ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఇకపై అంతర్జాతీయ ప్రయాణికుల డేటాను కస్టమ్స్ విభాగానికి కూడా తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకోసం విమాన రవాణా సేవల సంస్థలు జనవరి 10 నాటికి నేషనల్ కస్టమ్స్ టార్గెటింగ్ సెంటర్–ప్యాసింజర్ (ఎన్‌సీటీసీ–ప్యాక్స్)లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) జారీ చేసిన ఆదేశాల ప్రకారం .. అంతర్జాతీయ ఫ్లయిట్ బయలుదేరడానికి 24 గంటల ముందుగానే విదేశీ ప్రయణికుల మొబైల్ నంబరు మొదలుకుని టికెట్ కోసం చెల్లింపులు జరిపిన మాధ్యమం, ట్రావెల్ షెడ్యూల్ వరకు పలు వివరాలను కస్టమ్స్ అధికారులకు ఎయిర్‌లైన్స్ అందించాలి. ఒకవేళ విమానయాన సంస్థ గానీ డేటాను షేర్ చేసుకోవడంలో విఫలమైన పక్షంలో, అలా చేసిన ప్రతిసారి రూ. 25,000–50,000 వరకు కస్టమ్స్ విభాగం జరిమానా విధించవచ్చు.
ఆదాయపన్ను శాఖ ఖండన
పన్ను ఎగవేతదారులను పట్టుకునేందుకు తాము డిజీయాత్ర యాప్ డేటాను చూడడం లేదని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వస్తున్న వార్తలను ఖండిస్తూ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై పోస్ట్ పెట్టింది. ‘‘ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు అలాంటి చర్య ఏమీ లేదని స్పష్టం చేస్తున్నాం’’అని అందులో పేర్కొంది. ముఖ గుర్తింపు విధానంలో (ఎఫ్‌ఆర్‌టీ) పనిచేసే డిజీ యాత్ర విమానాశ్రయాల్లో పలు చెక్ పాయింట్ల వద్ద ఎలాంటి అవాంతరాల్లేకుండా ముందుకెళ్లేందుకు వీలు కల్పిస్తుంది. డిజీ యాత్ర యాప్ కోసం ప్రయాణికులు ఇచ్చే సమాచారం ఎన్‌క్రిపె్టడ్ విధానంలో నిల్వ ఉంటుంది. ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ద్వారా ప్రయాణికులు డిజీయాత్ర సేవలను పొందొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment