చౌక బేరం.. ఆదాయం దూరం! | United Airlines threatened with boycott after Tahera Ahmad's claims ... | Sakshi
Sakshi News home page

చౌక బేరం.. ఆదాయం దూరం!

Published Tue, Jun 2 2015 1:45 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

చౌక బేరం.. ఆదాయం దూరం! - Sakshi

చౌక బేరం.. ఆదాయం దూరం!

ప్రయాణికులు పెరిగినా ఆదాయం తగ్గుతోంది
* విమానయాన సంస్థల విచిత్ర పరిస్థితి

చౌక చార్జీలకే విమానయానం అని ఊరిస్తూ ప్రయాణికుల్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు భలే ఊరిస్తున్నాయి. అందరినీ విమానమెక్కేలా చేస్తున్నాయి. చిత్రమేంటంటే ప్రయాణికుల్ని పెంచుకోవటంలో సక్సెస్ అవుతున్నా... దానికి అనుగుణంగా ఆదాయాని పెంచుకోవటంలో మాత్రం ఫెయిలవుతున్నాయి. దీనిక్కారణం కూడా చౌక ఛార్జీలే.

అంటే... చౌక ఛార్జీలు ప్రయాణికుల్ని తెస్తున్నాయి కానీ ఆదాయాన్ని కాదన్నమాట. జనవరి-ఏప్రిల్ మధ్య నమోదైన గణాంకాలే దీనికి నిదర్శనం. గతేడాదితో పోలిస్తే విమాన ఛార్జీలు 20-25 శాతం తగ్గడంతో ప్రతి ప్రయాణికుడిపై ఎయిర్‌లైన్స్‌కి వచ్చే ఆదాయాలు ఆ మేరకు తగ్గాయి మరి.
 జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో విమాన ప్రయాణికుల సంఖ్య 20 శాతం పెరిగింది. చార్జీలు తగ్గడంతో దేశీయ రూట్లలో ప్రయాణించిన వారే ఇందులో అత్యధికంగా ఉన్నారు.

2014 తొలి త్రైమాసికంతో పోలిస్తే 2015 క్యూ1లో ప్యాసింజర్ ఆక్యుపెన్సీ చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగింది. గతేడాది క్యూ1లో వృద్ధి 71 శాతంగా ఉండగా ఈసారి ఇది 82 శాతంగా నమోదైంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. ఈ వ్యవధిలో ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, జపాన్, రష్యా, అమెరికా వంటి దేశాలతో పోల్చినా కూడా ఇది అత్యధిక పెరుగుదల. ప్రయాణికుల సంఖ్యతో పాటు ఎయిర్‌లైన్స్ నిర్వహణ ఆదాయాలు కూడా పెరిగాయి.

జనవరి-మార్చి త్రైమాసికంలో జెట్ ఎయిర్‌వేస్ నిర్వహణ ఆదాయం 10.9 శాతం పెరగ్గా.. ప్రతి ప్రయాణికుడిపై సగటున వచ్చే స్థూల ఆదాయం మాత్రం 11.7% క్షీణించి రూ.7,562కి తగ్గింది. ప్రస్తుతానికి చార్జీలు తక్కువగానే ఉన్నప్పటికీ.. క్రూడ్ ధరలు గానీ పెరిగిన పక్షంలో ఇవి మళ్లీ పెరిగే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు. అయితే రాబోయే 1-2 నెలల్లో ఇది జరగకపోవచ్చని వారు పేర్కొన్నారు.
 
పెరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్‌లు ..
గతేడాదితో పోలిస్తే అప్పటికప్పుడు ప్రయాణాలకు అమ్మే టికెట్ చార్జీలూ కూడా తగ్గాయి. 30-60 రోజుల ముందుగా బుక్ చేసుకుంటే టికె ట్లు చౌకగా లభిస్తున్నందున అడ్వాన్స్ బుకింగ్స్ పెరుగుతున్నాయి. సాధారణంగా 1-3 నెలల ముందే ప్రయాణికులు ట్రిప్స్‌ను ప్లానింగ్ చేసుకుని, టికెట్లను బుక్ చేసుకుంటున్నారని తమ సర్వేలో తేలినట్లు యాత్రా డాట్‌కామ్ వర్గాలు తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్‌లో టికెట్లు చౌకగా లభిస్తుండటమూ ఇందుకు కారణమన్నాయి.
 
రిటైల్ రేట్ల వైపు కార్పొరేట్ల మొగ్గు...
సాధారణంగానే కార్పొరేట్ బుకింగ్ కింద పెద్ద ఎత్తున డిస్కౌంట్లు పొందే కంపెనీలు కూడా ప్రస్తుతం రిటైల్ రేట్లకు టికెట్లు కొనుక్కునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. కార్పొరేట్లకు ఆఫర్ చేసే రేటు కన్నా కూడా ఇవి చౌకగా లభిస్తుండటమే ఇందుకు కారణం. గత జనవరి-ఏప్రిల్ మధ్య కాలంతో పోలిస్తే ఈసారి ఢిల్లీ-కోల్‌కతా రూట్‌లో కార్పొరేట్ ట్రావెల్ విభాగం బుకింగ్స్ 31 శాతం పెరగ్గా, ఢిల్లీ-పుణె రూట్‌లో 28 శాతం పెరిగినట్లు ఒక ట్రావెల్ కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

పుణె, అహ్మదాబాద్, నాగ్‌పూర్, ఇండోర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల నుంచి మెట్రోలకు వచ్చి, వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని యాత్రాడాట్‌కామ్ వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల కార్పొరేట్ ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ, ఆ విభాగం అమ్మకాల ఆదాయం మాత్రం తగ్గాయి. మరోవైపు ట్రాఫిక్‌కి అనుగుణంగా ఎయిర్‌లైన్స్ కూడా ప్రధాన నగరాల మధ్య సర్వీసులను పెంచుతున్నాయి. ముంబై-ఢిల్లీ, ఢిల్లీ-బెంగళూరు సహా పలు మెట్రో రూట్లలో ఈ ధోరణి కనిపిస్తోంది. ముంబై-ఢిల్లీ రూట్‌లో విస్తార అయిదు ఫ్లయిట్స్‌ను ప్రారంభించగా, ఢిల్లీ నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా రూట్లలో జెట్ ఎయిర్‌వేస్ మరిన్ని ఫ్లయిట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement