Telangana: తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు | Telangana Bags 13 National Panchayat Awards 2023 | Sakshi
Sakshi News home page

తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు.. ఎర్రబెల్లిని అభినందించిన కేటీఆర్, హరీశ్‌రావు

Published Sat, Apr 8 2023 2:37 AM | Last Updated on Sat, Apr 8 2023 10:26 AM

Telangana Bags 13 National Panchayat Awards 2023 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయస్థాయి పురస్కారాల్లో తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట పండింది. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌కు సంబంధించి 8 పురస్కారాలతోపాటు నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌కు సంబంధించి 5 పురస్కారాలు సాధించి రాష్ట్రం సత్తా చాటింది. దీన్‌దయాళ్‌ పురస్కారాల్లో 9 కేటగిరీల్లోని 27 అవార్డులకుగాను 8 అవార్డులు సాధించి రాష్ట్రాలవారీగా అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో నాలుగు పంచాయతీలు తొలి ర్యాంకు సాధించగా మరో రెండు పంచాయతీలు రెండో ర్యాంకు, ఇంకో రెండు పంచాయతీలు మూడో స్థానంలో నిలిచాయి.

అలాగే నానాజీ పురస్కారాల్లో 7 కేటగిరీలకుగాను ఐదు (వాటిలో ఒకటి ప్రథమ స్థానం) అవార్డులు లభించాయి. తెలంగాణ వివిధ కేటగిరీల్లో పురస్కారాలకు ఎంపికైన విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారు డాక్టర్‌ బిజయకుమార్‌ బెహరా ఓ లేఖ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శికి తెలియజేశారు. ఈ నెల 17న ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో జరిగే ‘నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇన్సెంటివైజేషన్‌ ఆఫ్‌ పంచాయత్స్‌ కమ్‌ అవార్డ్‌ సెర్మనీ’లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. 

మార్కుల ఆధారంగా ర్యాంకులు..
ఏటా జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు ప్రోత్సాహకంగా అవార్డులు అందిస్తోంది. జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా, ఆన్‌లైన్‌లో పంచాయతీల ద్వారా నామినేషన్‌లను తీసుకొని 9 అంశాల్లో (థీమ్‌లలో) ఉత్తమ గ్రామ పంచాయతీలకు మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉత్తమ అవార్డులు ప్రకటిస్తోంది. అయితే ఈ ఏడాది నుంచి అవార్డులను 9 అంశాల్లో ఏ పంచాయతీలు ప్రగతిని సాధించాయో వాటికి మొదటి, రెండవ, మూడవ బహుమతులుగా అవార్డులు ఇస్తోంది. ఇందులో ప్రతి అంశానికి వంద మార్కులకు సూచికలను ప్రకటించింది. ఈ తొమ్మిది అంశాల్లో ప్రతి పంచాయతీ సాధించిన మార్కుల ఆధారంగా దేశంలో ఉత్తమ పంచాయతీలను ప్రకటిస్తోంది. 

మంత్రి ఎర్రబెల్లి, ఆయన బృందానికి అభినందనలు 
సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక అయిన పల్లెప్రగతి కార్యక్రమాల అమలు వల్లే రాష్ట్రానికి ఈ ఘనత లభించిందని, తెలంగాణను అవార్డులు వరించాయని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు ఆయన బృందాన్ని ట్విట్టర్‌ వేదికగా అభినందించారు. ఇందుకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలియజేశారు. అవార్డులు రావడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, సహకరించిన ప్రజలకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. 

నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌–2023 
ఉత్తమ బ్లాక్‌ (మండల) పంచాయతీ: కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ ఎల్‌.ఎం.డి (సెకండ్‌ ర్యాంకు) 
ఉత్తమ జిల్లా పంచాయతీలు: ములుగు జిల్లా (సెకండ్‌ ర్యాంకు) 
గ్రామ ఊర్జా స్వరాజ్‌ విశేష్‌ పంచాయత్‌ పురస్కార్‌ (స్పెషల్‌ కేటగిరీ): ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె. (థర్డ్‌ ర్యాంకు).
కార్బన్‌ న్యూట్రల్‌ విశేష్‌ పంచాయతీ పురస్కార్‌: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా (సెకండ్‌ ర్యాంకు) 
గ్రామ ఊర్జా స్వరాజ్‌ విశేష్‌ పంచాయత్‌ పురస్కార్‌ (స్పెషల్‌ కేటగిరీ–నాన్‌ ఫైనాన్షియల్‌ ఇన్సెంటివ్‌–సర్టిఫికెట్‌): సిద్దిపేట జిల్లా మార్కూక్‌ ఎర్రవెల్లి (ఫస్ట్‌ ర్యాంకు)  

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌–2023 
ఆరోగ్యవంతమైన పంచాయతీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్‌ (ఫస్ట్‌ ర్యాంకు) 
తాగునీరు సమృద్ధిగా ఉన్న పంచాయతీ: జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల (ఫస్ట్‌ ర్యాంకు) 
సామాజిక భద్రతగల పంచాయతీ: మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం కొంగట్‌పల్లి (ఫస్ట్‌ ర్యాంకు) 
స్నేహపూర్వక మహిళా పంచాయతీ: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్‌) మండలం ఏపూరు (ఫస్ట్‌ ర్యాంకు) 
పేదరికరహిత, జీవనోపాధి పెంచిన పంచాయతీ: గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం (సెకండ్‌ ర్యాంకు) 
సుపరిపాలనగల పంచాయతీ: వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం చీమల్‌దారి (సెకండ్‌ ర్యాంకు) 
క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పంచాయతీ: పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్‌ మండలం సుల్తాన్‌పూర్‌ (థర్డ్‌ ర్యాంకు) 
స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాలుగల పంచాయతీ: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్‌రావుపేట మండలం గంభీర్‌రావుపేట (థర్డ్‌ ర్యాంకు)
చదవండి: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement