రోజూ గంట ఉచిత వైఫై! | Every Day 1Hour Free Wi-Fi | Sakshi
Sakshi News home page

రోజూ గంట ఉచిత వైఫై!

Published Mon, Jan 18 2016 4:41 AM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM

రోజూ గంట ఉచిత వైఫై!

రోజూ గంట ఉచిత వైఫై!

* పంచాయతీల్లో అందుబాటులోకి ఫైబర్ నెట్‌వర్క్
* మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,320 కోట్లు
* కేంద్రానికి డీపీఆర్ సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫైబర్ నెట్‌వర్క్ ప్రాజెక్టు పూర్తై తరువాత ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతిరోజూ గంటపాటు ఉచితంగా వైఫైను అందుబాటులో ఉంచనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన సవివరమైన ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రతి గ్రామ పంచాయతీలోని స్థానిక ప్రజలు వినియోగించుకునేందుకు ప్రతిరోజూ గంటపాటు ఉచితంగా వైఫై సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

ప్రతి జిల్లా కేంద్రంలో 25 ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రతి మండల కేంద్రంలో పది ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రతి గ్రామ పంచాయతీలో మూడు ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఈ సౌకర్యం కల్పించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో అమలు చేయాలని నిర్ణయించారు.

మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,320 కోట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.3,590 కోట్ల ఇవ్వాలని, మిగతా రూ.730 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నివేదిక కేంద్ర టెలికం, ఐటీ శాఖల పరిశీలనలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికారవర్గాలు తెలిపాయి.
 
టెరా రుణానికి  సర్కారు గ్యారంటీ !
వాస్తవానికి ఇప్పటికే (కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే) తొలి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తన బినామీ అయిన టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ సంస్థకు కట్టపెట్టారు. 22,500 కిలోమీటర్ల మేర ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటునకు గాను రూ.333 కోట్ల కాంట్రాక్టును ఆ సంస్థకు ఇచ్చేశారు.

టెరా సంస్థకు ఆంధ్రా బ్యాంకు రూ.266.4 కోట్ల రుణం మంజూరు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని బ్యాంకు షరతు విధించింది. రూ.75 కోట్లను మార్జిన్ మనీ గా చూపించాలని టెరాను కోరింది. దీంతో టెరా సంస్థ.. ఆ మేరకు గ్యారంటీ, మార్జిన్ మనీ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సాధారణంగా ఏ ప్రాజెక్టుకైనా కాంట్రాక్టర్ బ్యాంకు నుంచి రుణం తీసుకునే పక్షంలో.. ఆ రుణానికి ప్రభుత్వం  గ్యారంటీ ఇవ్వదు. కానీ టెరాకు మాత్రం ఇస్తుండడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement