Airlines Companies
-
కస్టమ్స్‌కు విదేశీ ప్రయాణికుల డేటా షేరింగ్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఇకపై అంతర్జాతీయ ప్రయాణికుల డేటాను కస్టమ్స్ విభాగానికి కూడా తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకోసం విమాన రవాణా సేవల సంస్థలు జనవరి 10 నాటికి నేషనల్ కస్టమ్స్ టార్గెటింగ్ సెంటర్–ప్యాసింజర్ (ఎన్సీటీసీ–ప్యాక్స్)లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) జారీ చేసిన ఆదేశాల ప్రకారం .. అంతర్జాతీయ ఫ్లయిట్ బయలుదేరడానికి 24 గంటల ముందుగానే విదేశీ ప్రయణికుల మొబైల్ నంబరు మొదలుకుని టికెట్ కోసం చెల్లింపులు జరిపిన మాధ్యమం, ట్రావెల్ షెడ్యూల్ వరకు పలు వివరాలను కస్టమ్స్ అధికారులకు ఎయిర్‌లైన్స్ అందించాలి. ఒకవేళ విమానయాన సంస్థ గానీ డేటాను షేర్ చేసుకోవడంలో విఫలమైన పక్షంలో, అలా చేసిన ప్రతిసారి రూ. 25,000–50,000 వరకు కస్టమ్స్ విభాగం జరిమానా విధించవచ్చు. ఆదాయపన్ను శాఖ ఖండన పన్ను ఎగవేతదారులను పట్టుకునేందుకు తాము డిజీయాత్ర యాప్ డేటాను చూడడం లేదని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వస్తున్న వార్తలను ఖండిస్తూ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై పోస్ట్ పెట్టింది. ‘‘ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు అలాంటి చర్య ఏమీ లేదని స్పష్టం చేస్తున్నాం’’అని అందులో పేర్కొంది. ముఖ గుర్తింపు విధానంలో (ఎఫ్‌ఆర్‌టీ) పనిచేసే డిజీ యాత్ర విమానాశ్రయాల్లో పలు చెక్ పాయింట్ల వద్ద ఎలాంటి అవాంతరాల్లేకుండా ముందుకెళ్లేందుకు వీలు కల్పిస్తుంది. డిజీ యాత్ర యాప్ కోసం ప్రయాణికులు ఇచ్చే సమాచారం ఎన్‌క్రిపె్టడ్ విధానంలో నిల్వ ఉంటుంది. ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ద్వారా ప్రయాణికులు డిజీయాత్ర సేవలను పొందొచ్చు. -
విమాన టికెట్ డౌన్‌గ్రేడ్ చేస్తే రీయింబర్స్మెంట్
న్యూఢిల్లీ: ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను ఎయిర్‌లైన్స్ ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేస్తుండటంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం టికెట్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తే, దేశీ రూట్లలో ప్రయాణాలకు సంబంధించి టికెట్ ఖర్చులో 75 శాతం మొత్తాన్ని ప్యాసింజర్లకు ఎయిర్‌లైన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ రూట్ల విషయంలో ప్రయాణ దూరాన్ని బట్టి టికెట్ ఖర్చుల్లో 30–75 శాతం వరకు (పన్నులు సహా) రీయింబర్స్ చేయాలి. ఇవి ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని డీజీసీఏ సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. ప్యాసింజర్లు నిర్దిష్ట తరగతిలో ప్రయాణించేందుకు బుక్ చేసుకున్న టికెట్‌ను విమానయాన సంస్థలు వివిధ కారణాలతో దిగువ తరగతికి డౌన్‌గ్రేడ్ చేస్తున్న ఉదంతాలు ఇటీవల పెరిగిన సంగతి తెలిసిందే. -
Pee Gate Row: రెచ్చిపోతే ఇకపై ఊరుకోరు!
న్యూఢిల్లీ: విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ప్రయాణికుడి ఘటన.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన నెల తర్వాత వృద్ధురాలు ఫిర్యాదు చేయడం, ముంబైకి చెందిన శంకర్ మిశ్రా పరారీలో ఉండడం, ఈ మధ్యలో జరిగిన రాజీ యత్నాలు వాట్సాప్ ఛాటింగ్ రూపంలో.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ వ్యవహారంలో!. అయితే.. ఇదొక్కటే కాదు.. స్వల్ఫ వ్యవధిలో ఇలాంటి వికృత ఘటనలు చోటు చేసుకోవడంతో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో అలాంటి ప్రయాణికుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, ఇకపై కఠినంగానే వ్యవహరించాలని విమానయాన నియంత్రణ సంస్థ నిర్ణయించుకుంది. విమానాల్లో ఇష్టానుసారం, పద్ధతి లేకుండా ప్రవర్తించే ప్రయాణికులను నిలువరించాల్సిన బాధ్యత పూర్తిగా సిబ్బందిదేనని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్‌లైన్స్ సంస్థలతో పేర్కొంది. అలాంటి ప్రయాణికులను నిలువరించేందుకు విమానంలోని సిబ్బంది సామరస్యంగా ప్రయత్నించాలి. పరిస్థితిని అంచనా వేయడం, సెంట్రల్ కంట్రోల్‌కు సమాచారం అందించాల్సిన బాధత్య పైలట్‌ది. ఒకవేళ..వాళ్లు(రెచ్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తించే ప్రయాణికులు) వినలేని పరిస్థితులు గనుక ఎదురైతే ప్రత్యేక పరికరాలను ఉపయోగించాలని డీజీసీఏ.. ఎయిర్‌లైన్స్ సంస్థలకు సూచించింది. బేడీలు లేదంటే బెల్టుల తరహా పరికరాలను ఉపయోగించాలని, వాటిని విమానంలో ఎప్పుడూ ఉంచాలని చెబుతూ.. అవి ఎలా ఉండాలో కూడా పలు సూచనలు చేసింది డీసీసీఏ. నవంబర్‌లో(26వ తేదీన) జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో బిజినెస్ క్లాస్ సెక్షన్లో ఓ వ్యక్తి.. ఓ వృద్ధురాలిపై మూత్రం పోశాడు. ఆ సమయంలో సిబ్బంది ఆమెకు సర్దిచెప్పి.. అతన్ని అక్కడి నుంచి పంపించేశారు విమాన సిబ్బంది. అయితే విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సదరు వ్యక్తి అక్కడి నుంచి ఏం జరగనట్లు వెళ్లిపోయాడు. అయితే.. ఈ ఘటన విషయంలో ఇరుపార్టీలు రాజీకి వచ్చి ఉంటాయని ఎయిర్ ఇండియా ఇంతకాలం భావించిందట!. కానీ, తాజాగా ఆ వృద్ధురాలు ఏకంగా ఎయిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో వ్యవహారం మీడియాకు ఎక్కింది. ఇక ఇది జరిగిన పదిరోజులకే.. అంటే డిసెంబర్ నెలలో మరోకటి జరిగింది. ప్యారిస్-ఢిల్లీ విమానంలో తప్పతాగిన ఓ వ్యక్తి తోటి మహిళా ప్రయాణికురాలి బ్లాంకెట్‌లో మూత్రం పోశాడు. అయితే విమానం దిగాక ఆ వ్యక్తితో లేఖ రాసి పంపించేశారు విమాన సిబ్బంది. ఇలా.. స్వల్ప కాలిక వ్యవధిలో జరిగిన ఘటనలు విమానయాన సంస్థల తీరు మీద విమర్శలు చెలరేగేలా చేశాయి. -
టికెట్ డౌన్‌గ్రేడ్ చేస్తే పరిహారం చెల్లించాలి
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఇకపై ప్రయాణికుల టికెట్లను ఇష్టానుసారంగా డౌన్‌గ్రేడ్ చేస్తే పరిహారం చెల్లించుకోవాల్సి రానుంది. పన్నులు సహా టికెట్ పూర్తి విలువను ప్యాసింజర్‌కి తిరిగి ఇవ్వడంతో పాటు సదరు ప్రయాణికులను తదుపరి అందుబాటులో ఉన్న తరగతిలో ఉచితంగా తీసుకెళ్లాల్సి రానుంది. ఇందుకు సంబంధించి ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రస్తుత నిబంధనలను సవరించే పనిలో ఉంది. సంబంధిత వర్గాలతో సంప్రదింపులు ముగిశాక తుది నిబంధనలను జారీ చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒక తరగతిలో బుక్ చేసుకున్న టికెట్లను విమానయాన సంస్థలు ఇష్టారీతిగా కింది తరగతికి డౌన్‌గ్రేడ్ చేస్తున్నాయంటూ తరచుగా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ మేరకు చర్యలు చేపట్టింది. విమాన సేవలను వేగవంతంగా విస్తరించాల్సి వస్తుండటం, ప్యాసింజర్ ట్రాఫిక్ భారీగా పెరిగిపోవడం వంటి అంశాల వల్ల కొన్ని సందర్భాల్లో ఎయిర్‌లైన్స్ ఇలా చేయాల్సి వస్తోంది. ‘ఉదాహరణకు ప్రయాణికులు .. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ లేదా ప్రీమియం ఎకానమీలో టికెట్ బుక్ చేసుకుని ఉండవచ్చు. అయితే, సీట్లు అందుబాటులో లేకపోవడం లేదా విమానాన్ని మార్చాల్సి రావడం వంటి కారణాల వల్ల చెకిన్ సమయంలో వారి టికెట్లను దిగువ తరగతికి డౌన్‌గ్రేడ్ చేసే పరిస్థితి ఉంటోంది. అయితే, ఇలా డౌన్‌గ్రేడ్ చేస్తే ప్రయాణికులకు ఎయిర్‌లైన్ టికెట్ పూర్తి విలువ రీఫండ్ చేయడంతో పాటు తదుపరి అందుబాటులో ఉన్న తరగతిలో ఉచితంగా తీసుకెళ్లేలా ప్రతిపాదిత సవరణ ఉపయోగపడుతుంది‘ అని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత నిబంధనలు ఇలా.. బోర్డింగ్‌ను నిరాకరించినా, ఫ్లయిట్ రద్దయినా విమాన ప్రయాణికులకు పరిహారం లభించేలా ప్రస్తుతం నిబంధనలు ఉన్నాయి. బుకింగ్ కన్ఫర్మ్ అయినా బోర్డింగ్‌ను నిరాకరిస్తే, ప్రత్యామ్నాయంగా సదరు విమానం బైల్దేరే షెడ్యూల్ తర్వాత గంట వ్యవధిలోగా మరో ఫ్లయిట్లో సీటు కల్పించగలిగితే ఎలాంటి పరిహారం చెల్లించనక్కర్లేదు. అదే 24 గంటల వరకూ పడితే వన్ వే ఛార్జీ, ఇంధన చార్జీలకు 200 శాతం అధికంగా పరిహారం చెల్లించాలి. గరిష్టంగా రూ. 10,000 పరిమితి ఉంటుంది. ఒకవేళ 24 గంటలు దాటేశాక సీటు కల్పిస్తే రూ. 20,000 గరిష్ట పరిమితికి లోబడి 400 శాతం వరకూ పరిహారం చెల్లించాలి. వీటితో పాటు ఫ్లయిట్ రద్దవడం తదితర అంశాలకు సంబంధించి వివిధ మార్గదర్శకాలు ఉన్నాయి. -
ఆ స్కీం కింద ఏవియేషన్‌కి రూ. 1,500 కోట్ల రుణ పరిమితి
కోవిడ్ ధాటికి కుదేలైన రంగాలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ఉద్దేశించిన ఈసీఎల్‌జీఎస్‌కి (అత్యవస రుణ సదుపాయ హామీ పథకం) కేంద్ర ఆర్థిక శాఖ సవరణలు చేసింది. వైమానిక రంగ సంస్థలకు గరిష్ట రుణ పరిమితిని రూ. 400 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెంచింది. సముచిత వడ్డీ రేటుతో తనఖా లేని రుణాలు పొందడం ద్వారా విమానయాన సంస్థలు నిధుల కొరత సమస్యను అధిగమించడంలో తోడ్పాటు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020 మే నెలలో కేంద్రం ఈ స్కీమును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత నుంచి పరిస్థితులను బట్టి సవరిస్తూ, పొడిగిస్తూ వస్తోంది. ఇది ఈ ఏడాది మార్చితో ముగియాల్సి ఉండగా 2023 మార్చి వరకూ పొడిగించింది. ఈ స్కీము కింద 2022 ఆగస్టు 5 నాటికి ఈ స్కీము కింద రూ. 3.67 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. -
విమానయాన సంస్థలకు భారీ ఊరట
సాక్షి,ముంబై: విమానయాన సంస్థలకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి వస్తున్న నేపథ్యంలో జెట్ ఇంధనం (ATF) ధరలు 2.2 శాతం దిగి వచ్చింది. ఈ మేరకు దేశీయ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు శనివారం ఒక నోటిఫికేషన్ విడుదల చేశాయి. ధరలు కిలోలీటర్‌కు రూ. 3,084.94 లేదా 2.2 శాతం తగ్గి, కిలోలీటర్‌కు రూ. 138,147.93గా ఉన్నాయని తెలిపాయి. ఈ ఏడాదిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి మాత్రమే. గత నెలలో ధరలు కిలో లీటర్‌కు రూ. 141,232.87 (లీటర్‌కు రూ.141.23)కు ఉన్నాయి. స్థానిక పన్నులను బట్టి ధరలు కూడా రాష్ట్రానికి, రాష్ట్రానికి రేట్లో వ్యత్యాసం ఉంటుంది. బెంచ్‌మార్క్ అంతర్జాతీయ చమురు ధరల రేట్ల ఆధారంగా ప్రతి నెలా 1, 16వ తేదీల్లో సవరించబడతాయి. జూన్ 1 నాటి రివ్యూలో ధరలలో మార్పులేనప్పటికీ జూన్ 16 నాటి పెంపుతో విమాన ఇంధన ధరలు ఆల్ టైం హైకి చేరాయి. మొత్తంగా, సంవత్సరం ప్రారంభం నుండి 11 సార్లు రేట్లు సవరించగా, దీంతో ఆరు నెలల్లో ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం భయాల కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరాయి. ఇదిలా ఉండగా, ఏటీఎఫ్ ధరల సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలతో సమావేశమయ్యేందుకు ఇండియన్ ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్‌లు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. స్పైస్‌జెట్, గోఫస్ట్ ఇండిగో, విస్తారా ఇతర విమానయాన సంస్థలు ఐవోసీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ కమిటీలో ఉన్నాయి. -
5G Issue: 5జీతో నిజంగానే విమానాలకు ఇబ్బందా?
5జీ.. ఫిఫ్త్ జనరేషన్ మొబైల్ ఫోన్ టెక్నాలజీ. 4జీ ఎల్‌టీఈకు నెక్స్ట్ వెర్షన్. వేగవంతమైన ఇంటర్నెట్ అందించే సెల్యూలార్ టెక్నాలజీ. హైపర్ఫార్మెన్స్, ఎక్కువ నెట్వర్క్ సామర్థ్యం, ఇంటర్నెట్ డేటా వేగం, ఎక్కువ మంది యూజర్లు పొందే అనుభవం-సేవలు ఒక్కరికే అందించడం, కొత్త పరిశ్రమలకు అనుసంధానం చేయడం లాంటి వెసులుబాట్లు 5జీతో కలగనున్నాయి . త్వరలో భారత్‌లోనూ 5జీ సేవలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. అమెరికాలో 5జీ సేవలపై అభ్యంతరం-విమాన సర్వీసులు నిలిపివేస్తామనే బెదిరింపుల నడుమ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘5జీ నెట్వర్క్ సేవలతో విమానాలకు విపత్తు పొంచి ఉంది’. అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ల బాసుల నుంచి వెల్లువెత్తుతున్న అభ్యంతరం. ఈ మేరకు ప్రముఖ యూఎస్ టెలికాం కంపెనీలు వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు చాలాకాలం నుంచి 5జీ సేవలను మొదలుపెట్టాలనే ప్రయత్నాల్లో ఉండగా.. ఆ ప్రయత్నాలకు అడ్డుపడుతూ వస్తున్నాయి ఎయిర్‌లైన్స్ కంపెనీలు. ఈ క్రమంలోనే విమాన సర్వీసులకు విఘాతం ఏర్పడుతోంది. అభ్యంతరాలు ఇవే.. సాధారణంగా విమానాలు ఎక్కిన ప్రయాణికులను.. ప్రత్యేకించి టేకాఫ్ అయ్యే లేదంటే ల్యాండ్ అయ్యే సమయంలో ఫోన్ స్విచ్ఛాప్ చేయమని కోరతారు సిబ్బంది. అందుకు కారణం.. రేడియో ఫ్రీక్వెన్సీ సమస్యలు ఎదురు కావొచ్చని!. అయితే టెక్నాలజీ అప్డేట్ అవుతున్నా కొద్దీ ఈ తరహా రిక్వెస్టులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. కానీ, అమెరికా ఎయిర్‌లైన్స్ వినిపిస్తున్న వాదన ఏంటంటే.. 5జీ ఏర్పాట్ల వల్ల ఎయిర్‌క్రాఫ్ట్ భద్రత వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రస్తావించిన అభ్యంతరాలు ఏంటంటే.. 5జీ టెలిఫోన్ నెటవర్క్స్- విమానాల్లో ఉపయోగించే రేడియో అల్టిమీటర్స్లో జోక్యం చేసుకుంటాయట. తద్వారా వాతావరణం సరిగా లేనప్పుడు విమానాల అత్యవసర ల్యాండింగ్, లోఅల్టిట్యూడ్లో హెలికాఫ్టర్లు ఎగరడం లాంటి అంశాలపై ప్రభావం పడుతుందని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆటో పైలెట్ వ్యవస్థను సైతం ప్రభావితం చేయొచ్చని అంటున్నాయి యూఎస్ ఎయిర్‌లైన్ సంస్థలు. ఈ మేరకు 2009లో టర్కీష్ ఎయిర్‌లైన్స్ ప్రమాదంలో సాంకేతిక వ్యవస్థ విఫలం కావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపెడుతున్నారు.(ఆ ప్రమాదంలో 9 మంది చనిపోగా.. 120 మందికి గాయపడ్డారు). అమెరికాకే నొప్పా? 5జీ సేవలు ప్రపంచంలో ఇప్పటిదాకా 40 దేశాల్లో కొనసాగుతున్నాయి. అయితే అగ్రరాజ్యంలోనే ఇంత చర్చా జరగడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ, మిగతా దేశాల్లోనూ ఇలాంటి సమస్యలు, అభ్యంతరాలు వచ్చాయి. 2021 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ సివిల్ ఏవియేషన్ కూడా ఇలాంటి అభ్యంతరాలనే లేవనెత్తింది. ఆ సందర్భంలో అమెరికా ఎయిర్‌లైన్స్ సర్వీసుల్లాగా రాద్ధాంతం చేయకుండా.. కెనడాలో మాదిరి ఫోన్ మాస్ట్‌లను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రయాణికులను టేకాఫ్, ల్యాండ్ అయిన సమయంలో ఫోన్లు స్విచ్ఛాఫ్ మాత్రమే చేయాలని కోరింది. ఇక యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ.. ‘సమస్యలను నివారించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు, ఎయిర్‌లైన్స్, స్టేట్ స్పెక్ట్రమ్ రెగ్యులేటర్లతో కలిసి పని చేస్తున్నామని, యూరప్‌లో ఎలాంటి ఘటలను గుర్తించలేద’ని స్పష్టం చేసింది. ఈయూతో పోలిస్తే.. అమెరికాలో రేడియో ఫ్రీకెన్సీ జోక్యం, ఇతర ఇబ్బందులు తక్కువేనని సేప్టీ డివైజ్‌లు తయారు చేసే అమెరికన్ కంపెనీ రెసోనాంట్ కంపెనీ ప్రతినిధి జార్జ్ హోమ్స్ చెప్తున్నారు. ఫ్రీక్వెన్సీ ఇష్యూ.. కొన్ని దేశాలు 5జీ విషయంలో 600 మెగాహెర్ట్జ్ నుంచి 900 మెగాహెర్ట్జ్ మధ్య ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తున్నాయి. మరికొన్నిదేశాలు 2.3 గిగాహెర్ట్జ్ నుంచి 4.7 గిగాహెర్ట్జ్ మధ్య ఫ్రీక్వెన్సీతో డేటా స్పీడ్‌ను పెంచుతున్నాయి. ఇంకొన్ని దేశాల్లో అయితే ఏకంగా 24 గిగాహెర్ట్జ్ నుంచి 47 గిగాహెర్ట్జ్ మధ్య ఉపయోగిస్తున్నాయి. ఈ ఫ్రీక్వెన్సీలో ఎక్కువ టవర్లు అవసరం పడినప్పటికీ.. డేటా కూడా అంతే స్పీడ్‌గా వస్తుంది. ఇక అమెరికా విషయానికి వస్తే.. వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు ఏర్పాటు చేయబోయే 5జీ నెట్వర్క్స్ కోసం 3.7 గిగాహెర్ట్జ్ నుంచి 3.8 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్స్ బ్యాండ్‌కు అప్‌గ్రేడ్ లభించింది. మరోవైపు ఏవియేషన్ ఉపయోగిస్తున్న రేడియో అల్టిమీటర్స్ ఏమో 4.2 గిగాహెర్ట్జ్ నుంచి 4.4 గిగాహెర్ట్జ్ బాండ్ మధ్య నడుస్తోంది. సీ-బ్యాండ్(5జీ సేవల కోసం ఉపయోగిస్తున్న ఫ్రీక్వెన్సీ), విమానాల కోసం ఉపయోగించే ఫ్రీక్వెన్సీలు దగ్గరదగ్గరగా ఉండడమే అసలు సమస్యగా మారింది. సీ-బ్యాండ్ ఎయిర్‌వేవ్స్‌తో.. ఏవియేషన్ కమ్యూనికేషన్ దెబ్బతింటుందనేది ఎయిర్‌లైన్స్ ఓనర్ల వాదన. ఎఫ్ఏఏ హెచ్చరికల తర్వాతే.. చాలా దేశాల్లో ప్రభుత్వ ఏజెన్సీలు రేడియో US స్పెక్ట్రమ్‌ను నియంత్రిస్తుంటాయి. అలాగే అమెరికాలో ఎఫ్‌సీసీ ‘ఫ్రీక్వెన్సీ కంట్రోల్’ చేస్తోంది. వాస్తవానికి 5జీ స్పెక్ట్రమ్‌లో చాలా భాగాలను 2016లోనే పక్కన పెట్టేసింది. ఆ సమయంలోనే ఎయిర్‌క్రాఫ్ట్‌ల సమస్యనే అభ్యంతరంగా లేవనెత్తింది ఎఫ్ఏఏ Federal Aviation Administration. అంతేకాదు కిందటి ఏడాది నవంబర్‌లో ఎయిర్‌లైన్స్‌ను హెచ్చరిస్తూ ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. ‘5G ట్రాన్స్మీటర్లు, ఇతర సాంకేతికత జోక్యం చేసుకోవడం వల్ల నిర్దిష్ట భద్రతా పరికరాలు పనిచేయకపోవడం లాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. విమాన కార్యకలాపాలను ప్రభావితం చేసే చర్యలను తగ్గించడం అవసరం అంటూ ఎయిర్‌లైన్స్ సంస్థలను సూచించింది ఎఫ్ఏఏ. ఒకరిని మించి ఒకరు అమెరికాలోనే అతిపెద్ద టెలికాం కంపెనీలుగా ఉన్నాయి వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు. వాస్తవానికి వీటికి అనుమతులు ఎప్పుడో లభించాయి. కానీ, భద్రత కారణాల దృష్ట్యా లాంచింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ తరుణంలో జనవరి 19 నుంచి 5జీ సేవల్ని కొన్ని ప్రధాన ఎయిర్‌పోర్ట్‌ల పరిధిలో మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాయి. ఈలోపు ఏవియేషన్ సేఫ్టీని లేవనెత్తుతూ సర్వీసులు నిలిపివేస్తామని బెదిరింపులకు దిగాయి ఎయిర్‌లైన్స్ కంపెనీలు. 5జీ సర్వీసు మొదలైతే. విమాన సర్వీసులను బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నాయి ఎయిర్‌లైన్స్. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశాయి. ఈలోపు కొన్ని దేశాలు(భారత్ కూడా) సర్వీసుల రద్దు, వేళల్లో మార్పునకే మొగ్గుచూపాయి. ఏం జరగనుంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఏటీ అండ్ టీ కంపెనీ 5జీ సేవల మొదలును మరోసారి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అమెరికా టెలికాం పరిశ్రమ, విమానయాన పరిశ్రమ రెండూ భారీగా లాభపడే ఈ వ్యవహారానికి పరిష్కారం మాత్రం త్వరగా దొరికేలా కనిపించడం లేదు. ఇది టెలికాం సహా ఇతర విభాగాలు, ప్రభుత్వాలకు సంబంధించిన సమస్య. వేర్వేరు ఫ్రీక్వెన్సీలను ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ, అమెరికాలో రెండూ సీ-బ్యాండ్‌నే ఉపయోగిస్తున్నాయి. ఈ విషయంలోనే రాజీకి రాలేకపోతున్నాయి. ఒకవేళ ఇప్పటికే ఉన్న ఆల్టిమీటర్‌లు సురక్షితమైనవిగా రేట్ చేసే అవకాశం ఉంది. లేదంటే 5G జోక్యానికి వ్యతిరేకంగా మరింత పటిష్టంగా ఉండేలా కొత్త నిబంధనల్ని ప్రభుత్వం రూపొందించొచ్చు. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్, ఎఫ్‌సీసీFederal Communications Commission, ఎయిర్‌లైన్స్ నిర్వాహకుల్ని కూర్యోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తోంది బైడెన్ ప్రభుత్వం. ఈ సమస్య పరిష్కారానికి ఎంత టైం పడుతుందన్నది కచ్చితంగా తెలియడం లేదు. సమస్య ఇదేనా? ఇక్కడ సేమ్ ఫ్రీక్వెన్సీ సమస్య ఒక్కటే కాదని తెలుస్తోంది. అమెరికాలో కమర్షియల్ ఫ్లయిట్లు వాతావరణం సరిగా లేని టైంలోనూ ఆపరేట్ చేసుకునేందుకు(లిమిట్ ఆక్యుపెన్సీతో) అనుమతులు ఉన్నాయి. అయితే హజారర్డ్స్(ప్రమాదాలు) జరిగే జోన్లో విమానాలు ఎగరడం పట్ల పైలెట్లను హెచ్చరిస్తూ ఇప్పటివరకు 1450 నోటీసులు జారీ అయ్యాయి. విశేషం ఏంటంటే.. ఈ జోన్లోనే 5జీ టవర్స్ ఏర్పాటు అయ్యాయి. ఈ విషయంలోనే 5జీ సేవలపై గుర్రుగా ఉన్న విమానయాన సంస్థల బాసులు అమెరికా ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఆ రూల్స్ ప్రకారం వెళ్తే.. విమానాల్ని రద్దు చేసుకోవాల్సి వస్తుందని, వాణిజ్య రంగానికి ఆటంకం వాటిల్లుతుందని లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. ::: సాక్షి, వెబ్‌స్పెషల్ -
5జీ దెబ్బకు విమాన సేవలకు బ్రేక్..!
అమెరికాలో ఏర్పాటు చేస్తున్న 5జీ సేవల వల్ల అక్కడి విమాన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు యుఎస్ ప్యాసింజర్, కార్గో క్యారియర్ల సీఈఓలు సోమవారం హెచ్చరించారు. ఎటీ అండ్ టీ, వెరిజోన్ కలిసీ కొత్త 5జీ సేవలను అందించడానికి సిద్ధం అవుతున్నప్పుడు రాబోయే "విపత్కర" విమానయాన సంక్షోభం గురించి ప్రధాన విమానయాన కంపెనీల సీఈఓలు ప్రభుత్వానికి సూచించారు. 5జీ టెక్నాలజీలో వినియోగించే కొత్త సీ-బ్యాండ్ వల్ల విమాన సేవలు నిలిచిపోతాయని, విమానాల విషయంలో గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నట్లు విమానయాన సంస్థలు హెచ్చరించాయి. అమెరికన్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఇలా రాశారు.. "మా విమానాలు ఎగరడానికి గ్రౌండ్ క్లియర్ చేయకపోతే, విమనాలలో ప్రయాణిస్తున్న ప్రజలు ఎక్కడిక్కడే చిక్కుకొని పోవల్సి వస్తుంది" అని అన్నారు. ఈ 5జీ సిగ్నల్స్ ఆల్టిమీటర్స్ వంటి సున్నితమైన విమాన పరికరాలను ప్రభావితం చేస్తుందని, దృశ్యమాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని ఎఫ్ఏఏ హెచ్చరించింది. 1,100కు పైగా విమానాల ప్రయాణం స్తంభించిపోయే అవకాశం ఉన్నట్లు సంస్థలు సూచిస్తున్నాయి. "నిస్సంకోచంగా చెప్పాలంటే దేశం వాణిజ్యం ఆగిపోతుంది" అని కంపెనీలు వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ బ్రియాన్ డీస్, రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) అడ్మినిస్ట్రేటర్ స్టీవ్ డిక్సన్, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(FCC) చైర్మెన్ జెస్సికా రోసెన్‌వోర్సెల్‌లకు లేఖ రాశాయి. ఈ లేఖపై ప్రభుత్వ సంస్థలు వెంటనే వ్యాఖ్యానించలేదు. గత ఏడాది 80 బిలియన్ల డాలర్లను వెచ్చించి మొత్తం సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను గెలుచుకున్న ఎటీ అండ్ టీ, వెరిజోన్ విమానయాన భద్రతను దృష్టిలో ఉంచుకొని 5జీ నెట్వర్క్ విస్తరణను రెండు వారాలపాటు పొడగించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడిన తర్వాత అక్కడ 5జీ టవర్స్ ఏర్పాటు చేయకుండా ప్రత్యామ్న్యాయ మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది. కొన్ని కీలక విమానాశ్రయాల్లో "విమానాశ్రయ రన్ వేలకు సుమారు 2 మైళ్ల (3.2 కిలోమీటర్ల)లోపల మినహా దేశంలో ప్రతిచోటా 5జీ అమలు చేయాలని" విమానయాన సంస్థలు కోరుతున్నాాయి. (చదవండి: కష్టకాలంలో శ్రీలంకకు మరోసారి అండగా నిలిచిన భారత్..!) -
విమానాల్లో ఇక ఈ రూల్స్ తప్పనిసరి
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా కరోనా కేసుల విషయంలో, మరణాలు రేటులోనూ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. అయినప్పటికీ విమానా ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ముఖ్యంగా మే, జూన్ నెలల్లో దేశంలో విమానాల ద్వారా ప్రయాణాలు చేసిన వారి సంఖ్య పెరిగిందని ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ర్టేషన్ నివేదించింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులందరూ కచ్ఛితంగా ముక్కు, నోరు కవర్ అయ్యేలా ఫేస్ మాస్క్ ధరించాలని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే నిబంధనలు జారీ చేశాయి. లేని పక్షంలో ప్రయాణికులపై తాత్కిలిక నిషేధం విధించేలా పలు సంస్థలు చర్యలకు పూనుకున్నాయి. విమానాల్లో ప్రయాణాలు చేయాలనుకునే వారు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాల్సిందే అని పలు అమెరికన్ ఎయిర్‌లైన్స్ నిబంధనల్లో పేర్కొన్నాయి. (కరోనా : 7500 ఉద్యోగాల కోత ) అలస్కా ఎయిర్ లైన్స్ కస్టమర్లు, ఉద్యోగులు సహా ప్రయాణికులందరూ కచ్ఛితంగా వారి ముక్కు, నోరు కవర్ అయ్యేలా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అలస్కా ఎయిర్‌లైన్స్ పేర్కొంది. అంతేకాకుండా అదనంగా మాస్క్ కావాలనుకునే వారికి కూడా ఎయిర్‌లైన్స్‌లోనే ఇచ్చే వెసులుబాటు ఉంది. తినేటప్పుడు, తాగేటప్పుడు మాత్రం మాస్క్ తీసేయోచ్చని పేర్కొంది. రెండు సంవత్సరాల లోపు పిల్లలు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, అంగ వైకల్యం ఉన్నవారికి సైతం మాస్క్ ధరించాలన్న నిబంధన నుంచి మినహాయింపు కల్పించారు. జూన్ 30న అలస్కా ఎయిర్‌లైన్స్ రెండు పాలసీలను తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా చెక్-ఇన్ దగ్గరే హెల్త్ ఆరోగ్య ఒప్పందం ( హెల్త్ అగ్రిమెంట్ )పై సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో ఎయిర్‌లైన్స్ సూచించిన నిబంధనలకు తగ్గట్లు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తామని సంతకం చేయాలి. ఒకవేళ ఎవరైనా పదేపదే దీన్ని విస్మరిస్తే వారికి యెల్లో కార్డు చూపిస్తారు. తద్వారా భవిష్యత్తులో వారిపై ట్రావెల్ బ్యాన్ విధిస్తార్నమాట. అమెరికన్ ఎయిర్‌లైన్స్ మాస్క్ ధరించకపోతే బోర్డింగ్ వద్దే నిలిపివేస్తాం అంటుంది అమెరికన్ ఎయిర్‌లైన్స్. ప్రయాణం మొత్తం వరకు మాస్క్ ధరించాల్సిందే. అయితే తినేపటప్పడు లేదా తాగేటప్పుడు మాత్రం మాస్క్ తీసేయొచ్చు. చిన్నపిల్లలు, దివ్యాంగులకు సైతం దీని నుంచి మినహాయింపు కల్పించారు. మిగతా ప్రయాణికులందరూ ప్రముఖులైనా సరే మాస్క్ ధరించాల్సిందే అని పేర్కొంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే సదరు ప్రయాణికులపై ట్రావెల్ బ్యాన్ విధిస్తారు. మాస్క్ ధరించేందుకు నిరాకరించిన కన్సర్వేటివ్ పార్టీ నేతను జూన్ 17న న్యూయార్క్‌లో విమానం ఎక్కకుండా అడ్డకున్నారు. నిబంధనలు అందరికీ సమానమే అని సంస్థ పేర్కొంది. డెల్టా ఎయిర్‌లైన్స్ లాబీ పాయింట్లో చెకింగ్ దగ్గరినుంచి ప్రయాణం ముగిసే వరకు మాస్క్ ధరించాలని డెల్టా ఎయిర్‌లైన్స్ తెలిపింది. ముక్కు, నోటిని కప్పి ఉంచేలా మాస్క్ దరించాలని అయితే భోజన సమయంలో మాత్రం తీసేయోచ్చని పేర్కొంది. ఒకవేళ మాస్క్ కావాలన్నా ఎయిర్‌లైన్స్‌లోనే కల్పిస్తారు. శ్వాస సంబంధిత సమస్యలున్నవారికి మాత్రం మాస్క్ ధరించాలనే నిబంధనను నుంచి మినహాయింపు కల్పించారు. ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ మాస్క్ లేనిదే ప్రయాణానికి అనుమతించరు. ఆరోగ్య సమస్యలున్న చిన్న పిల్లలకు మాత్రం మినహాయింపు కల్పించారు. అంతేకాకుండా సొంతంగా మాస్క్ తయారుచేసే విధానాన్ని తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఆసక్తి ఉన్నవాళ్లు స్వయంగా మాస్క్ తయారుచేసుకోవచ్చు. జెట్ బ్లూ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులూ సిబ్బందితో సహా మాస్క్ ధరించాలని ఆదేశించిన మొదటి విమానయాన సంస్థ జెట్ బ్లూ. చెక్-ఇన్ మెదలుకొని ప్రయాణం ముగిసే వరకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. తినేపటప్పుడు లేదా తాగేటప్పుడు మాస్క్ తీసేయోచ్చు. చిన్నపిల్లలు, శ్వాస సంబంధిత సమస్యలున్నవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు కల్పించారు. ఎవరైనా మాస్క్ ధరించేందుకు ఎవరైనా నిరకారిస్తే వారిపై తాత్కాలికంగా నిషేధం విధిస్తారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్, స్పిరిట్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానయాన సంస్థలు సైతం కరోనా నియంత్రణలో భాగంగా మాస్క్ ధరించాలనే నిబంధనను తప్పనిసరి చేశాయి. ప్రయాణికులందరూ తప్పనిసరిగా నోరు, ముక్కు కవర్ అయ్యేలా మాస్క్ ధరించాలని పేర్కొన్నాయి. ఎవరైనా ఈ నిబంధలన్ని ఉల్లంఘిస్తే వారిపై ట్రావెల్ బ్యాన్ విధిస్తామని తెలిపాయి. (దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విన్యాసాలు ) -
ఎయిర్‌లైన్స్, మల్టీప్లెక్స్ షేర్ల జోరు
గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లో ఎయిర్‌లైన్స్, మల్టీప్లెక్స్ షేర్లు జోరుగా ర్యాలీ చేశాయి. లాక్డౌన్లో కొన్ని నిబంధనలతో కూడిన సడలింపులు ఇస్తుండడంతో సాధారణ పరిస్థితులు నెలకొని, త్వరలో ప్రయాణాలు పుంజుకుంటాయని ఇన్వెస్టర్లు భావిస్తుండడంతో నేడు ఎయిర్‌లైన్స్ షేర్లు జోరుగా ర్యాలీ చేశాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్(ఇండిగో) షేరు 9.2 శాతం లాభపడి రూ.1,117.90 వద్ద ముగిసింది. ఉదయం రూ.1,025 వద్ద ప్రారంభమైన ఈ షేరు ఒక దశలో రూ.1,125 వద్ద గరిష్టాన్ని తాకింది. మరో ఎయిర్‌లైన్ సంస్థ స్పైస్‌జెట్ 5 శాతం లాభంతో రూ.46.85 వద్ద ముగిసింది. జూన్ తర్వాత సినిమా హళ్లు తెరుచుకునే అవకాశం ఉండడంతో నేడు ఎన్ఎస్ఈలో మల్టీ ప్లెక్స్ షేర్లు సైతం ర్యాలీ చేశాయి. వీటిలో ముఖ్యంగా పీవీఆర్ షేరు 7 శాతం లాభపడి రూ.1,074 వద్ద ముగిసింది. ఉదయం సెషన్లో రూ.990 వద్ద ప్రారంభమైన పీవీఆర్ షేరు ఒక దశలో రూ.1,103వద్ద గరిష్టాన్ని తాకింది. మరో కంపెనీ ఐనాక్స్ లీజర్ షేరు 16 శాతం లాభపడి రూ.270 వద్ద ముగిసింది. ఉదయం సెషన్లో రూ.236 వద్ద ప్రారంభమైన ఈ షేరు ఒక దశలో రూ.279 వద్ద గరిష్టాన్ని చేరింది. కాగా లాక్‌డౌన్‌తో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దవడం, సినిమాహాళ్లు మూతపడడంతో గత రెండు నెలలుగా ఈ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
1200 మంది విస్తారా ఉద్యోగులకు షాక్
సాక్షి, ముంబై: కరోనా సంక్షోభ సమయంలో విమానయాన సంస్థల ఆదాయాలు భారీగా పడిపోయాయి. ఈ ప్రభావం ఆయా విమానయాన సంస్థల ఉద్యోగులపై భారీగా పడుతోంది. తాజాగా విస్తారా ఉద్యోగులకు మరోసారి షాకిచ్చింది. సీనియర్ గ్రేడ్ ఉద్యోగులను 3 రోజులపాటు నిర్బంధ సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. జీతంలేని తప్పనిసరి సెలవు తీసుకోవాల్సిందిగా దాదాపు 1200 మంది సీనియర్లను కోరింది. నగదు కష్టాలను ఎదుర్కొంటున్న సంస్థ జీతం లేకుండా సెలవుపై వెళ్ళమని విస్తారా ఉద్యోగులను కోరడం ఇది రెండోసారి. లాక్ డౌన్ పొడిగింపుతో కార్యకలాపాలన్నింటినీ నిలిపివేశామనీ, ఇది తమ న గదు లభ్యతపై గణనీయంగా ప్రభావం చూపిందని ఉద్యోగులకు పంపిన ఇమెయిల్ సమాచారంలో విస్తారా సీఈవో లెస్లీ థంగ్ చెప్పారు. కరోనా వైరస్ ముప్పు.. లాక్డౌన్ కష్టాల మధ్య సంస్థ ఆర్థిక వనరులను పరిరక్షించే చర్యగా ఏప్రిల్ 15 - ఏప్రిల్30 మధ్య మూడు రోజుల వరకు వేతనం లేకుండా తప్పనిసరి సెలవుపై వెళుతున్నట్లు లెస్లీ థంగ్ బుధవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 -ఏప్రిల్ 14 మధ్య మూడు రోజుల వరకు జీతం లేకుండా తప్పనిసరి సెలవు తీసుకోవాలని మార్చి 27న ప్రకటించింది. ఈ సెలవు నుంచి 2800 మంది ఉద్యోగుల (క్యాబిన్, గ్రౌండ్ సర్వీసు)కు మినహాయింపు నిచ్చింది. కాగా కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా విధించిన 21 రోజుల లాక్ డౌన్ నిబంధనలను మే 3వ తేదీ వరకు పొడిగించింది కేంద్రం. కరోనా ముప్పు కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. (ట్రంప్ టీంలో మన దిగ్గజాలు) (అద్భుతమైన వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లు లాంచ్) -
దింపినందుకు రూ.35 లక్షల జరిమానా
చండీగఢ్: ఓ మహిళను తన ఇద్దరు పిల్లలతో సహా విమానం దిగిపొమ్మన్నందుకు రెండు విమానయాన సంస్థలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రూ.35 లక్షలు చెల్లించాల్సిందిగా పంజాబ్ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ జెట్ ఎయిర్వేస్, ఎయిర్ కెనడా సంస్థలను ఆదేశించింది. గత ఏడాది నవంబర్‌లో మినాలీ మిట్టల్ అనే మహిళ తన 11 ఏళ్ల కూతురు, మూడేళ్ల కొడుకుతో కలసి కెనడాలోని టొరంటోకు బయల్దేరారు. తొలుత ఢిల్లీ వెళ్లేందుకు మొహాలీలోని చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో జెట్ ఎయిర్వేస్ విమానమెక్కారు. తర్వాత ఢిల్లీలో ఎయిర్ కెనడా విమానమెక్కారు. ఆ సమయంలో మినాలీ కూతురు తీషా తాళంవేసి ఉన్న వాష్‌రూం వద్ద చాలాసేపు ఆగి చివరకు వాంతి చేసుకుంది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది అంటూ కేకలువేస్తూ మినాలీ, ఆమె కుమార్తె, కొడుకును విమానం నుంచి బలవంతంగా విమాన సిబ్బంది దింపేశారు. వారి లగేజీని ఢిల్లీ విమానాశ్రయంలో దించకుండా టొరంటోకు తీసుకెళ్లారు. -
వైఫై కనెక్షన్ : అర్థగంటకు రూ.500
చెన్నై : విమానాల్లో త్వరలోనే వైఫై సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. ఆకాశంలో ఉండగానే నెట్ వాడుకోవచ్చు. సెల్ఫీలు దిగి పోస్ట్ చేసుకోవచ్చు. ఇక స్నేహితులతో చాట్ చేసుకోవచ్చు. అయితే, ఇవన్నీ చాలా ఖరీదుతో కూడుకున్నవిగా ఉండబోతున్నాయి. వీటి కోసం విమాన చార్జీలతో కలిపి అదనంగా 20 శాతం నుంచి 30 శాతం చెల్లించాల్సి ఉండనుంది. ట్రాయ్ ఆదేశాలతో విమానంలో వైఫై సేవలను ప్రారంభించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పెను భారం వినియోగదారులపైనే పడబోతున్నట్టు తెలిసింది. అంతర్జాతీయ ప్రమాణాల పరంగా 30 నిముషాల నుంచి గంట వరకు నెట్‌కనెక్షన్ కోసం రూ.500 నుంచి రూ.1000 వరకు ఛార్జీలు విధించనున్నట్టు అధికారులు చెప్పారు. వాస్తవానికి విమానయాన సంస్థలు ఇన్‌ఫ్లైట్ వైఫై సేవల కోసం ఇన్మార్శాట్ తదితర సర్వీస్ ప్రొవైడర్లకు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దేశీయ మార్గాల్లో ఇన్‌ఫ్లైట్ ఇంటర్నెట్ సౌలభ్యం కోసం అడ్వాన్స్ బుకింగ్ చార్జీలు రూ.1200 నుంచి రూ.2,500 దాకా ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకే కాకుండా విమానయాన సంస్థలకూ ఆ చార్జీలు భారంగానే పరిణమించనున్నాయి. ఖండాంతర, దేశీయ మార్గాల్లో ప్రయాణించే విమానాలకు ఇన్‌ఫ్లైట్ వైఫై వెసులుబాటు ప్రయోజనం చేకూరుస్తుందని ఓ విమానయాన సంస్థ అధికారి ఒకరు చెప్పారు. అంతేగాకుండా భారత గగనతలంలో ఉన్నప్పుడు వైఫైని స్విచాఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన చెప్పారు. దేశీయ విమానాల్లో వైఫై సౌకర్యం గురించి చర్చిస్తున్నామని, దానిపై పూర్తి నిర్ణయం తీసుకునేముందు దాని చార్జీలు, వైఫైకి ఉన్న డిమాండ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఓ ప్రైవేటు విమానయాన సంస్థ అధికారి ఒకరు సూచించారు. ఇక, వైఫై సేవలను అందించేందుకు గానూ సిగ్నల్స్ కోసం విమానాల్లో యాంటెన్నాను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. -
టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు రద్దు
ముంబై : దేశీయ క్యారియర్స్ టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలను రద్దు చేశాయి. భీమా-కోరేగావ్ ఘటనపై నిరసనలు పుణే నుంచి మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో, ఎయిరిండియాతో పాటు పలు దేశీయ క్యారియర్స్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. జనవరి 2, 3 తేదీల్లో ముంబై నుంచి లేదా ముంబైకు వచ్చే ప్రయాణికులు విమాన టిక్కెట్లను రద్దు చేసుకున్నా లేదా రీషెడ్యూల్ చేసుకున్నా తాము ఎలాంటి ఛార్జీలను విధించమని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ క్యారియర్ జెట్ ఎయిర్వేస్ కూడా ఛార్జీల రద్దును నేటి వరకు అమలు చేయనున్నట్టు పేర్కొంది. బడ్జెట్ క్యారియర్ ఇండిగో ముంబై, పుణే ప్రాంతాల విమానాలకు టిక్కెట్ మార్పు లేదా క్యాన్సిలేషన్ ఫీజులను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. క్యాన్సిలేషన్ ఫీజుల రద్దును ఇండిగో పొడిగిస్తున్నట్టు కూడా చెప్పింది. దళితులు చేపట్టిన భీమా-కోరేగావ్ ఆందోళనలతో ముంబైలో రైళ్లన్నీ ఆగిపోయాయి. వందకు పైగా బస్సులు ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులు ముంబైలోని పలు ప్రాంతాల్లో వాణిజ్య, విద్యాసంస్థలు, దుకాణాలను మూసివేయించారు. పుణే దగ్గర్లోని భీమా-కోరేగావ్ యుద్ధ స్మారకం వద్ద 200వ విజయోత్సవాల సందర్భరంగా హిందూ, దళిత సంస్థల కార్యకర్తల వద్ద ఈ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలకు వ్యతిరేకంగా భరిజా బహుజన్ మహాసంఘ్ లీడరు ప్రకాశ్ అంబేద్కర్ మహారాష్ట్ర బంద్‌ను చేపడుతున్నారు. -
9/11 ఉగ్రదాడి కేసు : రూ.600 కోట్ల పరిహారం
న్యూయార్క్ : అమెరికాపై ఆల్‌ఖైదా ఉగ్రవాదులు 2001, సెప్టెంబర్ 11న దాడి చేసిన ఘటనలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్లు రెండు ధ్వంసం అయ్యాయి. ఆ రెండు భారీ ఆకాశహర్మ్యాలను రెండు విమానాలు ఢీకొనడంతో ఈ విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌తోపాటు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థలకు చెందిన విమానాలతో ఉగ్రవాదులు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను పేల్చేశారు. అయితే ఇప్పుడు ఆ దాడి కేసులో ఓ సెటిల్మెంట్ జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్న లారీ సిల్వర్‌స్టన్ 12.3 బిలియన్ల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా తాము రూ.600 కోట్లు చెల్లించేందుకు రెండు విమాన సంస్థలు అంగీకారాన్ని తెలిపాయి. రెండు భారీ బిల్డింగ్లు నేలకూలిన కేసులో ఇప్పటికే ఆయనకు 4.55 బిలియన్ డాలర్ల బీమా అందింది. ఇప్పుడు తాజాగా విమాన సంస్థలు కూడా సిల్వర్‌స్టన్‌తో నష్టపరిహాం కేసులో సెటిల్మెంట్ చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం కుదిరిన ఒప్పందానికి అమెరికా కోర్టు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఉగ్రవాదులు ట్విన్ టవర్స్ కూల్చివేసిన ఘటనలో సుమారు 2700 మంది చనిపోయిన విషయం తెలిసిందే. -
చౌక బేరం.. ఆదాయం దూరం!
ప్రయాణికులు పెరిగినా ఆదాయం తగ్గుతోంది * విమానయాన సంస్థల విచిత్ర పరిస్థితి చౌక చార్జీలకే విమానయానం అని ఊరిస్తూ ప్రయాణికుల్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు భలే ఊరిస్తున్నాయి. అందరినీ విమానమెక్కేలా చేస్తున్నాయి. చిత్రమేంటంటే ప్రయాణికుల్ని పెంచుకోవటంలో సక్సెస్ అవుతున్నా... దానికి అనుగుణంగా ఆదాయాని పెంచుకోవటంలో మాత్రం ఫెయిలవుతున్నాయి. దీనిక్కారణం కూడా చౌక ఛార్జీలే. అంటే... చౌక ఛార్జీలు ప్రయాణికుల్ని తెస్తున్నాయి కానీ ఆదాయాన్ని కాదన్నమాట. జనవరి-ఏప్రిల్ మధ్య నమోదైన గణాంకాలే దీనికి నిదర్శనం. గతేడాదితో పోలిస్తే విమాన ఛార్జీలు 20-25 శాతం తగ్గడంతో ప్రతి ప్రయాణికుడిపై ఎయిర్‌లైన్స్‌కి వచ్చే ఆదాయాలు ఆ మేరకు తగ్గాయి మరి. జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో విమాన ప్రయాణికుల సంఖ్య 20 శాతం పెరిగింది. చార్జీలు తగ్గడంతో దేశీయ రూట్లలో ప్రయాణించిన వారే ఇందులో అత్యధికంగా ఉన్నారు. 2014 తొలి త్రైమాసికంతో పోలిస్తే 2015 క్యూ1లో ప్యాసింజర్ ఆక్యుపెన్సీ చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగింది. గతేడాది క్యూ1లో వృద్ధి 71 శాతంగా ఉండగా ఈసారి ఇది 82 శాతంగా నమోదైంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. ఈ వ్యవధిలో ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, జపాన్, రష్యా, అమెరికా వంటి దేశాలతో పోల్చినా కూడా ఇది అత్యధిక పెరుగుదల. ప్రయాణికుల సంఖ్యతో పాటు ఎయిర్‌లైన్స్ నిర్వహణ ఆదాయాలు కూడా పెరిగాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో జెట్ ఎయిర్వేస్ నిర్వహణ ఆదాయం 10.9 శాతం పెరగ్గా.. ప్రతి ప్రయాణికుడిపై సగటున వచ్చే స్థూల ఆదాయం మాత్రం 11.7% క్షీణించి రూ.7,562కి తగ్గింది. ప్రస్తుతానికి చార్జీలు తక్కువగానే ఉన్నప్పటికీ.. క్రూడ్ ధరలు గానీ పెరిగిన పక్షంలో ఇవి మళ్లీ పెరిగే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు. అయితే రాబోయే 1-2 నెలల్లో ఇది జరగకపోవచ్చని వారు పేర్కొన్నారు. పెరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్‌లు .. గతేడాదితో పోలిస్తే అప్పటికప్పుడు ప్రయాణాలకు అమ్మే టికెట్ చార్జీలూ కూడా తగ్గాయి. 30-60 రోజుల ముందుగా బుక్ చేసుకుంటే టికె ట్లు చౌకగా లభిస్తున్నందున అడ్వాన్స్ బుకింగ్స్ పెరుగుతున్నాయి. సాధారణంగా 1-3 నెలల ముందే ప్రయాణికులు ట్రిప్స్‌ను ప్లానింగ్ చేసుకుని, టికెట్లను బుక్ చేసుకుంటున్నారని తమ సర్వేలో తేలినట్లు యాత్రా డాట్‌కామ్ వర్గాలు తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్‌లో టికెట్లు చౌకగా లభిస్తుండటమూ ఇందుకు కారణమన్నాయి. రిటైల్ రేట్ల వైపు కార్పొరేట్ల మొగ్గు... సాధారణంగానే కార్పొరేట్ బుకింగ్ కింద పెద్ద ఎత్తున డిస్కౌంట్లు పొందే కంపెనీలు కూడా ప్రస్తుతం రిటైల్ రేట్లకు టికెట్లు కొనుక్కునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. కార్పొరేట్లకు ఆఫర్ చేసే రేటు కన్నా కూడా ఇవి చౌకగా లభిస్తుండటమే ఇందుకు కారణం. గత జనవరి-ఏప్రిల్ మధ్య కాలంతో పోలిస్తే ఈసారి ఢిల్లీ-కోల్‌కతా రూట్లో కార్పొరేట్ ట్రావెల్ విభాగం బుకింగ్స్ 31 శాతం పెరగ్గా, ఢిల్లీ-పుణె రూట్లో 28 శాతం పెరిగినట్లు ఒక ట్రావెల్ కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. పుణె, అహ్మదాబాద్, నాగ్‌పూర్, ఇండోర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల నుంచి మెట్రోలకు వచ్చి, వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని యాత్రాడాట్‌కామ్ వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల కార్పొరేట్ ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ, ఆ విభాగం అమ్మకాల ఆదాయం మాత్రం తగ్గాయి. మరోవైపు ట్రాఫిక్‌కి అనుగుణంగా ఎయిర్‌లైన్స్ కూడా ప్రధాన నగరాల మధ్య సర్వీసులను పెంచుతున్నాయి. ముంబై-ఢిల్లీ, ఢిల్లీ-బెంగళూరు సహా పలు మెట్రో రూట్లలో ఈ ధోరణి కనిపిస్తోంది. ముంబై-ఢిల్లీ రూట్లో విస్తార అయిదు ఫ్లయిట్స్‌ను ప్రారంభించగా, ఢిల్లీ నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా రూట్లలో జెట్ ఎయిర్వేస్ మరిన్ని ఫ్లయిట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.