బాంబే హైకోర్టు స్పష్టీకరణ
ముంబై: నగ్నంగా ఉండే ప్రతి పెయింటింగ్ అశ్లీలంగా ఉందని చెప్పలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ప్రముఖ చిత్రకారులు ఎఫ్‌ఎన్ సౌజా, అక్బర్ పదమ్‌సీ గీసిన కళాఖండాలను వారికి తిరిగిచ్చేయాలంటూ కస్టమ్స్ విభాగం అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది జూలైలో ముంబై కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ జస్టిస్ ఎంఎస్ సొనక్, జస్టిస్ జితేంద్ర జైన్ డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది. నగ్నంగా అగుపించేంది ఏదైనా సరే అశ్లీలమైనదనే వ్యక్తిగత అవగాహన ఆధారంగా మాత్రమే ఆ అధికారి నిర్ణయం తీసుకున్నారని, నిపుణుల అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని పేర్కొంది.
ముంబై వ్యాపారవేత్త ముస్తాఫా కరాచీవాలాకు చెందిన బీకే పాలిమెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2022లో లండన్‌లో జరిగిన రెండు వేర్వేరు వేలాల్లో ఎఫ్‌ఎన్ సౌజా, అక్బర్ పదమ్‌సీ గీసిన ఏడు పెయింటింగ్‌లను సొంతం చేసుకుంది. వీటిని 2023 ఏప్రిల్‌లో ముంబైకి తీసుకురాగా కస్టమ్స్ విభాగం స్పెషల్ కార్గో కమిషనరేట్ వీటిని అసభ్యకర వస్తువులని అభ్యంతరం చెబుతూ స్వాధీనం చేసుకుంది. 2024లో అసిస్టెంట్ కమిషనర్ వీటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడంతోపాటు ఆ కంపెనీకి రూ.50వేల జరిమానా సైతం విధించారు. ఈ చర్యలను బీకే పాలిమెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో సవాల్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment