సాక్షి పుణ్యమా అని...
శుక్రవారం... సెప్టెంబర్ 5... టీచర్స్‌డే...
ఉదయం ఎనిమిదన్నరకు బ్రహ్మానందం నుంచి ఫోన్ కాల్.
‘‘ఈ రోజు ‘సాక్షి’లో వచ్చిన ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ ఎక్స్లెంట్...
నాకు చెప్పకుండా నా శిష్యుల ఇంటర్వ్యూలు చేసి నన్ను భలే సర్ప్రైజ్ చేశారే’’ అని
ఆనందం వెలిబుచ్చారు బ్రహ్మానందం.
మళ్లీ వెంటనే ఆయన ‘‘ఉదయం నుంచి ఫోన్ల మీద ఫోన్లు.
నా శిష్యులు చాలా మంది మాట్లాడారు.
మీ ‘సాక్షి’ పుణ్యమా అని 35 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయాను’’ అన్నారు.
పత్రికల్లో వచ్చే తన ఇంటర్వ్యూలకు ఎప్పుడూ పెద్దగా స్పందించనట్టు కనపడే బ్రహ్మానందం
ఈ ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ విషయంలో ఉద్వేగానికి గురయ్యారని అర్థమైంది.
కట్ చేస్తే...
ఆయన దగ్గర వాలిపోయాం.
మళ్లీ ఆ ఆర్టికల్‌ను చూస్తూ ‘‘నేను పనిచేసిన డిగ్రీ కాలేజ్ ఫొటో,
స్టాఫ్‌తో నేను దిగిన స్టిల్స్ చూస్తుంటే... నా మనసు ఆ రోజుల్లోకి వెళ్లిపోయింది’’
అన్నారు బ్రహ్మానందం.
ఈలోగా ఆయన ఫోన్ మోగింది. మళ్లీ మరో అభినందన కాల్.
మధ్య మధ్య అలా ఫోన్లు మాట్లాడుతూనే ‘సాక్షి’తో
లెక్చరర్‌గా తన అనుభవాలను నెమరు వేసుకుంటూ...
అనేక విషయాలు ముచ్చటించారు.
కాలేజ్‌లో స్టూడెంట్స్‌ని మీరు బాగా డీల్ చేసేవారని మీ శిష్యులే చెప్పారు. ఆ టెక్నిక్ మీకు ఎలా అలవడింది?
అది టెక్నిక్ అని నేననుకోవడం లేదు. మొదటి నుంచీ మనుషుల్ని బాగా డీల్ చేసే వరమేదో దేవుడు నాకిచ్చినట్టున్నాడు. అంతకుమించి నా వైపు ప్రిపరేషనేమీ లేదు. మామూలుగా హైస్కూలు స్టూడెంట్స్ అంటే చిన్నవాళ్లు కాబట్టి, దండించి అయినా దారిలోకి తీసుకురావచ్చు. ఇక్కడేమో డిగ్రీ స్టూడెంట్స్. టీనేజ్ దాటిపోయి ఉంటారు కాబట్టి, చెప్పిన మాట అస్సలు వినరు. కానీ మనదైన శైలిలో దారిలోకి తెచ్చుకోవాల్సిందే.
మీ దగ్గర అలా తోక జాడించిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారా?
ఎందుకుండరండీ... ఉంటారు. ఇట్స్ నేచురల్. ఒకసారి నేను క్లాస్ చెబుతుంటే, ఓ తుంటరి ‘‘సార్... టైమైపోయింది’’ అని అరిచాడు. నేను వెంటనే ‘‘అప్పుడే నీకు టైమ్ అయిపోవడమేంటి? నీకు చాలా భవిష్యత్తు ఉందే’’ అన్నాను. దాంతో అమ్మాయిలంతా ఘొల్లుమని నవ్వారు. అతనికి అవమానమనిపించి ‘‘నాకు కాదు సార్... బెల్ కొట్టడానికి టైమైపోయింది’’ అన్నాడు. నేను వెంటనే దానికి కౌంటర్ ఇస్తూ, ‘‘బెల్ కొట్టడానికి ఓ మనిషి ఉన్నాడుగా... నీకెందుకు కంగారు’’ అన్నాను. అంతే! ఇక మళ్లీ అతను నోరెత్తితే ఒట్టు. ఇలా సీరియస్ వేలో కాకుండా, నవ్వుతూనే చురకలంటించేవాణ్ణన్నమాట. అందుకే నా దగ్గర వాళ్లు జాగ్రత్తగా ఉండేవారు.
అదే పద్ధతి సినిమా ఇండస్ట్రీలో కూడా అనుసరిస్తున్నాట్టున్నారు?
తప్పదు మరి. వెంకటేశ్వరస్వామి గుడికెళ్లి ‘ఓం నమఃశివాయ’ అంటే దేవుడికి కోపం వస్తుంది కదా! ఎక్కడ చదవాల్సిన మంత్రాలు అక్కడే చదవాలి. అయినా నేనెప్పుడూ నా హద్దుల్లో నేనుంటాను. మిగతావాళ్లను కూడా హద్దులు దాటనివ్వను. ఆ సూత్రం తెలిస్తే అందరికీ హాయి.
సార్! మళ్లీ మీ లెక్చరర్ రోజుల్లోకి వెళ్దాం. మీరు లేడీస్ హాస్టల్ వార్డెన్‌గా కూడా చేశారట?
అవును. మా డిగ్రీ కాలేజ్‌లోనే లేడీస్ హాస్టల్ ఉంది. వాళ్ల స్కాలర్‌షిప్‌ల వ్యవహారాలతో పాటు ఎలాంటి భోజనం పెట్టాలి లాంటి అంశాలన్నీ వార్డెన్ చూసుకోవాలి. ఈ బాధ్యతలను ఒక్కోసారి ఒక్కో లెక్చరర్ చూసుకోవాలి. అలా నేను కొన్నాళ్లు వార్డెన్‌గా చేశా. అలాగే ఎన్ఎస్ఎస్ ఆఫీసర్‌గా కూడా చేశా.
అప్పట్లో మీ బెస్ట్ స్టూడెంట్ ఎవరు?
అలా జడ్జ్ చేయడం కష్టం. బాగా చదివేవాడికి బిహేవియర్ కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. బిహేవియర్ బాగున్నవాడు చదువులో రాణించకపోవచ్చు.
మీరు మిమిక్రీ బాగా చేసేవారట కదా? అప్పట్లో ప్రముఖుల ముందు ఎప్పుడైనా చేశారా?
పేర్లు గుర్తుకు రావడం లేదు. సాహితీవేత్త పురిపండా అప్పలస్వామి... ఇలా చాలామంది ఉన్నారు. జంధ్యాల గారు నా మిమిక్రీ టాలెంట్ చూసే కదా, నాకు సినిమా చాన్స్ ఇచ్చారు. రాత్రి ఎనిమిది గంటలకు మొదలుపెడితే, తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ ఆయన ముందు మిమిక్రీ చేశా.
మీ స్కూల్ వైస్ ప్రెసిడెంట్‌ను కూడా అనుకరించేవారట!
అదంతా సరదా కోసమే. ఆ మాత్రం సరదా లేకపోతే ఊరు కాని ఊళ్లో మనల్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి!
మీ శిష్యులంతా మీకన్నా పెద్దవాళ్లలా కనిపిస్తున్నారు. మీరేమో ఇంకా...?
అర్థమైంది మీ ప్రశ్న. ఇంత వయసు వచ్చినా నా ముఖంపై ముడతలు రాలేదేంటని ఈ మధ్యనే ఒకరడిగారు. దానికి నా సమాధానం ఒకటే. మనసులో మడతలు లేకపోతే, ముఖాన ముడతలు రావు. మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు మన ముఖం ఎలా ఉంటుందో, చెడ్డ ఆలోచనలతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకుంటే మనకే ఆ రహస్యం తెలిసిపోతుంది. ఓ మహానుభావుడు ఏం చెప్పాడంటే... "God is always ready with the camera. That's your responsibility to give him a good pose".
మీరు రామాయణ, భారత, భాగవతాలు బాగా చదువుకున్నట్టున్నారు?
చదువుకోవాలి కదండీ! వాటిపై నాకెంత పట్టు ఉందో, నాకు నేనుగా చెప్పుకోకూడదు. భాగవతం మీద కొన్ని గంటలు మాట్లాడగలను. అసలు మన దగ్గరున్న సాహితీ సంపద ఇంకెవరి దగ్గర ఉంది చెప్పండి! పోతన భాగవతంలోని ‘ఎవ్వనిచే జనియించు’ పద్యం ఒకసారి చదవండి. దీనిముందు ఓషో ఫిలాసఫీ లాంటివి ఎక్కడ నిలుస్తాయి!
గురువుగా మీ ప్రత్యేక ముద్ర ఏంటి?
నేను చాలా యాక్టివ్‌గా, జోవియల్‌గా ఉంటాను. నా చుట్టుపక్కల వాతావరణం డల్‌గా ఉంటే నాకస్సలు నచ్చదు. మనం యాక్టివ్‌గా ఉంటే, మన లైఫ్ కూడా యాక్టివ్గానే ఉంటుంది. ఇందిరాగాంధీ వాకింగ్ స్టయిల్ ఎప్పుడైనా చూశారా? అంత ఎనర్జీ ఉండాలి.
సినిమా ఇండస్ట్రీలో కూడా మిమ్మల్ని గురువుగా భావించేవాళ్లు ఉన్నారు. వాళ్లను మీరెలా గైడ్ చేస్తుంటారు?
ఇక్కడ గైడ్లు, క్లాస్‌లూ అంటూ ఏమీ ఉండవు. మనసు విప్పి మాట్లాడుకుంటే అన్నీ తెలుస్తుంటాయ్. అన్ని సమస్యలూ పరిష్కారం అవుతుంటాయ్. అప్పుడప్పుడూ సరదాగా పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ లాంటివాళ్లు నా దగ్గరకు వస్తుంటారు. నేనేమీ వాళ్లకు గురువును కాదే! ఇది సత్సంగం లాంటిది. ఒక అంశం మీద గంటలు గంటలు మాట్లాడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఒకసారి వాళ్లిద్దరూ ఉదయం 9 గంటలకు మా ఇంటికొచ్చి, సాయంత్రం 5 గంటల వరకు ఉన్నారు. ముగ్గురం అంతసేపూ మాట్లాడుకుంటూనే ఉన్నాం. రకరకాల టాపిక్స్ మా మధ్య నడిచాయి.
అన్నట్లు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మళ్లీ పాఠం చెబుదామనిపించిందా?
ఒకవేళ అనిపించినా, చెప్పలేని పరిస్థితి నాది. ఎందుకంటే బ్రహ్మానందం కామెడీ మానేసి పద్యాలూ పాఠాలూ చెబుతున్నాడని రకరకాలుగా అనుకుంటారు. ఎందుకంత బాధ! నన్ను ఇలా ఉండనివ్వండి బాబూ..!
- పులగం చిన్నారాయణ
సడన్‌గా శంకర్ ఫోన్...
ఓ పక్క ‘సాక్షి’తో సంభాషిస్తూనే, మరోపక్క వరుసగా వస్తున్న ఫోన్లు మాట్లాడుతున్నారు బ్రహ్మానందం. దాదాపుగా అన్నీ ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ గురించే. ఒకతనైతే ఫుల్స్టాప్, కామాలు లేకుండా ఆయనను పొగుడుతూనే ఉన్నాడు. అప్పుడు చూడాలి బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్స్. ఈ హడావిడిలో ఇంకో ఫోన్ వచ్చింది. ‘‘నేను సార్... డెరైక్టర్ శంకర్‌ని’’ అనగానే, బ్రహ్మానందానికి మొదట ఏమీ అర్థం కాలేదు. ‘
‘ఎవరు?’’ అని మళ్లీ రెట్టించి అడిగారు.
‘‘డెరైక్టర్ శంకర్‌ని సార్... చెన్నై నుంచి మాట్లాడుతున్నా’’ అనగానే,
బ్రహ్మానందానికి అర్థమైపోయింది. ‘‘శంకర్గారూ... ఎలా ఉన్నారు?’’ అని
ఆప్యాయంగా అడిగారు బ్రహ్మానందం.
‘‘బావున్నాను సార్... మొన్న ‘ఆగడు’ ఆడియో ఫంక్షన్‌కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవలేకపోయాను. దూకుడు, రేసుగుర్రం సినిమాల్లో మీ కామెడీ అదిరిపోయింది. నా వైఫ్, పిల్లలకు తెలుగు తెలియదు కానీ, మీ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యాన్స్. ‘ఆగడు’లో కూడా చేశారుగా. అది కూడా చూస్తా. మీ గురించి నిర్మాత ఏఎమ్ రత్నంగారు అప్పట్లో చాలాసార్లు చెప్పారు. త్వరలో మీతో నా సినిమాలో ఫుల్ లెంగ్త్ కేరెక్టర్ చేయించుకుంటా’’ అన్నారు శంకర్. ఇలా ఇద్దరూ చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.