aviation companies
-
‘మమ్మల్ని ఆదుకోండి సార్’.. రతన్ టాటాకు చేరిన పైలెట్ల పంచాయితీ!
మానవ వనరుల విభాగం (hr) ఏకపక్షనిర్ణయాలతో తమకు అన్యాయం జరుగుతోందని, వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎయిరిండియా పైలెట్లు, క్యాబిన్ క్రూ సిబ్బంది 1500 సంతకాలతో కూడిన పిటిషన్‌ను ఎయిరిండియా మాతృసంస్థ, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాకు పంపారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న పైలెట్లు, క్యాబిన్ క్రూ సిబ్బందికి చెల్లించే జీతాలు, కాంట్రాక్ట్‌లను ఎయిండియా సవరించింది. ఈ నిర్ణయాన్ని పైలెట్ల యూనియన్లు ఇండియన్ కమర్షియల్ పైలెట్ అసోషియేషన్ (icpa), ఇండియన్ పైలెట్స్ గిల్డ్ (ipg) లు వ్యతిరేకించాయి. తమని సంప్రదించకుండా హెచ్ఆర్ విభాగం కాంట్రాక్ట్ సవరణ, జీతభత్యాలపై నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి.ఎట్టి పరిస్థితుల్లో ఈ కొత్త చెల్లింపుల్ని అంగీకరించబోమని స్పష్టం చేశాయి. రతన్ టాటాకు పంపిన పిటిషన్లో ఎయిరిండియా హెచ్ఆర్ విభాగం తీరుపై పైలెట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థలో తమకు విలువ లేదని, శ్రమకు తగ్గ గౌరవం లేదని వాపోయారు. ఆ కారణంతోనే విధులు నిర్వహించే సమయంలో శక్తి, సామర్ధ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పిటిషన్లో వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమానయాన సంస్థగా తీర్చిదిద్దుతున్న ఎయిరిండియా విజయంలో తాము భాగస్వాములమేనని, ప్రయాణికులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేలా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విమానయాన రంగం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్ని తాము అర్ధం చేసుకున్నామని చెప్పారు. సమస్యల్ని పరిష్కరించుకుంటూ సంస్థతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ‘కానీ మా సమస్యలను హెచ్ఆర్ విభాగం పట్టించుకోవడం లేదు. పరిష్కారం చూపించడం లేదని భావిస్తున్నాం. ఉత్పన్నమవుతున్న సమస్యల్ని పరిష్కరించాలని మిమ్మల్ని (రతన్ టాటాను) కోరుతున్నామని’ పైలెట్లు రతన్ టాటాకు ఇచ్చిన పిటిషన్లో తెలిపారని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
హమ్మయ్యా.. గాల్లో తేలుతున్నారు, మళ్లీ పాత రోజులొస్తున్నాయ్!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికుల సంఖ్య తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి చేరవచ్చని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. తద్వారా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ ట్రాఫిక్ 75 శాతం మేర వృద్ధి సాధించవచ్చని సూచనతప్రాయంగా తెలిపింది. అంతర్జాతీయ రూట్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నందున.. దేశీ రూట్లలో ప్రయాణాలు ఇందుకు ఊతంగా ఉండగలవని క్రిసిల్ వివరించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికుల సంఖ్య దాదాపు 34 కోట్లుగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లో (ఆగస్టు వరకు) అప్పటి గణాంకాలతో పోలిస్తే 88 శాతం మేర ప్యాసింజర్ ట్రాఫిక్ నమోదైనట్లు క్రిసిల్ పేర్కొంది. బిజినెస్ ట్రావెల్ సెంటిమెంటు, అంతర్జాతీయంగా ప్రయాణాలు పెరుగుతుండటం, విమానాలు పూర్తి సామర్థ్యాలతో పని చేయడం మొదలయ్యే కొద్దీ మిగతా నెలల్లో ఇది ఇంకా పుంజుకోగలదని వివరించింది. అయితే, ఎయిర్ ట్రాఫిక్ రికవరీ, ఆదాయ అంచనాలు మొదలైనవన్నీ స్థూల ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయని క్రిసిల్ పేర్కొంది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! కరోనా ముందు ఏటా 12 శాతం వృద్ధి.. 2015–2020 మధ్య విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 12 శాతం వార్షిక వృద్ధి చెందుతూ వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతీయ కనెక్టివిటీ స్కీములతో చిన్న పట్టణాలకు కూడా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం మొదలైన అంశాలు ఇందుకు తోడ్పడ్డాయని నివేదికలో క్రిసిల్ పేర్కొంది. అయితే, ఆ తర్వాత 2021 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి తెరపైకి రావడంతో ఎయిర్ ట్రాఫిక్ ఒక్కసారిగా పడిపోయింది. పలు వేవ్‌లు, ప్రయాణాలపై ఆంక్షల కారణంగా 2021–22లో పాక్షికంగానే రికవర్ అయింది. 2019–20తో పోలిస్తే ప్యాసింజర్ ట్రాఫిక్ 55 శాతానికే పరిమితమైంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
ఆ స్కీం కింద ఏవియేషన్‌కి రూ. 1,500 కోట్ల రుణ పరిమితి
కోవిడ్ ధాటికి కుదేలైన రంగాలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ఉద్దేశించిన ఈసీఎల్‌జీఎస్‌కి (అత్యవస రుణ సదుపాయ హామీ పథకం) కేంద్ర ఆర్థిక శాఖ సవరణలు చేసింది. వైమానిక రంగ సంస్థలకు గరిష్ట రుణ పరిమితిని రూ. 400 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెంచింది. సముచిత వడ్డీ రేటుతో తనఖా లేని రుణాలు పొందడం ద్వారా విమానయాన సంస్థలు నిధుల కొరత సమస్యను అధిగమించడంలో తోడ్పాటు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020 మే నెలలో కేంద్రం ఈ స్కీమును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత నుంచి పరిస్థితులను బట్టి సవరిస్తూ, పొడిగిస్తూ వస్తోంది. ఇది ఈ ఏడాది మార్చితో ముగియాల్సి ఉండగా 2023 మార్చి వరకూ పొడిగించింది. ఈ స్కీము కింద 2022 ఆగస్టు 5 నాటికి ఈ స్కీము కింద రూ. 3.67 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. -
హైదరాబాద్‌కు ‘ఎగిరొచ్చిన’ ప్రపంచంలోనే నంబర్ 1 సంస్థ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ దిగ్గజ సంస్థ సిద్ధమైంది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ రూ.1200 కోట్లతో తన కంపెనీని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైమానిక రంగానికి సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్ఓ) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. భారత్‌లో తన తొలి ఎంఆర్ఓ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చిన శాఫ్రాన్ నిర్ణయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు స్వాగతించారు. మన దేశంలో ఒక విదేశీ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనన్నారు. శాఫ్రాన్ ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలోని ఏవియేషన్ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. శాఫ్రాన్ అతిపెద్ద నిర్వహణ కేంద్రం హైదరాబాద్‌లోనే రాబోతుందన్నారు. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజన్లు ఉత్పత్తి చేసే అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన శాఫ్రాన్ ఏర్పాటుచేస్తున్న ఈ కేంద్రంతో సుమారు వెయ్యి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. భారత్‌తోపాటు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థల విమానాల్లో వాడే లీప్–1ఏ, లీప్–1బీ ఇంజన్ల నిర్వహణను హైదరాబాద్‌లోనే చేస్తారన్నారు. ప్రస్తుతం విదేశాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. శాఫ్రాన్ పెడుతున్న ఈ భారీ పెట్టుబడితో ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్‌కు తిరుగులేదన్న సంగతి మరోసారి రుజువైందని కేటీఆర్ చెప్పారు. చదవండి👉🏻సర్కార్‌పై ‘వార్’టీఐ! దరఖాస్తుల ద్వారా యుద్ధానికి రాష్ట్ర బీజేపీ సిద్ధం ప్రపంచంలోనే నంబర్ 1 ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ అంతర్జాతీయంగా హైటెక్నాలజీ గ్రూప్. ఇది వైమానిక, రక్షణ, అంతరిక్ష రంగాల్లో పనిచేస్తుంది. వైమానిక రంగానికి సంబంధించి ప్రొపల్షన్, ఎక్విప్మెంట్, ఇంటీరియర్స్ తయారీల్లో అగ్రశ్రేణి సంస్థ. గగనతల రవాణాకు సంబంధించి సురక్షితమైన, సౌకర్యవంతమైన సహకారాన్ని ప్రపంచానికి అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. 2021 సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం ఈ సంస్థ పరిధిలో 76,800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 15.3 బిలియన్ యూరోల విక్రయాలతో ప్రపంచంలో అగ్రస్థానాన ఉంది. జీఈ సంస్థతో కలిసి వాణిజ్య జెట్ ఇంజన్లకు సంబంధించి ప్రపంచంలోనే నంబర్ 1గా ఉన్న శాఫ్రాన్.. హెలికాప్టర్ టర్బైన్ ఇంజన్లు, లాండింగ్ గేర్ల తయారీల్లో కూడా అగ్రశ్రేణి సంస్థగా ఉంది. నేడు రెండు ప్రాజెక్టుల ప్రారంభం ఇటీవల హైదరాబాద్‌లో శాఫ్రాన్ సంస్థ రెండు మెగా ఏరోస్పేస్ ప్రాజెక్టులను స్థాపించింది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల్లో ఒకటి శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ. ఇది విమాన ఇంజన్లకు వైర్ హార్నెస్‌లను ఉత్పత్తి చేస్తుంది. రెండోది శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ ఫ్యాక్టరీ. ఇది కీలకమైన లీప్ ఇంజన్ల కోసం క్లిష్టమైన ఏరో ఇంజన్ భాగాలను తయారు చేయనుంది. ఈ రెండు ఫ్యాక్టరీలను గురువారం మంత్రి కేటీఆర్.. శాఫ్రాన్ గ్రూప్ సీఈవో ఒలివీర్ ఆండ్రీస్, శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ సీఈవో జీన్‌పాల్ అలరీలతో కలిసి ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఎంఆర్ఓకు ఇవి అదనం. ప్రపంచస్థాయి ఏరోస్పేస్ సంస్థల నుంచి మెగా పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలో అత్యంత శక్తిమంతమైన ఏరోస్పేస్ వ్యాలీగా హైదరాబాద్ స్థిరపడనుందని కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి👉🏻విధ్వంసాన్ని పసిగట్టే వీడియో వ్యవస్థ -
5G Issue: 5జీతో నిజంగానే విమానాలకు ఇబ్బందా?
5జీ.. ఫిఫ్త్ జనరేషన్ మొబైల్ ఫోన్ టెక్నాలజీ. 4జీ ఎల్‌టీఈకు నెక్స్ట్ వెర్షన్. వేగవంతమైన ఇంటర్నెట్ అందించే సెల్యూలార్ టెక్నాలజీ. హైపర్ఫార్మెన్స్, ఎక్కువ నెట్వర్క్ సామర్థ్యం, ఇంటర్నెట్ డేటా వేగం, ఎక్కువ మంది యూజర్లు పొందే అనుభవం-సేవలు ఒక్కరికే అందించడం, కొత్త పరిశ్రమలకు అనుసంధానం చేయడం లాంటి వెసులుబాట్లు 5జీతో కలగనున్నాయి . త్వరలో భారత్‌లోనూ 5జీ సేవలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. అమెరికాలో 5జీ సేవలపై అభ్యంతరం-విమాన సర్వీసులు నిలిపివేస్తామనే బెదిరింపుల నడుమ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘5జీ నెట్వర్క్ సేవలతో విమానాలకు విపత్తు పొంచి ఉంది’. అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ల బాసుల నుంచి వెల్లువెత్తుతున్న అభ్యంతరం. ఈ మేరకు ప్రముఖ యూఎస్ టెలికాం కంపెనీలు వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు చాలాకాలం నుంచి 5జీ సేవలను మొదలుపెట్టాలనే ప్రయత్నాల్లో ఉండగా.. ఆ ప్రయత్నాలకు అడ్డుపడుతూ వస్తున్నాయి ఎయిర్‌లైన్స్ కంపెనీలు. ఈ క్రమంలోనే విమాన సర్వీసులకు విఘాతం ఏర్పడుతోంది. అభ్యంతరాలు ఇవే.. సాధారణంగా విమానాలు ఎక్కిన ప్రయాణికులను.. ప్రత్యేకించి టేకాఫ్ అయ్యే లేదంటే ల్యాండ్ అయ్యే సమయంలో ఫోన్ స్విచ్ఛాప్ చేయమని కోరతారు సిబ్బంది. అందుకు కారణం.. రేడియో ఫ్రీక్వెన్సీ సమస్యలు ఎదురు కావొచ్చని!. అయితే టెక్నాలజీ అప్డేట్ అవుతున్నా కొద్దీ ఈ తరహా రిక్వెస్టులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. కానీ, అమెరికా ఎయిర్‌లైన్స్ వినిపిస్తున్న వాదన ఏంటంటే.. 5జీ ఏర్పాట్ల వల్ల ఎయిర్‌క్రాఫ్ట్ భద్రత వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రస్తావించిన అభ్యంతరాలు ఏంటంటే.. 5జీ టెలిఫోన్ నెటవర్క్స్- విమానాల్లో ఉపయోగించే రేడియో అల్టిమీటర్స్లో జోక్యం చేసుకుంటాయట. తద్వారా వాతావరణం సరిగా లేనప్పుడు విమానాల అత్యవసర ల్యాండింగ్, లోఅల్టిట్యూడ్లో హెలికాఫ్టర్లు ఎగరడం లాంటి అంశాలపై ప్రభావం పడుతుందని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆటో పైలెట్ వ్యవస్థను సైతం ప్రభావితం చేయొచ్చని అంటున్నాయి యూఎస్ ఎయిర్‌లైన్ సంస్థలు. ఈ మేరకు 2009లో టర్కీష్ ఎయిర్‌లైన్స్ ప్రమాదంలో సాంకేతిక వ్యవస్థ విఫలం కావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపెడుతున్నారు.(ఆ ప్రమాదంలో 9 మంది చనిపోగా.. 120 మందికి గాయపడ్డారు). అమెరికాకే నొప్పా? 5జీ సేవలు ప్రపంచంలో ఇప్పటిదాకా 40 దేశాల్లో కొనసాగుతున్నాయి. అయితే అగ్రరాజ్యంలోనే ఇంత చర్చా జరగడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ, మిగతా దేశాల్లోనూ ఇలాంటి సమస్యలు, అభ్యంతరాలు వచ్చాయి. 2021 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ సివిల్ ఏవియేషన్ కూడా ఇలాంటి అభ్యంతరాలనే లేవనెత్తింది. ఆ సందర్భంలో అమెరికా ఎయిర్‌లైన్స్ సర్వీసుల్లాగా రాద్ధాంతం చేయకుండా.. కెనడాలో మాదిరి ఫోన్ మాస్ట్‌లను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రయాణికులను టేకాఫ్, ల్యాండ్ అయిన సమయంలో ఫోన్లు స్విచ్ఛాఫ్ మాత్రమే చేయాలని కోరింది. ఇక యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ.. ‘సమస్యలను నివారించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు, ఎయిర్‌లైన్స్, స్టేట్ స్పెక్ట్రమ్ రెగ్యులేటర్లతో కలిసి పని చేస్తున్నామని, యూరప్‌లో ఎలాంటి ఘటలను గుర్తించలేద’ని స్పష్టం చేసింది. ఈయూతో పోలిస్తే.. అమెరికాలో రేడియో ఫ్రీకెన్సీ జోక్యం, ఇతర ఇబ్బందులు తక్కువేనని సేప్టీ డివైజ్‌లు తయారు చేసే అమెరికన్ కంపెనీ రెసోనాంట్ కంపెనీ ప్రతినిధి జార్జ్ హోమ్స్ చెప్తున్నారు. ఫ్రీక్వెన్సీ ఇష్యూ.. కొన్ని దేశాలు 5జీ విషయంలో 600 మెగాహెర్ట్జ్ నుంచి 900 మెగాహెర్ట్జ్ మధ్య ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తున్నాయి. మరికొన్నిదేశాలు 2.3 గిగాహెర్ట్జ్ నుంచి 4.7 గిగాహెర్ట్జ్ మధ్య ఫ్రీక్వెన్సీతో డేటా స్పీడ్‌ను పెంచుతున్నాయి. ఇంకొన్ని దేశాల్లో అయితే ఏకంగా 24 గిగాహెర్ట్జ్ నుంచి 47 గిగాహెర్ట్జ్ మధ్య ఉపయోగిస్తున్నాయి. ఈ ఫ్రీక్వెన్సీలో ఎక్కువ టవర్లు అవసరం పడినప్పటికీ.. డేటా కూడా అంతే స్పీడ్‌గా వస్తుంది. ఇక అమెరికా విషయానికి వస్తే.. వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు ఏర్పాటు చేయబోయే 5జీ నెట్వర్క్స్ కోసం 3.7 గిగాహెర్ట్జ్ నుంచి 3.8 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్స్ బ్యాండ్‌కు అప్‌గ్రేడ్ లభించింది. మరోవైపు ఏవియేషన్ ఉపయోగిస్తున్న రేడియో అల్టిమీటర్స్ ఏమో 4.2 గిగాహెర్ట్జ్ నుంచి 4.4 గిగాహెర్ట్జ్ బాండ్ మధ్య నడుస్తోంది. సీ-బ్యాండ్(5జీ సేవల కోసం ఉపయోగిస్తున్న ఫ్రీక్వెన్సీ), విమానాల కోసం ఉపయోగించే ఫ్రీక్వెన్సీలు దగ్గరదగ్గరగా ఉండడమే అసలు సమస్యగా మారింది. సీ-బ్యాండ్ ఎయిర్‌వేవ్స్‌తో.. ఏవియేషన్ కమ్యూనికేషన్ దెబ్బతింటుందనేది ఎయిర్‌లైన్స్ ఓనర్ల వాదన. ఎఫ్ఏఏ హెచ్చరికల తర్వాతే.. చాలా దేశాల్లో ప్రభుత్వ ఏజెన్సీలు రేడియో US స్పెక్ట్రమ్‌ను నియంత్రిస్తుంటాయి. అలాగే అమెరికాలో ఎఫ్‌సీసీ ‘ఫ్రీక్వెన్సీ కంట్రోల్’ చేస్తోంది. వాస్తవానికి 5జీ స్పెక్ట్రమ్‌లో చాలా భాగాలను 2016లోనే పక్కన పెట్టేసింది. ఆ సమయంలోనే ఎయిర్‌క్రాఫ్ట్‌ల సమస్యనే అభ్యంతరంగా లేవనెత్తింది ఎఫ్ఏఏ Federal Aviation Administration. అంతేకాదు కిందటి ఏడాది నవంబర్‌లో ఎయిర్‌లైన్స్‌ను హెచ్చరిస్తూ ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. ‘5G ట్రాన్స్మీటర్లు, ఇతర సాంకేతికత జోక్యం చేసుకోవడం వల్ల నిర్దిష్ట భద్రతా పరికరాలు పనిచేయకపోవడం లాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. విమాన కార్యకలాపాలను ప్రభావితం చేసే చర్యలను తగ్గించడం అవసరం అంటూ ఎయిర్‌లైన్స్ సంస్థలను సూచించింది ఎఫ్ఏఏ. ఒకరిని మించి ఒకరు అమెరికాలోనే అతిపెద్ద టెలికాం కంపెనీలుగా ఉన్నాయి వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు. వాస్తవానికి వీటికి అనుమతులు ఎప్పుడో లభించాయి. కానీ, భద్రత కారణాల దృష్ట్యా లాంచింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ తరుణంలో జనవరి 19 నుంచి 5జీ సేవల్ని కొన్ని ప్రధాన ఎయిర్‌పోర్ట్‌ల పరిధిలో మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాయి. ఈలోపు ఏవియేషన్ సేఫ్టీని లేవనెత్తుతూ సర్వీసులు నిలిపివేస్తామని బెదిరింపులకు దిగాయి ఎయిర్‌లైన్స్ కంపెనీలు. 5జీ సర్వీసు మొదలైతే. విమాన సర్వీసులను బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నాయి ఎయిర్‌లైన్స్. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశాయి. ఈలోపు కొన్ని దేశాలు(భారత్ కూడా) సర్వీసుల రద్దు, వేళల్లో మార్పునకే మొగ్గుచూపాయి. ఏం జరగనుంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఏటీ అండ్ టీ కంపెనీ 5జీ సేవల మొదలును మరోసారి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అమెరికా టెలికాం పరిశ్రమ, విమానయాన పరిశ్రమ రెండూ భారీగా లాభపడే ఈ వ్యవహారానికి పరిష్కారం మాత్రం త్వరగా దొరికేలా కనిపించడం లేదు. ఇది టెలికాం సహా ఇతర విభాగాలు, ప్రభుత్వాలకు సంబంధించిన సమస్య. వేర్వేరు ఫ్రీక్వెన్సీలను ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ, అమెరికాలో రెండూ సీ-బ్యాండ్‌నే ఉపయోగిస్తున్నాయి. ఈ విషయంలోనే రాజీకి రాలేకపోతున్నాయి. ఒకవేళ ఇప్పటికే ఉన్న ఆల్టిమీటర్‌లు సురక్షితమైనవిగా రేట్ చేసే అవకాశం ఉంది. లేదంటే 5G జోక్యానికి వ్యతిరేకంగా మరింత పటిష్టంగా ఉండేలా కొత్త నిబంధనల్ని ప్రభుత్వం రూపొందించొచ్చు. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్, ఎఫ్‌సీసీFederal Communications Commission, ఎయిర్‌లైన్స్ నిర్వాహకుల్ని కూర్యోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తోంది బైడెన్ ప్రభుత్వం. ఈ సమస్య పరిష్కారానికి ఎంత టైం పడుతుందన్నది కచ్చితంగా తెలియడం లేదు. సమస్య ఇదేనా? ఇక్కడ సేమ్ ఫ్రీక్వెన్సీ సమస్య ఒక్కటే కాదని తెలుస్తోంది. అమెరికాలో కమర్షియల్ ఫ్లయిట్లు వాతావరణం సరిగా లేని టైంలోనూ ఆపరేట్ చేసుకునేందుకు(లిమిట్ ఆక్యుపెన్సీతో) అనుమతులు ఉన్నాయి. అయితే హజారర్డ్స్(ప్రమాదాలు) జరిగే జోన్లో విమానాలు ఎగరడం పట్ల పైలెట్లను హెచ్చరిస్తూ ఇప్పటివరకు 1450 నోటీసులు జారీ అయ్యాయి. విశేషం ఏంటంటే.. ఈ జోన్లోనే 5జీ టవర్స్ ఏర్పాటు అయ్యాయి. ఈ విషయంలోనే 5జీ సేవలపై గుర్రుగా ఉన్న విమానయాన సంస్థల బాసులు అమెరికా ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఆ రూల్స్ ప్రకారం వెళ్తే.. విమానాల్ని రద్దు చేసుకోవాల్సి వస్తుందని, వాణిజ్య రంగానికి ఆటంకం వాటిల్లుతుందని లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. ::: సాక్షి, వెబ్‌స్పెషల్ -
ఈ నెల 29న ఇండిగో ఈజీఎమ్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ, ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కంపెనీ ఈజీఎమ్(అసాధారణ సమావేశం) ఈ నెల 29న జరగనున్నది. ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్ గంగ్వాల్ అభ్యర్థన మేరకు ఈ ఏజీఎమ్ జరుగుతోంది. కంపెనీ షేర్ల బదిలీ, టేకోవర్, సంబంధించి ‘రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్’, ‘ట్యాగ్ ఎలాంగ్ రైట్’ తదితర అంశాలను తొలగించడానికి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్(ఏఓఏ)లో సవరణ కోసం ఈ ఈజీఎమ్‌ను ఉద్దేశించారు. ఇండిగో కంపెనీలో నిర్వహణ పరంగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్ గంగ్వాల్ ఆరు నెలల క్రితం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సెబీ జోక్యం చేసుకోవాలని గంగ్వాల్ కోరారు. దీంతో మరో ప్రమోటర్‌అయిన రాహుల్ భాటియాతో వివాదాలు చెలరేగాయి. రాకేశ్ గంగ్వాల్ గ్రూప్‌నకు 36.64 శాతం వాటా ఉండగా, రాహుల్ భాటియా గ్రూప్‌నకు 38 శాతం వాటా ఉంది. కంపెనీకి మంచిదే.... ఏఓఏ నుంచి కొన్ని అంశాలను(మూడు క్లాజులను) తొలగించడం, దానికి ఆమోదం పొందడం కంపెనీకి మంచిదేనని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. ఈ మూడు క్లాజుల తొలగింపు వల్ల ప్రమోటర్లు ఇరువురికి సమాన హక్కులు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్లాజుల తొలగింపునకు ఆమోదం లభించకపోతే, ప్రమోటర్ల పోరు మరికొంత కాలం కొనసాగుతుందని, అది షేర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కాగా కంపెనీ ఈజీఎమ్ ఈ నెల 29న జరగనున్నదన్న వార్తల కారణంగా బీఎస్ఈలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్ బీఎస్ఈలో 2.1 శాతం లాభంతో రూ.1,361 వద్ద ముగిసింది. -
ఊరిస్తున్న విమాన చార్జీలు!
♦ ఏడాదిలో సగటున 20 శాతం తగ్గిన టికెట్ చార్జీలు ♦ తొలిసారిగా బిజినెస్ క్లాస్‌కూ డిస్కౌంట్ ఆఫర్లు ♦ లాభాల బాట పట్టిన ఏవియేషన్ కంపెనీలు ♦ ఇంధన ధరలు ఏడాదిలో 45% తగ్గడమే కారణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానం ఎంత పెకైగురుతుందో... చార్జీలు అంతలా దిగి వస్తున్నాయి. ఈ వేసవిలో గతేడాదికంటే 20 శాతం తక్కువ ధరకే టికెట్లు విక్రయించడానికి విమానయాన కంపెనీలు సిద్ధమయ్యాయి. గతంలో ఇవి డిమాండ్ లేని సమయంలో డిస్కౌంట్ ఆఫర్లిచ్చేవి. కానీ ప్రయాణికుల్ని ఆకట్టుకోవటానికిపుడు ఏడాది పొడవునా ఏదో ఒక పేరుతో ఆఫర్లు ఇస్తూనే ఉన్నాయి. రూ.500 నుంచి రూ.1,000కే విమానం ఎక్కే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. నిజానికి వేసవిలో డిమాండ్ ఎక్కువ.ఈ వేసవిలో డిమాండ్ 20% దాకా పెరుగుతుందని కూడా కంపెనీలు అంచనా వేస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఎయిర్కోస్టా, స్పైస్ జెట్ వంటి సంస్థలు మరిన్ని నగరాలకు ఎక్కువ సర్వీసులను నడపడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాయి. ‘‘ఈ సారి డిమాండ్ పెరిగినా టికెట్ ధరలైతే పెరిగే అవకాశం లేదు. గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20% తక్కువ ధరకే టికెట్లు లభిస్తున్నాయి’’ అని ఎయిర్కోస్టా ప్రతినిధి చెప్పారు. గతేడాదితో పోలిస్తే డిసెంబర్ నాటికి దేశీ విమాన టికెట్ ధరలు సగటున 18.3 శాతం తగ్గినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు ఇటీవల చెప్పారు. 2014 డిసెంబర్లో సగటు టికెట్ ధర 7,492గా ఉంటే అది డిసెంబర్, 2015 నాటికి రూ.5,734కి తగ్గినట్లు బోయింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ కేశ్కర్ తెలియజేశారు. అన్నింటికీ డిస్కౌంట్లే: ఇప్పటిదాకా ఎకానమీ క్లాస్‌కే పరిమితమైన డిస్కౌంట్ల యుద్ధం ఇప్పుడు బిజినెస్ క్లాస్‌లకూ పాకింది. తొలిసారిగా బిజినెస్ క్లాస్‌లో 30 నుంచి 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు జెట్, విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రకటించాయి. నిత్యం డిమాండుండే ముంబై-ఢిల్లీ మార్గంలో రూ.21,000 ఉండే బిజినెస్ క్లాస్ టికెట్‌ను విస్తారా రూ. 15,000కే అందిస్తోంది. ఈ తగ్గింపు ధరలు అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. ఎయిర్ ఏషియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు ఏకంగా 50 శాతంవరకూ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఎంత చౌకగా అంటే... చేతిలో మూడు నాలుగు వేలుంటే మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లేలా. ఈ తగ్గింపుతో ప్రయాణికుల సంఖ్యలో భారీ వృద్ధి నమోదవుతున్నట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తెలియజేసింది. గతేడాదితో పోలిస్తే దేశీ విమాన ప్రయాణికుల సంఖ్యలో 23% వృద్ధి నమోదయిందని ఐఏటీఏ పేర్కొంది. దేశీ మధ్యతరగతి ప్రజల్లో పెరుగుతున్న వినిమయ శక్తి ఈ వృద్ధికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. 2024 నాటికి దేశీయ మధ్యతరగతి ప్రజల సంఖ్య 50% వృద్ధితో 60 కోట్లు దాటుతుందని ఎయిర్ బస్ అంచనా వేస్తోంది. వచ్చే ఇరవై ఏళ్లలో ప్రపంచ విమాన ప్రయాణికుల సంఖ్యలో 4.6% వృద్ధి ఉంటే ఇండియాలో ఈ వృద్ధి 8.4% ఉంటుందని అంచనా. చార్జీలు తగ్గుతున్నా, లాభాలు పెరుగుతున్నాయ్... ఒకపక్క విమాన టికెట్ ధరలు తగ్గుతున్నా విమానయాన కంపెనీల లాభాలు మాత్రం పెరుగుతుండటం విశేషం. మొన్నటి వరకు నష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థలిపుడు భారీ లాభాలను ప్రకటిస్తున్నాయి. స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్, ఇండిగో వంటి సంస్థలు మూడో త్రైమాసికంలో ప్రకటించిన లాభాలే దీనికి నిదర్శనం. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సైతం డిసెంబర్ నెల నుంచి నిర్వహణా లాభాల్లోకి అడుగుపెట్టింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2019 నాటికి ఎయిర్ ఇండియా లాభాల్లోకి వస్తుందని కేంద్ర పౌర విమానయాన కార్యదర్శి ఆర్.ఎన్ చౌబే చెప్పారు. గతంలో సగటున టికెట్‌కు రూ.256 నష్టం వస్తే ధరలు 20 శాతం పైగా తగ్గినా ఇప్పుడు సగటున రూ.632 లాభం వస్తోంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు తగ్గడమే. గడిచిన ఏడాది కాలంలో విమాన ఇంధన ధరలు 45 శాతం తగ్గాయి. ఎయిర్‌లైన్స్ వ్యయంలో సింహ భాగం ఇంధనానిదే. గతంలో నిర్వహణ వ్యయంలో 49 శాతంగా ఉన్న ఇంధనం వాటా ఇప్పుడు 23 శాతానికి పడిపోవడంతో కంపెనీలు లాభాల బాట పట్టాయి.