2024లో రూ. 1.18 లక్షల కోట్లు
ఎంఎఫ్‌లపై ఇన్వెస్టర్ల మక్కువ
థిమాటిక్, సెక్టోరల్, ఈటీఎఫ్‌ల హవా
న్యూఢిల్లీ: గత క్యాలండర్ ఏడాది(2024)లో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పట్ల ఇన్వెస్టర్లు అత్యంత ఆసక్తిని ప్రదర్శించారు. దీంతో 239 కొత్త ఫండ్ ఆఫరింగ్స్(ఎన్‌ఎఫ్‌వోలు) ద్వారా మొత్తం రూ. 1.18 లక్షల కోట్లను అందుకున్నాయి. వీటిలో సెక్టోరల్ లేదా థిమాటిక్ ఈక్విటీ ఫండ్స్ ఇన్వెస్టర్లను గరిష్టంగా ఆకట్టుకున్నట్లు జెర్మినేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది.
కాగా.. 2023లో 212 ఎన్‌ఎఫ్‌వోలు ఉమ్మడిగా రూ. 63,854 కోట్లు సమీకరించగా.. 2022లో 228 పథకాలకు రూ. 62,187 కోట్లు లభించాయి. అంతక్రితం అంటే 2020లో 81 కొత్త పథకాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. తద్వారా ఫండ్స్ రూ. 53,703 కోట్లు సమీకరించాయి. వీటితో పోలిస్తే గతేడాది రెట్టింపు పెట్టుబడులు అందుకోవడం గమనార్హం! ఇది ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసంతోపాటు.. పటిష్ట వృద్ధి పథాన్ని ప్రతిబింబిస్తోంది.
మార్కెట్ల ఎఫెక్ట్
సాధారణంగా స్టాక్ మార్కెట్లు పురోగమిస్తున్నప్పుడు ఎన్‌ఎఫ్‌వోలు వెలువడుతుంటాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సానుకూల సెంటిమెంటు, ఇన్వెస్టర్ల ఆశావహ ధృక్పథం ప్రభావం చూపుతుంటాయి. ఇన్వెస్టర్ల ఆసక్తి ఆధారంగా కొత్త పథకాలకు ఫండ్స్ తెరతీస్తుంటాయి. దీంతో పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతాయి. వెరసి 2024లో అధిక ఎన్‌ఎఫ్‌వోల ద్వారా భారీగా పెట్టుబడులను సమీకరించాయి. గతేడాది స్టాక్ ఇండెక్స్‌లలో సెన్సెక్స్ 5,899 పాయింట్లు(8.2 శాతం) జంప్‌చేయగా.. నిఫ్టీ 1,913 పాయింట్లు(8.8 శాతం) ఎగసింది.
ఈఎస్‌జీ సైతం
గతేడాది పెట్టుబడుల్లో థిమాటిక్, సెక్టోరల్, ఇండెక్స్, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు) అధిక శాతం ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. నివేదిక ప్రకారం 53 ఎన్‌ఎఫ్‌వోల ద్వారా ఫండ్స్‌కు రూ. 79,109 కోట్లు లభించాయి. ఇన్వెస్టర్ల ఆసక్తికి అనుగుణంగా రూపొందించిన థీమ్స్ లేదా థిమాటిక్, సెక్టోరల్ ఫండ్స్ ఇందుకు సహకరించాయి. తయారీ, టెక్నాలజీ, పర్యావరణం, సామాజిక, సుపరిపాలన(ఈఎస్‌జీ) విభాగాలను ఇందుకు ప్రస్తావించవచ్చు. విడిగా చూస్తే హెచ్‌డీఎఫ్‌సీ మ్యాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఎన్‌ఎఫ్‌వో గత ఏప్రిల్‌లో రూ. 12,500 కోట్లు అందుకుంది. డిసెంబర్‌లో అత్యధిక ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లను తాకడం ప్రస్తావించదగ్గ అంశం!
Comments
Please login to add a commentAdd a comment