న్యూఢిల్లీ: విమానయాన సంస్థ, ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కంపెనీ ఈజీఎమ్(అసాధారణ సమావేశం) ఈ నెల 29న జరగనున్నది. ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్ గంగ్వాల్ అభ్యర్థన మేరకు ఈ ఏజీఎమ్ జరుగుతోంది. కంపెనీ షేర్ల బదిలీ, టేకోవర్, సంబంధించి ‘రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్’, ‘ట్యాగ్ ఎలాంగ్ రైట్’ తదితర అంశాలను తొలగించడానికి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్(ఏఓఏ)లో సవరణ కోసం ఈ ఈజీఎమ్‌ను ఉద్దేశించారు. ఇండిగో కంపెనీలో నిర్వహణ పరంగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్ గంగ్వాల్ ఆరు నెలల క్రితం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సెబీ జోక్యం చేసుకోవాలని గంగ్వాల్ కోరారు. దీంతో మరో ప్రమోటర్‌అయిన రాహుల్ భాటియాతో వివాదాలు చెలరేగాయి. రాకేశ్ గంగ్వాల్ గ్రూప్‌నకు 36.64 శాతం వాటా ఉండగా, రాహుల్ భాటియా గ్రూప్‌నకు 38 శాతం వాటా ఉంది.
కంపెనీకి మంచిదే....
ఏఓఏ నుంచి కొన్ని అంశాలను(మూడు క్లాజులను) తొలగించడం, దానికి ఆమోదం పొందడం కంపెనీకి మంచిదేనని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. ఈ మూడు క్లాజుల తొలగింపు వల్ల ప్రమోటర్లు ఇరువురికి సమాన హక్కులు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్లాజుల తొలగింపునకు ఆమోదం లభించకపోతే, ప్రమోటర్ల పోరు మరికొంత కాలం కొనసాగుతుందని, అది షేర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కాగా కంపెనీ ఈజీఎమ్ ఈ నెల 29న జరగనున్నదన్న వార్తల కారణంగా బీఎస్‌ఈలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్ బీఎస్‌ఈలో 2.1 శాతం లాభంతో రూ.1,361 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment