ఊరిలో 108 మంది జనాభా... 69 మంది ఓటర్లు.. ప్రాథమిక పాఠశాల.. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఏడుగురే విద్యార్థులు.. ఒక్కరే మాస్టారు.. ఊరికి ఒకవైపు కిన్నెరసాని, మరో వైపు వాగులు.. వర్షాకాలమైతే ఊరు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సమీపంలోని కాస్త పెద్ద ఊరికి వెళ్లాలంటే ఆరు కిలోమీటర్ల మేర గతుకులు, బురద రోడ్డు దాటాలి. ఇది దాటేందుకు కనీసంగా గంటన్నర సమయం పడుతుంది. గుండెపోటుకు గురైతే రోడ్డు దాటే లోపు మృత్యువాత పడటమే.. అసలు ఇంతవరకు అంబులెన్స్ ఆ గ్రామానికి ఒక్క సారి కూడా రాలేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు.
రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీ ‘దొంగతోగు’ దుస్థితి ఇది. గ్రామంలో మద్యం విక్రయాలు లేకుండా అంతా ఏకతాటిపై ఉన్న ఆ ఏజెన్సీ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మళ్లీ పంచాయతీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం దొంగతోగు గ్రామ పంచాయతీ దయనీయ స్థితిపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్..
(సాక్షిప్రతినిధి, ఖమ్మం) : పాలనా సౌలభ్యం కోసం గుండాల గ్రామ పంచాయతీలో భాగంగా ఉన్న దొంగతోగు 2018లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. కేవలం 80 మంది జనాభా, 35 మంది ఓటర్లతో రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీగా ఏర్పాటైనా నేటికీ సమస్యలు సమసిపోలేదు. తొలి పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచినా ప్రభుత్వ ప్రోత్సాహకం మాత్రం అందలేదు. వర్షం వస్తే కిన్నెరసానికి వరదతో వాగులు.. వంకలు పొంగిపొర్లడం, కనీస రహదారి సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలు అక్కడ నిత్యకృత్యం.
మండల కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరం
గుండాల నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్లు కాగా, ఆళ్లపల్లికి 40 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. వాగులు పొంగిపొర్లితే ఇక్కడికి చేరుకోవడం కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆళ్లపల్లి మండలంలో ఈ గ్రామాన్ని కలిపినా దూరాభారంతో ఆ మండల కేంద్రం వైపు కూడా గ్రామస్తులు వెళ్లడం లేదు.
పాలనా కేంద్రంగా బడి..
గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ భవనంలోనే అంగన్‌వాడీ కేంద్రం కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ నిర్మాణానికి ఐటీడీఏ నుంచి రూ.16 లక్షలు మంజూరైనా ఇప్పటికీ పునాది పడలేదు. దీంతో పాఠశాల భవనంలోనే పంచాయతీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు పడితే ఈ బడికి చేరుకునేందుకు ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు సాహ సం చేయాల్సిందే. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు కూడా రాకపోవడంతో ఆ పల్లె అభివృద్ధికి నోచుకోలేదు. మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించినా వరదలతో పైపులైన్లు ధ్వంసమై ఏడాదిగా గ్రామానికి తాగునీరు రావడం లేదు.
ఆరు కిలోమీటర్లు.. అవస్థలు..
దొంగతోగు సమీపంలోని ముత్తాపురం నుంచి ఇక్కడికి ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాలి. ఎందుకంటే వర్షం వస్తే పొంగే వాగులు, వంకలు, గుంతల మయంగా ఉన్న ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది. గ్రామం నుంచి గర్భిణులు, అస్వస్థతకు గురైన వారు వైద్యం కోసం గుండాల ఆస్పత్రికి వెళ్లాలంటే నరకం చూడాల్సిందే.
రెండు నెలల క్రితం గుండె పోటుకు గురైన ఓ వ్యక్తిని ఈ దారిలో ట్రాక్టర్‌పై గుండాలకు, అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకెళ్లే సరికే మృతి చెందాడు. రోడ్డు లేకపోవడంతో ఇప్పటివరకు ఒక్కసారి కూడా అంబులెన్స్ రాలేదు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నిధుల కింద ఆరు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరైనా అటవీ శాఖ అనుమతి లభించలేదు. ఇటీవల రెండు కిలోమీటర్లకు అనుమతి రాగా, పనులు ప్రారంభమయ్యాయి.
మద్యం అమ్మకుండా..
గ్రామంలో 27 కుటుంబాలున్నాయి. అంతా పోడు వ్యవసాయం చేస్తుంటారు. వర్షాధారంగా వరి, మొక్కజొన్న, పత్తి, కంది పంటలు సేద్యమవుతున్నాయి. పోడు పట్టాలు రావడంతో వారి ఖాతాల్లో వానాకాలం రైతుబంధు డబ్బు పడింది. ఆదివాసీ కుటుంబాలన్నీ ఏకగ్రీవంగా సర్పంచ్‌ని ఎన్నుకున్నట్లే.. గ్రామంలో మద్యం అమ్మకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్, నలుగురు వార్డు సభ్యులు ఉన్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు వస్తుండడంతో సందడి నెలకొనాల్సిన ఈ గ్రామంలో పాత కష్టాలే కళ్లముందు కనిపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కొత్త పంచాయతీ అయితే రోడ్డు, మంచినీటి వసతి, కొత్త పంచాయతీ భవనం వస్తాయనుకున్న వారి ఆశలు నెరవేరలేదు.
గ్రామ ప్రొఫైల్
♦ గ్రామ పంచాయతీ: దొంగతోగు (రాష్ట్రంలో అతి చిన్నది)
♦ 2018లో గుండాల పంచాయతీ నుంచి వీడి నూతన పంచాయతీగా ఏర్పాటు.
♦ తొలుత 35 మంది ఓటర్లు
♦ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల జాబితా ప్రకారం 69 మంది ఓటర్లు.
♦ మొత్తం ఓటర్లలో పురుషులు 36, స్త్రీలు 33 మంది
♦ మొత్తం జనాభా : 108 మంది
♦ పురుషులు : 44, స్త్రీలు : 64 మంది
రోడ్డే ప్రధాన ఇబ్బంది..
ముత్తాపురం నుంచి రోడ్డు పడితేనే మా గ్రామ సమస్యలు తీరుతాయి. పైపులైన్లు ధ్వంసం కావడంతో ట్యాంకు నుంచి మంచినీళ్లు రావడం లేదు. పంచాయతీకి ఇచ్చిన చిన్న ట్రాక్టర్ రిపేరు వచ్చినా చేయించలేకపోతున్నాం. నిధులు లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. – కొమరం బాయమ్మ, సర్పంచ్, దొంగతోగు
రోడ్డు ఉంటే ప్రాణం దక్కేది..
నా భర్త అక్టోబర్ 20న గుండెపోటుతో చనిపోయాడు. గుండె నొప్పి వస్తే బండి మీద గుండాల తీసుకెళ్లాం. అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకెళ్లమన్నారు. అక్కడ వైద్యం పొందుతూ చనిపోయిండు. ఆరు కిలోమీటర్ల రోడ్డుపై గంటకు పైగా ప్రయాణించి గుండాల వేళ్లే సరికి నొప్పి ఎక్కువైంది. అదే రోడ్డు బాగుంటే త్వరగా ఆస్పత్రికెళ్తే ప్రాణాలు దక్కేవి. గర్భిణులను మొన్నటివరకు ఎడ్ల బండిపై తీసుకెళ్లారు. ఇప్పుడు ట్రాక్టర్లలో ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం. –పూణె అనంతలక్ష్మి, దొంగతోగు
Comments
Please login to add a commentAdd a comment