అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)ను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ తమ పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి వేతనాలను పెంచినట్లు ఒక నివేదిక తెలిపింది. వేతనాల పెంపుదల అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
గత ఏడాది ఇండిగో తమ సిబ్బందికి రెండు విడతల్లో 10 శాతానికిపైగా జీతాలను పెంచింది. ఈ విమానయాన సంస్థ పైలట్లకు నెలకు 70 గంటల చొప్పున స్థిరమైన వేతనాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 2023-24 మొదటి త్రైమాసికంలో ఇండిగో రికార్డు స్థాయిలో రూ. 3,090 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
భారతీయ విమానయాన సంస్థలు అంతర్జాతీయంగా, దేశీయంగా విస్తరించడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉన్న పైలట్‌లు వెళ్లిపోకుండా చూసుకోవడంతోపాటు కొత్త పైలట్‌లను నియమించుకోవడానికి గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థ 320కు పైగా విమానాలతో 1,900 రోజువారీ సర్వీసులు నిర్వహిస్తోంది. దేశీ విమానయాన మార్కెట్‌లో ఈ సంస్థకు 63 శాతం వాటా ఉంది. 32 అంతర్జాతీయ, 81 దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. అయితే ఇటీవల పీఅండ్‌డబ్ల్యూ ఇంజన్లలో సమస్యల కారణంగా కొన్ని ఏ320 విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. దీన్ని అధిగమించేందుకు సంస్థ కొన్ని విమానాలను వెట్‌లీజ్ తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment