customs department
-
నగ్న చిత్రం ప్రతిదీ అసభ్యకరం కాదు
ముంబై: నగ్నంగా ఉండే ప్రతి పెయింటింగ్ అశ్లీలంగా ఉందని చెప్పలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ప్రముఖ చిత్రకారులు ఎఫ్ఎన్ సౌజా, అక్బర్ పదమ్సీ గీసిన కళాఖండాలను వారికి తిరిగిచ్చేయాలంటూ కస్టమ్స్ విభాగం అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది జూలైలో ముంబై కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ జస్టిస్ ఎంఎస్ సొనక్, జస్టిస్ జితేంద్ర జైన్ డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది. నగ్నంగా అగుపించేంది ఏదైనా సరే అశ్లీలమైనదనే వ్యక్తిగత అవగాహన ఆధారంగా మాత్రమే ఆ అధికారి నిర్ణయం తీసుకున్నారని, నిపుణుల అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని పేర్కొంది. ముంబై వ్యాపారవేత్త ముస్తాఫా కరాచీవాలాకు చెందిన బీకే పాలిమెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2022లో లండన్‌లో జరిగిన రెండు వేర్వేరు వేలాల్లో ఎఫ్ఎన్ సౌజా, అక్బర్ పదమ్సీ గీసిన ఏడు పెయింటింగ్‌లను సొంతం చేసుకుంది. వీటిని 2023 ఏప్రిల్‌లో ముంబైకి తీసుకురాగా కస్టమ్స్ విభాగం స్పెషల్ కార్గో కమిషనరేట్ వీటిని అసభ్యకర వస్తువులని అభ్యంతరం చెబుతూ స్వాధీనం చేసుకుంది. 2024లో అసిస్టెంట్ కమిషనర్ వీటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడంతోపాటు ఆ కంపెనీకి రూ.50వేల జరిమానా సైతం విధించారు. ఈ చర్యలను బీకే పాలిమెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో సవాల్ చేసింది. -
మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్ అధికారుల సమన్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు పంపించారు. ఖరీదైన చేతి గడియారాల అక్రమ రవాణాకు సంబంధించి హర్ష రెడ్డికి కస్టమ్స్ అధికారులు సమన్లు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఏప్రిల్ 27వ తేదీన హాజరు కావడానికి అంగీకరించినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. ఫ్రిబవరి ఐదో తేదీన చెన్నై విమానాశ్రయంలో రెండు లగ్జరీ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాచీలను మహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా భారత్‌లోకి తీసుకొచ్చినట్టు గుర్తించారు. ఆ వాచీల్లో ఒకటి పాటెక్ ఫిలిప్ 5740, రెండోది బ్రెగ్యుట్ 2759 ఉన్నాయి. అయితే, పాటెక్ ఫిలిప్ వాచ్‌కు మన దేశంలో ఎక్కడా డీలర్లు లేరు. ఇక, బ్రెగ్యుట్ కంపెనీల వాచీలు ఇండియా మార్కెట్లో స్టాక్ లేకపోవటంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వాచీలను పరిశీలించడంతో వాటి విలువ ఏకంగా రూ.1.70 కోట్లపైగా ఉండటం చూసి వారే ఖంగుతున్నారు. దీంతో ముబీన్‌ను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో విచారణ చేయగా మధ్యవర్తి నవీన్‌కుమార్ పేరును వెల్లడించారు. ఇదే క్రమంలో మార్చి 12న అలోకం నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మరిన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం. స్పందించిన హర్ష.. ఈ సందర్భంగా రెండు వాచీలను పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి కోసం కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ముబీన్‌ను లగ్జరీ వాచ్ డీలర్‌గా, నవీన్‌కుమార్ మధ్యవర్తిగా, హర్షరెడ్డి కొనుగోలుదారుడిగా అనుమానిస్తున్నారు. ఇక, ఈ వాచీల కొనుగోలుకు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రెజరీ (యూఎస్డీటీ)కి చెందిన టెథర్ వంటి క్రిప్టో కరెన్సీ ఆధారంగా కొంత డబ్బు, మరికొంత హవాలా రూపంలో చెల్లించినట్టు తేలిందని కస్టమ్స్ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే హర్షకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించాయి. కాగా, చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షకు గత నెల 28వ తేదీన నోటీసులు ఇచ్చి ఏప్రిల్ నాలుగో తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే, ఇటీవల హర్షకు డెంగ్యూ ఫీవర్ రావడంతో అతను ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నాడు. దీంతో, ఏప్రిల్ 27వ తేదీన హాజరవుతానని ఈనెల మూడో తేదీన సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఇక, పరిమాణాలపై తాజాగా హర్ష స్పందిస్తూ వాచీల అక్రమ రవాణాలో తనకు ప్రమేయం లేదన్నారు. ఇవన్నీ నిరాధారమైనవని అన్నారు. అనారోగ్యం కారణంగా తాను విచారణకు హాజరుకాలేకపోయినట్టు తెలిపారు. మరోవైపు.. హర్షను విచారించే వరకు నవీన్ కుమార్‌కు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని మద్రాస్ కోర్టు స్పష్టం చేసింది. -
వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు..
ముంబై: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ భారీ స్మగ్లింగ్‌ను నిలువరించారు. ఓ వ్యక్తి నుంచి రూ.28 కోట్లు విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతను బ్యాగులో దీన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. బ్యాగును చింపి కొకైన్‌ను బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. #WATCH | Mumbai Airport Customs y'day arrested an Indian pax carrying 2.81 Kg cocaine worth Rs 28.10 Cr, concealed in a duffle bag. Probe shows that pax was lured to carry drugs by persons whom he met only over social media. He was honey trapped to indulge in smuggling: Customs pic.twitter.com/oCxBG5F2CP — ANI (@ANI) January 10, 2023 ఈ వ్యక్తి బ్యాగులో మొత్తం 2.81కిలోల కొకైన్ దొరికింది. దీని విలురు రూ.28.10 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యక్తి ఓ మహిళ వలపు వలలో చిక్కుకునే స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ, ఇతడ్ని కొకైన్ ఢిల్లీకి తీసుకెళ్లి మరో వ్యక్తికి ఇవ్వమని చెప్పిందని పేర్కొన్నారు. ఆమె మాయలో పడిన ఇతడు స్మగ్లింగ్ చేసేందుకు సిద్ధమైనట్లు వివరించారు. గతవారం కూడా ముంబై విమానాశ్రయంలో రూ.47 కోట్లు విలువ చేసే కొకైన్, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 4.47 కేజీల హెరాయిన్, 1.6 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. చదవండి: ఆటోను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి -
విశాఖ.. ఎగుమతులకు స్వర్గధామం
సాక్షి, విశాఖపట్నం: ఎగుమతుల్లో విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ), గంగవరం పోర్టు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వ సహకారం.. సరుకు రవాణా రంగంలో సత్ఫలితాలిస్తున్నాయి. వీపీఏలో 32 బెర్త్‌లు, గంగవరంలో 9 బెర్త్‌లున్నాయి. ఇందులో మొత్తం 23 బెర్త్‌ల ద్వారా కార్గో కంటైనర్ ఎక్స్‌పోర్ట్స్ జరుగుతుంటాయి. విశాఖ నుంచి ఎక్కువగా అమెరికా, చైనా, యూఏఈ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇటలీ, వియత్నాం, జపాన్, కెనడా దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా ప్రపంచ పెద్దన్న అమెరికాదే అగ్రస్థానం కావడం విశేషం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఏకంగా రూ. 11,866 కోట్ల ఎగుమతులు జరిగాయి. తర్వాత స్థానంలో చైనా (రూ.8,307 కోట్లు), యూఏఈ (రూ.4,358 కోట్లు) ఉన్నాయి. ఎగుమతుల్లో సింహభాగం సముద్ర ఉత్పత్తులదే. అలాగే ఎగుమతుల్లో వృద్ధికి అవకాశమున్న అన్ని అంశాలనూ సద్వినియోగం చేసుకుంటూ.. విశాఖపట్నంలోని పోర్టులు తమ జోరును కొనసాగిస్తున్నాయి. ఎగుమతులకు సిద్ధం చేస్తున్న సముద్ర ఉత్పత్తులు ఇక్కడ లైసెన్స్ తీసుకుంటే.. దేశ విదేశీ ఎగుమతులకు కస్టమ్స్ శాఖ అనుమతులను సులభతరం చేయడంతో విశాఖ నుంచి సరుకు రవాణా మరింత వేగం పుంజుకుంటోంది. 24/7 కస్టమ్స్ అధికారులు పోర్టులో అందుబాటులో ఉంటూ.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా వన్‌టైమ్ పర్మిషన్ విధానం అమలుచేస్తున్నారు. దీని ద్వారా డైరెక్ట్ పోర్ట్ ఎంట్రీ (డీపీఈ) కింద అనుమతులు వేగవంతమయ్యాయి. విశాఖ పోర్టుల్లో 29 శాతం వరకు ఈ తరహాలో ఎగుమతులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. ఈ విధానంవల్ల సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. ఈ–సంచిత్ సాంకేతికత ద్వారా పోర్టులోకి రాకముందే ఎగుమతికి సంబంధించిన సరుకు వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేస్తున్నారు. ఈ సౌకర్యం తీసుకురావడంతో దాదాపు 90 శాతం సంస్థలు దీనిపైనే ఆధారపడుతూ.. ఎగుమతులను వేగవంతం చేస్తున్నాయి. ఎగుమతులకు సంబంధించి కస్టమ్స్ లైసెన్స్‌ను విశాఖపట్నంలో తీసుకుంటే చాలు.. దేశంలోని ఏ పోర్టు నుంచైనా.. ఏ దేశానికైనా ఎగుమతి, దిగుమతులు చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఈపీసీజీతో ఎగుమతి సంస్థలకు వెసులుబాటు దేశ విదేశాల ఎగుమతులకు విశాఖపట్నం స్వర్గధామంగా ఉంది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (ఈపీసీజీ) పథకం ద్వారా ఐజీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు లభిస్తుంది. షిప్పింగ్ బిల్స్ డ్రాబ్యాక్ క్లెయిమ్ చేసుకోవడం విషయంలోనూ వైజాగ్ కస్టమ్స్ ముందుంటుంది. ప్రతినెలా రూ.60 కోట్ల వరకు ఎగుమతిదారులు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఐజీఎస్టీ రిఫండ్ ప్రతినెలా రూ.45 కోట్లు జరుగుతోంది. ఆన్లైన్ పద్ధతుల ద్వారా ఎగుమతులను మరింత సులభతరం చేశాం. ఈ కారణంగా ఎగుమతుల విషయంలో వైజాగ్ దూసుకుపోతోంది. – డా. జేన్ జేసుదాస్, కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ -
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 61కిలోల గోల్డ్ సీజ్.. కస్టమ్స్ చరిత్రలోనే రికార్డ్
ముంబై: విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాల గుట్టురట్టు చేశారు ముంబై కస్టమ్స్ అధికారులు. ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్థాయిలో బంగారం పట్టుకున్నారు. రెండు వేరు వేరు సంఘటనల్లో మొత్తం 61 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. దాని విలువ సుమారు రూ.32 కోట్లు ఉంటుందని తెలిపారు. ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ విభాగం చరిత్రలో ఒక్కరోజులో సీజ్ చేసిన విలువలో ఇదే అత్యధికమని తెలిపారు. ఈ సంఘటన గత శుక్రవారం జరిగినట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మొదటి ఆపరేషన్‌లో టాంజానియా నుంచి వచ్చిన నలుగురు భారతీయులను తనిఖీ చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన బెల్టుల్లో 1 కేజీ బంగారం బిస్కెట్లను దాచి తీసుకొచ్చారు. మొత్తం రూ.28.17 కోట్లు విలువైన యూఏఈ తయారీ గోల్డ్ బార్స్ 53 లభ్యమయ్యాయి. నలుగురిని అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. మరో ఆపరేషన్‌లో 8 కిలోలు సుమారు రూ.3.28 కోట్ల విలువైన బంగారం సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద తనిఖీలు చేయగా ఈ బంగారం బయటపడింది. ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి కలిసి బంగారాన్ని మైనం రూపంలో చేసి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. దానిని జీన్స్‌లో పెట్టి తీసుకొస్తున్నారని తెలిపారు. ఇదీ చదవండి: Prashant Kishor: ఎన్నికల్లో పోటీపై ప్రశాంత్ కిషోర్ క్లారిటీ.. ఏమన్నారంటే? -
వామ్మో.. ఈ వాచ్ విలువ ఇన్ని కోట్లా? పోలీసులకు చిక్కడంతో..!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల నుంచి అక్రమంగా విలువైన వస్తువులను తీసుకొస్తుంటే కస్టమ్స్ అధికారులు పసిగట్టి పట్టేస్తుంటారు. అలాంటి సంఘటనే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం జరిగింది. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? పోలీసులు పట్టుకున్న చేతి గడియారాల విలువ తెలిస్తే.. ఆశ్చర్యపోవటం మీ వంతవుతుంది. మొత్తం ఏడు గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వజ్రాలు పొదిగిన వైట్ గోల్డ్ వాచ్ విలువ ఏకంగా రూ.27 కోట్లు ఉంటుందటా.. అత్యంత విలువైన ఏడు చేతి గడియారాలని అక్రమంగా తీసుకొస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టేశారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద విలువైన గడియారాలతో పాటు వజ్రాలు పొదిగిన బ్రెస్లెట్, ఐఫోన్ 14ప్రోను సైతం సీజ్ చేశారు. లగ్జరీ వస్తువులకు పన్నులు, ఇతర సుంకాలు చెల్లించకుండానే దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా జువెలరీ, వాచ్ తయారీ సంస్థ జాకబ్ అండ్ కో.. తయారు చేసిన ఓ వాచ్‌లో విలువైన వజ్రాలు పొదిగారని, అది సంపన్నులు మాత్రమే ధరిస్తారని అధికారులు తెలిపారు. మొత్తం పట్టుబడిన వస్తువుల విలువ రూ.28 కోట్లకుపైగా ఉంటుందని, ఈ స్థాయిలో పట్టుకోవటం ఇదే తొలిసారిగా వెల్లడించారు. 60 కిలోల బంగారంతో సమానమని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘ఎల్జీ సాబ్ జస్ట్ చిల్.. మీలా నా భార్య సైతం చేయలేదు’.. కేజ్రీవాల్ ట్వీట్ -
రూ.150 కోట్ల మాదక ద్రవ్యాలు ధ్వంసం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న ఐకానిక్ వారోత్సవాల (ఆజాదీ కా అమృత్ మహోత్సవ్)ను పురస్కరిం చుకుని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు గతంలో పట్టుబడ్డ మాదక ద్రవ్యాలను బుధవారం ధ్వంసం చేశారు. కేంద్రమంత్రి నిర్మల సీతా రామన్ వర్చువల్‌గా పాల్గొన్న ఈ కార్య క్రమంలో హైదరాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు 29.35 కేజీల హెరా యిన్, 4,821 కేజీల గంజాయిని ధ్వంసం చేశారు. హైదరాబాద్ జోన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ టాక్స్ కమిషనర్ బీవీ శివ కుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రెండే ళ్లుగా థాయ్‌లాండ్, ఉగాండా, జింబా బ్వే, టాంజానియా, జాంబియా దేశాల నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలను హైదరాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ సిబ్బంది పట్టుకున్నారు. ఇందులో 35 కేజీల హెరాయిన్, కొకైన్ ఉన్నాయి. హెరా యిన్ విలువ రూ.142 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సిద్ధిపేట, ఎల్బీ నగర్, పెద్ద అంబర్ పేట తదితర ప్రాంతాల్లో 4,821 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు, దీని విలువ రూ.9.62 కోట్లు ఉంటుందని వివరించారు. -
ఉన్నా... లేనట్లే
సాక్షి, హైదరాబాద్: పోలీసు, ఆబ్కారీశాఖల్లో ఖాకీ డ్రెస్ ధరించిన ప్రతి ఉద్యోగి ప్రధాన కర్తవ్యం నేరాల నియంత్రణ. కానీ ఎక్సైజ్‌లో కొంతకాలంగా ఆ విధి నిర్వహణ కొరవడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నార్కోటిక్ డ్రగ్స్ నేరాల కట్టడిలో ఆబ్కారీ యంత్రాంగం విఫలమవుతోంది. కొందరు అధికారులు మాత్రమే నిజాయితీగా విధులు నిర్వహిస్తుండగా ఎక్కువ మంది ఎక్సైజ్ స్టేషన్ల వారీగా ఆదాయంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసు కంట్రోల్ రూమ్ తరహాలో ఆబ్కారీ శాఖలోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఆచరణలో అలంకారప్రాయంగా మారింది. దీనిపై సరైన ప్రచారం లేదు. మరోవైపు గంజాయి, కోకైక్ వంటి మత్తు పదార్థాల సరఫరాపై సమాచారాన్ని రాబట్టుకునేందుకు గతంలో బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ పని చేసేది. ఒకరిద్దరు అధికారులు అలాంటి ఇన్ఫార్మర్ల నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే డ్రగ్స్ నియంత్రణలో మంచి ఫలితాలను సాధించారు. కానీ ఇప్పుడు కంట్రోల్ రూమ్, ఇన్ఫార్మర్ వ్యవస్థ రెండూ దాదాపుగా నిర్వీర్యమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో డ్రగ్స్ సరఫరా, విక్రేతలను, బాధితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎక్సైజ్‌శాఖ పనితీరు పరిమితంగా మారింది. పోలీసులకు ధీటైన యంత్రాంగం ఉన్నప్పటికీ ఆ స్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. వంద తరహాలో 24733056 నంబర్ .... ఒకవైపు రాడిస్బ్లూ హోటల్ వంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నప్పటికీ మరోవైపు గంజాయి, ఇతర మత్తుపదార్థాల వెల్లువ కొనసాగుతూనే ఉంది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ మీదుగా మత్తుపదార్థాలు సరఫరా అవుతున్నాయి. అంతేకాకుండా స్కూళ్లు, కాలేజీలు, నగర శివార్లే ప్రధాన అడ్డాలుగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2016లో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ కంట్రోల్ రూమ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. స్కూళ్లు, కాలేజీల నుంచి నేరుగా సమాచారం అందేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. 2017 వరకు ఈ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసింది. 24 గంటల పాటు ఫిర్యాదులను స్వీకరించేందుకు సిబ్బందిని నియమించారు. ఎక్కడి నుంచైనా టోల్ ఫ్రీ నంబర్ 24733056కు సమాచారం అందజేయవచ్చు. ఇప్పటికీ ఈ నంబర్ అందుబాటులో ఉన్నప్పటికీ సరైన ప్రచారం లేకపోవడం వల్ల పెద్దగా ఫిర్యాదులు అందడం లేదు. బెల్ట్‌షాపులు, మైనర్లకు మద్యం అమ్మకాలు వంటి వాటిపైనే తరచు ఫిర్యాదులు అందుతున్నాయి.. కానీ నార్కోటిక్ నేరాలపైన రావడం లేదని ఓ అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఇన్ఫార్మర్ వ్యవస్థ లేకపోవడం కూడా ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. బర్త్‌డే పార్టీలు, వేడుకలే లక్ష్యం... బర్త్‌డే పార్టీలు, యువత ఎక్కువగా గుమిగూడేందుకు అవకాశం ఉన్న వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఒకరి నుంచి ఒకరికి ఈ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఒక పార్టీలో నలుగురు కొత్తవాళ్లు గంజాయిని సేవిస్తే ఆ నలుగురు మరో నలుగురికి దాన్ని అలవాటు చేస్తున్నారు. ఇలా వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరిస్తుంది. నగరంలోని ధూల్‌పేట్, నానక్‌రామ్‌గూడ, నేరేడ్మెట్, శేరిలింగంపల్లి, సూరారం, జీడిమెట్ల, కొంపల్లి, బోయిన్పల్లి, నాగోల్, కాప్రా, తదితర ప్రాంతాలు ప్రధాన అడ్డాలుగా మారాయి. (చదవండి: లగేజ్ బ్యాగేజ్‌లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు) -
అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ సీఎంపై సంచలన ఆరోపణలు
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు భారీ షాక్ తగిలింది. కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో పినిరయి విజయన్‌కు చాలా సన్నిహిత సంబంధం ఉందనే ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్పప్న సురేష్ కస్టమ్స్ అధికారుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. గోల్డ్, డాలర్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాత్ర ఎంతో ఉందని.. ఆయన స్వయంగా కాన్సులేట్ జనరల్‌తో మాట్లాడారని ఆమె కస్టమ్స్ అధికారులకు తెలిపారు. విజయన్‌తో పాటు మరో ముగ్గురు కేబినెట్ మంత్రులపై ఆమె ఆరోపణలు చేశారు. ఈ విషయాలను కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు కేరళ హై కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘విజయన్‌కు అరబిక్ భాష రాదు. అందువల్ల స్వప్న సురేష్ ముఖ్యమంత్రికి, కాన్సులేట్ జనరల్‌కి మధ్య మధ్యవర్తిగా వ్యవహించారు. ఈ డీల్‌లో సీఎం, మిగతా ముగ్గురు మంత్రులు కోట్ల రూపాయలను కమిషన్‌గా పొందినట్లు స్వప్న సురేష్ తెలిపారు’’ అన్నారు. ఈ సందర్భంగా కేరళ ప్రతిపక్ష నాయుకుడు రమేశ్ చెన్నితాలా మాట్లాడుతూ.. ‘‘గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మొదటి నుంచి మేం ఏం ఊహించామో అదే జరిగింది. ఈ కేసులో ముఖ్యమంత్రికి సంబంధం ఉందని మేం ముందే గుర్తించాం. దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు’’ అన్నారు. చదవండి: గోల్డ్ స్మగ్లింగ్ కేసు: సీఎం రాజీనామా చేయాలి -
'కస్టమ్స్'.. తీర్చేయాప్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి దుబాయ్‌లో తన మేనమామ ఇంట్లో విందుకు హాజరైంది. వారిచ్చిన బంగారు నెక్లెస్‌ను వేసుకుని శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే కస్టమ్స్‌వాళ్లు సరైన పత్రాలు లేవని భారీగా పన్ను విధించారు. హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్యాసింజర్‌కు దుబాయ్ ఎయిర్‌పోర్టులో మరో భారతీయుడు ఒక బ్యాగు ఇచ్చి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తమ వాళ్లకు ఇవ్వాలని కోరాడు. అలా తెచ్చి కస్టమ్స్ అధికారుల తనిఖీలో అందులో బంగా రం ఉండటంతో జైలుపాలయ్యాడు. విదేశీ వస్తువులు భారత్‌కు తీసుకొచ్చే విషయంలో నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన లేకపోవడంతో ఒక్కోసారి అమాయకులు కస్టమ్స్ వద్ద తీవ్ర ఇబ్బందులు పడటం, అధిక పన్ను చెల్లించాల్సి రావడం, కొన్ని సందర్భాల్లో అరెస్టు కావడం జరుగుతోంది. విదేశాలకు వెళ్లేవారు లగేజీ, వస్తువుల విషయంలో నిబంధనలను యాప్ ద్వారా తెలుసుకోవాలని వారు సూచిస్తున్నారు. నిబంధనలు ఇవీ... 1 రెండు లీటర్ల లిక్కర్, 100 సిగరెట్లు, ఒక ల్యాప్‌టాప్, ఒక ఫోన్ మాత్రమే తీసుకొస్తే పన్ను విధించరు. రెండో ఫోన్, రెండో ల్యాప్‌టాప్ తీసుకొస్తే దాని ఖరీదు రూ.50 వేలు దాటితే కస్టమ్స్ డ్యూటీ 38.5 శాతం చెల్లించాలి. 2 కొన్ని వస్తువులకు పన్ను మినహాయింపు అస్సలుండదు. ఉదాహరణకు.. కొందరు టీవీలు తెచ్చుకుంటారు. దాని ధర రూ.50 వేలలోపు ఉన్నా అధికారులు చెప్పినంత డ్యూటీ కట్టాల్సిందే. 3 చాలామంది మహిళలు విదేశాల్లో నగలు కొనుగోలు చేసి వేసుకుని వస్తుంటారు. విదేశాల్లో ఏడాదికిపైగా ఉండి భారత్ తిరిగి వచి్చన మహిళలకు 40 గ్రాముల (విలువ రూ.లక్ష మాత్రమే) వరకు బంగారానికి డ్యూటీ ఉండదు. విలువ రూ.లక్ష దాటితే 38.5 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. పురుషులకైతే ఇది 20 గ్రాములకే పరిమితం. 4 విదేశాల నుంచి బంగారు బిస్కెట్లు తీసుకొచ్చేవారు ఇమిగ్రేషన్ కౌంటర్లోనే కస్టమ్స్ అధికారులను సంప్రదించి డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలి. దాని ఆధారంగా ఎంత పన్ను కట్టాలో అధికారులు చెబుతారు. అది కట్టి బయటికి రావాల్సి ఉంటుంది. కట్టకుంటే అక్రమ రవాణాగా పరిగణించి అరెస్టు చేస్తారు. ఎలాంటి డిక్లరేషన్ చేయాల్సిన అవసరం లేనివాళ్లు గ్రీన్ చానల్ ద్వారా బయటికి రావొచ్చు. 5 విదేశీ నగదు విషయంలోనూ 5,000 డాలర్ల కంటే నగదు, 10,000 డాలర్ల చెక్ కంటే అధికంగా ఉండకూడదు. వీటిని కరెన్సీ డిక్లరేషన్ ఫారం తీసుకుని అందులో పొందుపరచాలి. విదేశాలకు వెళ్లే సమయంలో ఫారిన్ కరెన్సీ విషయంలో ఎలాంటి పరిమితులు లేవు. కానీ, దాన్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చారన్న విషయంపై సరైన పత్రాలు çసమర్పించాలి. ఒకవేళ ఇండియన్ కరెన్సీని తీసుకెళ్లాలంటే మాత్రం రూ.25 వేల కంటే అధికంగా అనుమతించరు. 6 విదేశాల్లో విందులకు, వివాహాలకు హాజరయ్యే మహిళలకు తాము వెంట తీసుకెళ్లే నగల విషయంలో జాగ్రత్త అవసరం. ఎంత విలువైన నగలను తీసుకెళ్తున్నామన్నది ముఖ్యం. ప్రభుత్వ ఆమోదం పొందిన సంస్థల ద్వారా ఎంత బంగారం తీసుకెళ్తున్నా మన్నది సరి్టఫై చేయించుకోవాలి. దాన్ని ఎక్స్పోర్ట్ డిపార్చర్ ఆఫీసర్ వద్ద సరి్టఫై చేయించుకుని తీసుకెళ్లొచ్చు. వచ్చే సమయంలో దాన్ని చూపిస్తే ఎలాంటి అనుమానాలు రాకుండా ఉంటాయి. 7 ఇలాంటి నిబంధనలు పాటిస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రావు. మరిన్ని వివరాలకు http://www.cbic.gov.in/ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. 8 విదేశీయులు లేదా విదేశాల్లో కొంతకాలం ఉండి ఇండియాకు వచ్చేవారు ఏమేం తీసుకొచ్చే విషయంలో అనుమానాల నివృత్తికి యాప్ కూడా ఉంది. ‘ఇండియన్ కస్టమ్స్ ట్రావెల్ గైడ్ యాప్’ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
రూ. 2,700 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
అమృత్సర్ (పంజాబ్): పాక్ నుంచి అక్రమంగా వాణిజ్య మార్గం ద్వారా భారత్‌కు తీసుకొస్తున్న 532 కిలోల హెరాయిన్‌ను సరిహద్దులోని అట్టారి చెక్ పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 2,700 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా పాకిస్తాన్ నుంచి అట్టారి చేరుకున్న ట్రక్కులోని హెరాయిన్, మరో 52 కిలోల అనుమానాస్పద డ్రగ్స్‌ను వందలాది రాతి ఉప్పు బస్తాల కింద దాచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు దేశంలోనే కస్టమ్స్ విభాగానికి ఇది భారీ విజయమని వెల్లడించారు. కశ్మీర్‌కు చెందిన హెరాయిన్ స్మగ్లింగ్ సూత్రధారి తారిఖ్ అన్వర్ని అరెస్ట్ చేసిన అధికారులు రాతి ఉప్పును దిగుమతి చేసుకుంటున్న అమృత్‌సర్‌కు చెందిన వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని దీపక్‌కుమార్ వెల్లడించారు. -
అడ్డదారుల్లో బంగారం అక్రమ రవాణా
సాక్షి, శంషాబాద్ : దుబాయ్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్, డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు బంగా రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకవ్యక్తి వద్ద 405 గ్రాముల బంగారం పేస్ట్ బయటపడింది. శుక్రవారం అర్థరాత్రి ఇండిగో 6ఈ 025 విమానంలో వచ్చిన మహ్మద్ అన్షాద్ కదలికలను అనుమానించిన అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. అతడిని అధికారులు విచారించగా బంగారాన్ని మలద్వారంలో దాచుకుని తీసుకొచ్చినట్లు వెల్లడించాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి బంగారాన్ని బయటికి తీయించారు. దీని విలువ రూ.13,08,215 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అన్షాద్ తరచూ ఇదే విధంగా బంగారం తీసుకొస్తున్నట్లు విచారణలో బయటపడింది. మరోవైపు ముందస్తు సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు ఎయిర్‌పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన మరోవ్యక్తిని తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో ఎటువంటి బంగారం బయటపడలేదు. దీంతో అతడి ని టెర్మినల్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి మలద్వారంలో దాచి తీసుకొచ్చిన నాలుగు బంగారు క్యాప్సుల్స్‌ను బయటికి తీశారు. -
జ్యువెలరీ వ్యాపారులే సూత్రధారులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన పలువురు జ్యువెలరీ వ్యాపారులే అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ సూత్రధారులుగా ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిరుపేదల్ని పావులుగా మార్చుకుని ఈ వ్యవహారం సాగిస్తున్నారు. రెండ్రోజుల క్రితం దుబాయ్ నుంచి మూడు కిలోల బంగారం తీసుకువచ్చిన ముఠాను కస్టమ్స్ అధికారులు పట్టుకొని విచారించగా పలు కీలక విషయాలు వెల్లడైనట్లు కస్టమ్స్ విభాగం కమిషనర్ ఎంఆర్ఆర్ రెడ్డి తెలిపారు. అదనపు కమిషనర్ మంజుల హోస్మానీ, డిప్యూటీ కమిషనర్ కల్యాణ్ రేవెళ్లతో కలసి బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు ప్రాంతాల్లోనూ ముఠాసభ్యులు.. హైదరాబాద్–దుబాయ్‌ల్లో బంగారం ధరల్లో భారీ వ్యత్యాసం ఉంది. నేరుగా దిగుమతి చేసు కుంటే 38.5% వరకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి వస్తుందని స్మగ్లర్లు అక్రమంగా రవాణా చేస్తున్నారు. అయితే, ఈ వ్యాపారులు నేరుగా సీన్లోకి రావట్లేదు. పాతబస్తీకి చెందిన కొందరు నిరుపేద యువకులను కమీషన్ పేరుతో ఆకర్షించి స్మగ్లింగ్‌లోకి దించుతున్నారు. దుబాయ్ తదితర దేశాల్లో స్థిరపడిన వారితోనూ ఒప్పందాలు చేసుకుని ఈ రొంపిలోకి దింపుతున్నారు. ట్రావెల్ ఏజెంట్ల నుంచి వివరాల సేకరణ దుబాయ్‌లోని స్మగ్లింగ్ ముఠాసభ్యులు అక్కడి ట్రావెల్ ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వారి ద్వారా హైదరాబాద్‌కు వెళ్తున్న పేద, మధ్య తరగతివారిని సంప్రదించి వస్తువులను తీసుకువెళ్లేలా ఒప్పిస్తున్నారు. దీనికోసం కొందరికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు కమీషన్ ఇస్తుండగా మరికొందరికి టికెట్ కొని ఇస్తున్నారు. సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలిచే వీరిలో అత్యధికులకు తాము పసిడి తీసుకువస్తున్నామనే విషయం తెలియదు. వీరికి తెలియకుండా బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చేసి అప్పగిస్తున్నారు. బుధవారం 3 కిలోల బంగారంతో అధికారులకు చిక్కిన ఇద్దరు క్యారియర్లు దాన్ని ట్రాలీ బ్యాగ్స్‌కు ఫ్రేమ్‌లు తదితరాల రూపంలో తీసుకువచ్చారు వాట్సాప్ ద్వారా ఫొటోలు పంపుతూ... నాలుగు టాలీ బ్యాగ్స్‌తో బయలుదేరిన ఈ ఇద్దరి ఫొటోలను అక్కడి ఏజెంట్లు తమ ఫోన్లలో తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చాక వీరిని రిసీవ్ చేసుకునేది ఎవరో, వారి కాంటాక్ట్ నంబర్లు ఏమిటో చెప్పరు. అలా చేస్తే కస్టమ్స్ తనిఖీల్లో వీరు చిక్కితే ముఠా గుట్టురట్టవుతుందని ఇలా చేస్తున్నారు. వీరి ఫొటోలను మాత్రం వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉంటున్న రిసీవర్లకు పంపుతున్నారు. దుబాయ్ నుంచి 3 కిలోల బంగారంతో వచ్చిన ఇద్దరూ కస్టమ్స్ ఏరియాను దాటి బయటకు వచ్చేశారు. అక్కడ వేచి ఉన్న ముగ్గురు రిసీవర్లు వీరిని గుర్తించి దగ్గరకు వెళ్లారు. అప్పటికే ఈ స్మగ్లింగ్స్పై ఉప్పందిన శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు ఐదుగురినీ అదుపులోకి తీసుకుని రూ.కోటి విలువైన పసిడిని స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణలో సూత్రధారి పేరు బయటకు రాగా అతడి కోసం గాలిస్తున్నారు. సూత్రధారులైన స్మగ్లర్లు ఇక్కడే పాస్‌పోర్ట్ ఉన్న కొందరు పేదల్ని గుర్తిస్తున్నారు. వీరికి టికెట్లు, వీసా ఇవ్వడం ద్వారా దుబాయ్‌కు పంపి, రెండు, మూడు రోజుల తర్వాత బంగారంతో రప్పిస్తున్నట్లు తేలింది. -
ప్రసాద్ ఐమ్యాక్స్‌పై సెంట్రల్ ట్యాక్స్ విచారణ!
సాక్షి, హైదరాబాద్: ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్‌పై సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ విచారణ చేపట్టింది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన విధంగా రూ.100 దాటిన సినిమా టికెట్లపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించకుండానే ప్రేక్షకుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారని ఈ విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 1 నుంచి అన్ని థియేటర్లలో ఈ తగ్గించిన రుసుమును టికెట్లపై వసూలు చేయాల్సి ఉంది. అయితే, సినిమా థియేటర్లు దీన్ని అమలు చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు కస్టమ్స్ శాఖ పరిధిలోని ప్రత్యేక విభాగం అధికారులు కొన్ని థియేటర్లను పరిశీలించగా, ఐమ్యాక్స్ థియేటర్లో తగ్గించలేదని తేలింది. ఆధారాలను కూడా సేకరించిన కస్టమ్స్ విభాగం దీనిపై విచారణ జరిపించేందుకు రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీకి సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
సీజ్ చేసిన బంగారం తక్కువ ధరకే ఇస్తామని..
♦ రూ.3 లక్షలు, 10 సెల్ఫోన్లు, సుమో స్వాధీనం కోరుట్ల : కస్టమ్స్ అధికారులు సీజ్చేసిన బంగారం తక్కువ ధరకే ఇస్తామని చెప్పి సూట్‌కేసు మాయతో లక్షల్లో డబ్బులు తీసుకుని ఉడాయిస్తున్న దొంగలముఠా సభ్యులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కోరుట్ల పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టుపడినవారిలో ఒకరు డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ఉండడం గమనార్హం. డీఎస్పీ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలుకు చెందిన వనమాల తిరుపతయ్య గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన ఓ దొంగతనం కేసులో సస్పెండ్అయ్యాడు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన చెక్క సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా వక్కలంకకు చెందిన బండితి శ్రీనివాస్ కలిసి 20 ఏళ్లుగా బంగారం ఎరగా వేసి మోసాలకు పాల్పడుతున్నారు. తిరుపతయ్య తాను కస్టమ్స్ ఆఫీసర్‌గా తప్పుడు ఐడెంటిటీ కార్డు తయారుచేయించి దాన్ని ఆధారంగా చేసుకుని తమ వద్ద సీజ్ చేసిన బంగారం ఉందని తక్కువ ధరకు అమ్ముతామని చెబుతూ ఫోన్లో సంప్రదిస్తాడు. మొదట స్విస్ దేశపు ముద్ర ఉన్న బంగారు బిళ్లను చూపుతాడు. అదే బంగారం కిలో వరకు ఉందని కేవలం రూ.15–20 లక్షలు ఇస్తే అమ్ముతామని నమ్మబలుకుతారు. వీరి మాటలు నమ్మి డబ్బులు ఇచ్చిన వారిని సూట్‌కేసుతో మాయ చేస్తారు. వారి డబ్బులు తీసుకుని దర్జాగా పారిపోతారు. సూట్‌కేసు మాయాజాలం ఇలా.. బంగారం కోసం వచ్చినవారి నుంచి డబ్బులు తీసుకునే సమయంలో నిందితులు తమ వద్ద ఉన్న రెండు అరల సూట్‌కేసు తీసుకెళ్లారు. ఈ సూట్‌కేసులోని రెండు అరల్లో ఒకే రీతిలో ఉన్న నల్లటి చిన్నబ్యాగులు ఉంచుతారు. బంగారం కోరిన వారి దగ్గర నుంచి తీసుకున్న డబ్బులను నల్లబ్యాగులో ఉంచి సూట్‌కేసులో ఓ అరలో ఉంచుతారు. ఆ తరువాత తమ బంగారం మరో వ్యక్తి తెస్తున్నాడని చెబుతారు. కొంతసేపటికి తమ వ్యక్తి బంగారం తేవడంలో అలస్యమవుతోందని, బంగారం ఇవ్వకుండా డబ్బులు తీసుకోమని చెప్పి సూట్‌కేసులో మరో అరలో ఉంచిన తెల్లకాగితాల నోట్లు ఉన్న మరో బ్యాగును తీసి వాపస్ ఇచ్చేస్తారు. సూట్‌కేసులో రెండు అరలు ఉన్న విషయం నల్లబ్యాగు మారిన విషయం గమనించని బాధితులు తమ డబ్బులు తమ వద్దనే ఉన్నాయని భావిస్తారు. ఈలోపు నిందితులు బంగారం తీసుకువస్తామని బయటకు వెళ్లి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి జారుకుంటారు. బంగారం కొనుగోలు చేద్దామనుకున్న వారు వీరు ఎంతకీ రాకపోయే సరికి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి తమ వద్ద ఉన్న నల్లబ్యాగును తెరిచి అందులో తెల్లనోట్ల కాగితాలు ఉండటంతో లబోదిబోమంటారు. లెక్కలేనన్ని మోసాలు.. తిరుపతయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్ కలిసి ఏడాదిన్నర వ్యవధిలో ఇదే రీతిలో ఐదుగురిని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2015 జనవరిలో వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన గంగినేని రాజేందర్ వద్ద రూ.10లక్షలు, 2015 అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని టప్పాచబుత్రాలో ఉండే దయానంద్ వద్ద రూ.11.50 లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల మండలం ఎర్రవెల్లికి చెందిన రాధాకృష్ణ వద్ద ఈ ఏడాది మారిచలో రూ.10 లక్షలు, గత నెలలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన సందీప్ అనే వ్యాపారి వద్ద రూ.15 లక్షలు తీసుకుని బంగారం ఇవ్వకుండానే ఉడాయించారు. నెల క్రితం మెట్పల్లి మండలం చింతలపేటకు చెందిన తిరుపతిరెడ్డిని ఉచ్చులోకి లాగేందుకు యత్నించారు. వరంగల్‌కు చెందిన గంగినేని రాజేందర్‌తో వ్యాపార భాగస్వామిగా ఉన్న తిరుపతిరెడ్డి బంగారం విషయమై సలహా అడిగాడు. దీంతో రాజేందర్ తాను ఏడాది క్రితం మోసపోయిన విషయాన్ని వెల్లడించాడు. అప్రమత్తమైన తిరుపతిరెడ్డి వెంటనే కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజుకు సమాచారం ఇచ్చారు. జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ రాజశేఖర్‌రాజు చాకచక్యంగా వలపన్ని నిందితులను పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం పోలీస్ బోర్డు పెట్టుకుని కోరుట్ల శివారు ప్రాంతంలో టాటా సుమోలో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తాము చేసిన మోసాలు ఒప్పుకున్నారు. వీరిని అరెస్టు చేసి రూ.3లక్షలు నగదు, 3 తులాల స్విస్ బంగారం బిళ్ల, 10 సెల్ఫోన్లు, సూట్‌కేసు, సుమో స్వా«ధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో చొరవ చూపిన సీఐ రాజశేఖర్‌రాజు, ఎస్సై బాబురావు, ప్రొబేషనరీ ఎస్సై సూరి, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, నరేందర్, నరేష్రావును డీఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించారు. -
కస్టమ్స్ విభాగం సహకరించాల్సిందే!
హైదరాబాద్: శేషాచలం అడవుల్లో లభించే అరుదైన ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే కచ్చితంగా కస్టమ్స్ విభాగం సహకారం అవసరమని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఉదంతాల ఆధారంగా ఎర్రచందనం ఎక్కువగా దుంగల రూపంలో ఓడల ద్వారా విదేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతున్నట్లు నిర్థారిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు సహా అనేక పోర్టుల ద్వారా జరుగుతున్న ఈ స్మగ్లింగ్‌ను అడ్డుకోవాలంటే కస్టమ్స్, ఓడరేవులు సహా ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుని పని చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ త్వరలో ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు, సిఫార్సులతో కూడిన లేఖ రాయాలని పోలీసు అధికారులు యోచిస్తున్నారు. ఈ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయడమే తెలిసిన స్మగ్లర్లకు దానితో విదేశాల్లో ఏం చేస్తున్నారనేది స్పష్టంగా తెలియడంలేదు. దీనిపై ఆరాతీసిన పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. చైనా, జపాన్ సహా అనేక మధ్య ఆసియా దేశాల్లో ఎర్రచందనానికి ఎంతో డిమాండ్ ఉంది. దీన్ని లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధంగా అక్కడి వారు వినియోగిస్తున్నారు. ఎర్రచందనంతో చేసిన పాత్రల్లో నీరుపోసి, నిర్ణీత సమయం నిలువ ఉంచి తాగితే మంచి ఫలితాలు ఉంటాయని వారు భావిస్తుంటారు. అక్కడి కొన్ని దేశాల్లో ధనవంతుల ఇళ్లల్లో పెళ్లి జరగాలంటే ఎర్రచందనం తప్పనిసరి. దీంతో తయారు చేసిన షామిచాన్ అనే వాయిద్య పరికరాన్ని కానుకగా ఇవ్వడం ఆ దేశాల్లో ఆనవాయితీగా వస్తోంది. వీటన్నింటికీ మించి ఎర్రచందనంలో రేడియో ధార్మికతను తట్టుకునే శక్తి ఉందని, అందుకే న్యూక్లియర్ సంబంధ పరికరాల్లో దీని పొడిని పూతగా పూస్తారని చెబుతున్నారు. ఈ విధంగా డిమాండ్ ఉండటంతో దుంగల్ని వివిధ పేర్లతో పోర్టుల ద్వారా ఆయా దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. -
ఎన్నికలతో బంగారం స్మగ్లింగ్‌కు లింకు
* ఈ కోణంలోనూ దర్యాప్తు: కస్టమ్స్ విభాగం * శంషాబాద్‌లో ఇద్దరు మహిళల నుంచి 15.7 కిలోల బంగారం స్వాధీనం * దిగుమతి సుంకం ఎగవేసేందుకే స్మగ్లింగ్ చేస్తున్నట్లు మహిళల అంగీకారం * వ్యవస్థీకృత ముఠాల ప్రమేయం ఉండొచ్చన్న కస్టమ్స్ రేంజ్ చీఫ్ కమిషనర్ సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు సమీకరణలో భాగంగానే విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా పెరిగిందని అనుమానిస్తున్నట్లు కస్టమ్స్ విభాగం హైదరాబాద్ రేంజ్ చీఫ్ కమిషనర్ బి.బి.ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కోణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఒక్క బుధవారమే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు మహిళల నుంచి 15.7 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రసాద్ కథనం ప్రకారం.. బంగారం తదితరాలను అక్రమ రవాణా చేస్తున్న వారి కోసం కస్టమ్స్ విభాగంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ విమానాశ్రయంలో పటిష్ట నిఘా ఉంచింది. స్మగ్లర్ల వేషధారణతో పాటు ప్రవర్తనే అనుమానించడానికి కీలక ఆధారంగా మారుతుంది. కొన్నిసార్లు పాస్‌పోర్ట్‌లో ఉండే వివరాలూ సందేహాలను కలిగిస్తాయి. సాధారణంగానే మహిళా ప్రయాణికులు అనుమానితుల జాబితాలో తక్కువగా ఉంటారు. అయితే బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు దోహా నుంచి ఖతర్ ఎయిర్ వేస్ విమానంలో వచ్చిన ఫాతిమా అనే మహిళ కదలికల్ని అనుమానించిన కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల నేపథ్యంలో ఈమె బ్యాగేజ్, లగేజీల్లో రూ. 78 లక్షల విలువైన 2.7 కిలోల బంగారం బయటపడింది. దిగుమతి సుంకం ఎగవేత కోసమే అక్రమరవాణా చేస్తున్నామని అంగీకరించిన ఫాతిమాను అరెస్టు చేసిన కొన్ని గంటలకే మరో మహిళ పట్టుబడింది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టస్‌గా పని చేస్తున్నారు. దుబాయ్‌లో విధులు ముగించుకున్న ఈమె ఆఫ్ డ్యూటీలో ఉండి ఎమిరేట్స్ ఫ్లైట్‌లోనే బుధవారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగినప్పటికి నుంచి అదో రకంగా ప్రవర్తిస్తున్న ఈమెను అనుమానించిన కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే కేజీ బరువున్న 13 బంగారం కడ్డీలను తరలిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. వీటి విలువ రూ. 3.76 కోట్లుగా నిర్ధారించారు. ఈమె సైతం సుంకం ఎగవేత కోసమే అక్రమ రవాణా చేశానని చెప్తున్నప్పటికీ ఈ వ్యవహారాల వెనుక వ్యవస్థీకృత ముఠాల ప్రమేయాన్ని అనుమానిస్తున్న కస్ట మ్స్ అధికారులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు 16 నెలల్లో రూ. 20.12 కోట్ల విలువైన 67.758 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధిక శాతం స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగున ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, మొబైల్ చార్జర్స్‌లో దాచి తీసుకు వస్తున్నారని గుర్తించారు. విదేశాల్లో 6 నెలలు ఉండి వచ్చే వారు నిర్ణీత పన్ను చెల్లించి కేజీ బంగారం వరకు తెచ్చుకునే అవకాశం ఉందని ప్రసాద్ తెలిపారు. బరువుకు ఒంగిపోయి దొరికిపోయి... శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ చిక్కిన ఇద్దరు మహిళల్లో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తున్న సదాఫ్ఖాన్ ఒకరు. ఈమె గతంలోనూ అనేకసార్లు హైదరాబాద్ వచ్చారు. ఈసారీ దుబాయ్ నుంచి వస్తూ తన హ్యాండ్ బ్యాగ్‌లో రహస్యంగా ఏర్పాటు చేసిన అరలో 13 కేజీల బరువున్న 13 బంగారం కడ్డీలను తీసుకువచ్చారు. వీటిపైన మెర్క్యూరీ పేపర్ చుట్టడంతో స్కానర్‌కు చిక్కకుండా బయటపడ్డారు. అయితే అంత బరువున్న బ్యాగ్‌ను మోస్తున్న కారణంగా సదాఫ్ఖాన్ ఒంగిపోయి భిన్నంగా నడవాల్సి వచ్చింది. ఈ శైలిని చూసి అనుమానించిన కస్టమ్స్ విభాగం అధికారులు ఆమెను తనిఖీ చేయటంతో విషయం బయటపడింది.