దేశీయంగా విమాన ప్రయాణాలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల మధ్య విమానాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానాల్లో ఆహార పదార్థాలు, పానీయాల కోసం ప్రయాణికుల నుంచి అత్యధికంగా వసూలు చేస్తున్నాయంటూ మాజీ ఎంపీ ఫిర్యాదు చేయడంతో ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్ దిగొచ్చింది.
ఇండిగో విమానంలో సాఫ్ట్ డ్రింక్ కావాల్సిన ప్రయాణికుతో బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తున్నారని, విడిగా సాఫ్ట్ డ్రింక్స్ ఇవ్వడం లేదని బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ స్వపన్‌దాస్ గుప్తా ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఎక్స్‌ట్రాల పేరుతో ప్రయాణికులను పిండడం మానేయాలని ఆ విమానయాన సంస్థకు హితవు పలికారు.
(ఇండిగో విమానం ఎక్కుతున్నారా? అయితే గుడ్‌న్యూస్!)
ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అందుబాటు ధరల్లో స్నాక్స్ అనుభవాన్ని అందించడానికి తమ సేవలను పునరుద్ధరించినట్లు ఇండిగో ప్రతినిధి తాజాగా తెలిపారు. ఇక క్యాన్లలో పానీయాలు విక్రయించడం నిలిపివేసినట్లు చెప్పారు. వేలాది క్యాన్ వ్యర్థాలను అరికట్టే తమ గో గ్రీన్ నిబద్ధతకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే విమానాలలో క్యాన్లలో పానీయాల విక్రయం ఎప్పటి నుంచి నిలిపివేసిందో ఇండిగో ఎయిర్‌లైన్ పేర్కొనలేదు.
ఉచితంగా సాఫ్ట్ డ్రింక్
ఇండిగో ఎయిర్‌లైన్ ప్రకటన ప్రకారం.. కస్టమర్‌లు ఆన్‌బోర్డ్‌లో కొనుగోలు చేసిన ఏదైనా స్నాక్‌తో కాంప్లిమెంటరీ పానీయాన్ని (ఉచితంగా) ఆస్వాదించవచ్చు. దేశీయ విమానయాన మార్కెట్‌లో 63 శాతానికిపైగా వాటాతో ఇండిగో దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment