free Wi-Fi
-
ఇంటర్నెట్ నిలిపివేసిన రోజునే..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం నగరంలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న దృష్ట్యా నగరంలో పలుచోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన రోజునే కేజ్రీవాల్ ఉచిత వైఫైని ప్రారంభించడం యాదృచ్చికం. ఆయన కూడా ఈ విషయాన్నే చెబుతూ జరుగుతోంది పరస్పర విరుద్ధంగా ఉందన్నారు. 70 శాతం మంది ప్రజలు తమ వద్ద పౌరసత్వాన్ని నిరూపించుకునే పత్రాలు లేకపోవడం వల్ల భయపడుతున్నారని కేజ్రీవాల్ అన్నారు. పౌరసత్వ చట్టాన్ని సవరించవలసిన అవసరం లేదని దానికి బదులు కేంద్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అందించడంపై దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం నగరాన్ని కవర్ చేయడం కోసం 11,000 వైఫై హాట్స్పాట్లను ఉపయోగించాలనుకుంటున్నట్ల చెప్పారు. గురువారం ఆయన ట్వీట్ చేస్తూ ఢిల్లీని ఆధునిక ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దిడంలో వైఫై ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. వైఫై ద్వారా తాను, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విడియో కాల్లో మాట్లాడుకున్నట్లు ఆయన తెలిపారు. (‘పౌర’ సెగలు; ఆందోళనలు.. అరెస్ట్‌లు) -
నెలకు 15 జీబీ డేటా ఫ్రీ; ‘కేజ్రీ’ ఆఫర్
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల వరాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉచిత ఇంటర్నెట్తో ఢిల్లీ వాసులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. దేశ రాజధానిలో 11 వేల ఉచిత వై-ఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేయనున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. హాట్స్పాట్ల నుంచి స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ప్రతి నెలా 15 జీబీ డేటాను ఉచితంగా వాడుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు గురువారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఉచిత వై-ఫైలను ఏర్పాటు చేస్తామని 2015 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హామీయిచ్చింది. ఈ నాలుగేళ్లలో అమలు చేయడానికి మూడు విభాగాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టును కేజ్రీవాల్ సర్కారు ఎట్టకేలకు పట్టాకెక్కించింది. దీని కోసం బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయించామని, మరో నాలుగు నెలల్లో ప్రజలకు ఉచిత వై-ఫై అందుబాటులోకి రానుందని కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని నిర్వహిస్తామన్నారు. వై-ఫై ఏర్పాటు చేయడానికి అవసరమైన రౌటర్లు ప్రైవేటు సంస్థలు సమకూరుస్తాయని, వీటి నిర్వహణ మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంటుందని వివరించారు. ఒక హాట్‌స్పాట్ నుంచి రౌటర్ సేవలు 50 మీటర్ల వరకు అందుతాయని, ఒకేసారి 200 మంది ఉచిత వై-ఫై సేవలను వినియోగించుకోవచ్చన్నారు. ఢిల్లీలో మరో 14 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో గతవారం ఉచిత విద్యుత్ వరాన్ని కేజ్రీవాల్ ప్రకటించారు. ఫిక్స్డ్ చార్జీలను 84 శాతం తగ్గించడమే కాక 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసి ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు. (చదవండి: ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు..) -
గ్లోబల్‌గా ఉచిత వైఫై సేవలు
బీజింగ్ : టెక్నాలజీ రంగంలోనూతన ఆవిష్కరణలకు సంబంధించి చైనా టెక్నాలజీ సంస్థ మరో సంచలనానికి శ్రీకారం చుట్టింది. గ్లోబల్‌గా ఉచిత వైఫై సేవలను ను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రత్యర్థి టెక్ దిగ్గజాలు గూగుల్, స్పేస్‌ఎక్స్‌లాంటి సంస్థల మాదిరిగా ప్రపంచవ్యాపితంగా ఉచిత వైఫై సేవలను అందించేందుకు తొలి అడుగు వేసింది. ప్రణాళికలో భాగంగా చైనాకు చెందిన కంపెనీ లింక్‌స్యూర్ నెట్వర్క్ తన మొదటి శాటిలైట్‌ను లాంచ్ చేసింది. చైనాలో జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ ద్వారా దీన్ని ప్రారంభించింది.స్థానిక టెలికాం నెట్‌వర్క్‌లు కవర్చేయని ప్రాంతాల్లో కూడా యూజర్లు తమ శాటిలైట్ద్వారా ఇంటర్నెట్ సేవలనువినియోగించు కోవచ్చంటూ స్థానిక మీడియా రిపోర్టు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.3వేలకోట్లను పెట్టుబడిగా పెడుతున్నట్టు లింక్‌స్యూర్ నెట్వర్క్ సీఈవో వాంగ్ జింగ్ యింగ్ తెలిపారు. అంతేకాదు 2020 నాటికి అంతరిక్షంలో 10 ఉపగ్రహాలను లాంచ్ చేస్తామన్నారు. అలాగే 2026 నాటికి 272 ఉపగ్రహాలను విడుదల చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కాగా ప్రస్తుతం, గూగుల్, స్పేస్ఎక్స్, వన్ వెబ్, టెలి సాట్వంటి అనేక విదేశీ టెక్నికల్ కంపెనీలు ఇప్పటికే ఇంటర్నెట్ ఇంటర్నెట్ యాక్సెస్ కోసం ఉపగ్రహాలను లాంచ్ చేసే ప్రణాళికలను ప్రకటించాయి. ఈ క్రమంలో స్పేస్ఎక్స్ 7వేలకు పైగా స్టార్‌లింక్ ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రవేశపెట్టేందుకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్(ఎఫ్‌సీసీ) అనుమతి పొందింది. మొత్తం12వేల ఉపగ్రహాలను విడుదల చేయాలనేది స్పేస్ఎక్స్ లక్ష్యం. అయితే ఈ ప్రక్రియ మొత్తం పూర్తికావడానికి మరో ఆరు సంవత్సరాలకు పైగా పడుతుందని ఇటీవల వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి సమాచారం ప్రకారం, 2017 చివరి నాటికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని ప్రజలు 3.9 బిలియన్లకు పైనే. -
రైల్వే ఆఫర్ : 80 లక్షల మందికి ఉచిత వై-ఫై
న్యూఢిల్లీ : దేశీయ రైల్వే స్టేషన్లన్నీ వైఫై హంగులను సమకూర్చుకుంటున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న 700కి పైగా స్టేషన్లలో ఉచిత పబ్లిక్ వై-ఫై సర్వీసులను ఆఫర్ చేస్తున్నట్టు దేశీయ రైల్వే ప్రకటించింది. ఇది ప్రతి నెలా 80 లక్షల మంది ప్రజలను కవర్ చేయనుంది. టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి, దేశీయ రైల్వే ఈ సర్వీసులను ఆఫర్ చేస్తోంది. ‘రైల్ టెల్, అన్‌కనెక్టెడ్‌ను కనెక్ట్ చేయాలని అంకిత భావంతో ఉంది. 700 ప్లస్ రైల్వే స్టేషన్లలో రైల్‌వైర్ హాట్స్పాట్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీంతో నెలకు 80 లక్షల మంది ప్రజలకు ఈ ఉచిత వై-ఫై అనుభవాన్ని అందించనున్నాం’ అని దేశీయ రైల్వే టెలికాం సంస్థ రైల్‌టెల్ ట్వీట్ చేసింది. ఈ సర్వీసులను 30 నిమిషాల పాటు ఉచితంగా అందిస్తామని, ఒక్కో సెషన్‌పై సగటున 350 ఎంబీ డేటాను యూజర్లు వాడుకోవచ్చని తెలిపింది. నెలవారీ డేటా వినియోగం ఈ ఉచిత నెట్‌వర్క్‌పై 7000 టీబీలకు పైగా నమోదవుతుందని పేర్కొంది. ఈ సర్వీసులు ప్రస్తుతం 407 అర్బన్ రైల్వే స్టేషన్లు, 298 రూరల్ స్టేషన్లలలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ స్టేషన్లలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, చండీగఢ్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, గోవా, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్ము కశ్మీర్, జార్ఖాండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్తాన్, తెలంగాణ, త్రిపుర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌లు ఉన్నాయి. 2016 జనవరిలో ముంబై నుంచి తొలుత ఈ సర్వీసులను దేశీయ రైల్వే ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద లాంచ్ అయిన ఏడాదిలో 100 స్టేషన్లను కవర్ చేసింది. 6వేలకు పైగా స్టేషన్లలో ఈ ఉచిత వై-ఫై సర్వీసులను రైల్వే విస్తరిస్తుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. -
ఫ్రీ-వైఫైతో ముగ్గురిలో ఒకరు..
న్యూఢిల్లీ: భారత్‌లో ఫ్రీ వైఫైతో కనీసం ముగ్గురిలో ఒకరు అడల్ట్ చిత్రాలనే చూస్తున్నారని నార్టన్ సర్వేలో వెల్లడైంది. భారత్‌లో హోటల్స్, ఎయిర్‌పోర్టు, లైబ్రరీ, వర్కింగ్ ప్లేస్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్ ఫ్రీ-వైఫైని మంచి కన్నా చెడుకే ఎక్కువ ఉపయోగిస్తున్నారని సర్వేలో తెలిసింది. భారత్‌లో సగటున ముగ్గురిలో ఒకరైతే.. ప్రపంచ వ్యాప్తంగా ఆరుగురిలో ఒకరు ఫ్రీ-వైఫైని దుర్వినియోగం చెస్తున్నారని నార్టన్ సంస్థ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ-వైఫై అడ్మిన్లపై నిర్వహించిన స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయని తెలిపింది. భారత్‌లో ఫ్రీ-వైఫై ఉపయోగించే వెయ్యి మంది అడ్మిన్లపై స్టడీ చేయగా ఈ విస్తుపోయే విషయం వెల్లడైందని తెలిపింది. భారత్‌లోని వీధుల్లో ఫ్రీ వైఫై ఉపయోగించే వారిలో 31 శాతం అశ్లీల చిత్రాలు చూస్తున్నారని, బుస్సు, రైల్వే స్టేషన్లలో 34 శాతం , లైబ్రరీల్లో 24 శాతం , ఎయిర్‌పోర్టుల్లో 34 శాతం మంది చూస్తున్నారని తమ సర్వేలో వెల్లడైందని నార్టన్ పేర్కొంది. సైబర్ సెక్యూర్ లేని ఫ్రీ వైఫైలతో సోషల్ మీడియాను, వ్యక్తిగత కార్యకలపాలను నిర్వహిస్తున్నారని తెలిపింది. -
హాట్..హాట్‌స్పాట్!
ఫ్రీ వై–ఫైకి జై కొడుతున్న హైదరాబాదీలు - సినిమాలు, అశ్లీల సైట్లు చూసేవారే ఎక్కువ..! - సగటున రోజుకు 300 ఎంబీ డేటా వినియోగం - ప్రస్తుతం 43 చోట్ల ఏర్పాటు.. త్వరలో మరో 240 హాట్స్పాట్లు హాట్‌స్పాట్.. ఉచిత వై–ఫై.. ప్రస్తుతం హైదరాబాదీలను ఆకర్షిస్తున్న విషయాలివీ. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ గ్రేటర్ మహానగరంలోని 43 ప్రాంతాల్లో 113 వై–ఫై హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేసింది. ఈ 43 చోట్ల హైదరాబాదీలు ఇప్పుడు ఉచితంగా వై–ఫై సేవలను పొందుతున్నారు. తొలి 15 నిమిషాల పాటు ఈ వై–ఫై సేవలు ఉచితంగా అందుతాయి. ఆ తర్వాత వై–ఫై సేవలను వినియోగించేందుకు ప్రతి అరగంటకు రూ.30 చార్జీ అవుతుంది. – సాక్షి, హైదరాబాద్ సినిమాలు.. అశ్లీల సైట్లే అధికం.. ప్రస్తుతం ఉచిత వై–ఫై వినియోగానికి గ్రేటర్ సిటిజన్లు జై కొడుతున్నారు. 43 ఫ్రీ వై–ఫై హాట్‌స్పాట్స్ వద్ద ఎక్కవ మంది సినిమాలు, పాటలు వంటి వినోదాన్ని పంచే కార్యక్రమా లను వీక్షించేందుకు యూట్యూబ్ లాంటి సైట్లను ఆశ్రయిస్తున్నారట. ఇక కొంతమంది కుర్రకారు ఉచిత వై–ఫై లభిస్తున్న తొలి 15 నిమిషాల్లో అశ్లీల, పోర్న్సైట్లను వీక్షించేందుకు మక్కువ చూపుతున్నారట. మరికొందరు బస్సు, రైళ్ల వేళలు, రిజర్వేషన్ల వివరాలను ఆన్లైన్లో తెలుసుకుంటున్నారట. ఇక ఉచిత డేటా వినియోగంలో గ్రేటర్లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బస్స్టేషన్లు అగ్రభాగాన నిలిచాయి. డేటా వినియోగంలో ట్యాంక్‌బండ్, నక్లెస్‌రోడ్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, లుంబినీపార్క్, జూబ్లీ బస్‌స్టేషన్ ప్రాంతాలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇక గోల్కొండ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, జూపార్క్ వంటి పర్యాటక స్థలాల్లో ఉచిత వై–ఫై హాట్‌స్పాట్స్‌కు మాంచి డిమాండ్ ఉంది. ఆయా ప్రాంతాల్లో ఒక్కోక్కరు సగటున నిత్యం సుమారు 300 ఎంబీ డేటాను వినియోగించుకుంటున్నట్టు బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో.. నగరంలో ఇప్పటికే 43 చోట్ల హాట్‌స్పాట్ పరికరాలు ఏర్పాటు చేయగా.. మూడు నెలల్లో మరో 240 ప్రాంతాల్లో హాట్స్పాట్లను ఏర్పాటు చేయాలని బీఎస్ఎన్ఎల్ సంస్థ నిర్ణయించింది. కాగా, నగరవ్యాప్తంగా వై–ఫై సేవల విస్తరణకు ప్రభుత్వం నుంచి అనుమతుల జారీ ఆలస్యమవుతుండడం, వాణిజ్య ప్రకటనలు, ఉచిత విద్యుత్ కనెక్షన్, రోడ్ కటింగ్ అనుమతులను మంజూరు చేస్తూ జీవో జారీ చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఈ పనులు ఆలస్యమవుతున్నాయి. కాగా, ఒకేసారి వందలాది మంది వై–ఫై సేవలు పొందేందుకు ప్రయత్నిస్తుండటంతో వారికి నిరాశే ఎదురవుతోంది. స్పీడ్ తగ్గుతోందని, ఒక్కోసారి వై–ఫై కనెక్ట్కావడం లేదని నక్లెస్‌రోడ్ వద్ద వై–ఫై సేవలు వినియోగిస్తున్న పలువురు ‘సాక్షి’కి తెలిపారు. హాట్‌స్పాట్ పరికరాల సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు. -
ఈ దేశీయ విమానంలో ఫ్రీ వై-ఫై
న్యూఢిల్లీ : గగనతలంలో విమానం ఎగురుతున్నట్టు ఫోన్ ఆన్ చేయడమే నిబంధనలకు విరుద్ధం. ఈ నిబంధనలన్నింటిన్నీ మార్చేస్తూ విమానాల్లో వై-ఫై వాడుకునే సౌకర్యాలను పౌర విమానయాన సంస్థలు కల్పిస్తున్నాయి. ఇన్నిరోజులు అంతర్జాతీయ విమానాల్లోనే ఈ సదుపాయం ఉండేది. తాజాగా దేశీయ విమానాల్లోనూ వై-ఫై సందుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్ ఇండియా ఆన్ బోర్డులో ఈ జూలై లోపల ఉచిత వై-ఫై సేవలిందించేందుకు ప్లాన్ చేస్తోంది. తన ఎయిర్ బస్ ఏ-320 విమానాలకు ఈ సదుపాయం తీసుకొస్తుందట. ఒక్కసారి ఈ ఎయిర్ బస్ లో ఉచిత వై-ఫైను విజయవంతంగా అందిస్తే, ఇదే బాటలో ఇతర ఎయిర్ లైన్ సంస్థలు పయనించనున్నాయి. ''మా విమానాల్లో వై-ఫై అందించేందుకు కృషిచేస్తున్నాం. వై-ఫై పరికరాలను అమర్చడానికి ఎయిర్ క్రాఫ్ట్ తయారీదారి దగ్గర్నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పటి నుంచి వై-ఫై సేవలను అందించగలమో సరియైన తేది చెప్పలేకపోతున్నాం. కానీ జూన్, జూలై మధ్యలో ఈ సేవలను ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉన్నాం'' అని ఎయిర్ ఇండియా చీఫ్ అశ్వని లోహాని చెప్పారు. అయితే ఎంత డేటా అందిస్తోందో, స్పీడు ఎలా ఉంటుందో ఈ విమానయాన సంస్థ ప్రకటించలేదు. తొలుత బేసిక ప్యాక్ లను ఉచితంగా అందించిన తర్వాత, చెల్లింపు ప్యాక్‌లను ప్రారంభిస్తుందని తెలుస్తోంది. ఉచిత బేసిక్ ప్యాక్, వాట్సాప్ మెసేజ్ లు పంపడం వంటివి చేసుకోవచ్చు. దీంతో ఉచిత వై-ఫై సేవలందించే తొలి ఎయిర్ లైన్ గా ఎయిర్ ఇండియా గుర్తింపు పొందనుంది. -
ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వై-ఫై
తాము నడిపించే వోల్వో బస్సుల్లో ఉచితంగా వై-ఫై సేవలు అందించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు శుక్రవారం తెలిపారు. ఎంపిక చేసిన రూట్లలో వెళ్లే ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఈ ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని అన్నారు. తొలిదశలో ఐదు బస్సులలో వై-ఫై సేవలు ప్రారంభించామని, రాబోయే 15 రోజుల్లో మరో 10 బస్సుల్లో కూడా ఇది వస్తుందని ఒక అధికారి చెప్పారు. ప్రస్తుతం లక్న్-ఢిల్లీ, లక్నో-బహరైచ్, లక్నో-అజ్మీర్ మార్గాలలో నడిచే బస్సులలో ఉచిత వై-ఫై ఉంది. ఇందుకోసం బస్సులలో ఒక డాంగిల్‌ను ఫిట్ చేస్తున్నారు. బస్సు సిబ్బంది అందించే పాస్వర్డ్ తీసుకుని ప్రయాణికులు తాము ప్రయాణం చేసినంత సేపు ఉచితంగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. -
ఫ్రీ వై-ఫైతో ఏం చూస్తున్నారో తెలుసా?
రైల్వే స్టేషన్లలో ఉచితంగా అందిస్తున్న వై-ఫైని వాడుకోవడంలో బిహార్ రాజధాని పట్నా అగ్రస్థానంలో నిలిచింది. అయితే.. అక్కడ ఎక్కువగా ఈ వై-ఫైని ఉపయోగించి ఏం చూస్తున్నారో తెలుసా.. పోర్న్ సైట్లు! ఈ విషయాన్ని రైల్వే అధికారులు తెలిపారు. దేశంలో మరే ఇతర రైల్వేస్టేషన్ కన్నా ఉచిత వై-ఫైని పట్నా రైల్వే స్టేషన్ ఎక్కువగా వాడుకుంటోందని, అయితే ప్రధానంగా పోర్న్ సైట్లు వెతకడానికే దీన్ని వాడుతున్నారని రైల్‌టెల్ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. పట్నా తర్వాతి స్థానంలో ఇంటర్నెట్ సెర్చిలో జైపూర్, బెంగళూరు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లున్నాయి. తూర్పు రైల్వే పరిధిలోని దానాపూర్ డివిజన్ కిందకు వచ్చే పట్నా స్టేషన్.. బిహార్‌లోనే ఉచిత వై-ఫై పొందిన మొదటి స్టేషన్. ఈ స్టేషన్ మీదుగా రోజుకు 200కు పైగా రైళ్లు వెళ్తుంటాయి. దేశంలోనే బాగా రద్దీగా ఉండే స్టేషన్లలో ఇదొకటి. రైల్‌టెల్ అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం, పట్నాలో ఎక్కువగా యూట్యూబ్, తర్వాత వికీపీడియాలను పట్నా స్టేషన్లో చూస్తున్నారు. అయితే మిగిలిన అన్నింటికంటే పోర్న్ సైట్లను చూడటం, డౌన్లోడ్ చేసుకోవడం లాంటివి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. కొందరు మాత్రం యాప్‌లు డౌన్లోడ్ చేసుకోడానికి, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల డౌన్‌లోడ్‌కు కూడా వాడుతున్నారు. ప్రస్తుతం పట్నా రైల్వే స్టేషన్లో రైల్‌టెల్ సంస్థ ఒక గిగాబైట్ వై-ఫై డేటాను అందిస్తోంది. కానీ దీన్ని 10 గిగాబైట్లకు పెంచాలని భావిస్తోంది. ఎక్కువ మంది ప్రయాణికులు.. ముఖ్యంగా యువత ఉచిత ఇంటర్నెట్ కోసమే ఎక్కువగా రైల్వేష్టేషన్లకు వస్తుండటంతో ఇక్కడ నెట్ స్పీడు తగ్గిపోతోంది. అందుకే దాన్ని పెంచాలని రైల్‌టెల్ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, బిహార్‌లోని పట్నా, జార్ఖండ్‌లోని రాంచీ సహా దేశంలోని 23 రైల్వేస్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలను ప్రారంభించారు. రాబోయే మూడేళ్లలో దేశంలోని అన్ని ప్రధాన స్టేషన్లలో ఉచిత వై-ఫై అందింఆచలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఈ ఏడాది చివరకు 100 ప్రధాన స్టేషన్లలో వై-ఫై అందిస్తామని, మూడేళ్లలో 400 స్టేషన్లలో ఇస్తామని ఆయన అన్నారు. ఇది పూర్తయితే ప్రపంచంలోనే ప్రభుత్వ రంగంలో ఇంత పెద్ద ఎత్తున వై-ఫై సేవలు అందించడం ఇదే మొదటిది అవుతుందని తెలిపారు. రైల్‌టెల్ సంస్థ గూగుల్‌తో కలిసి రైల్వే ప్రయాణికులకు ఉచితంగా వై-ఫై అందిస్తోంది. -
సెప్టెంబర్ నుంచి ఉచిత వైఫై
కేకేనగర్: పబ్లిక్ ప్రదేశాల్లో ఉచిత వైఫై పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఎన్నికల వాగ్ధానాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తమిళనాడు ప్రభుత్వ కేబుల్ టీవీ సంస్థ ఇందుకోసం ఏర్పాట్లు ప్రారంభించింది. సెప్టెంబర్ నెలలో ఉచిత వైఫై సౌకర్యానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ మొదటి విడతగా 32 జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ప్రారంభించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండు, పార్కులు, ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం ఏజెంట్ల ద్వారా టెండర్లను కోరినట్లు దీనికి ఉపకరణాలు, సర్వర్, డేటా వంటివి అందజేసే ఏజెన్సీలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ పథకానికి ప్రజల నుంచి లభించే ఆదరణ బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తామని అధికారులు తెలిపారు. -
24 గంటలు ఉచిత వైఫై
- కాచిగూడ, విజయవాడ రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ సేవలు షురూ - వీడియో లింకేజీ ద్వారా ప్రారంభించిన రైల్వే మంత్రి హైదరాబాద్సీటీ : కాచిగూడ, విజయవాడ రైల్వే స్టేషన్లలో 24 గంటల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించుకొనే హైస్పీడ్ వైఫై సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. న్యూఢిల్లీ రైల్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైల్వేమంత్రి సురేష్ ప్రభు, కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి వీడియో లింకేజీ ద్వారా వైఫై సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాచిగూడ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, దక్షిణమధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఎకె గుప్తా తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ ఇండియా’లో భాగంగా డిజిటల్ రైల్-డిజిటల్ ఇండియా’ కార్యక్రమానికి రైల్వే అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఏజీఎం అన్నారు. దక్షిణమధ్య రైల్వేలోని అన్ని ఎ1, ఎ,బి కేటగిరి రైల్వేస్టేషన్లకు వైఫై సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో నాంపల్లి, వరంగల్, తిరుపతి, గుంటూరు, నాందేడ్ స్టేషన్లలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్లో వైఫై సేవలను ఆధునీకరిస్తామన్నారు. దక్షిణమధ్య రైల్వేలో మొత్తం 74 స్టేషన్లలో వైఫై సర్వీసులను దశలవారీగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. హోమంత్రి నాయిని మాట్లాడుతూ, దక్షిణమధ్య రైల్వే పనితీరు అభినందించారు. ప్రయాణికులకు సదుపాయాల కల్పనలో, సేవలలో దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉన్న కాచిగూడ స్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సూచించారు. హైస్పీడ్ సామర్ధ్యం ఉన్న వైఫై సేవలు ప్రారంభించడం వల్ల ప్రయాణికులు ముఖ్యమైన ఫైళ్లను కూడా డౌన్లోడ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని, సాంకేతిక రంగంలో దక్షిణమధ్య రైల్వే అందజేస్తున్న సేవలు ఎంతో బాగున్నాయని నగర మేయర్ ప్రశంసించారు. సేవల వినియోగం ఇలా.... రైల్వేశాఖకు అనుబంధంగా పని చేస్తున్న రైల్‌టెల్ రైల్వేస్టేషన్లలో వైఫై సేవలను విస్తరిస్తోంది. గూగుల్ సాంకేతిక భాగస్వామిగా సేవలను అందజేస్తుంది. ప్రతి రోజు 40 వేల మంది ప్రయాణికులు రాకపోక లు సాగించే కాచిగూడ స్టేషన్లో 27 యాక్సెస్ పాయింట్లు, 12 యాక్సెస్ స్విచ్‌లు ఏర్పాటు చేశారు. స్టేషన్లో ఎక్కడి నుంచైనా వైఫై సేవలను పొందేవిధంగా హైస్పీడ్ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. దీనివల్ల ప్రయాణికులు అత్యంత వేగంగా ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. హెచ్డీ వీడియో ఫైల్స్‌ను కూడా క్షణాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వాడొద్దు పక్కన పెట్టాలి. స్మార్ట్ ఫోన్, లేదా లాప్టాప్లో వైఫై రావాలంటే కింది విధంగా చేయాలి. -కాచిగూడ స్టేషన్లోకి ప్రవేశించగానే రైల్‌టెల్ వారి రైల్ వైర్ వై-ఫై నెట్వర్క్ డిస్ప్లే అవుతుంది. -వెంటనే దానికి కనెక్ట్ కావాలి. -బ్రౌజర్ ఓపెన్ చేయగానే మొబైల్ నెంబర్ అడుగుతుంది. -మీ మొబైల్ నెంబర్ ఇవ్వగానే మీకు నాలుగు అంకెల వన్‌టైమ్ పాస్వర్డ్ (ఒటిపి) వస్తుంది. -ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. -
100 స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు
న్యూఢిల్లీ: కొత్తగా మూడు రైలు సర్వీసులు ప్రారంభించనున్నట్టు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. 2016 సంవత్సరానికి గాను లోక్ సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో హమ్ సఫర్, తేజస్, ఓవర్ నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను ఆయన ప్రకటించారు. ఫుల్లీ ఎయిర్ కండీషన్డ్ థర్డ్ క్లాస్ బోగీలతో హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ ఉంటుందని వెల్లడించారు. తేజస్ ఎక్స్ ప్రెస్ 130 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని చెప్పారు. ఇందులో వై-ఫై, వినోదం సహా అత్యాధునిక సదుపాయాలు ఉంటాయని తెలిపారు. రిజర్వేషన్ లేని ప్రయాణికులకు కోసం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, దీన్ దయాళ్ బోగీలు ప్రవేశపెడుతున్నట్టు వీటిలో మంచినీళ్లు, చార్జింగ్ పాయింట్లు సహా అన్ని సదుపాయాలు ఉంటాయని వెల్లడించారు. 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు కల్పిస్తామని, రెండేళ్లలో మరో 400 స్టేషన్లకు విస్తరిస్తామని హామీయిచ్చారు. -
రోజూ గంట ఉచిత వైఫై!
* పంచాయతీల్లో అందుబాటులోకి ఫైబర్ నెట్వర్క్ * మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,320 కోట్లు * కేంద్రానికి డీపీఆర్ సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్టు పూర్తై తరువాత ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతిరోజూ గంటపాటు ఉచితంగా వైఫైను అందుబాటులో ఉంచనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన సవివరమైన ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రతి గ్రామ పంచాయతీలోని స్థానిక ప్రజలు వినియోగించుకునేందుకు ప్రతిరోజూ గంటపాటు ఉచితంగా వైఫై సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రతి జిల్లా కేంద్రంలో 25 ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రతి మండల కేంద్రంలో పది ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రతి గ్రామ పంచాయతీలో మూడు ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఈ సౌకర్యం కల్పించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,320 కోట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.3,590 కోట్ల ఇవ్వాలని, మిగతా రూ.730 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నివేదిక కేంద్ర టెలికం, ఐటీ శాఖల పరిశీలనలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికారవర్గాలు తెలిపాయి. టెరా రుణానికి సర్కారు గ్యారంటీ ! వాస్తవానికి ఇప్పటికే (కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే) తొలి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తన బినామీ అయిన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థకు కట్టపెట్టారు. 22,500 కిలోమీటర్ల మేర ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటునకు గాను రూ.333 కోట్ల కాంట్రాక్టును ఆ సంస్థకు ఇచ్చేశారు. టెరా సంస్థకు ఆంధ్రా బ్యాంకు రూ.266.4 కోట్ల రుణం మంజూరు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని బ్యాంకు షరతు విధించింది. రూ.75 కోట్లను మార్జిన్ మనీ గా చూపించాలని టెరాను కోరింది. దీంతో టెరా సంస్థ.. ఆ మేరకు గ్యారంటీ, మార్జిన్ మనీ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సాధారణంగా ఏ ప్రాజెక్టుకైనా కాంట్రాక్టర్ బ్యాంకు నుంచి రుణం తీసుకునే పక్షంలో.. ఆ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదు. కానీ టెరాకు మాత్రం ఇస్తుండడం విశేషం. -
భారత్‌లో తొలి వై-ఫై ఇంటర్నెట్ కుగ్రామాలు
నలుగురు ఐటీ నిపుణుల కృషి ఫలితం భోపాల్: షకీల్ అంజుమ్, అతని ముగ్గురి స్నేహితులు కేవలం కలలు కనడమే కాదు.. వాటిని నిజం చేసి చూపించారు కూడా. గ్రామ పంచాయతీలు కూడా చేయలేని పనిని అతి తక్కువ ఖర్చుతో చేసి చూపించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని మూడు గ్రామాలకు ఉచిత వై-ఫై ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. భారత్‌లోని తొలి వై-ఫై ఇంటర్నెట్ గల కుగ్రామాలు ఇవేనని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమే స్ఫూర్తిగా బవడికెడ జాగీర్, శివ్నాథ్పురా, దేవ్రియా గ్రామాల్లో విజయవంతంగా ఇంటర్నెట్ సదుపాయం కల్పించగలిగామని ఈ యువకుల బృందంలో ఒకరైన షకీల్ అంజుమ్ చెప్పారు. ‘ఈ పనిని మేమే స్వయంగా చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని నిర్ణయించుకున్నాం. మా లక్ష్యం సాధించడానికి రూ.రెండు లక్షలు ఖర్చు చేశాం. నిరంతరాయంగా ఇంటర్నెట్ ఇవ్వడం వల్ల కనీసం 100 మంది మొబైల్ యూజర్లు ఎంతగానో ప్రయోజనం పొందుతున్నారు. కరెంటు లేకున్నా ఇబ్బంది లేకుండా చేసేందుకు 200 ఆంపియర్ల సామర్థ్యం గల ఇన్వెర్టర్‌ను కూడా అమర్చాం’ అని అంజుమ్, తుషార్,భాను, అభిషేక్ వివరించారు. అభినందించిన ముఖ్యమంత్రి చౌహాన్ రాజ్‌గఢ్ జిల్లా కలెక్టర్ తరుణ్ కుమార్ పిఠోడ్ ఈ నెల 1న ఉచిత వై-ఫై రూటర్లను ఆవిష్కరించారు. ఈ గ్రామాల్లో నలుగురు యువకులు ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా కియోస్క్ కూడా వీళ్ల వై-ఫైను ఉపయోగించుకుంటోంది. మారుమూల ప్రాంతానికి వై-ఫై సదుపాయం తెచ్చిన ఈ నలుగురు యువకులను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా అభినందించారు. సాటి యువకులకు వీళ్లు మార్గదర్శకంగా నిలిచారని ప్రశంసించారు. వీరి భవిష్యత్ ప్రణాళికలకు అవసరమైన నిధులు, సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. -
హైహై... వైఫై!
ఫ్రీ వైఫైకి విశేష స్పందన నెక్లెస్ రోడ్, ట్యాంక్బండ్లు టాప్ త్వరలో నగర వ్యాప్తంగా 3 వేల హాట్స్పాట్లు బీఎస్ఎన్ఎల్ సన్నాహాలు సిటీబ్యూరో: ఉచిత వైఫై సేవలకు సిటీజనుల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాలు ఈ విషయంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. నగరంలో 15 చోట్ల బీఎస్ఎన్ఎల్ సంస్థ 20 నిమిషాల చొప్పున ఉచితంగా వైఫై సేవలు అందించేందుకు హాట్‌స్పాట్ పరికరాలు ఏర్పాటు చేసింది. క్రమంగా వీటి సంఖ్య పెంచుతోంది. దీనికి స్పందన అదే స్థాయిలో ఉంటోంది. నెక్లెస్ రోడ్లో వారానికి సగటున 79,076 సెషన్స్ మేర ఉచిత వైఫై వినియోగమవుతోందని... 8.83 టెరాబైట్ల డేటాను వినియోగదారులు వాడుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ట్యాంక్‌బండ్ వద్ద 61,745 సెషన్ల మేర 10.63 టెరాబైట్ల డేటా వినియోగించినట్లు తెలిసింది. ఆ తరవాత స్థానంలో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉంది. కనిష్టంగా బిర్లా ప్లానిటోరియం వద్ద 503 సెషన్స్, నిమ్స్ వద్ద 580 సెషన్స్ మేర వైఫై వినియోగిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. 3 వేల హాట్స్పాట్లు నగర వ్యాప్తంగా వైఫై సేవల విస్తరణకు 3 వేల హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు ఆలస్యం కావడం... హాట్స్పాట్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఈ పనులు ఆలస్యమవుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వపరంగా సహకారం అందితే మరో ఆరు నెలల్లో 3 వేల హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేస్తామని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. నగరంలో తమ సంస్థకు 4,500 కి.మీ మేర ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అందుబాటులో ఉందని ప్రకటించింది. వినియోగంలో సమస్యలివీ.. ఉచిత వైఫై వినియోగంలో పలుమార్లు సమస్యలు ఎదురవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఒకేసారి వందలాది మంది వైఫై సేవలకు ప్రయత్నిస్తే నిరాశే ఎదురవుతోంది. స్పీడ్ తగ్గుతోందని... ఒక్కోసారి కనెక్ట్ కావడం లేదని నెక్లెస్ రోడ్‌పై వైఫై వినియోగిస్తున్న పలువురు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినపుడు సేవలు అందడం లేదని చెబుతున్నారు. హాట్‌స్పాట్ పరికరాల సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు. వినియోగించే తీరిదీ మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆప్షన్‌ను క్లిక్ చే సి మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్మిట్ చేయాలి.ఆ తరవాత మొబైల్‌కు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి.రెండో బాక్సులో యూజర్‌నేమ్, పాస్వర్డ్ టైప్‌చేసి లాగిన్ కావాలి. అపుడు 20 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలు అందుతాయి.ఆ తరవాత వినియోగించేందుకు ప్రతి అరగంటకు రూ.30 చార్జీ అవుతుంది. ఈ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించవచ్చు. లేదా హాట్స్పాట్లు ఉన్నచోట బీఎస్ఎన్ఎల్ విక్రయించే కూపన్లను కొనుగోలు చేయవచ్చు. ప్రయోజనాలివీ.. ఆన్లైన్లో అనుసంధానించినసుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందవచ్చు. వెఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటే చాలు.. మొబైల్ డేటా నెట్వర్క్ లేకున్నా, వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్ను వినియోగించే వీలుంటుంది. కేబుల్ కనెక్షన్లతో అవసరం ఉండదు. ఆన్లైన్ ద్వారా ఒకే టీవీలో అన్ని చానళ్లు వీక్షించే వీలుంటుంది.ఒకే కనెక్షన్‌పై ఒకటి కన్నా ఎక్కువ మంది మాట్లాడుకునే యాక్సెస్ లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు సేవలే కాకుండా కొన్ని రకాల యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు. ఉదాహరణకు పార్కింగ్ యాప్, గార్బేజ్ యాప్ వంటివి. ఈ యాప్ సేవలతో నగరం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ట్రాఫిక్ చిక్కులూ తప్పుతాయి. -
యాక్ట్ ఫైబర్‌నెట్ కస్టమర్లకు ఉచిత వైఫై
హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు.. * త్వరలో వైజాగ్, బెంగళూరుకు విస్తరణ * గ్రూప్ సీఈవో బాల మల్లాది హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాక్ట్ ఫైబర్‌నెట్ కస్టమర్లకు శుభవార్త. వినియోగదార్లు ఇక నుంచి వారి ఫైబర్‌నెట్ కనెక్షన్ కలిగిన ఇల్లు, కార్యాలయం వెలుపల కూడా ఉచితంగా, అపరిమిత వైఫై ఎంజాయ్ చేయొచ్చు. అదనంగా ఎటువంటి చెల్లింపులు చేయనవసరం లేదు. ఇంటర్నెట్ సర్వీసుల రంగంలో ఉన్న యాక్ట్ ఫైబర్‌నెట్ వైఫై యాక్సెస్ పాయింట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులకు ఉచిత వైఫైని అందిస్తోంది కూడా. ఒకట్రెండు నెలల్లో అధికారికంగా సర్వీసులను ప్రకటిస్తామని గ్రూప్ సీఈవో బాల మల్లాది సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. 10 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ను అందిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం నూతనతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్టు చెప్పారు. కొత్త సర్వీసులతో మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయమన్నారు. ఇలా పనిచేస్తుంది.. కంపెనీకి చెందిన బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌కు వినియోగదారులైన వారు వైఫై జోన్లో అపరిమితంగా, ఫ్రీగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. కస్టమర్ ఒక్కసారి లాగిన్ అయితే చాలు. వైఫై జోన్లోకి వెళ్లగానే నెట్ కనెక్ట్ అవుతుంది. కస్టమర్ ఎంత డేటా వాడితే ఆ మేరకు బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లో భాగంగా ఇచ్చే ఉచిత డేటా నుంచి తగ్గిస్తారు. ఉదాహరణకు ఏ-మ్యాక్స్ 650 ప్యాక్‌లో ఉన్న కస్టమర్‌కు 50 జీబీ డేటా ఉచితం. వైఫై జోన్లో ఉన్నప్పుడు 1 జీబీ డేటా వాడితే, కస్టమర్ బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్ నుంచి 1 జీబీని తగ్గిస్తారు. బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్ పరిమితి దాటినా కొంతమేర ఇంటర్నెట్ వాడుకునే సౌకర్యం ఉంది. ఇక కంపెనీ కస్టమర్లు కానివారికి మాత్రం వైఫై జోన్లో 30 నుంచి 60 నిమిషాల వరకు మాత్రమే నెట్ ఉచితం. చాలా మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఇల్లు, కార్యాలయం దాటగానే ఆయా టెలికం ప్రొవైడర్ అందించే మొబైల్ ఇంటర్నెట్ను చార్జీలు చెల్లించి వాడుతున్నారు. ఇటువంటి వారికి యాక్ట్ వైఫై సర్వీసు పెద్ద ఉపశమనమే. వారు ఇకనుంచి మొబైల్లో యాక్ట్ ఫైబర్‌నెట్ వైఫై జోన్లో ఉచితంగా ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు. ఇతర నగరాలకూ విస్తరణ.. హైదరాబాద్‌లో ప్రస్తుతం 40 యాక్సెస్ పాయింట్లు ఏర్పాటయ్యాయి. వీటి సంఖ్యను ఏడాదిలో 200, రెండేళ్లలో 500లకు చేరుస్తామని బాల మల్లాది తెలిపారు. వైఫై జోన్ల ఏర్పాటు విషయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చొరవ అభినందనీయమని అన్నారు. ‘200ల హాట్‌స్పాట్ లొకేషన్లకుగాను రూ.15 కోట్ల వరకు వెచ్చిస్తున్నాం. మూడు నెలల్లో వైజాగ్, బెంగళూరులో ఇటువంటి సేవలు తీసుకురావాలని యోచిస్తున్నాం. డేటా చార్జీలు పెంచడం లేదు. ఉచిత డేటా పరిమితిని పెంచుతూ కస్టమర్లకు దగ్గరయ్యాం’ అని బాల తెలిపారు. వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లలో దేశంలో 7.7 లక్షల మంది కస్టమర్లతో యాక్ట్ (అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్) నాల్గవ స్థానంలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్ట్ ఫైబర్‌నెట్ కస్టమర్ల సంఖ్య 5 లక్షలు. -
మరో11ఉచిత వైఫై స్పాట్లు!
నగరంలో దశలవారీగా సేవల విసర్తణ ప్రతి రోజు 100 జీబీ వరకు డాటా డౌన్లోడ్ సోషల్ మీడియా సర్వేలో బీఎస్ఎన్ఎల్ సేవలకు బెస్ట్ రేటింగ్ హైదరాబాద్: దేశంలోనే తొలి పూర్తి స్థాయి వై ఫై నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని మరో 11 పర్యాటక, జనరద్దీ గల ప్రాంతాల్లో ఉచిత వై ఫై సేవల విస్తరణకు బీఎస్ఎన్ఎల్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 20 ప్రాంతాల్లో ఉచిత వై ఫై సేవలు అందిస్తున్న బీఎస్ఎన్ఎల్... డిసెంబర్ 31 లోగా పూర్తి స్థాయిలో ఉచిత వై ఫై సేవలను విస్తరించాలని నిర్ణయించింది. హాట్ స్పాట్స్ లో ఉచిత వై ఫై సేవల ద్వారా ప్రతి రోజు 80 నుంచి 100 జీబీ వరకు డాటా వినియోగమవుతోంది. చార్మినార్ వద్ద అత్యధికంగా వినియోగమవుతుండగా, ప్రతిరోజు సుమారు రెండు వేల మంది వరకు ఉచిత సేవలను వినియోగిస్తున్నట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఒక సోషల్ మీడియా నిర్వహించిన సర్వేలో బీఎస్ఎన్ఎల్ సేవలకు బెస్ట్ రేటింగ్ లభించింది. దీంతో బీఎస్ఎన్ఎల్ అధికారులు మరింత ఉత్సాహంతో ఉచిత వై ఫై సేవల విస్తరణ పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం మూడు రకాలుగా హాట్ స్పాట్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సౌలభ్యం మేరకు స్మాల్, మీడియం, లార్జ్ హాట్స్పాట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఒక్కో హాట్‌స్పాట్‌కు ఐదు వైఫై టవర్స్, ఒక్కో టవర్ ఐదు నుంచి పది కిలో మీటర్ల మేర సేవలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం పది కిలోమీటర్లకు ఒక జోన్‌గా పరిగణిస్తున్నారు. వారంలోగా జూపార్క్‌లో సేవలు పర్యాటక ప్రాంతామైన నెహ్రూ జూ పార్క్, గోల్కొండ ఖిల్లా, జనరద్దీ ప్రాంతాలైన కోఠి బస్ టర్మినల్, ఐటీ కారిడార్, హైటెక్ ఎగ్జిబిషన్, శిల్పారామం, శిల్పా కళా వేదిక, నిమ్స్ స్పెషాలిటీ బ్లాక్‌లలో ఉచిత వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. ఇందులో హైటెక్ ఎగ్జిబిషన్లో రెండు, గోల్కొండ ఖిల్లాలో నాలుగు చొప్పున వైఫై కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా, వారం రోజుల్లో జూపార్క్‌లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెస్తామని సంబంధిత అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. నెలలో మూడుసార్లు ఉచితం.. బీఎస్ఎన్ఎల్ హాట్‌స్పాట్స్‌లో వైఫై సేవలను వినియోగదారులు ఒక మొబైల్ ద్వారా నెలకు మూడుసార్లు 30 నిమిషాల చొప్పున ఉచితంగా వినియోగించవచ్చు. ఆ తర్వాత ఓచర్ బేస్ట్ సర్వీసెస్, ఈ-ఓచర్ బేస్డ్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ ఓచర్స్ కోసం డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను వినియోగించవచ్చు. ఈ సర్వీసులను తక్కువ రేట్లలో బీఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచింది. ఒక్క రోజు 4 జీబీ సేవలకు రూ. 140 మాత్రమే. ఒక బ్రాడ్‌బ్యాండ్ లో ఆయితే 4 జీబీలకు రూ. 500 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. వోచర్ బేస్డ్ సర్వీసులు రూ. 30లకు 30 నిమిషాలు, రూ.60 లకు 60 నిమిషాలు, రూ.90లకు 120 నిమిషాలు, రూ. 150 లకు ఒక రోజు పూర్తిగా వినియోగించవచ్చు. -
జూన్ 2 నుంచి గాంధీ ఆస్పత్రిలో ఉచిత వై-ఫై
హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఉచిత వై-ఫై సేవలు మరో ఐదురోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయమై బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సుబ్బారావు గురువారం ఆస్పత్రిని సందర్శించి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లుతో భేటీ ఆయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. 'వై-ఫై నగరంగా హైదరాబాద్' పధకంలో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2వ తేదీ నుంచి గాంధీ ఆస్పత్రిలో ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గాంధీ ఓపీ, ఇన్‌పేషెంట్ విభాగాల వద్ద వై-ఫై రూటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. 2 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్ స్పీడుతో వై-ఫై సేవలు అందిస్తామన్నారు. ప్రతిరోజు మొదటి అరగంట పాటు ఈ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని, తర్వాత వినియోగించుకున్న డేటాకు ఛార్జీలు వర్తిస్తాయని తెలిపారు. రెండు రోజుల్లో వై-ఫై రూటర్లు ఇన్స్టాల్ చేసి, జూన్ 2వ తేదీ నుంచి వై-ఫై సేవలను అందుబాటులోకి తెస్తామని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సుబ్బారావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. -
సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై
-
హైదరాబాద్‌లో ఉచిత వై-ఫై సేవలు
-
ఏడాది తర్వాతే ఉచిత వైఫై..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నగరానికి వైఫై ఇంటర్నెట్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 'నా పిల్లలు కూడా వైఫై వాడతారు కానీ, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది కాలం పడుతుంది' అని ఆయన శుక్రవారం తెలిపారు. కేజ్రీవాల్ సీఎం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సభలో మాట్లాడుతూ.. విద్యుత్, నీటి సరఫరా అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని అన్నారు. ప్రతి ఇంటికీ నెలసరి ఉచితంగా 20 వేల లీటర్ల మంచినీరు, విద్యుత్ బిల్లులపై 50 శాతం రాయితీ అంశాలపై పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం 24 గంటలు పనిచేస్తుందని, అవినీతిపై పోరాటం కొనసాగిస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. 'తక్కువగా మాట్లాడు-ఎక్కువగా పనిచేయడం' తమ ప్రభుత్వ పాలసీ అని కేజ్రీవాల్ అన్నారు. తమ టీమ్ ఓ పద్ధతి ప్రకారమే పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.అవినీతి నిరోధించడానికి హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అవినీతి స్థాయిని బట్టి కొందరు వ్యక్తులు మాత్రమే శిక్షింపబడతారని అన్నారు. కాగా వైఫై సౌకర్యం అన్ లిమిటెడ్ కాదని, రోజులో కేవలం అరగంట మాత్రమే వైఫై ఇచ్చే యోచనలో ఉన్నామని, డౌన్ లోడింగ్ పై ఆంక్షలు ఉంటాయని ఆప్ నేతల సమాచారం. -
ఉచిత వై-ఫై
బెంగళూరు: బెంగళూరుతోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలలో ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి నుంచి ఈ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఐటీ శాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్ చెప్పారు అయితే కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఈ సదుపాయాన్ని అందించనున్నట్లు ఆయన తెలిపారు. బెంగళూరులోని 110 ప్రాంతాలతోపాటు అన్ని జిల్లా కేంద్రాలలో మూడు మూడు ప్రాంతాలలో ఉచిత వై-ఫై సదుపాయం కల్పించనున్నట్లు పాటిల్ చెప్పారు. -
గోల్డెన్ ఆఫర్
టైర్ 2, 3 నగరాల్లో కంపెనీల స్థాపనకు ముందుకు వస్తే ఉచితంగా భూమి పెట్టుబడుల సేకరణకు త్వరలో సిద్ధు అమెరికా పర్యటన ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ప్రాంతాల్లో ఉచిత ‘వై-ఫై’ వెల్లడించిన మంత్రి ఎస్ఆర్ పాటిల్ బెంగళూరు : రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో (టైర్-2,3 సిటీల్లో) ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు 30 ఏళ్ల పాటు ఉచితంగా భూమిని లీజుకు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఐటీ,బీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్ పాటిల్ తెలిపారు. బెంగళూరులో మీడియాతో ఆయన బుధవారం మాట్లాడారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి పన్ను రాయితీ కూడా ఎక్కువగానే ఉంటుందని ప్రకటించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పారిశ్రామిక వేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. సమాచార సాంకేతిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి వీలుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్వరలో అమెరికా పర్యటన చేపట్టనున్నారని చెప్పారు. ఆయన వెంట తనతో పాటు ఇక్కడి ఐటీ ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా వెళుతున్నట్లు పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన అమెరికాకు తీసిపోని రీతిలో కర్ణాటకను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఇక్కడి వనరులను అమెరికాలోని పెట్టుబడిదారులకు వివరించేందుకు గాను ఈ పర్యటన చేపట్టినట్లు వివరించారు. ఐటీ అభివృద్ధి బెంగళూరుకు మాత్రమే పరిమితం కానివ్వబోమన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలిపారు. బెంగళూరు పరిధిలో వంద ప్రాంతాలతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు మంత్రి చెప్పారు. -
ర్యాపిడ్ మెట్రో రైళ్లలో ఉచితంగా వై-ఫై
గుర్గావ్ ప్రాంతంలో ర్యాపిడ్ మెట్రో రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా వై-ఫై సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. 5.1 కిలోమీటర్ల పొడవున ఆరు స్టేషన్లలో ఆగే ఈ రైళ్లలో బుధవారం నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఎంటీఎస్ బ్రాండ్‌నేమ్‌తో సేవలు అందించే సిస్టెమా శ్యామ్ టెలి సర్వీసెస్, ర్యాపిడ్ మెట్రోరైల్ గుర్గావ్ లిమిటెడ్ కలిసి దీన్ని అందిస్తున్నాయి. ర్యాపిడ్ మెట్రోలతో పాటు ఇంకా సికందర్పూర్, ఇండస్ఇండ్ బ్యాంక్ సైబర్ సిటీ, ఫేజ్2, మైక్రోమాక్స్ మౌల్సరి ఎవెన్యూ స్టేషన్లలో కూడా వై-ఫైని ఉచితంగా అందించాలని ఎంటీఎస్ నిర్ణయించింది. అయితే.. ఈ ఉచిత సేవలు 6నెలల పాటు మాత్రమే కొనసాగుతాయి. ఆ తర్వాతి నుంచి వీటికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా 9.8 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని ఎంటీఎస్ సీఈవో దిమిట్రీ షుకోవ్ తెలిపారు. ఇతర నగరాల్లో కూడా ఈ సేవలు అందించడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. 95 శాతానికి పైగా ప్రయాణికులు మెట్రోలో వెళ్లేటప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించుకోవాలని భావిస్తున్నారని, 15-35 మధ్య వయస్కులలో ఇది మరీ ఎక్కువగా ఉందని సంస్థ తెలిపింది.