5జీ.. ఫిఫ్త్ జనరేషన్ మొబైల్ ఫోన్ టెక్నాలజీ. 4జీ ఎల్‌టీఈకు నెక్స్ట్ వెర్షన్. వేగవంతమైన ఇంటర్నెట్ అందించే సెల్యూలార్ టెక్నాలజీ. హైపర్‌ఫార్మెన్స్, ఎక్కువ నెట్‌వర్క్ సామర్థ్యం, ఇంటర్నెట్ డేటా వేగం, ఎక్కువ మంది యూజర్లు పొందే అనుభవం-సేవలు ఒక్కరికే అందించడం, కొత్త పరిశ్రమలకు అనుసంధానం చేయడం లాంటి వెసులుబాట్లు 5జీతో కలగనున్నాయి . త్వరలో భారత్‌లోనూ 5జీ సేవలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. అమెరికాలో 5జీ సేవలపై అభ్యంతరం-విమాన సర్వీసులు నిలిపివేస్తామనే బెదిరింపుల నడుమ ఆసక్తికర చర్చ నడుస్తోంది.
‘5జీ నెట్‌వర్క్ సేవలతో విమానాలకు విపత్తు పొంచి ఉంది’. అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ల బాసుల నుంచి వెల్లువెత్తుతున్న అభ్యంతరం. ఈ మేరకు ప్రముఖ యూఎస్ టెలికాం కంపెనీలు వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు చాలాకాలం నుంచి 5జీ సేవలను మొదలుపెట్టాలనే ప్రయత్నాల్లో ఉండగా.. ఆ ప్రయత్నాలకు అడ్డుపడుతూ వస్తున్నాయి ఎయిర్‌లైన్స్ కంపెనీలు. ఈ క్రమంలోనే విమాన సర్వీసులకు విఘాతం ఏర్పడుతోంది.
అభ్యంతరాలు ఇవే..
సాధారణంగా విమానాలు ఎక్కిన ప్రయాణికులను.. ప్రత్యేకించి టేకాఫ్ అయ్యే లేదంటే ల్యాండ్ అయ్యే సమయంలో ఫోన్ స్విచ్ఛాప్ చేయమని కోరతారు సిబ్బంది. అందుకు కారణం.. రేడియో ఫ్రీక్వెన్సీ సమస్యలు ఎదురు కావొచ్చని!. అయితే టెక్నాలజీ అప్‌డేట్ అవుతున్నా కొద్దీ ఈ తరహా రిక్వెస్టులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. కానీ, అమెరికా ఎయిర్‌లైన్స్ వినిపిస్తున్న వాదన ఏంటంటే.. 5జీ ఏర్పాట్ల వల్ల ఎయిర్‌క్రాఫ్ట్ భద్రత వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రస్తావించిన అభ్యంతరాలు ఏంటంటే.. 5జీ టెలిఫోన్ నెటవర్క్స్- విమానాల్లో ఉపయోగించే రేడియో అల్టిమీటర్స్‌లో జోక్యం చేసుకుంటాయట. తద్వారా వాతావరణం సరిగా లేనప్పుడు విమానాల అత్యవసర ల్యాండింగ్, లోఅల్టిట్యూడ్‌లో హెలికాఫ్టర్లు ఎగరడం లాంటి అంశాలపై ప్రభావం పడుతుందని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆటో పైలెట్ వ్యవస్థను సైతం ప్రభావితం చేయొచ్చని అంటున్నాయి యూఎస్ ఎయిర్‌లైన్ సంస్థలు. ఈ మేరకు 2009లో టర్కీష్ ఎయిర్‌లైన్స్ ప్రమాదంలో సాంకేతిక వ్యవస్థ విఫలం కావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపెడుతున్నారు.(ఆ ప్రమాదంలో 9 మంది చనిపోగా.. 120 మందికి గాయపడ్డారు).
అమెరికాకే నొప్పా?
5జీ సేవలు ప్రపంచంలో ఇప్పటిదాకా 40 దేశాల్లో కొనసాగుతున్నాయి. అయితే అగ్రరాజ్యంలోనే ఇంత చర్చా జరగడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ, మిగతా దేశాల్లోనూ ఇలాంటి సమస్యలు, అభ్యంతరాలు వచ్చాయి. 2021 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ సివిల్ ఏవియేషన్ కూడా ఇలాంటి అభ్యంతరాలనే లేవనెత్తింది. ఆ సందర్భంలో అమెరికా ఎయిర్‌లైన్స్ సర్వీసుల్లాగా రాద్ధాంతం చేయకుండా.. కెనడాలో మాదిరి ఫోన్ మాస్ట్‌లను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రయాణికులను టేకాఫ్, ల్యాండ్ అయిన సమయంలో ఫోన్లు స్విచ్ఛాఫ్ మాత్రమే చేయాలని కోరింది. ఇక యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ.. ‘సమస్యలను నివారించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు, ఎయిర్‌లైన్స్, స్టేట్ స్పెక్ట్రమ్ రెగ్యులేటర్‌లతో కలిసి పని చేస్తున్నామని, యూరప్‌లో ఎలాంటి ఘటలను గుర్తించలేద’ని స్పష్టం చేసింది.
ఈయూతో పోలిస్తే.. అమెరికాలో రేడియో ఫ్రీకెన్సీ జోక్యం, ఇతర ఇబ్బందులు తక్కువేనని సేప్టీ డివైజ్‌లు తయారు చేసే అమెరికన్ కంపెనీ రెసోనాంట్ కంపెనీ ప్రతినిధి జార్జ్ హోమ్స్ చెప్తున్నారు.
ఫ్రీక్వెన్సీ ఇష్యూ..
కొన్ని దేశాలు 5జీ విషయంలో 600 మెగాహెర్ట్జ్ నుంచి 900 మెగాహెర్ట్జ్ మధ్య ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తున్నాయి. మరికొన్నిదేశాలు 2.3 గిగాహెర్ట్జ్ నుంచి 4.7 గిగాహెర్ట్జ్ మధ్య ఫ్రీక్వెన్సీతో డేటా స్పీడ్‌ను పెంచుతున్నాయి. ఇంకొన్ని దేశాల్లో అయితే ఏకంగా 24 గిగాహెర్ట్జ్ నుంచి 47 గిగాహెర్ట్జ్ మధ్య ఉపయోగిస్తున్నాయి. ఈ ఫ్రీక్వెన్సీలో ఎక్కువ టవర్లు అవసరం పడినప్పటికీ.. డేటా కూడా అంతే స్పీడ్‌గా వస్తుంది. ఇక అమెరికా విషయానికి వస్తే.. వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు ఏర్పాటు చేయబోయే 5జీ నెట్‌వర్క్స్ కోసం 3.7 గిగాహెర్ట్జ్ నుంచి 3.8 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్స్ బ్యాండ్‌కు అప్‌గ్రేడ్ లభించింది. మరోవైపు ఏవియేషన్ ఉపయోగిస్తున్న రేడియో అల్టిమీటర్స్ ఏమో 4.2 గిగాహెర్ట్జ్ నుంచి 4.4 గిగాహెర్ట్జ్ బాండ్ మధ్య నడుస్తోంది. సీ-బ్యాండ్(5జీ సేవల కోసం ఉపయోగిస్తున్న ఫ్రీక్వెన్సీ), విమానాల కోసం ఉపయోగించే ఫ్రీక్వెన్సీలు దగ్గరదగ్గరగా ఉండడమే అసలు సమస్యగా మారింది. సీ-బ్యాండ్ ఎయిర్‌వేవ్స్‌తో.. ఏవియేషన్ కమ్యూనికేషన్ దెబ్బతింటుందనేది ఎయిర్‌లైన్స్ ఓనర్ల వాదన.
ఎఫ్‌ఏఏ హెచ్చరికల తర్వాతే..
చాలా దేశాల్లో ప్రభుత్వ ఏజెన్సీలు రేడియో US స్పెక్ట్రమ్‌ను నియంత్రిస్తుంటాయి. అలాగే అమెరికాలో ఎఫ్‌సీసీ ‘ఫ్రీక్వెన్సీ కంట్రోల్’ చేస్తోంది. వాస్తవానికి 5జీ స్పెక్ట్రమ్‌లో చాలా భాగాలను 2016లోనే పక్కన పెట్టేసింది. ఆ సమయంలోనే ఎయిర్‌క్రాఫ్ట్‌ల సమస్యనే అభ్యంతరంగా లేవనెత్తింది ఎఫ్‌ఏఏ Federal Aviation Administration. అంతేకాదు కిందటి ఏడాది నవంబర్‌లో ఎయిర్‌లైన్స్‌ను హెచ్చరిస్తూ ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. ‘5G ట్రాన్స్‌మీటర్లు, ఇతర సాంకేతికత జోక్యం చేసుకోవడం వల్ల నిర్దిష్ట భద్రతా పరికరాలు పనిచేయకపోవడం లాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. విమాన కార్యకలాపాలను ప్రభావితం చేసే చర్యలను తగ్గించడం అవసరం అంటూ ఎయిర్‌లైన్స్ సంస్థలను సూచించింది ఎఫ్‌ఏఏ.
ఒకరిని మించి ఒకరు
అమెరికాలోనే అతిపెద్ద టెలికాం కంపెనీలుగా ఉన్నాయి వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు. వాస్తవానికి వీటికి అనుమతులు ఎప్పుడో లభించాయి. కానీ, భద్రత కారణాల దృష్ట్యా లాంచింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ తరుణంలో జనవరి 19 నుంచి 5జీ సేవల్ని కొన్ని ప్రధాన ఎయిర్‌పోర్ట్‌ల పరిధిలో మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాయి. ఈలోపు ఏవియేషన్ సేఫ్టీని లేవనెత్తుతూ సర్వీసులు నిలిపివేస్తామని బెదిరింపులకు దిగాయి ఎయిర్‌లైన్స్ కంపెనీలు. 5జీ సర్వీసు మొదలైతే. విమాన సర్వీసులను బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నాయి ఎయిర్‌లైన్స్. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశాయి. ఈలోపు కొన్ని దేశాలు(భారత్ కూడా) సర్వీసుల రద్దు, వేళల్లో మార్పునకే మొగ్గుచూపాయి.
ఏం జరగనుంది..
ప్రస్తుత పరిస్థితుల్లో ఏటీ అండ్ టీ కంపెనీ 5జీ సేవల మొదలును మరోసారి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అమెరికా టెలికాం పరిశ్రమ, విమానయాన పరిశ్రమ రెండూ భారీగా లాభపడే ఈ వ్యవహారానికి పరిష్కారం మాత్రం త్వరగా దొరికేలా కనిపించడం లేదు. ఇది టెలికాం సహా ఇతర విభాగాలు, ప్రభుత్వాలకు సంబంధించిన సమస్య. వేర్వేరు ఫ్రీక్వెన్సీలను ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ, అమెరికాలో రెండూ సీ-బ్యాండ్‌నే ఉపయోగిస్తున్నాయి. ఈ విషయంలోనే రాజీకి రాలేకపోతున్నాయి. ఒకవేళ ఇప్పటికే ఉన్న ఆల్టిమీటర్‌లు సురక్షితమైనవిగా రేట్ చేసే అవకాశం ఉంది. లేదంటే 5G జోక్యానికి వ్యతిరేకంగా మరింత పటిష్టంగా ఉండేలా కొత్త నిబంధనల్ని ప్రభుత్వం రూపొందించొచ్చు. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్, ఎఫ్‌సీసీFederal Communications Commission, ఎయిర్‌లైన్స్ నిర్వాహకుల్ని కూర్యోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తోంది బైడెన్ ప్రభుత్వం. ఈ సమస్య పరిష్కారానికి ఎంత టైం పడుతుందన్నది కచ్చితంగా తెలియడం లేదు.
సమస్య ఇదేనా?
ఇక్కడ సేమ్ ఫ్రీక్వెన్సీ సమస్య ఒక్కటే కాదని తెలుస్తోంది. అమెరికాలో కమర్షియల్ ఫ్లయిట్‌లు వాతావరణం సరిగా లేని టైంలోనూ ఆపరేట్ చేసుకునేందుకు(లిమిట్ ఆక్యుపెన్సీతో) అనుమతులు ఉన్నాయి. అయితే హజారర్డ్స్(ప్రమాదాలు) జరిగే జోన్‌లో విమానాలు ఎగరడం పట్ల పైలెట్లను హెచ్చరిస్తూ ఇప్పటివరకు 1450 నోటీసులు జారీ అయ్యాయి. విశేషం ఏంటంటే.. ఈ జోన్‌లోనే 5జీ టవర్స్ ఏర్పాటు అయ్యాయి. ఈ విషయంలోనే 5జీ సేవలపై గుర్రుగా ఉన్న విమానయాన సంస్థల బాసులు అమెరికా ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఆ రూల్స్ ప్రకారం వెళ్తే.. విమానాల్ని రద్దు చేసుకోవాల్సి వస్తుందని, వాణిజ్య రంగానికి ఆటంకం వాటిల్లుతుందని లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు.
::: సాక్షి, వెబ్‌స్పెషల్
Comments
Please login to add a commentAdd a comment