
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు సమృద్ధిగా నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వచ్చే బడ్జెట్‌లో పంచాయతీల అభివృద్ధికి రూ.2,714 కోట్లను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. దీంతో స్థానిక సంస్థలకు నిధుల కొరత ఉండదని స్పష్టం చేశారు. గురువారం ఎంసీహెచ్‌ఆర్డీలో ‘కొత్త పంచాయతీరాజ్ చట్టం’పై అదనపు కలెక్టర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు నిధులు కేటాయిస్తోందని, తద్వారా గ్రామ పంచాయితీలకు ప్రతీ నెల రూ.339 కోట్లు విడుదల చేస్తోందని తెలిపారు. దేశానికే ఆదర్శంగా రూ.45వేల కోట్లతో మిషన్ భగీరథను పూర్తి చేసి గ్రామాలకు శుద్ధమైన తాగు నీటిని అందిస్తున్నామని, తాగునీటి సరఫరా ఖర్చు భారం గ్రామపంచాయతీలపై వేయడం లేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
పారదర్శకతకు పెద్దపీట వేయాలనే..
పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానాన్ని అమలు చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రంగా ఉండడంతోపాటు సమగ్ర అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో ‘పల్లె ప్రగతి’ని రూపొందించామని, మొదటి దశ స్ఫూర్తిని కొనసాగించే విషయంలో ఆశించిన మేరకు జరగలేదనే అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు కూడా ఇలాగే ఉన్నాయన్నారు. అదనపు కలెక్టర్లు పల్లె ప్రగతి ఒరవడిని కొనసాగించడంలో చొరవచూపాలని పిలుపునిచ్చారు. వైకుంఠధామం, డంపింగ్ యార్డులు, ఇంకుడుగుంతలు, నర్సరీలు, హరితహారం, ఉపాధిహామీ పథకంలో నిధుల వినియోగం, దాతల విరాళాలు, డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, మిషన్ భగీరథ నల్లాల పరిశుభ్రత, వా ల్టా అమలు, జరిమానాల విధింపుపై అదనపు కలెక్టర్లు పకడ్బందీగా వ్యవహ రించాలని ఆదేశించారు. సదస్సులో ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ ఎం.రఘునందన్ రావు, స్పెషల్ కమిషనర్ సైదులు, ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ అడిషనల్ డైరెక్టర్ బెనహార్ దత్ ఎక్కా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment