ఫ్రీ వై-ఫైతో ఏం చూస్తున్నారో తెలుసా?
రైల్వే స్టేషన్లలో ఉచితంగా అందిస్తున్న వై-ఫైని వాడుకోవడంలో బిహార్ రాజధాని పట్నా అగ్రస్థానంలో నిలిచింది. అయితే.. అక్కడ ఎక్కువగా ఈ వై-ఫైని ఉపయోగించి ఏం చూస్తున్నారో తెలుసా.. పోర్న్ సైట్లు! ఈ విషయాన్ని రైల్వే అధికారులు తెలిపారు. దేశంలో మరే ఇతర రైల్వేస్టేషన్ కన్నా ఉచిత వై-ఫైని పట్నా రైల్వే స్టేషన్ ఎక్కువగా వాడుకుంటోందని, అయితే ప్రధానంగా పోర్న్ సైట్లు వెతకడానికే దీన్ని వాడుతున్నారని రైల్‌టెల్ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. పట్నా తర్వాతి స్థానంలో ఇంటర్‌నెట్ సెర్చిలో జైపూర్, బెంగళూరు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లున్నాయి.
తూర్పు రైల్వే పరిధిలోని దానాపూర్ డివిజన్ కిందకు వచ్చే పట్నా స్టేషన్.. బిహార్‌లోనే ఉచిత వై-ఫై పొందిన మొదటి స్టేషన్. ఈ స్టేషన్ మీదుగా రోజుకు 200కు పైగా రైళ్లు వెళ్తుంటాయి. దేశంలోనే బాగా రద్దీగా ఉండే స్టేషన్లలో ఇదొకటి. రైల్‌టెల్ అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం, పట్నాలో ఎక్కువగా యూట్యూబ్, తర్వాత వికీపీడియాలను పట్నా స్టేషన్‌లో చూస్తున్నారు. అయితే మిగిలిన అన్నింటికంటే పోర్న్ సైట్లను చూడటం, డౌన్‌లోడ్ చేసుకోవడం లాంటివి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. కొందరు మాత్రం యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోడానికి, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల డౌన్‌లోడ్‌కు కూడా వాడుతున్నారు.
ప్రస్తుతం పట్నా రైల్వే స్టేషన్‌లో రైల్‌టెల్ సంస్థ ఒక గిగాబైట్ వై-ఫై డేటాను అందిస్తోంది. కానీ దీన్ని 10 గిగాబైట్లకు పెంచాలని భావిస్తోంది. ఎక్కువ మంది ప్రయాణికులు.. ముఖ్యంగా యువత ఉచిత ఇంటర్నెట్ కోసమే ఎక్కువగా రైల్వేష్టేషన్లకు వస్తుండటంతో ఇక్కడ నెట్ స్పీడు తగ్గిపోతోంది. అందుకే దాన్ని పెంచాలని రైల్‌టెల్ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, బిహార్‌లోని పట్నా, జార్ఖండ్‌లోని రాంచీ సహా దేశంలోని 23 రైల్వేస్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలను ప్రారంభించారు. రాబోయే మూడేళ్లలో దేశంలోని అన్ని ప్రధాన స్టేషన్లలో ఉచిత వై-ఫై అందింఆచలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఈ ఏడాది చివరకు 100 ప్రధాన స్టేషన్లలో వై-ఫై అందిస్తామని, మూడేళ్లలో 400 స్టేషన్లలో ఇస్తామని ఆయన అన్నారు. ఇది పూర్తయితే ప్రపంచంలోనే ప్రభుత్వ రంగంలో ఇంత పెద్ద ఎత్తున వై-ఫై సేవలు అందించడం ఇదే మొదటిది అవుతుందని తెలిపారు. రైల్‌టెల్ సంస్థ గూగుల్‌తో కలిసి రైల్వే ప్రయాణికులకు ఉచితంగా వై-ఫై అందిస్తోంది.