ఊరిస్తున్న విమాన చార్జీలు!
♦ ఏడాదిలో సగటున 20 శాతం తగ్గిన టికెట్ చార్జీలు
♦ తొలిసారిగా బిజినెస్ క్లాస్‌కూ డిస్కౌంట్ ఆఫర్లు
♦ లాభాల బాట పట్టిన ఏవియేషన్ కంపెనీలు
♦ ఇంధన ధరలు ఏడాదిలో 45% తగ్గడమే కారణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానం ఎంత పెకైగురుతుందో... చార్జీలు అంతలా దిగి వస్తున్నాయి. ఈ వేసవిలో గతేడాదికంటే 20 శాతం తక్కువ ధరకే టికెట్లు విక్రయించడానికి విమానయాన కంపెనీలు సిద్ధమయ్యాయి. గతంలో ఇవి డిమాండ్ లేని సమయంలో డిస్కౌంట్ ఆఫర్లిచ్చేవి. కానీ ప్రయాణికుల్ని ఆకట్టుకోవటానికిపుడు ఏడాది పొడవునా ఏదో ఒక పేరుతో ఆఫర్లు ఇస్తూనే ఉన్నాయి. రూ.500 నుంచి రూ.1,000కే విమానం ఎక్కే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. నిజానికి వేసవిలో డిమాండ్ ఎక్కువ.ఈ వేసవిలో డిమాండ్ 20% దాకా పెరుగుతుందని కూడా కంపెనీలు అంచనా వేస్తున్నాయి.
దీనికి అనుగుణంగా ఎయిర్‌కోస్టా, స్పైస్ జెట్ వంటి సంస్థలు మరిన్ని నగరాలకు ఎక్కువ సర్వీసులను నడపడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాయి. ‘‘ఈ సారి డిమాండ్ పెరిగినా టికెట్ ధరలైతే పెరిగే అవకాశం లేదు. గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20% తక్కువ ధరకే టికెట్లు లభిస్తున్నాయి’’ అని ఎయిర్‌కోస్టా ప్రతినిధి చెప్పారు. గతేడాదితో పోలిస్తే డిసెంబర్ నాటికి దేశీ విమాన టికెట్ ధరలు సగటున 18.3 శాతం తగ్గినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు ఇటీవల చెప్పారు. 2014 డిసెంబర్లో సగటు టికెట్ ధర 7,492గా ఉంటే అది డిసెంబర్, 2015 నాటికి రూ.5,734కి తగ్గినట్లు బోయింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ కేశ్కర్ తెలియజేశారు.
అన్నింటికీ డిస్కౌంట్లే: ఇప్పటిదాకా ఎకానమీ క్లాస్‌కే పరిమితమైన డిస్కౌంట్ల యుద్ధం ఇప్పుడు బిజినెస్ క్లాస్‌లకూ పాకింది. తొలిసారిగా బిజినెస్ క్లాస్‌లో 30 నుంచి 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు జెట్, విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రకటించాయి. నిత్యం డిమాండుండే ముంబై-ఢిల్లీ మార్గంలో రూ.21,000 ఉండే బిజినెస్ క్లాస్ టికెట్‌ను విస్తారా రూ. 15,000కే అందిస్తోంది. ఈ తగ్గింపు ధరలు
అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. ఎయిర్ ఏషియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు ఏకంగా 50 శాతంవరకూ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఎంత చౌకగా అంటే... చేతిలో మూడు నాలుగు వేలుంటే మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లేలా. ఈ తగ్గింపుతో ప్రయాణికుల సంఖ్యలో భారీ వృద్ధి నమోదవుతున్నట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తెలియజేసింది. గతేడాదితో పోలిస్తే దేశీ విమాన ప్రయాణికుల సంఖ్యలో 23% వృద్ధి నమోదయిందని ఐఏటీఏ పేర్కొంది. దేశీ మధ్యతరగతి ప్రజల్లో పెరుగుతున్న వినిమయ శక్తి ఈ వృద్ధికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. 2024 నాటికి దేశీయ మధ్యతరగతి ప్రజల సంఖ్య 50% వృద్ధితో 60 కోట్లు దాటుతుందని ఎయిర్ బస్ అంచనా వేస్తోంది. వచ్చే ఇరవై ఏళ్లలో ప్రపంచ విమాన ప్రయాణికుల సంఖ్యలో 4.6% వృద్ధి ఉంటే ఇండియాలో ఈ వృద్ధి 8.4% ఉంటుందని అంచనా.
చార్జీలు తగ్గుతున్నా, లాభాలు పెరుగుతున్నాయ్...
ఒకపక్క విమాన టికెట్ ధరలు తగ్గుతున్నా విమానయాన కంపెనీల లాభాలు మాత్రం పెరుగుతుండటం విశేషం. మొన్నటి వరకు నష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థలిపుడు భారీ లాభాలను ప్రకటిస్తున్నాయి. స్పైస్ జెట్, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో వంటి సంస్థలు మూడో త్రైమాసికంలో ప్రకటించిన లాభాలే దీనికి నిదర్శనం. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సైతం డిసెంబర్ నెల నుంచి నిర్వహణా లాభాల్లోకి అడుగుపెట్టింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2019 నాటికి ఎయిర్ ఇండియా లాభాల్లోకి వస్తుందని కేంద్ర పౌర విమానయాన కార్యదర్శి ఆర్.ఎన్ చౌబే చెప్పారు.
గతంలో సగటున టికెట్‌కు రూ.256 నష్టం వస్తే ధరలు 20 శాతం పైగా తగ్గినా ఇప్పుడు సగటున రూ.632 లాభం వస్తోంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు తగ్గడమే. గడిచిన ఏడాది కాలంలో విమాన ఇంధన ధరలు 45 శాతం తగ్గాయి. ఎయిర్‌లైన్స్ వ్యయంలో సింహ భాగం ఇంధనానిదే. గతంలో నిర్వహణ వ్యయంలో 49 శాతంగా ఉన్న ఇంధనం వాటా ఇప్పుడు 23 శాతానికి పడిపోవడంతో కంపెనీలు లాభాల బాట పట్టాయి.