా ఉంటోంది. ప్రభుత్వం కూడా గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఎకానమీని మెరుగుపర్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతోంది. కాబట్టి ఈ థీమ్ అనేది వృద్ధి అవకాశాలను అందించవచ్చు. ఈ ఫండ్, వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లవ్యాప్తంగా లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రూరల్ థీమ్ ఆధారిత సెక్టార్లకు కేటాయింపులను అటూ, ఇటూ మార్చుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుంది.
ఆర్థిక వృద్ధికి దోహదపడే విభాగం అయినందున ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు దేశ గ్రామీణ వృద్ధి గాథలో పాలుపంచుకునే అవకాశం లభించగలదని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఈడీ శంకరన్ నరేన్ తెలిపారు. దీనికి నిఫ్టీ రూరల్ ఇండెక్స్ ప్రామాణిక సూచీగా ఉంటుంది. 6 నెలల ఫ్రీ–ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సగటు ఆధారంగా అతి పెద్ద 75 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. శంకరన్ నరేన్, ప్రియాంక ఖండేల్వాల్ ఈ స్కీమును నిర్వహిస్తారు.