సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. ప్రీతి మృతి బాధాకరమని, ప్రభుత్వపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారని వివరించారు. దోషులు ఎంతటి వారైనా సరే చట్టప్రకారంగా కఠినంగా శిక్షిస్తామని ఎర్రబెల్లి తెలిపారు.
ప్రీతి ఘటన బాధాకరం: మంత్రులు
ప్రీతి మృతి అత్యంత బాధాకరమని, ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం శక్తివంచన లేకుండా ప్రయత్నించిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కాగా.. ప్రీతి మృతి బాధాకరమని, ఆమె కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కౌశిక్ కుమార్ పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే దారుణం : బండి సంజయ్
ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని, ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రీతి మరణం బాధాకరమన్నారు.
‘‘ఈ దారుణ ఘటనపై సీఎం ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు? మీరిచ్చే రూ.10 లక్షల సాయం ఆ తల్లిదండ్రుల గుండెకోతను చల్లార్చుతాయా? గిరిజన విద్యార్థిని కాబట్టి ఏమైనా ఫరవాలేదనే సీఎం స్పందించలేదా? కేసీఆర్ పాలనలో బీఆర్‌ఎస్, ఎంఐఎం మద్దతుంటే క్రిమినల్స్ ఏం చేసినా చెల్లుతుందని ప్రీతి ఘటన నిరూపిస్తోంది’’అని విమర్శించారు.
విచారణకు రేవంత్ డిమాండ్
ప్రీతి మరణంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ప్రీతి మరణానికి గల కారణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment