Hyderabad: French Aviation Giant Safran MRO Centre Inauguration KTR - Sakshi
Sakshi News home page

Hyderabad: హైదరాబాద్‌కు ‘ఎగిరొచ్చిన’ మరో దిగ్గజం.. 1,200 కోట్ల పెట్టుబడి.. 1,000 ఉద్యోగాలు

Published Thu, Jul 7 2022 8:52 AM | Last Updated on Thu, Jul 7 2022 5:44 PM

French Aviation Giant Safran MRO Centre Inauguration KTR At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ దిగ్గజ సంస్థ సిద్ధమైంది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్‌ రూ.1200 కోట్లతో తన కంపెనీని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైమానిక రంగానికి సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది.

భారత్‌లో తన తొలి ఎంఆర్‌ఓ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చిన శాఫ్రాన్‌ నిర్ణయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు స్వాగతించారు. మన దేశంలో ఒక విదేశీ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనన్నారు. శాఫ్రాన్‌ ఎంఆర్‌ఓ కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలోని ఏవియేషన్‌ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. శాఫ్రాన్‌ అతిపెద్ద నిర్వహణ కేంద్రం హైదరాబాద్‌లోనే రాబోతుందన్నారు.

పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజన్లు ఉత్పత్తి చేసే అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన శాఫ్రాన్‌ ఏర్పాటుచేస్తున్న ఈ కేంద్రంతో సుమారు వెయ్యి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. భారత్‌తోపాటు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థల విమానాల్లో వాడే లీప్‌–1ఏ, లీప్‌–1బీ ఇంజన్ల నిర్వహణను హైదరాబాద్‌లోనే చేస్తారన్నారు. ప్రస్తుతం విదేశాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. శాఫ్రాన్‌ పెడుతున్న ఈ భారీ పెట్టుబడితో ఏరోస్పేస్‌ రంగంలో హైదరాబాద్‌కు తిరుగులేదన్న సంగతి మరోసారి రుజువైందని కేటీఆర్‌ చెప్పారు. 
చదవండి👉🏻సర్కార్‌పై ‘వార్‌’టీఐ! దరఖాస్తుల ద్వారా యుద్ధానికి రాష్ట్ర బీజేపీ సిద్ధం

ప్రపంచంలోనే నంబర్‌ 1
ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్‌ అంతర్జాతీయంగా హైటెక్నాలజీ గ్రూప్‌. ఇది వైమానిక, రక్షణ, అంతరిక్ష రంగాల్లో పనిచేస్తుంది. వైమానిక రంగానికి సంబంధించి ప్రొపల్షన్, ఎక్విప్‌మెంట్, ఇంటీరియర్స్‌ తయారీల్లో అగ్రశ్రేణి సంస్థ. గగనతల రవాణాకు సంబంధించి సురక్షితమైన, సౌకర్యవంతమైన సహకారాన్ని ప్రపంచానికి అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. 2021 సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం ఈ సంస్థ పరిధిలో 76,800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 15.3 బిలియన్‌ యూరోల విక్రయాలతో ప్రపంచంలో అగ్రస్థానాన ఉంది. జీఈ సంస్థతో కలిసి వాణిజ్య జెట్‌ ఇంజన్లకు సంబంధించి ప్రపంచంలోనే నంబర్‌ 1గా ఉన్న శాఫ్రాన్‌.. హెలికాప్టర్‌ టర్బైన్‌ ఇంజన్లు, లాండింగ్‌ గేర్ల తయారీల్లో కూడా అగ్రశ్రేణి సంస్థగా ఉంది. 

నేడు రెండు ప్రాజెక్టుల ప్రారంభం 
ఇటీవల హైదరాబాద్‌లో శాఫ్రాన్‌ సంస్థ రెండు మెగా ఏరోస్పేస్‌ ప్రాజెక్టులను స్థాపించింది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల్లో ఒకటి శాఫ్రాన్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ పవర్‌ ఫ్యాక్టరీ. ఇది విమాన ఇంజన్‌లకు వైర్‌ హార్నెస్‌లను ఉత్పత్తి చేస్తుంది. రెండోది శాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్‌ ఫ్యాక్టరీ. ఇది కీలకమైన లీప్‌ ఇంజన్ల కోసం క్లిష్టమైన ఏరో ఇంజన్‌ భాగాలను తయారు చేయనుంది.

ఈ రెండు ఫ్యాక్టరీలను గురువారం మంత్రి కేటీఆర్‌.. శాఫ్రాన్‌ గ్రూప్‌ సీఈవో ఒలివీర్‌ ఆండ్రీస్, శాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్‌ సీఈవో జీన్‌పాల్‌ అలరీలతో కలిసి ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఎంఆర్‌ఓకు ఇవి అదనం. ప్రపంచస్థాయి ఏరోస్పేస్‌ సంస్థల నుంచి మెగా పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలో అత్యంత శక్తిమంతమైన ఏరోస్పేస్‌ వ్యాలీగా హైదరాబాద్‌ స్థిరపడనుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.   
చదవండి👉🏻విధ్వంసాన్ని పసిగట్టే వీడియో వ్యవస్థ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement