హైదరాబాద్: శేషాచలం అడవుల్లో లభించే అరుదైన ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే కచ్చితంగా కస్టమ్స్ విభాగం సహకారం అవసరమని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఉదంతాల ఆధారంగా ఎర్రచందనం ఎక్కువగా దుంగల రూపంలో ఓడల ద్వారా విదేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతున్నట్లు నిర్థారిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు సహా అనేక పోర్టుల ద్వారా జరుగుతున్న ఈ స్మగ్లింగ్‌ను అడ్డుకోవాలంటే కస్టమ్స్, ఓడరేవులు సహా ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుని పని చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ త్వరలో ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు, సిఫార్సులతో కూడిన లేఖ రాయాలని పోలీసు అధికారులు యోచిస్తున్నారు.
ఈ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయడమే తెలిసిన స్మగ్లర్లకు దానితో విదేశాల్లో ఏం చేస్తున్నారనేది స్పష్టంగా తెలియడంలేదు. దీనిపై ఆరాతీసిన పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. చైనా, జపాన్ సహా అనేక మధ్య ఆసియా దేశాల్లో ఎర్రచందనానికి ఎంతో డిమాండ్ ఉంది. దీన్ని లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధంగా అక్కడి వారు వినియోగిస్తున్నారు. ఎర్రచందనంతో చేసిన పాత్రల్లో నీరుపోసి, నిర్ణీత సమయం నిలువ ఉంచి తాగితే మంచి ఫలితాలు ఉంటాయని వారు భావిస్తుంటారు. అక్కడి కొన్ని దేశాల్లో ధనవంతుల ఇళ్లల్లో పెళ్లి జరగాలంటే ఎర్రచందనం తప్పనిసరి. దీంతో తయారు చేసిన షామిచాన్ అనే వాయిద్య పరికరాన్ని కానుకగా ఇవ్వడం ఆ దేశాల్లో ఆనవాయితీగా వస్తోంది. వీటన్నింటికీ మించి ఎర్రచందనంలో రేడియో ధార్మికతను తట్టుకునే శక్తి ఉందని, అందుకే న్యూక్లియర్ సంబంధ పరికరాల్లో దీని పొడిని పూతగా పూస్తారని చెబుతున్నారు. ఈ విధంగా డిమాండ్ ఉండటంతో దుంగల్ని వివిధ పేర్లతో పోర్టుల ద్వారా ఆయా దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు.